Tuesday, 18 September 2012

నా కళ్ళజోడు కష్టాలు


మీరు రోజులో ఎక్కువ భాగం ఏంచేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం వస్తువులు వెతుక్కుంటూ ఉంటాను. చదువుతున్న పుస్తకం, తాగుతున్న కాఫీ కప్పు, రాస్తున్న పెన్ను.. ఇలా ఒకటేమిటి.. అన్నీ ఎక్కడ పెట్టానో మర్చిపోయి వెతుక్కుంటూ ఉంటాను. జీవితంలో ఇంకెప్పుడూ ఏదీ మర్చిపోకూడదని పట్టుదలగా ఉంటాను. కానీ కొద్దిసేపటికి ఆ పట్టుదలని కూడా మర్చిపోతాను!

నేను ఎక్కువసార్లు.. ఎక్కువసేపు వెతుక్కునేది నా కళ్ళజోడు. నాకీ కళ్ళజోడు వెదుకులాట బాగా అలవాటైపోయింది. ఎంత అలవాటయ్యిందంటే.. ఒక్కోసారి కళ్ళజోడు పెట్టుకుని కూడా కళ్ళజోడు కోసం వెతుకుతుంటాను!

నాకు రెండు కళ్ళజోళ్ళు. ఒకటి సీనియర్. సీనియర్ ఇంటర్ నుండి నన్నంటి పెట్టుకునుంది. కొన్ని వందల సినిమాల్ని స్పష్టంగా చూపించిన నేస్తం. రెండోది నలభైయ్యేళ్ళు దాటినందుకు చిహ్నంగా వచ్చిన చత్వారం. దీన్నే ఆంగ్లంలో రీడింగ్ గ్లాసెస్ అంటారు. నాతో ఎన్నో మంచిపుస్తకాలు చదివించింది. మిమ్మల్ని భయపెట్టే తెలుగులో చెప్పాలంటే మొదటిది దీర్ఘదృష్టి లోపం, రెండోది హ్రస్వదృష్టి లోపం!

రోజూ ఈ కళ్ళజోడు వెతుక్కోడం నాకు చికాగ్గా ఉంటుంది. అంచేత 'ఇక్కడే, ఇందాకే పెట్టాను. ఎవరు తీశారో చెప్పండి.' అంటూ ఇంట్లోవాళ్ళని సతాయించసాగాను. మా అబ్బాయి, అమ్మాయి కళ్ళజోడు వెతికి పెట్టినందుకు ఫీజు వసూలు చెయ్యసాగారు. నాకు కళ్ళజోడు దొరికేదాకా మనశ్శాంతి లేకుండా చేస్తానని గ్రహించిన నా భార్య కూడా ఈ కళ్ళజోడు వెదుకులాటలో ఓ చూపు వెయ్యసాగింది.

క్రమేణా నా కళ్ళజోడు సణుగుడు భరింపరానిదిగా తయారైనట్లుంది.. నా భార్య తన మిత్రుడు మరియూ క్లాస్‌మేట్ అయిన ఒక కంటివైద్యునికి తన గోడు వెళ్ళబోసుకొంది. ఆయన నా పీడా విరుగుడుగా ఒక నల్లటి తాడులాంటిదేదో పంపించాడు. (ఇంకానయం! ఈవిడకి ఏ ప్లీడరో స్నేహితుడైనట్లయిన నాపై గృహహింస కేసు పెట్టించేవాడు.) 

ఈ నల్లతాడుకి రెండువైపులా చిన్నరింగులు. అందులో కళ్ళజోడుకుండే రెండు పుల్లలు దూర్చి fix చెయ్యాలి. పిమ్మట ఆ తాడుని మెళ్ళో హారంగా ధరించాలి.

ఆ కళ్ళజోడు హారం మంగళసూత్రం వలె ధరించిన వెంటనే మెడ భాగం దురద పెట్టసాగింది. 'కొన్నాళ్ళకీ దురద అలవాటైపోతుంది. తియ్యొద్దు.' అని నాభార్య ఆజ్ఞాపించింది. ఆమెని ధిక్కరించు ధైర్యంలేదు.

నా మంగళసూత్రాన్ని భక్తిగా కళ్ళకద్దుకున్నాను. హఠాత్తుగా సతీఅనసూయ, సక్కుబాయిలా ఫీలవడం మొదలెట్టాను. 'ఆడది కోరుకునే వరాలు రెండేరెండు. చల్లని ఇల్లూ.. ' అంటూ పాడుకుందామనే కోరికని బలవంతంగా ఆపుకుని.. నా కళ్ళజోడు వెతుక్కునే ప్రోగ్రాంకి తెర పడినందుకు సంతసించితిని.


నా భార్యకి నేనీ కళ్ళజోడు సూత్రం తీసేస్తాననే అనుమానం కలిగినట్లుంది. 'CPM సీతారాం ఏచూరి, RSS శేషాద్రిచారిలు కూడా ఇట్లాంటి సూత్రాలతోనే టీవీల్లో కనిపిస్తుంటారు. నువ్వు కూడా వాళ్ళలాగే మేధావిలాగా కనిపిస్తున్నావ్.' అంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. నా ఛాతీ గర్వంతో రెండంగుళాలు ఉబ్బింది.

ఆస్పత్రిలో పేషంట్లని చూచుచూ.. ఈ కళ్ళజోడు వ్యవహారం మరచితిని. కానీ పేషంట్లు నా కళ్ళజోడు సూత్రం వైపు ఆశ్చర్యంగా చూడసాగారు. కొందరు నిర్మొహమాటస్తులు తాడు గూర్చి సూటిగా అడిగెయ్యడం మొదలెట్టారు. ఒకడు 'ఆ తాడు లేకపోతే మీక్కనపడదా?' అంటూ అనవసరపు కుతూహలం ప్రదర్శించగా.. ఇంకోడు 'ఆ తాడు కళ్ళజోడు చార్జికి ఎగస్ట్రానా?' అంటూ ఎగస్ట్రాలు.

ఇప్పుడొక ధర్మసందేహం. మరి నా ఈడువారు ఒకే కళ్ళజోడుతో అన్నిచూపులూ చూసేస్తున్నారే! ఇదెలా సాధ్యం? దీనికి సమాధానం ఆనతికాలంలోనే లభించినది. నాల్రోజుల తరవాత జరిగిన ఒక సైకియాట్రీ కాన్ఫరెన్సులో ఈ కళ్ళజోడు కూపీ కూడా ప్రధానాంశముగా చేర్చితిని. 

అక్కడ పిచ్చివైద్య శిఖామణులతో మాట్లాడగా తెలిసింది.. వారు ప్రోగ్రెసివ్ లెన్స్ అనబడే కళ్ళద్దాలు వాడుతున్నారుట. శివరాత్రి నాడు ఒకే టికెట్టుపై రెండు సినిమాలు చూపినట్లు.. ఒకే అద్దంలో రెండు పవర్లు ఉంటాయిట. ఇదేదో బాగానే ఉంది.

నేను మాత్రం తక్కువ తిన్నానా? హమ్ కిసీ సే కమ్ నహీ. నా భార్య స్నేహితుడైన ఆ కంటి డాక్టర్ని సంప్రదించితిని. అతగాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఎదురుగా ఉన్న ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ గళ్ళల్లో ఏవో అంకెలు కెలికాడు. నాల్రోజుల్లో నా ముఖారవిందాన్ని కొత్తకళ్ళజోడు అలంకరించింది . తిరునాళ్ళలో నాల్రూపాయలకి నల్లకళ్ళజోడు కొనుక్కుని నాగేశ్వర్రావులాగా ఫీలవుతారు. నేను మరీ అంత గర్వపడలేదుగానీ - కించిత్తు ఆనందపడ్డాను.

నా కొత్త కళ్ళజోడు గూర్చి రెండుముక్కలు. దూరం వస్తువుల్ని చూడాలంటే అద్దం పైభాగం నుండి చూడాలట. చదవాలంటే క్రిందిభాగం నుండి చూడాలిట. పైభాగం పాకిస్తాన్.. క్రిందిభాగం ఇండియా. మధ్యలో ఏదేశానికి చెందని కాశ్మీర్ వలే.. ప్లస్సూ, మైనస్సులు కలగలిపిన పవర్. ఇదేదో మాయా అద్దమువలెనున్నదే! భలే భలే! 'కల నిజమాయెగా, కోరికా తీరెగా'.
                               
కానీ ఒక చిక్కొచ్చి పడింది. ఎదుటివారితో మాట్లాడాలంటే క్షవరం చేయించుకునేవాడిలా తల దించాలి. ప్రిస్క్రిప్షన్ రాయాలంటే మోర పైకెత్తాలి. తల ఎత్తీ దించి.. దించీ ఎత్తి.. తొండ మార్కు ఎక్సర్ సైజులు చేయగా, చేయగా మెడనరం పట్టేసింది. సాయంకాలానికల్లా విసుగొచ్చేసింది. ఇక లాభం లేదనుకుని.. నా పాత రీడింగ్ గ్లాసులు పెట్టుకున్నా. ఎంతో హాయిగా ఉంది!

ఈ కొత్తరకం అద్దాలు నాకేల? నాకు రెండుకళ్ళు, రెండు చెవులు. అట్లే.. రెండురకాల దృష్టిలోపాలు. చదవడానికో జోడూ.. దూరంగా చూడ్డానికి మరో జోడు. సో వాట్? ఈ రెండు పవర్లు కలిపి ఒకే కళ్ళజోడులో ఇరికించుకొని.. నేను సాధించేదేమిటి? మెడనొప్పి తప్ప! చంద్రబాబంతటివాడిదే రెండుకళ్ళ సిద్ధాంతం. మరప్పుడు నాకు మాత్రం రెండు కళ్ళజోళ్ళ సిద్ధాంతం ఎందుకుండరాదు?

నాకీ కొత్త లెన్సులూ వద్దు.. ఆ మంగళసూత్రాలూ వద్దు. అసలు కళ్ళజోడు వెతుక్కోడంలో ఎంత ఆనందముంది! భార్యని ఆ మాత్రం ఇబ్బంది పెట్టనియెడల మగవాడి భర్తత్వానికే కళంకం కాదా! కావున.. మితృలారా! ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయునదేమనగా.. నేను మళ్ళీ నా పాత కళ్ళజోళ్ళకే షిఫ్ట్ అవుతున్నాను.
       
ముగింపు -

ఈ మధ్య ఒకపెళ్ళిలో మన కంటి డాక్టరు తారసపడ్డాడు. 'మీరు తొందర పడ్డారు. ప్రోగ్రెసివ్ లెన్స్ ఓ పదిరోజులు అట్లాగే ఉంటాయి. తరవాత చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.' అంటూ సెలవిచ్చాడు. తరచి చూడగా.. ఈ కంటి డాక్టరు పక్కనేఉన్న తన స్నేహితుడైన మెడనొప్పి డాక్టరుతో మేచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడేమోనని అనుమానం కలుగుతుంది!

(photos courtesy: Google)