Friday 27 December 2013

సన్మానాలు - శాలువాలు

ఈ సంవత్సరం 'కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం' ప్రముఖ రచయిత డాక్టర్ వి.చంద్రశేఖరరావుకి లభించిందని చదివి సంతోషించాను.

డాక్టర్ చంద్రశేఖరరావు గుంటూరు మెడికల్ కాలేజిలో నాకు క్లాస్మేట్. ఎనాటమీ డిసెక్షన్లో నా బాడీమేట్ (ఇద్దరం ఒకే శవాన్ని పంచుకున్నాం). ఆరోజుల్లో మంచి స్నేహంగా ఉండేవాళ్ళం. ఇప్పుడీ ముక్కలు ఇక్కడ రాయడం 'చంద్రబాబు నాయుడు నా స్నేహితుడు' అని చెప్పుకోవడం వంటిదని నాకు తెలుసు.

చదువైపొయ్యాక ఆతను రైల్వే ఉద్యోగంలో చేరాడు (రైల్వే భాషలో చెప్పాలంటే - లూప్ లైన్లోకి వెళ్ళాడు). కనుక నాకు అతన్ని కలిసే సందర్భాలు పెద్దగా రాలేదు. ఎప్పుడన్నా కలిసినా మా సంభాషణ 'బాగున్నావా?' మించి పెద్దగా ముందుకు సాగలేదు.

మొన్నామధ్య 'నీ బ్లాగులు చదువుతున్నాను. బాగున్నాయి.' అన్నాడు. నేనైతే నమ్మలేదు. అతనికి నా బ్లాగు చదివేంత తీరిక ఉండదు, పొరబాటున చదివినా నచ్చే అవకాశం లేదని నా నమ్మకం. ఈ పోస్టు చంద్రశేఖరరావు గూర్చి కాదు కనుక అతని ప్రస్తావన ఇంతటితో ఆపేస్తాను.

'అరసం' (అభ్యుదయ రచయితల సంఘం) వారు ఈ నెల 28 న జరిగే పురస్కార సభలో డాక్టర్ వి.చంద్రశేఖరరావుని 10,116 నగదుతో సత్కరిస్తార్ట, శాలువా కూడా కప్పుతార్ట. నాకు ఆశ్చర్యం వేసింది. ఇందుకు కారణాలు రెండు. ఒకటి - 116 అంకె పవిత్రతపై కమ్యూనిస్టులక్కూడా మోజు ఉండటం. రెండు - శాలువాల సంస్కృతి ఇంకా కొనసాగుతుండటం. ఏవిటో.. 'అరసం' పేరులో అభ్యుదయం.. ఆచరణలో మాత్రం సనాతనం.

ఇప్పుడు కొద్దిసేపు శాలువా కబుర్లు చెప్పుకుందాం. పెళ్ళిలో మంగళ సూత్రం ఎంత ముఖ్యమో సన్మానానికి శాలువా కూడా అంతే ముఖ్యం. అసలీ సన్మానాలల్లో శాలువాలెందుకనేది నాకు అర్ధం కాదు. బహుశా శాలువాల వ్యాపారం చేసేవాళ్ళని బాగుచెయ్యడానికేమో!

(ఏదో రాసేసుకుంటూ పోతున్నాను. ఈ శాలువాకి ఏదైనా ఘనచరిత్ర, పరమ పవిత్రత ఉందేమో నాకు తెలీదు. ఉన్నట్లైతే శాలువా ప్రేమికులు నాపై కోపం చేసుకోరాదని విజ్ఞప్తి.)

అసలీ శాలువాల వల్ల ఉపయోగమేమీ?

మా ఊళ్ళో సంవత్సరానికి ఒక్కరోజు కూడా చలి ఉండదు. కావున శాలువా కప్పుకునే అవసరం రానేరాదు. పోనీ రాత్రిళ్ళు నిద్ర పోయేప్పుడు దుప్పటిలాగా కప్పుకుందామా అంటే.. శాలువా గరుగ్గా ఉంటూ.. గుచ్చుకుంటుంది.

స్టైల్ కోసం చోక్కాపై కప్పుకుందామా అంటే.. జనాలు మనని రోగిష్టివాడనుకునే ప్రమాదం తీవ్రంగా ఉంది (థాంక్స్ టు అక్కినేని నాగేశ్వర్రావ్). సినిమా వాళ్ళు జమీందార్ పాత్రలకి శాలువా కప్పుతుంటారు (జమీందార్లకి చలి ఎక్కువని సినిమావాళ్ళ అభిప్రాయం కావచ్చు).  

పరుచూరి గోపాలకృష్ణ అనే పేరుగల సినిమా రచయిత ఒకాయన కరుడుగట్టిన కమ్యూనిస్టుట. కాబట్టే ఎప్పుడూ ఎర్ర శాలువా భుజంపై వేసుకుని కనబడుతుంటాట్ట. మరి కమ్యూనిస్టు కానివాడి పరిస్థితితేంటో తెలీదు.

ప్రముఖ సాహిత్యకారుల్ని ఎన్నో సంస్థలు పోటీపడి మరీ శాలువాల్తో సత్కరిస్తుంటాయి. వారికి కప్పిన శాలువాల్ని దాచిపెట్టాలంటే బట్టల బీరువాలు సరిపోవు. పోనీ - ఎవరికన్నా ఫ్రీగా ఇద్దామన్నా తీసుకునే వాడుండడు. రోలింగ్ షీల్డులా రోలింగ్ శాలువాని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది?

ఇట్లాంటి అనేక కారణాల వల్ల ఒక ప్రతిభావంతుణ్ని సత్కరించాలంటే శాలువా కప్పాలనే ఆలోచన మంచిది కాదని తోస్తుంది. సన్మానంలో కప్పే శాలువా ఎందుకూ పనికిరాదు కాబట్టి ఇదో నేషనల్ వేస్ట్ అనుకోవచ్చు. కావున మనం శాలువాల సంస్కృతిని విడనాడాలని బల్లగుద్ది వాదిస్తున్నాను.

ఊరికే విమర్శించడం కాదు, నీ ప్రతిపాదన ఏమిటి?

వేరే భాషల వాళ్ళ సంగతి తెలీదు గానీ.. తెలుగులో ఎక్కువమంది రచయితలు, కవులు మధ్యతరగతికి చెందినవారు. ఈ మధ్యతరగతి రచయితలు రాతల్లో మునిగి ఉండటం మూలానా తమ ఆర్ధికస్థాయిని పెంచుకోలేకపోయ్యారా? లేక మధ్యతరగతి వారవడం మూలానే చక్కగా రాస్తున్నారా? (ఇది వేరే చర్చ).

ఓ శాలువా కప్పే బదులుగా.. కొన్ని కిలోల (ఎన్నికిలోలో సన్మానించేవారి ఆర్ధిక స్థితి నిర్ణయిస్తుంది) కందిపప్పు, చింతపండు వంటి పనికొచ్చే రోజువారీ కిరాణా వస్తువులు బహుమతిగా ఇవ్వడం ఉత్తమం అని నా అభిప్రాయం. శాలువా కప్పేకన్నా ఇలా వస్తువులివ్వడమే సముచిత పురస్కారం కూడా. ఇది ఆ రచయితకి నూతనోత్తేజాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను.

ఎందుకు? ఎలా?

ఒక రచయిత తన వ్యాసంగానికి ఎంతో విలువైన తన వ్యక్తిగత సమయం వెచ్చిస్తాడు. ఇందువల్ల కుటుంబ సభ్యులు (ముఖ్యంగా భార్య) నష్టపోతారు. వారు ఆ మేరకు కొంత అసంతృప్తిగా (బయటకి చెప్పుకోరు గానీ) ఉంటారు. భర్త ప్రపంచాన్ని పట్టించుకోకుండా రచనలో మునిగి తేలుతుంటే.. ఆ వ్యాపకానికి ఏ మాత్రం సంబంధం లేని భార్య 'ఇది నా ఖర్మ' అని బాధ పడుతూ పిల్లల్ని, ఇంటినీ చూసుకుంటుంది.

అందువల్ల - నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో అరుదుగా మాత్రమే రచయితలకి భార్య సహకారం ఉంటుంది. ఎందుకంటే - భర్త రాయడం వల్ల వారు జీవితంలో చాలా కోల్పోతారు. విషయం ఇంతుంది కాబట్టే పాశ్చాత్య దేశాల్లో పుస్తకం ముందుమాటలో భార్యలకి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రముఖంగా తెలిపే సంప్రదాయం ఉంది.

అసలే భర్త రాతల వల్ల శిరోభారంతో ఉన్న రచయితగారి భార్యకి, సన్మానం తాలూకా 'శాలువా' అనే ఇంకో బరువుని ఇవ్వడం ఉచితం కాదు. అంచేత రచయిత కుటుంబానికి పనికొచ్చే బహుమతి ఇవ్వడం సముచితం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కందిపప్పు, చింతపండుల లాంటి వస్తువుల కన్నా విలువైందేదీ లేదు.

ఇట్లాంటి వస్తువుల పురస్కారం వల్ల భార్యకి ఆనందం కలుగుతుంది. ఉత్సాహం వస్తుంది. తన భర్త మరిన్ని మంచి రచనలు చెయ్యాలనీ, మరిన్ని కిరాణా వస్తువుల్ని పురస్కారంగా పొందాలనీ రచయితల భార్యలు కోరుకుంటారు. భర్తల్ని మరింత ప్రోత్సాహిస్తారు (రాసేప్పుడు సణగటం మాని ప్రేమతో కాఫీ, టీలు సప్లై చేస్తారు)

రచయితల్ని నేనేదో తక్కువ చేసి రాస్తున్నానని మీకు అనిపించవచ్చు. కానీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కొందరు రచయితలు నాకు తెలుసు. ఈ కరువు రోజుల్లో శాలువాలు చేసుకున్న పుణ్యమేంటి? కందిపప్పు చేసుకున్న పాపమేంటి?

నువ్వు చెప్పింది బానే ఉంది కానీ.. అలా ఇవ్వడం నిషేధం. పైగా నేత కార్మికుల్ని నిరుత్సాహ పరిచినట్లవుతుంది.

మీ ఆచారం తగలెయ్యా! పోనీ బెడ్ షీట్లు, దిండు గలీబులైనా ఇవ్వండి స్వామీ!

(picture courtesy : Google)