Tuesday 14 January 2014

'నేనొక్కడినే' ఓ సైకలాజికల్ ట్రాష్


ఇవ్వాళ పొద్దున్న నా స్నేహితుడి నుండి ఫోన్.

"మహేశ్ బాబు సినిమా 'నేనొక్కడినే'లో ఏదో సైకియాట్రీ జబ్బు చూపించారు. అట్లాంటి కేసు నువ్వెప్పుడైనా చూశావా?"

చచ్చితిని. అనుకున్నట్లే అయ్యింది. ఇట్లాంటి ప్రశ్న నేను ఊహిస్తూనే ఉన్నాను. సినిమాల్లో గజ్జి, తామర చూపిస్తే జనాలు పట్టించుకోరు. కానీ ఎందుకో సైకియాట్రి కేస్ చూపించగాన్లే ఎక్కడ లేని డౌట్లు వచ్చేస్తాయి.

ఇంతకు ముందు 'అపరిచితుడు' అంటూ ఏదో సినిమా వచ్చింది గానీ.. నేనా సినిమా చూళ్ళేదు. ఇప్పుడు 'నేనొక్కడినే' చూశానంటూ నా బ్లాగులో దండోరా వేశాను కావున.. తప్పించుకోటానికి లేదు.

"బిజీగా ఉన్నాను. తరవాత మాట్లాడతా." అంటూ ఫోన్ కట్ చేశాను.

నేను ఇంతకు ముందు మిస్సమ్మ, దేవదాసు, పెద్ద మనుషుల్ని విమర్శించాను. దానికి కారణం కూడా రాశాను. అందరికీ నచ్చిన సినిమాలో సూక్ష్మ లోపాల్ని ఎత్తి చూపుతూ, విమర్శిస్తే మజాగా ఉంటుంది. కానీ ప్రేక్షకులు తిరస్కరించిన సినిమాని విమర్శించడం అనవసరం. అయినా - 'నేనొక్కడినే' సినిమాపై నా ఆలోచనలు కొన్ని రాసి ముగిస్తాను.

ఇదేదో తెలుగువారి స్థాయిని మించిన హాలీవుడ్ స్థాయి సినిమా అని కొందరు సెలవిస్తున్నారు. వారికో నమస్కారం. నాకర్ధం కానిది.. తెలుగు సినిమాలు హాలీవుడ్ సినిమాలా ఎందుకు ఉండాలి? తెలుగు సినిమా తెలుగు సినిమాలాగే ఉండాలి కదా! టెక్నికల్ గా ఆ స్థాయిలో ఉండాలని అంటున్నారా?

ఇంతకూ అసలీ 'నేనొక్కడినే' తెలుగు సినిమానేనా? పాత్రలు తెలుగు భాషలో మాట్లాడుకుంటాయి. అంత మాత్రాన దీన్ని తెలుగు సినిమా అంటూ చెప్పలేం. ఇది అనేక హాలీవుడ్ సినిమాల్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి వండిన సినిమా. స్థానికత లేని ఈ సినిమాకి మనం ఎలా కనెక్ట్ అవుతాం? అవ్వలేం కదా. మన గుండమ్మకథ ఇంగ్లీషోళ్ళకి నచ్చుతుందా?

తెలుగు సినిమాల్ని అమెరికాలో కూడా విరగబడి చూస్తున్నారనీ, అంచేత తెలుగు సినిమా చచ్చినట్లు ఇతర దేశాల్లో తీయాల్సొస్తుందనీ అంటున్నారు. ఔను, అదీ నిజమే! నిర్మాత డబ్బు ఖర్చు పెట్టేదెలా? కాబట్టి పాత్రలు తెలుగులో మాట్లాడతాయే గానీ.. ఇది తెలుగువాడి జీవితానికి సంబంధించిన సినిమా కాదు. ఓవర్సీస్ వ్యూయర్స్ ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వెదజల్లుతూ తీసిన అతి ఖరీదైన సినిమా. 

వెరైటీగా తీశారు కాబట్టి బాగుంది అంటున్నారు కొందరు. వెరైటీ అంటే బెండ కాయల్తో వంకాయ పులుసు చెయ్యడం కాదు, అది కుదరదు కూడా. ఈ సినిమా దర్శకుడు అదే చేశాడు. నే చదువుకునే రోజుల్లో ఓ క్షుద్ర రచయిత చేతబడిని హిప్నాటిజంతో లింకు పెట్టి పెద్ద నవలొకటి రాశాడు, దండిగా సొమ్ము చేసుకున్నాడు. ఆ రోజుల్లో ప్రేమ కథల్తో విసిగి ఉన్న పాఠకులు ఆ చెత్తనే ఓ రిలీఫ్ గా ఫీలయ్యారు.

ఈ సినిమాలో గాల్లో ఫైటింగ్ చేసి, హత్య చేసినట్లుగా భావించుకుంటాడు హీరో. దీన్ని hallucinatory behavior అంటారు. ఇది మానసిక రోగం. అర్జంటుగా ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించాలి. దీనికి ఓ డాక్టర్ టెస్టులు, గట్రా చేయించి (డాక్టర్లు ఉట్టి పుణ్యానికి డబ్బులు బాగా ఖర్చు పెట్టిస్తారని దర్శకుడు ఫిక్స్ అయిపోయినట్లున్నాడు) integration disorder అని ఊరూ, పేరు లేని ఓ రోగం పేరు చెబుతాడు.

హైదరాబాదులో సైకియాట్రిస్టులు కనీసం వందమంది ఉన్నారు. దర్శకుడు వారిలో ఒకరితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడినట్లయితే.. వాళ్ళు హీరోకి ఇంకొంచెం బెటర్ రోగం సూచించి ఉండేవారు. కానీ ఆ మాత్రం రీసెర్చ్ చేస్తే అతను తెలుగు సినిమా డైరక్టర్ అవడు.

సరే! ఏదొక రోగం. మరీ శంకరశాస్త్రిలా చాందసంగా రాస్తున్నట్లున్నాను, వదిలేద్దాం. దర్శకుడి రూట్లోకే వద్దాం. డాక్టర్ హీరోదంతా ఊహే, అతనికి గతం లేదు అంటాడు. అన్నన్ని టెస్టులు చేశాడు కాబట్టి డాక్టర్ కరెక్ట్ చెప్పాడనుకుందాం. కానీ డాక్టర్ తప్పు చెప్పాడు. హీరో ఊహించుకున్న వాళ్ళంతా నిజంగానే ఉన్నారు.

మరయితే సినిమా మొదట్లో హీరో గాల్లో ఫైటింగ్ ఎందుకు చేశాడు? ఆయనగారికి అదేదో గ్రే మేటర్ తగ్గి (అసలు సంగతి - దర్శకుడికి గ్రే మేటర్ తగ్గింది) ఒక మాయదారి రోగం ఉన్నందువల్లనే కదా! డాక్టరో, హీరోనో ఎవరో ఒకళ్ళే కరక్ట్ అవ్వాలిగా. ఇద్దరూ ఎలా కరెక్ట్ అవుతారు? కనీస శాస్త్రీయత లేకుండా ఇంట్లో కూర్చుని రాసుకున్న కథ కూడా తప్పులతడకే!

ఇట్లా రాసుకుంటూ పొతే.. ఈ సినిమాలో చూపించిందంతా ఓ పెద్ద సైకలాజికల్ ట్రాష్ అని అర్ధమవుతుంది. ఒకప్పటి క్షుద్ర రచయిత లాగా, ఈ దర్శకుడు 'నేను సైకలాజికల్ థ్రిల్లర్ తీశాను, చూసి తరించండి' అంటాడు. 

ఈయన ఒకప్పుడు 'ఆర్య' అనే గొప్ప సినిమా తీశాట్ట. నేనా సినిమా విడియో చూశాను. ఆ ఆర్య అనేవాడు ఒక చౌకబారు stalker. మనకి కనిపిస్తే అర్జంటుగా eve teasing కేసు పెట్టించి జైల్లో వేయించదగ్గ వ్యక్తి. 'ఆర్య'ని ఓ intelligent సినిమాగా భావించాల్ట! దర్శకుడికి ఎంత ధైర్యం!

అసలు సమస్య ఏమంటే.. మన తెలుగు సినిమాలు చదువుకున్న వాళ్ళు చూడరు (నా తోటి సైకియాట్రిస్టులు సినిమాలు చూడరు, వాళ్ళల్లో నేనే గొప్ప), చూసినా పట్టించుకునే టైం ఉండదు.. నాలాంటి సైకియాట్రిస్ట్ 'పని లేక' రాస్తే తప్ప. తెలిసిన వాళ్ళు చెప్పకపోతే నిజంగానే ఇదేదో గొప్ప కథ అనుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఇవ్వాళ ఈ పవిత్ర కార్యం నెత్తినెత్తుకున్నాను.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కావలిసినంత స్వేచ్చ ఉంది. కావున రెండో ఎక్కం తెలీకుండా గణిత శాస్త్రంలో పుస్తకం రాసెయ్యొచ్చు. న్యూటన్ సూత్రం తెలీకుండా గొప్ప సైన్స్ ఫిక్షన్ రాయొచ్చు. ఎవడన్నా తలకి మాసినవాడు నిర్మాతగా దొరికితే (తెలుగు ప్రేక్షకులకి దరిద్రం శనిలా పట్టుకుంటే), ఆ కథనే సినిమాగా కూడా తీసి ప్రేక్షకులపై కసి తీర్చుకోవచ్చు. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.

నా దృష్టిలో రొటీన్ ఫార్ములా సినిమాలు తీసేవాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు సినిమా సక్సెస్ కోసం ఓ కథ ఒండుకుంటారు. దాన్లో మసాలా దట్టిస్తూ నానా తిప్పలు పడతారు. అది వారి వృత్తి. కోటి విద్యలూ కూటి కొరకే అన్నారు పెద్దలు. కానీ చెత్త తీస్తూ, తెలుగు సినిమాని ఉద్దరిస్తున్నట్లు పోజులు కొట్టే మేధో డైరక్టర్ల డొల్లతనాన్ని గుర్తించకపొతే మాత్రం ప్రమాదం, నష్టం. ఇంతకన్నా ఈ సినిమా గూర్చి రాసి సమయం వృధా చేసుకోలేను.