Monday 23 December 2013

ఆడలేడీసుల రాజకీయ కష్టాలు


సమాజ మనుగడ, పురోగతిని రాజకీయ రంగం ప్రభావితం చేసినంతగా ఇంకే రంగమూ చెయ్యలేదు. అందుకే రాజకీయ కార్యాచరణ అత్యంత పవిత్రమైనది (ఈ పవిత్రతకి, కె.విశ్వనాథ్ సినిమాల పవిత్రతకీ సంబంధం లేదు). ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రంగంలో సమాజంలో కనపించే అసమానతలు కూడా ప్రతిబింబించడం సహజం. వీటిల్లో లింగ వివక్షత ముఖ్యమైనది.

మన రాజకీయ నాయకుల్లో ఆడవారితో పోలిస్తే మగవారు చాలా ప్రశాంతంగా ఉంటారు (వారు టీవీ సీరియల్స్ చూడకపోవటం ఈ ప్రశాంతతకి ఒక కారణం కావచ్చు). మీడియావారు అడిగిన ప్రశ్నలకి, అడగని ప్రశ్నలక్కూడా అలవోకగా సమాధానాలు చెప్పేస్తుంటారు. అందుకే కేశవరావు, జానారెడ్డిలు బిట్ క్వశ్చన్కి ఎస్సే ఆన్సర్లు చెప్పేస్తారు (చిరంజీవి, బాలకృష్ణల సమస్య ). అదే లేడీ పోలిటీషయన్లైతే ముక్తసరిగా సమాధానాలు చెబుతారు.. కొద్దిగా టెన్షన్తో ఉన్నట్లుగా కూడా కనిపిస్తారు.

మన దేశానికి సంబంధించి ఒకప్పుడు ఇందిరా గాంధీ.. ఇప్పుడు సోనియా గాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్.. అత్యంత ప్రముఖులైన నాయకురాళ్ళు (రాజకుమారి, గంగాభవాని అక్కయ్యలు నన్ను మన్నించాలి). వీరు గంభీరంగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, హడావుడిగా కూడా ఉంటారు.

ఈ రకమైన ప్రవర్తన వెనుక మీడియా ప్రశ్నల్ని తప్పించుకునే వ్యూహం దాగి ఉందా? (ఉందో లేదో నాకు తెలీదు. అయితే ఇప్పుడీ టాపిక్ పై నేనో పోస్టు రాయాలి కాబట్టి.. వ్యూహం ఉందనే నమ్ముతున్నాను). ఉన్నట్లయితే.. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? అవేంటో ఆలోచన చేద్దాం ('చేద్దాం' అని మాటవరసకి అన్నాను గానీ.. ఆలోచన చేస్తుంది మాత్రం నేనే).

సైకలాజికల్ కారణాలు :  

సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక గడ్డం సైకాలజిస్టు మనోవిశ్లేషణ సూత్రాలు ప్రతిపాదించాడు (గడ్డం ఉంటే గానీ మేధావి కాదు - 'అసూబా'ల ఆహార్యం ). మన రాజకీయ నాయకులు, సినిమా హీరోలు ఈమధ్య తమ కుటుంబ వారసుల్ని తెస్తున్నారు గానీ.. ఆపని ఫ్రాయిడ్ ఎప్పుడో చేశాడు. తండ్రి ఆశిస్సులతో ఫ్రాయిడ్ కూతురు అన్నా ఫ్రాయిడ్ కూడా సైకాలజీలోనే సెటిలయ్యింది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ కూతురు తమ ఫ్రాయిడ్ వారి వంశం పేరు (నేను అచ్చమైన తెలుగు వాణ్ని. అందుకే వంశాల పేరెత్తితేనే ఒళ్ళు పులకరిస్తుంది) తోడగొట్టి (అన్నా ఫ్రాయిడ్ నిజంగా తోడ గొట్టిందో లేదో నాకు తెలీదు.. ఇది మాత్రం మసాలా) మరీ నిలబెట్టింది. తండ్రి సిద్ధాంతాలకి మరింత ప్రాచుర్యం కలిపించింది. (అన్నా ఫ్రాయిడ్ చాలా తెలివైందనడానికి మరో నిదర్శనం.. ఆవిడ పెళ్లి చేసుకోలేదు).

తండ్రీకూతుళ్ళ సిద్ధాంతాల్లో డిఫెన్స్ మెకానిజమ్స్ ముఖ్యమైనవి. వీటిల్లో 'రియాక్షన్ ఫార్మేషన్' అనేది ఒక ఆసక్తికరమైన డిఫెన్స్ మెకానిజం. ఒక వ్యక్తికి అభద్రతా భావం ఉంటుంది. భయపడిపోతుంటాడు. ఆ భయం నుండి బయటకి రావడానికి అందుకు సరీగ్గా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అంటే లేని ధైర్యాన్ని అతిగా ప్రదర్శిస్తాడు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి పిరికివాడు. మరి మన ఆడలేడీసు గాంభీర్యం కూడా ఒక రియాక్షన్ ఫార్మేషనేనా? (కత్తిలాంటి ప్రశ్న.. మీలో బాకులా దిగింది కదూ).

బయలాజికల్ కారణాలు :

స్త్రీకి మెనోపాజ్ శత్రువు (ఈ వాక్యానికి స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న వాక్యం ప్రేరణ). ఆడవాళ్ళలో menstrual cycle కి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ల ఎక్కువతక్కువలు కారణం (ఆడవాళ్ళ మనసులాగే ఈ హార్మోన్లు కూడా అస్థిరంగా ఉంటాయి). చివరాఖరికి ఈ హార్మోన్లలో సమతుల్యత లోపించడం మూలానా మెనోపాజ్ వస్తుంది.

స్త్రీలలో థైరాయిడ్ సమస్యలు కూడా ఎక్కువ. థైరాయిడ్ హార్మోన్ తక్కువవడంతో (Hypothyroidism) అధిక బరువుకి లోనవుతారు. ఈ హార్మోన్ల సమస్యలు ఆడవారిని శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకి గురిచేస్తాయి. కొందరిలో దిగులు, దుఃఖం, నిరాసక్తత, నిర్వేదన వంటి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.

సర్లే! ఏదో ఒక హార్మోన్.. ఈ హార్మోన్ల తేడా వల్ల చిరాకు, అసహనం, అనుమానం.. సహచరులు తమకి హాని చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారనే తీవ్రమైన భయాందోళనలకి గురౌతారు. ఈ ఆలోచనలని 'పేరనాయిడ్ థాట్స్' అంటారు. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ సమయంలో ఇలాంటి ఆలోచనలతో ఇబ్బంది పడిందని చెబుతారు.

ఆగక్కడ! చేతిలో కీ బోర్డుందని ఓ కొట్టేసుకుంటూ పోతున్నావ్! నువ్వు చెప్పే లక్షణాలు చంద్రబాబుక్కూడా ఉన్నాయి. మరి దానికేం సమాధానం చెబుతావ్?

అయ్యా! మగవాళ్ళక్కూడా 'మేల్ మెనోపాజ్' ఉంటుందని విజ్ఞులు సెలవిస్తున్నారు.

(ఇంక ఈ టాపిక్ ఆపేస్తాను.. ఇప్పటికే నాకు 'డాక్టర్ సమరం ఫీలింగ్' వచ్చేసి చిరాగ్గా ఉంది.)

సాంఘిక కారణాలు :

సమాజంలో ఉన్న లింగ వివక్షతే రాజకీయ రంగంలో కూడా కొనసాగుతుంది. ఉదాహరణకు వివాహేతర సంబంధాలని పరిశీలిద్దాం. వివాహేతర సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతం. మన సమాజం రాజకీయ నాయకుడి 'అక్రమ' సంబంధం పట్టించుకోదు (మా నాయకుడు స్త్రీ జనోద్ధారకుడు. అందువల్ల రాత్రుళ్ళు ఒంటరిగా నారీమణుల కష్టాల్ని దగ్గరగా పరిశీలించెదరు.. ఆపై వారితో సుఖించెదరు).

కానీ రాజకీయ నాయకురాళ్ళకి అంత 'వెసులుబాటు' లేదు. అంచేత రాజకీయ నాయకురాళ్ళు తమపై ఎవరూ 'నింద' వెయ్యకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి (మన మీడియా జయలలిత, శశికళల గూర్చి కూడా ఎంత గొప్పగా రాసిందో గుర్తుంది కదూ) .ఇది వారిపై మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది. ఈ కారణం వల్ల కూడా ఆడవారు ప్రజాజీవితంలో గంభీరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వృత్తిగతమైన కారణాలు :

మన నాయకుల ప్రజాసేవకి (తెలుగు టీవీ తాయెత్తు ప్రోగ్రాముల్లా) వేళాపాడూ ఉండదు. వారి జీవితం (జేబులు కొట్టేవాడి ఓటు కూడా కాపాడుకుంటూ) ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడిచిపోతుంది. పగలంతా ప్రజాసేవలో అలసి సొలసిన మగ రాజకీయులకి రాత్రికి తగినంత 'మందోబస్తు' (ఈ పదానికి కాపీరైట్ ముళ్ళపూడి వెంకట్రవణది) ఉంటుంది.

సహచరులతో రాజకీయాలు, అరాచకీయాలు మాట్లాడుకుంటూ కులాసాగా రిలాక్స్ అవుతారు. పాపం! ఈ లక్జరీ రాజకీయ నాయకురాళ్ళకి మాత్రం లేదు (ఏం రాస్తున్నావ్ నువ్వు? ఇది భారత దేశం. స్త్రీ సర్వశక్తి స్వరూపిణి. నీ కళ్ళు సీమటపాకాయల్లా పేలిపోగలవ్ జాగ్రత్త).

వ్యక్తిగత కారణాలు :

మన సమాజంలో అందచందాలకి ప్రాధాన్యం ఎక్కువ. తెల్లదొరలూ మనని వదిలేసి చాలా కాలమైనా.. మనకి మాత్రం తెల్లరంగుపై మోజు తగ్గలేదు. చాలామందికి అందం అంటే తెల్లగా ఉండటమే. అందువల్లనే సినిమా హీరోయిన్లు, న్యూస్ రీడర్లు ఎల్లప్పుడూ తెల్లతోలువారు మాత్రమే ఉందురు (తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!).

కావున మన దేశంలో 'సోనియా గాంధీ భలే తెల్లగా ఉంటుంది' అని మురిసిపోయే సౌందర్యారాధకులకి కొదవ లేదు. వారిలో మా అమ్మ కూడా ఉంది (అమ్మ.. నేను.. కొన్ని పెళ్ళికబుర్లు ). అంచేత రాజకీయ రంగంలో అందం (అనగా చర్మం రంగు) తక్కువగా ఉన్న నాయకురాళ్ళు ఆత్మన్యూనతకి (low self esteem కి వచ్చిన తెలుగు తిప్పలు) లోనవుతారు.

(మగవాళ్ళకి ఈ సమస్య లేదు. చంద్రబాబు పొడుగ్గా ఉంటాడనో, రాజశేఖర్రెడ్డి బట్టతల బాగుందనో ఎవడూ ఓటు వేసిన దాఖలా లేదు.)

మీడియా పక్షపాత ధోరణి :

మన దేశంలో పత్రికా రంగం మగవారి చేతిలోనే ఉంది. మెజారిటీ రిపోర్టర్లు, ఎడిటర్లు, పత్రికాధిపతులు మగవారు. వీరి మనసులో ఒక అజ్ఞాత 'పురుష పుంగవుడు' (వీడికింకో పేరు గిరీశం) దాగి యుండును. అదీగాక మీడియా మగవాళ్ళు భార్య మీద కోపం స్త్రీజాతి మీద హోల్సేల్ గా చూపిచ్చేస్తుంటారు. అందుకే వీరు ప్రతిభావంతురాలైన స్త్రీ కనబడితో పక్షపాతంతో పక్షవాతం వచ్చినట్లైపోతారు (ఈ వాక్యం మాత్రం ప్రాస కోసమే రాశాను).

కాబట్టి సహజంగానే వీరికి రాజకీయ నాయకురాళ్ళల్లో అజ్ఞానం ఎక్కువగానూ, విజ్ఞానం తక్కువగానూ కనిపిస్తుంటుంది. అందుకే వీరికి నరేంద్ర మోడీలో ఆత్మవిశ్వాసం కనబడితే.. మమతా బెనర్జీలో అహంభావం కనిపిస్తుంది (తెలుగు మీడియాలో వార్తా కథనాల కన్నా వార్తా కతలు ఎక్కువ).

చివరిగా..

రాజకీయ రంగంలో విజయవంతమైన వ్యక్తుల ప్రతిభాపాటవాలని అంచనా వెయ్యాలంటే ఈ విధంగా పలు కారణాలని పరిగణనలోకి తీసుకుంటూ భిన్నకోణంలో ఆలోచించాలి (నేనెప్పుడూ అంతేనండి, వెరైటీగా ఆలోచిస్తుంటాను).

నే రాసిన ఈ కారణాలు అందరికి వర్తించవు. కొన్ని పాయింట్లు కొందరికి వర్తించవచ్చు.. అసలు వర్తించకపోవచ్చును కూడా (ఈ ముక్క పోస్టులో ముందే చెప్పేస్తే మీరిక్కడదాకా చదవరని చెప్పలేదు). ఎందుకంటే ఇదంతా హైపొథెటికల్ రీజనింగ్ (ఇది మాత్రం తప్పించుకోటానికి దొడ్డిదోవ తలుపు తెరిచి ఉంచుకోవడమే).

కానీ స్త్రీలు రాజకీయ రంగంలో రాణించడానికి (పురుషులతో పోలిస్తే) ఎంతగానో శ్రమించాలన్నది మాత్రం నిజం. అంచేత ఈ 'అదనపు' ఒత్తిడే (కార్ల్ మార్క్స్ చెప్పిన అదనపు విలువతో ఈ అదనపు ఒత్తిడికి సంబంధం లేదు) వారిని గంభీర స్వరూపులుగా మార్చేస్తుందనిపిస్తుంది.

నా ఎనాలిసిస్ ఒప్పుకుంటే మీరు తెలివైనవారుగా పరిగణించబడతారు. ఆపై మీ ఇష్టం!

(pictures courtesy : Google)