Saturday 15 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 2


'ఫ్యూడల్ భావజాలం మన ఆలోచనా విధానం నుండి డిలీట్ అయ్యిందా? లేదా?' అనేది ఓ ధర్మసందేహం. ఈ ప్రస్తావన 'సినిమాల్లోంచి సమాజంలోకి' మొదటి భాగంలో వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం కోసం విజయవంతమైన రెండు తెలుగు సినిమాల గూర్చి మాట్లాడుకుందాం.

సుమారు ముప్పైయ్యేళ్ళ క్రితం 'బొబ్బిలి బ్రహ్మన్న' అనే సినిమా వచ్చింది. కృష్ణంరాజు అనే నటుడు హీరో. ఒక ఊళ్ళో బ్రహ్మన్న అనేవాడు ఉంటాడు. అతగాడిది అదేదో బొబ్బిలి వంశంట! గుండెల నిండా గాలి పీల్చుకుని, కళ్ళు మిటకరించి.. ఊళ్ళో జరిగే నేరాలకి ఎడాపెడా తీర్పులు తనదైన స్టైల్లో చెప్పేస్తుంటాడు. అవన్నీ హర్యానాలో జరుగుతున్న ఖాప్ పంచాయితీలు టైపు తీర్పులు. బ్రహ్మన్న ఊళ్ళో పోలీసు, న్యాయ వ్యవస్థలు ఉండవు, సర్వం బ్రహ్మన్న బాబే! వాస్తవానికి ప్రజలు ఈ సినిమాని నిర్ద్వందంగా తిరస్కరించాలి, కానీ అలా జరగలేదు.

ఇరవైయ్యేళ్ళ క్రితం 'పెదరాయుడు' అని ఇంకో సినిమా వచ్చింది. ఈ కథ కూడా ఖాప్ పంచాయితీ కథే. ఊళ్ళో ఓ అగ్రకుల పెద్దమనిషి స్టైలుగా చుట్ట పీలుస్తూ కాలు మీద కాలు వేసుకుని తీర్పులు చెప్పేస్తుంటాడు. సాంఘిక బహిష్కరణ (ఇట్లాంటి తీర్పు చట్టరీత్యా నేరం) వంటి తీర్పులు కూడా ఇచ్చేస్తుంటాడు. పంచెకట్టు, మీసం మెలెయ్యడం, బంగారు కంకణం.. ఆ పాత్ర ఆహార్యం కూడా జుగుప్సాకరంగా ఉంటుంది. పైగా అమ్మోరికి మేకని బలిస్తున్నట్లు బేక్ గ్రౌండ్ మ్యూజిక్కొకటి. ఫ్యూడల్ భావజాలాన్ని నిస్సిగ్గుగా ప్రమోట్ చేసిన ఈ సినిమా కూడా బాగా ఆడింది.

అనగనగా ఒకానొప్పుడు ప్రజలు తమకన్నా పెద్ద కులాల వారిని గౌరవించేవాళ్ళట, తక్కువ కులాల వారిపట్ల తేలికభావంతో ఉండేవాళ్ళట. అదంతా చరిత్ర కదా! కాదా? మరి ఈ రెండు సినిమాలు విజయవంతం అవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సమాజంలో సామాన్య ప్రజానీకంలో ఫ్యూడల్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత లేదు అనా? ప్రేక్షకుల్లో చాలామంది అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్దిస్తున్నారు అనా? అందుకే - 'పెద్ద కులం పెద్దమనిషి, పాపం తీర్పులు చెబుతూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా!' అంటూ ఆ ఫ్యూడల్ మనిషితో empathize అయ్యారా?

మన తెలుగు జాతికి సాహిత్య స్పృహ తక్కువ, కాబట్టి సామాజిక స్పృహ కూడా అదే రేంజ్ లో ఉండటం సహజం. కాబట్టే.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తి, అంతస్తు, హోదా తప్ప ఇంకే అర్హతా లేని (ఒక్కరోజు కూడా శారీరక / మేధోశ్రమ చెయ్యని / చెయ్యలేని) అడ్డగాడిద లాంటి హీరో (దేవదాసు, ప్రేమనగర్, దసరా బుల్లోడు) పడే 'ప్రేమ' అనే మూలిగే సూడిపంది ప్రసూతి నొప్పుల బాధని ఆనందంగా, ఆరాధనగా చూస్తుండిపోతాం. ఎంతైనా పెద్దకులంవాడు, డబ్బున్నవాడు, కష్టం ఎరుగని సున్నితమైనవాడు కదా!

అందుకే - (నాకు తెలిసిన) చాలామంది అగ్రకులస్తులకి కారంచేడు, చుండూరు హత్యాకాండ చాలా సహజమైనదిగా కనిపించింది. చుండూరులో అగ్రకులస్తులు తమ ఆడపిల్లల్ని దళిత యువకులు ఇబ్బంది పెడుతున్నారని, వారి కుటుంబాల్ని వెంటాడి, వేటాడి నరికి చంపారు. శవాల్ని గోనె సంచుల్లో కుక్కి కాలవలోకి విసిరేశారు. 'మన ఆడపిల్లల జోలికోచ్చిన అంటరాని కులం వాళ్లకి ఆ మాత్రం బుద్ధి చెప్పకపోతే ధర్మం నాలుగు పాదాల మీద నడవద్దూ!' అని వారి వాదన. ఈ వాదన దళితులు కానివారికి నచ్చింది (బయటకి మాత్రం అందరూ తీవ్రంగా ఖండించారు, అది వేరే సంగతి).

ప్రజల ఆదరణ పొందిన సినిమాల నుండి, సమాజ ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తున్నాను. ఈ పధ్ధతిలో ఉన్న పరిమితుల గూర్చి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందువల్ల నేను రాసిన విషయాలు జెనరలైజ్ చెయ్యరాదు. సమాజంలో అప్పుడూ, ఇప్పుడూ కూడా అన్నిరకాల మనుషులు ఎన్నోరకాల ఆలోచనా ధోరణిని కలిగుంటారు. అయితే - బూజుపట్టిన భావజాలంతో వచ్చిన సినిమాలు విజయవంతం అయ్యాయి కాబట్టి, ఆ ధోరణిని సమర్ధించేవారు (కొందరైనా) మనమధ్యన ఉన్నారని (వీళ్ళు మనకి ఎంత నచ్చకపోయినా) చెప్పడం మాత్రమే నా లిమిటెడ్ పాయింట్.

(picture courtesy : Google)