Thursday, 9 January 2014

వామ్మో వోల్వోఆయన పేరు పాపన్న. పరులకి ఉపకారం చెయ్యడం పాపన్నకి అలవాటు, ఇష్టం. అందుకే అందరూ ఆయన్ని 'పరోపకారి పాపన్న' అంటారు. పంచె, అరచేతుల చొక్కాలో.. ఎర్రగా, పొట్టిగా, బొద్దుగా హుందాగా ఉంటాడు. 

ఆ పక్క వీధిలో ఉండే సుబ్బారావు కూతురి కాపురం విషయంలో ఏదో ఇబ్బంది తలెత్తితే, ఇప్పుడే ఆ సమస్య పరిష్కరించాడు పాపన్న. నెమ్మదిగా ఇంటికి నడక మొదలెట్టాడు. పాపన్న పాతకాలం మనిషి. సాధ్యమైనంతవరకూ నడకే ఆయనకి అలవాటు. అలా నడుస్తుండగా పాపన్న దృష్టి నాకర్షించింది ఓ ఇల్లు.

అది పెళ్లి వారిల్లు. కొత్తగా వేసిన రంగులతో ఇల్లు మెరిసిపోతుంది. కొత్తబట్టల్లో పిన్నలు, పెద్దలు.. ఇల్లంతా కళకళలాడుతుంది. కానీ వారంతా గోలగోలగా ఏదో అరుచుకుంటున్నారు. ఇంటికి కొద్దిదూరంలో రోడ్డు మార్జిన్లో ఖరీదైన బస్సొకటి నిలబడుంది.

అక్కడేదో సమస్యగా ఉందని గ్రహించాడు పాపన్న. 'సమస్యల్ని మొగ్గలోనే తుంచెయ్యకపోతే ప్రమాదం. అది చిలికిచిలికి గాలివానగా మారొచ్చు.' అనుకుంటూ పెళ్లి వారింటి వైపు నడిచాడు. ఇలా సమస్యల్ని సూ మోటోగా స్వీకరించటం పాపన్న అలవాటు.

కొద్దిసేపట్లోనే వివరాలు రాబట్టాడు. ఇది మగపెళ్లివారి ఇల్లట. పెళ్లి రాత్రికి ఏలూర్లోట. పెళ్లికొడుకు వైపువాళ్ళు ఆవేశంతో ఊగిపోతున్నారు.

మరీ ముఖ్యంగా ఒక పెద్దాయన పెద్దగా అరుస్తున్నాడు. ఆయన పొడుగ్గా, సన్నగా ఉన్నాడు. జుట్టు తెల్లగా ముగ్గుబుట్టలా ఉంది.. పెళ్లికొడుకు తండ్రిట.

ఆయన చేతుల్ని పట్టుకుని బ్రతిమాలుతున్నాడు ఒక నడివయసు బట్టతల మనిషి.. పెళ్లికూతురు బాబాయిట.

పాపన్నకి విషయం అర్ధమైపోయింది. సందేహం లేదు.. ఇది ఖచ్చితంగా వరకట్నం కేసు.

"నాతో పెట్టుకోవద్దు. మాట తేడా వచ్చిందంటే మనిషినే కాను." అరిచాడు తెల్లజుట్టాయన.

"తప్పైపోయింది బావగారు. మన్నించండి." బట్టతల బ్రతిమాలుతుంది.

"ఒరేయ్ గోపాలం! ఎస్పీకి ఫోను కలపరా. ఇప్పుడే వీళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టించి బొక్కలో వేయించేస్తాను." తెల్లజుట్టు కోపంతో వణికిపోయింది.

"బావగారు! మీరంత మాట అనకండి. జరిగింది తప్పే. మీరు పెద్దమనసు చేసుకుని మమ్మల్ని క్షమించాలి. ఇవి చేతులు కావు.. కాళ్ళు." అంటూ బట్టతలాయన వేడుకుంటున్నాడు.

ఈ బట్టతలాయనెవరో తెలుగు సినిమాలు బాగా చూసినట్లుంది.. సినిమా డైలాగులు కొడుతున్నాడు.

"క్షమించాడానికి మీరు చేసిందేమన్నా చిన్నతప్పా? ఛీఛీ.. మీరింత కుట్ర మనుషులని ముందే గ్రహించలేకపొయ్యాను." ఈసడించుకుంది తెల్లజుట్టు.

పాపన్న ఇంక సమయం వృధా చెయ్యదల్చుకోలేదు.

"అయ్యా! అమ్మా! శాంతించండి. నా పేరు పాపన్న. అందరూ నన్ను 'పరోపకారి పాపన్న' అంటారు. దయచేసి నే చెప్పేది సావధానంగా వినండి. ఈ రోజుల్లో కూడా డబ్బు కోసం పెళ్ళిళ్ళు ఆగిపోవలసిందేనా?"

అక్కడున్నవాళ్ళు హఠాత్తుగా అరుపులు మానేశారు. ఒక్కసారిగా నిశ్శబ్దం. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఆపై అందరూ పాపన్న వైపు ఆశ్చర్యంగా చూశారు.

బట్టతల భుజంపై చెయ్యి వేసి 'నేనున్నాను' అన్నట్లుగా తట్టాడు పరోపకారి పాపన్న. ఆయన  పాపన్న చేస్తున్న సాయం పట్ల కృతజ్ఞత చూపకపోగా మొహం చిట్లించాడు.

పాపన్నకి యిట్లాంటి విషయాల్లో అపార అనుభవం ఉంది. ఆయన పీటల మీద ఆగిపోతున్న పెళ్ళిళ్ళనే సాఫీగా అయ్యేట్లు చేశాడు.

"దయచేసి ఆలోచించండి. కట్నం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చెయ్యడం మహాపాపం." ఉపన్యాస ధోరణి అన్నాడు పాపన్న.

ఇంతలో పాపన్న భుజంపై ఎవరిదో చెయ్యి పడింది. ఆ చెయ్యి ఓనరు వైపు చూశాడు పాపన్న. మనిషి దిట్టంగా, కుదమట్టంగా ఉన్నాడు.

"పాపన్నగారూ! నేను పెళ్లికొడుకు మేనమావని. అసలిక్కడేం జరుగుతుందో మీకు తెలుసా?" అనడిగాడతను.

"ఇట్లాంటివి ఎన్ని చూళ్ళేదు? కట్నం దగ్గరేదో పేచీ వచ్చినట్లుంది." ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా అన్నాడు పాపన్న.

"లేదు బాబూ లేదు. ఇది అంతకన్నా పెద్ద సమస్య. పెళ్లికూతురు తండ్రి మా కోసం ఒక లక్జరీ బస్సు పంపాడు. అది మాకు నచ్చలేదు." అన్నాడాయన.

"లక్జరీ బస్సొస్తే సుబ్బరంగా ఎక్కి కూర్చోక ఈ పంచాయితీ ఏమిటి?" ఆశ్చర్యపొయ్యాడు పాపన్న.

"పాపన్నగారూ! అర్ధం చేసుకోండి. మేం ఆడపెళ్లివాళ్ళని ఆర్టీసీ ఎర్రబస్సు పంపమంటే, ఈ పెద్దమనిషి ప్రైవేటు ఓల్వో బస్సు పంపాడు. మొన్న ఓల్వో బస్సులో ప్రయాణీకులు సజీవ దహనం అయిన సంగతి మీకు తెలిసిందే గదా. అప్పట్నుండీ మా అందరికీ ఆ మాయదారి ఓల్వో పేరు వింటేనే గుండె దడగా ఉంటుంది. బయట వున్న ఆ పాడు వోల్వో బస్సు చూసి మా అబ్బాయికి దడుపుడు జెరం వచ్చింది. ప్రాణాలకి తెగించి మరీ పెళ్ళికి ఎలా వెళ్తామండీ? అందుకే ఆ బస్సు ఎక్కడానికి మేం ఒప్పుకోం." అన్నాడు పెళ్లికొడుకు మేనమామ.

పాపన్నకి విషయం అర్ధమైంది. ఇది కట్నం కేసు కాదు, బస్సు కేసు.

"ఏమయ్యా పెద్దమనిషీ! సంసార పక్షంగా ఎర్రబస్సు ఏర్పాటు చెయ్యకపొయ్యావా? ఖర్చు కూడా తగ్గేది." బట్టతలని అడిగాడు పాపన్న.

"అయ్యా! పాపన్న గారూ! ఎర్ర బస్సు కోసం ఎంతో ప్రయత్నించామండి. అప్పటికీ మా ఎమ్మెల్యే గారితో ఫోను కూడా చేయించాం. అయినా మా వల్ల కాలేదు.. పెళ్ళిళ్ళ సీజన్ కదండీ!" దీనంగా అన్నాడు బట్టతల బాబాయ్.

"అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటి? మమ్మల్నందర్నీ బస్సెక్కి మాడి మసైపొమ్మంటారు. అంతేనా?" తెల్లజుట్టాయన మళ్ళీ ఆయాసపడ్డాడు.

"శివశివా, అంత మాటనకండి." అంటూ చెవులు మూసుకున్నాడు బట్టతలాయన.

పాపన్న గొంతు సరి చేసుకుని చెప్పడం మొదలెట్టాడు.

"ఇక్కడ ఎవరిది తప్పు అని మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే.. అవతల పెళ్లి ముహోర్తం ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు జరగవలసింది ఏంటనేది ఆలోచించడం విజ్ఞుల లక్షణం." అన్నాడు పాపన్న.

"అయితే ఈ సమస్యకి పరిష్కారం మీరే చూపాలి, మీరే చూపాలి." అన్నారు అందరూ ముక్తకంఠంతో.

ఒక క్షణం తీవ్రంగా ఆలోచించాడు పాపన్న. ఏదో ఐడియా వచ్చినట్లుంది. తల పంకిస్తూ చిన్నగా నవ్వాడు.

"పక్క వీధిలో నాకు తెలిసిన సిటీ బస్సు ఓనరొకాయన ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మీరా సిటీ బస్సులో పొయ్యే ఏర్పాటు చేయిస్తాను. సరేనా?" అన్నాడు పాపన్న.

"సరే, సరే" అన్నారు అందరూ.

"ఐతే ఇక్కడో సమస్య ఉంది. ఆ బస్సు సీట్లు చిరిగిపోయ్యాయి, టైర్లు బోడిగుండులా అరిగిపొయ్యాయి, ఎంత తొక్కినా ముప్పైకి మించి స్పీడు పోదు.... "

పాపన్నమాటకి అడ్డు తగిలాడు తెల్లజుట్టు పెద్దాయన.

"అయ్యా పాపన్న గారూ! ప్రస్తుతం మేమున్న పరిస్థితి మీకు పూర్తిగా తెలిసినట్లు లేదు. బస్సు ఎట్లా ఉన్నా పర్లేదు.. దానికి ఇంజన్ ఉంటే చాలు. మధ్యలో ఆగిపోయినా అందరం కలిసి నెట్టుకుంటూ వెళ్తాం. ఇంక మీరేమీ మాట్లాడకండి. అర్జంటుగా ఆ సిటీ బస్సేదో ఏర్పాటు చేద్దురూ." అర్ధిస్తున్నట్లు అన్నాడు.

"అయితే సరే! నాకో పావుగంట టైమివ్వండి. ఈలోపు అందరూ రెడీ అవ్వండి." అన్నాడు పాపన్న.

ఆడవాళ్ళు, పిల్లలు హడావుడిగా సూట్ కేసులు సర్దుకోడానికి ఇంట్లోకి పరిగెత్తారు.

"పాపన్నగారూ! మీ ఋణం ఈ జన్మకి తీర్చుకోలేను. చచ్చి మీ కడుపున పుడతాను." పాపన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని హెవీగా అన్నాడు బట్టతల బాబాయ్.

ఈయన సినిమా డైలాగులు తప్ప మామూలు డైలాగులు పలకలేడేమో!

పావుగంటలో పెద్దగా శబ్దం చేసుకుంటూ, నల్లటి పొగ దట్టంగా చిమ్ముకుంటూ ఒక డొక్కుబస్సు పెళ్లివారింటి ముందు ఆగింది.

పిల్లలు, పెద్దలు 'హేయ్ బస్సొచ్చేసింది' అంటూ హడావుడిగా బస్సు ఎక్కేసారు. కొద్దిసేపటికి బస్సు భారంగా బయల్దేరింది.

తన జీవితంలో మరో పరోపకారం చేసినందుకు సంతోషిస్తూ, తృప్తిగా ఇంటి దారి పట్టాడు పాపన్న.

( 'పరోపకారి పాపన్న' పాత్ర చందమామ కథల సృష్టి)