Thursday 16 January 2014

ఇవేం రాజకీయాలు!


ప్రపంచంలో అనేక దేశాలు, రకరకాలైన రాజకీయాలు. సౌదీ అరేబియా, ఉత్తర కొరియాల్లొ నియంతృత్వం ఉంది. అట్లాగే మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ. అయితే ఇది గాడిద గుడ్డు ప్రజాస్వామ్యమని మా సుబ్బు అంటుంటాడు. అనగా కాగితం మీద రాసుకుంది మాత్రం 'ప్రజలే పాలకులు' అని. కానీ - నిజానికి ప్రజలకి, పాలకులకి సంబంధం లేదు. అసలీ ఎన్నికల రంగం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పొయి చాలా కాలమైంది. సరే! మన ప్రజాస్వామ్యం గూర్చి సుబ్బు ఏమనుకుంటున్నాడన్నది ప్రస్తుతం అప్రస్తుతం.

ప్రజాస్వామ్యంలో ఆలోచనా సారూప్యత కల కొందరు వ్యక్తులు ఒక రాజకీయ పార్టీగా ఉంటారు. వారిలోంచి పార్టీ నాయకత్వం ఎన్నుకోబడుతుంది. ఈ పార్టీ నాయకత్వం విధానపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది. పార్టీలో అంతర్గతంగా అనేక స్థాయిల్లో చర్చ జరుగుతుంది.

ఆ సందర్భంలో ఒక నాయకుడు పార్టీ పాలసీని విబేధించవచ్చు, ప్రశ్నించవచ్చు. కుదిరితే సహచరుల మద్దతు కూడగట్టుకుని, చర్చలో పట్టు సాధించి పార్టీ నిర్ణయాన్ని మార్చుకునేలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ డెమాక్రసీలో ఒక విధానం గూర్చి విభిన్న అభిప్రాయాల మధ్య వాడిగా చర్చింపబడటం ఆహ్వానించదగ్గ పరిణామం (ఈ గోల ఏక వ్యక్తి పాలనలో ఉండే ప్రాంతీయ పార్టీల్లో ఉండదు, అంచేత వాటికి మినహాయింపు).

పార్టీ పాలసీని విబేధిస్తూ అభిప్రాయాల్ని స్వేచ్చగా వ్యక్తీకరించి, చర్చించిన తరవాత.. పార్టీ తనకి వ్యతిరేకమైన నిర్ణయం ప్రకటించినప్పుడు ఆ నాయకుడికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి - పార్టీ అభిప్రాయానికి శిరసావహించి పార్టీలో కొనసాగడం, రెండు - ఆ పార్టీకి రాజీనామా చేసి బయటపడటం. మూడో మార్గం లేదు.. ఉండరాదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రాన్నే చూడండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశం సంవత్సరాల తరబడి చర్చించింది. వందలమంది వేలాదిగా తమ అభిప్రాయాలు చెప్పారు. చివారకరికి AICC రాష్ట్రాన్ని విడగొట్టేదామని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మంచిదా కాదా అనేది ఇక్కడ అనవసరం. ఆ నిర్ణయం నచ్చనివాళ్ళు ఏం చెయ్యాలి? రాజీ అయినా పడాలి లేదా అర్జంటుగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి బయటపడాలి. ఇది నైతికతకి సంబంధించిన విషయం. నైతికత, నిజాయితీ లేనివాడు ఏం చెప్పినా విలువుండదు.

ఇవ్వాళ మంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలో వేకెన్సీ ఉందా, ఎందులో చేరితే గిట్టుబాటు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి రేపు కొత్త పార్టీ పెట్టబోతున్నాట్ట! మరప్పుడు ఇవ్వాళ ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకో అర్ధం కాదు. ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం కాదా?

పత్రికలు రాస్తున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో తన ఇమేజ్ పెంచుకుని, ఓ కొత్తపార్టీ పెట్టి, అన్ని సీట్లు గెలిచేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనుకుందాం. ఇది ఏ రకమైన రాజకీయం? ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ, నెలనెలా జీతం పుచ్చుకుంటూ ఇంకో కంపెనీకి లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవటం అనైతికం కాదా? ఈ ధోరణికి గిరీశం కూడా సిగ్గు పడతాడు.

అసలీ నాయకులు అధినాయకుల దగ్గర ఒకటి చెబుతున్నారు, ప్రజలకి ఇంకోటి చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి కొత్తపార్టీ వార్తల్ని ఢిల్లీ పట్టించుకోదు. వీటన్నింటినీ మన తెలుగు మీడియా మరింత వక్రీకరించి, ప్రజల్ని ప్రతిభావంతంగా తప్పుదోవ పట్టిస్తుంది. అందుకే మన మీడియా ప్రజల గూర్చి వార్తలు ప్రచురించటం ఎప్పుడో మానేసింది. ఇప్పుడు మీడియాకి హాట్ కేకులు రాజకీయ నాయకుల కెరీర్ గూర్చి వార్తలే!

ప్రతి పార్టీవారు మిగిలిన పార్టీలవారు కుమ్ముక్కయ్యారని ఆరోపిస్తుంటారు. వాస్తవానికి అన్నిపార్టీల అధినాయకత్వం, తమ నాయకుల్తో కుమ్ముక్కై ఒక డ్రామా నడిపిస్తున్నారని అనుమానం కలుగుతుంది. రాజకీయ పార్టీలు ప్రజల్ని వంచిస్తున్నారని కూడా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ దురదృష్ట పరిణామాల్ని గమనిస్తూ ఉండటం మించి సామాన్యుడు చేయగలిగిందేమీ లేదు.