Friday, 10 January 2014

ముసుగు వీరులు


ఆ ఊళ్ళో రంగారావు ఓ చిన్నపాటి నాయకుడు. రంగారావుది ఎస్వీరంగారావంతటి నిండైన విగ్రహం. పెదరాయుడంతటి హుందాతనం. ఆశ లేనివాడు మనిషే కాదు. అబ్దుల్ కలాం గారేమన్నారు? ముందొక కల గని.. ఆ తర్వాత తీరిగ్గా ఆ కలని సాకారం చేసుకోమన్నారు. రంగారావుకి కలాం గారి మాట నచ్చింది.

అందుకే కొన్నాళ్ళపాటు ప్రజాప్రతినిధి అయిపోయినట్లు కలగన్నాడు. ఇప్పుడు ఆ కల నిజం చేసుకోటానికి గత కొంతకాలంగా గ్యాపు లేకుండా ప్రజాసేవ చేసేస్తున్నాడు. ఏదైనా పార్టీ టిక్కెట్టిస్తే ప్రజాప్రతినిధిగా పోటీ చెయ్యాలని ఉబలాటపడుతున్నాడు.

అయితే ఆ ఊళ్ళో అబ్దుల్ కలాం గారి ఫాలోవర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అచ్చు రంగారావు కన్నకలే కన్నారు. వాళ్లకి రంగారావు ప్రణాళిక అర్ధమయ్యింది. దొంగలకే సాటి దొంగల మనస్తత్వం తెలుస్తుంది. అంచేత ఆ ఔత్సాహిక రాజకీయ నాయకులు రంగారావు ప్రజాసేవని ప్రశ్నించడం మొదలెట్టారు. తన పోటీదారుల ప్రశ్నాధోరణి రంగారావుకి ఇబ్బందిగా తయారైంది.

రంగారావుకి అప్పారావనే స్నేహితుడున్నాడు. నల్లగా, పీలగా, పొట్టిగా ఉంటాడు. అతనికి రోడ్డు మార్జిన్లో సైకిల్ రిపైర్ షాప్ ఉంది. అప్పారావు నిఖార్సైన తాగుబోతు. అంతకంటే నిఖార్సైన వదరుబోతు. గొంతులోకి మందు దిగంగాన్లే ఎక్కడ లేని శక్తీ వస్తుంది. ఆపై ఇందిరా గాంధీ నుండి బడ్డీ కొట్టు సాంబయ్య దాకా అందర్నీ బండబూతులు తిడతాడు. అలా తెల్లవార్లూ తాగుతూ, వాగుతూ.. మైకంలో ఎక్కడో పడిపోతుంటాడు. పొద్దున్నే మెలకువొచ్చి నీరసంగా ఇంటికి చేరుకుంటాడు. అందుకే అప్పారావుని 'బూతుల అప్పారావు', 'తాగుబోతు అప్పిగాడు' అని కూడా అంటుంటారు.

అప్పారావుకి రంగారావంటే అభిమానం. రంగారావు ఎప్పటికైనా ఏదో పదవి సంపాదిస్తాడని అప్పారావు నమ్మకం. ఆరోజు రంగారావు స్నేహితుడు అప్పారావుకి కబురంపాడు. ఫలానావాడు నన్ను ఫలానా మాటలన్నాడని అప్పారావుతో చెప్పుకుని బాధ పడ్డాడు. అప్పారావుకి ఆ ఫలానావాడి పట్ల కోపం వచ్చింది. 'ఖర్చులకి ఉంచుకో' అంటూ ఓ ఐదొందలు అప్పారావు చేతిలో పెట్టాడు రంగారావు.

ఆ రోజు రాత్రి ఫుల్లుగా తాగేసిన అప్పారావు ఆ ఫలానావాడి ఇంటికి చేరుకున్నాడు. తూగుతూ రోడ్డు మీద నిలబడి ఆ ఫలానావాణ్ని, వాడింట్లో ఆడవాళ్లనీ తెల్లవార్లు తిట్టాడు. అప్పారావు అరుపులకి వీధంతా దద్దరిల్లిపోయింది. ఆ ఇంట్లోవాళ్ళు తలుపులు బిగించుకుని, చెవుల్లో దూది పెట్టుకుని జాగారం చేశారు. విజయ గర్వంతో వికటాట్టహాసం చేశాడు అప్పారావు. ఆ రకంగా స్నేహితుని ఋణం తీర్చుకున్నట్లుగా తృప్తినొంది.. మైకం ఎక్కువై.. మురిక్కాలవ పక్కన పడిపొయ్యాడు.

మర్నాడు రంగారావు ఆ ఫలానావాడి ఇంటికి పరామర్శ కోసం వెళ్ళాడు. ఆ ఇంట్లోవారికి జరిగిన అవమానం పట్ల ఆందోళన చెందాడు. తాగుబోతు అప్పిగాడి ప్రవర్తనని తీవ్రంగా ఖండించాడు. పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేయిస్తానని హడావుడి చేశాడు. 'పోన్లే, మైకంలో ఏదో వాగాడు, వదిలేద్దాం.' అన్నారు ఆ ఫలానావాడి కుటుంబ సభ్యులు.

ఆ రోజు మొదలు, రంగారావుని విబేధించిన వారందరి ఇళ్ళ పైకి (రంగారావిచ్చిన డబ్బుల్తో) ఫుల్లుగా తాగి దండయాత్రకి పొయ్యేవాడు తాగుబోతు అప్పిగాడు. వాడి బూతుల దండకానికి ఇళ్ళల్లో ఆడవాళ్ళకి వాంతులయ్యేవి, చెవులు చిల్లులు పడేవి. ఒకళ్ళిద్దరు ధైర్యం చేసి పోలీసు రిపోర్టిచ్చి లోపల వేయించారు కూడా. ఆ మర్నాడే రంగారావు సాయంతో బెయిల్ మీద బయటకొచ్చి మరింత రెచ్చిపొయ్యేవాడు అప్పారావు. 

కొన్నాళ్ళకి ఊళ్ళోవాళ్లకి రంగారావు, అప్పారావులకి గల కనెక్షన్ అర్ధమైంది. అప్పారావంటే రంగారావు ముసుగు మాత్రమేననీ, ఇద్దరూ ఒకటేననీ తెలుసుకున్నారు. ఇప్పుడు రంగారావు వ్యతిరేకులు కొందరు అప్పారావు నోటికి ఝడిసి నోరు మూసుకుంటున్నారు. రంగారావుకి కావలిసిందదే. 

చివరి తోక :

ఈ కథ చదివిన వారికి ఒక రాజకీయ పార్టీ, దాని అనుబంధ సంస్థలు గుర్తొస్తే సంతోషం.