Monday 16 December 2013

అపరిచితురాలు

వారిద్దరు భార్యాభర్తలు. అతనికి నలభైకి పైన, ఆవిడకి నలభైకి  లోపుగా వయసుంటుంది. అతనేదో కాలేజిలో పని చేస్తున్నాట్ట. ఆవిడ ఇంటి భార్య ('హౌస్ వైఫ్' కి అచ్చ తెలుగు.. అనగా డబ్బు సంపాదన లేని భార్య అని అర్ధం). పదో క్లాసు పాసైందిట. బొద్దుగా, పొట్టిగా, ఎర్రగా ఉంది. సంప్రదింపు రుసుము (కన్సల్టేషన్ ఫీజ్) రసీదు ఆవిడ పేర ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఆవిడ నా పేషంట్.

ఇద్దరూ గదిలోకి వచ్చాడు. భర్త మాట్లాడ్డం మొదలెట్టాడు. భార్యని తనెంత అపురూపంగా చూసుకుంటున్నది.. పెళ్ళైన తరవాత ఒక్కరోజు కూడా భార్యని వదలకుండా ఏవిధంగా ఉండలేనిదీ.. కాలేజిలో ఉన్నాకూడా అనుక్షణం భార్య గూర్చే ఎంత తీవ్రంగా ఆలోచించేదీ.. వైనంగా చెబుతున్నాడు.

భర్త ప్రేమని అపారంగా పొందుతున్న ఆ భార్యామణి అసలు తలే పైకెత్తట్లేదు. బహుశా రోజూ భర్త చూపిస్తున్న టన్నుల కొద్దీ ప్రేమ బరువు మొయ్యలేక మెడ ఒంగిపోయ్యుంటుంది. నాకు చికాకేసింది. ఆయన భార్యని ఆయన ప్రేమించుకోవడంలో విశేషమేముంది! అదీగాక నాకెందుకో భార్య పట్ల బహిరంగంగా ప్రేమ ప్రకటించేవాళ్ళు నమ్మదగ్గ వ్యక్తులుగా అనిపించరు. అటువంటివాళ్ళు అమాయకులైనా అయ్యుండాలి లేదా అబద్దమైనా చెబుతుండాలి అంటాడు మా సుబ్బు. 

"ఇంత ప్రేమగా చూసుకుంటున్నా ఎందుకనో నా భార్య దిగులుగా ఉంటుంది. అప్పుడప్పుడూ ఏడుస్తుంటుంది." అంటూ దిగులు చెందుచూ తన వాక్ప్రవాహాన్ని ఆపాడు. అమ్మయ్య! వర్షం వెలిసినట్లైంది.

ఆవిడ తల పైకెత్తలేదు. పాపం! మరీ మొహమాటస్తురాల్లా ఉంది. నేనావిడ బిడియం పోగొట్టడానికి కొన్ని జెనరల్ ప్రశ్నలు అడిగాను. ఆవిడ తల దించుకునే ముక్తసరిగా సమాధానాలు చెప్పింది.

గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం.

"మావారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అయినా.. ఎందుకో దిగులు." ఉన్నట్లుంది అన్నది.

వెంటనే భర్త అందుకున్నాడు.

"అదీ అలా చెప్పు. భయపడకుండా చెప్పాలి. చెప్పు. ఇంకా చెప్పు. డాక్టర్ల దగ్గర ఏదీ దాచకూడదు. నీ మనసులో ఉన్నదంతా చెప్పు.. చెప్పెయ్యి.. చెప్పు" అంటూ ఆవిడని హడావుడి చెయ్యసాగాడు.

నాకు అతని ధోరణి చికాగ్గా అనిపించింది. తెలుగు సినిమాలో కేరక్టర్ ఆర్టిస్టులా ఒకటే మాట్లాడేస్తున్నాడు. ఇతగాడు గదిలో ఉండగా మరొకళ్ళకి మాట్లాడే చాన్స్ ఇవ్వడని అర్ధమైపోయింది.

"మీ భార్యతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓ రెండు నిమిషాలు బయట వెయిట్ చేస్తారా?" అన్నాను భర్తతో.

భర్త షాక్ తిన్నాడు. నమ్మశక్యం కానట్లుగా మొహం పెట్టాడు. కేబినేట్ మీటింగు మధ్యలో ముఖ్యమంత్రిని బయటకి పొమ్మన్నప్పుడు కూడా ఇంతలా ఫీలవ్వడేమో!

ఆవిడ కంగారు పడిపోసాగింది.

"ఏవండీ! మీరు బయటకి వెళ్ళకండి. డాక్టరు గారు! మా ఆయన దేవుడు. నా దిగులు తగ్గడానికి మందు రాయండి. చాలు. అంతేగానీ వారిని బయటకి పంపకండి." అని దీనంగా బ్రతిమాలుతున్నట్లుగా అంది.

భార్య దీనావస్థకి భర్త మిక్కిలిగా సంతోషించసాగాడు.

"నా పద్ధతులు నాకున్నాయ్. మీ ఆయన బయటకెళ్ళేది రెణ్ణిమిషాలే కదా. మీరు సహకరించాలి." అన్నాను.

అతను ఒక క్షణం ఆలోచించాడు. తరవాత ఆవిడ చేతిని మృదువుగా నొక్కాడు.

"భయపడకు. డాక్టరు గారు అడిగినవాటికి ధైర్యంగా చెప్పు. బయట వెయిట్ చేస్తాను." అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు. 

నాకేసి అదోరకంగా చూస్తూ తలుపు తెరుచుకుని బయటకి వెళ్ళిపొయ్యాడు. స్ప్రింగ్ డోర్ అతని వెనక మూసుకుపోయింది.

ఆవిడ ఒక క్షణం ఆగి డోర్ వైపు అనుమానంగా చూస్తూ లోగొంతుకతో అడిగింది.

"మన మాటలు బయటకి వినబడతాయా?"

"మీరు గట్టిగానే మాట్లాడవచ్చు. మన మాటలు బయటకి అస్సలు వినబడవు." అభయ హస్తం ఇచ్చాను.

ఆవిడ ధోరణి ఒక్కసారిగా మారిపోయింది.

"డాక్టరు గారు, నాలాంటిది బ్రతికి ప్రయోజనం లేదు.. భూమికి భారం తప్ప. ఏదో పిల్లలు అన్యాయం అయిపోతారని చావలేక బతుకుతున్నా. నేనేదో మహా పాపం చేసుకునుంటాను.. ఈ దరిద్రుడు భర్తగా దొరికాడు. నేను నిల్చున్నా అనుమానమే, కూర్చున్నా అనుమానమే. నీడలాగా వెంటే తిరుగుతుంటాడు. మెత్తగానే మాట్లాడతాడు.. కత్తితో కండ కోసినంత బాధగా ఉంటుంది. కనీసం ఒక మంచి చీర కట్టుకున్నా ఓర్చుకోలేడు. నాకు అమ్మానాన్న లేరు. ఉన్న ఒక్క అన్నయ్య పరిస్థితి అంతంత మాత్రం. గతిలేక రోజూ ఏడ్చుకుంటూ కాపురం చేస్తున్నాను." అంటూ నిశ్సబ్దంగా రోదించసాగింది.

నేనావిడని కొద్దిసేపు అలాగే ఏడవనిచ్చాను.

"అర్ధమైంది. మరి మీ ఆయన ముందు అలా చెప్పారేం?"

"అలా చెప్పకపొతే ఇంటికెళ్ళాక విపరీతంగా సాధిస్తాడండి. ఇప్పుడైనా తన గూర్చి మీకేమైనా చెప్పేస్తున్నానేమోనని వణికి చస్తుంటాడు. మీకు దణ్ణం పెడతాను. నేనిలా చెప్పానని మాత్రం ఆయనకి చెప్పకండి." అర్దిస్తున్నట్లుగా అంది.

"డోంట్ వర్రీ. మీరు చెప్పినవన్నీ మనిద్దరి మధ్యే ఉండిపోతాయి. అతన్నిప్పుడు పిలుస్తున్నాను." కాలింగ్ బెల్ మీద వేలు ఉంచి అన్నాను.

"ఒక్క క్షణం." అంటూ కర్చీఫ్ తో కళ్ళు, ముక్కు తుడుచుకుని, జుట్టు సరిచేసుకుంది. పిమ్మట 'ఓకే' అన్నట్లు సైగ చేస్తూ తల దించుకుంది.

కాలింగ్ బెల్ నొక్కాను. నర్స్ భర్తని లోపలకి పంపింది.

భర్తని చూడంగాన్లే భార్య భయం భయంగా బిత్తర చూపులు చూస్తూ బేలగా "ఏమండి! వద్దంటున్నా బయటకి ఎందుకెళ్ళారండీ? మీకు తెలీకుండా చెప్పడానికి నాదగ్గరేముంటుందండి?" అన్నది.

తన భార్య అమాకత్వాన్ని చూసి భర్త తృప్తిగా, సంతోషంగా తలాడించాడు.

"మనిద్దరి మధ్యా ప్రేమ తప్ప మరేదీ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు.. కానీ - డాక్టర్లకి తెలీదుగా! అందుకే నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్లాను. నువ్వేం ఫీలవకు." అంటూ మళ్ళీ మృదువుగా భార్య చెయ్యి నొక్కుతూ నావైపు విజయ గర్వంతో చూశాడు.

చిన్నగా నవ్వుకున్నాను. ఇతగాడికి అసలు సంగతి తెలిస్తే గుండాగి ఛస్తాడేమో! ఆవిడ నటనా కౌశలాన్ని మనసులోనే మెచ్చుకున్నాను. నాకిప్పుడు శంకర్ తీసిన 'అపరిచితుడు' సినిమా జ్ఞాపకం వస్తుంది. నా ఎదురుగా కూర్చునున్నది ఒక అపరిచితురాలు!

చివరి తోక :

ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. 100% కల్పితం.

(picture courtesy : Google)