Monday 30 December 2013

అన్యోన్య దాంపత్యం


గజలక్ష్మి, గజరాజులు భార్యాభర్తలు. వారిది విశాలమైన ఇల్లు. ఆ ఇంట్లో ఓ విశాలమైన హాలు. ఆ హాల్లో ఓ విశాలమైన సోఫా. ఆ సోఫాలో తమ విశాలమైన శరీరాల్ని ఇరుకిరుగ్గా సర్దుక్కూర్చునున్నారు.

గజరాజు ఓ రాజకీయ నేత. ప్రజాప్రతినిధి. కొన్నేళ్లుగా తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశాడు.

ఫలితంగా ఓ పది ఫేక్టరీలు, వెయ్యెకరాల భూమిని సమకూర్చుకోగలిగాడు.

ప్రస్తుతం భార్యాభార్తలిరువురూ ఒక టీవీ వారికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

గత కొన్నేళ్లుగా తెలుగు టీవీ చానెళ్ళకి క్రియేటివిటీ కరువైపోయ్యి.. ఏవేవో దిక్కుమాలిన కాన్సెప్టుల్తో ప్రోగ్రాములు చుట్టేస్తున్నారు.

'చిలకా గోరింకల అన్యోన్య దాంపత్యం' అనే ప్రోగ్రాం గత కొన్నాళ్ళుగా టీవీ 420 లో విశేష ప్రజాదరణ పొందింది.

ప్రోగ్రాంలో ప్రతివారం ఒక 'ప్రముఖ జంట'ని పనీపాటా లేని వీక్షకులకు పరిచయం చేస్తుంటారు.

గజలక్ష్మి అత్యంత బరువైన పట్టుచీర, మరింత బరువైన నగలతో కళకళలాడుతుంది.

గజరాజు తెల్లబట్టల్లో అచ్చు గోరింకలా మెరిసిపోతున్నాడు.

ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి వచ్చీరాని తెలుగులో ఏవో ప్రశ్నలడుగుతూ.. వారిచ్చే సమాధానాల్ని బోల్డంత ఆసక్తిగా వింటుంది.

"మా ఆయన బంగారం. అహోరాత్రులు కుటుంబం గూర్చే ఆలోచిస్తుంటారు. అప్పటికీ చెబుతూనే ఉంటాను.. మరీ తీవ్రంగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుందని. ఏదీ వింటేనా?" గజలక్ష్మి మురిపెంగా చెప్పింది.

"నా భార్య ఉత్తమురాలు. అనుక్షణం నా అవసరాలు కనిపెడుతూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అది నా అదృష్టం." అపురూపంగా భార్యని చూసుకుంటూ అన్నాడు గజరాజు.

"రాబోయే వంద జన్మలక్కూడా ఈయనే నాకు భర్తగా లభించాలని రోజుకి వందసార్లు దణ్ణం పెట్టుకుంటాను." భక్తిగా అంది గజలక్ష్మి.

ఇలా అనేక ముచ్చట్లతో ఇంటర్వ్యూ ముగిసింది.

బుల్లితెరపై వచ్చేవారం మీ ఇంటర్వ్యూ చూసుకోండని చెప్పి టీవీ వాళ్ళు సర్దుకున్నారు.

ఓ రెండు నిముషాలు నిశ్శబ్దం.

సిగరెట్ వెలిగించాడు గజరాజు.

"ఈ జన్మకి పెట్టే హింస చాలదా? రాబోయే వంద జన్మలకి నీ దరిద్రపు మొహమేనా?" వెటకారంగా అన్నాడు గజరాజు.

గజలక్ష్మి గయ్యిమంది.

"మాటలు జాగ్రత్తగా రానీ. నీగూర్చి నాలుగు మంచి ముక్కలు చెప్పినందుకు సంతోషించు. నీ తిరుగుళ్ళ గూర్చి చెప్పానా? దందాల గూర్చి చెప్పానా?"

"ఛీపో! నీలాంటి దరిద్రప్ముండతో నాకు మాటలేంటి!" ఈసడించుకున్నాడు గజరాజు.

"ఛీఛీ పొప్పో! నీలాంటి పోరంబోకుల్తో మాట్లాడేదేంటి?" అసహ్యించుకుంది గజలక్ష్మి.

అయ్యా! అదీ సంగతి!

మీరందరూ వచ్చేవారం ఈ అన్యోన్య దంపతుల ప్రోగ్రాం చూసి తమ విలువైన అభిప్రాయం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

(picture courtesy : Google)

No comments:

Post a Comment