Tuesday 11 March 2014

కుప్పల చెత్తసామి


అది ఆంధ్రదేశంలోనున్న వేలాది మురికి వీధుల్లో ఒకటి. ఆ మూలగా ఓ చెత్త కుండీ. ఆ పక్కనే మురిక్కాలవ. దాని గట్టు మీద ఒక నడివయసు మనిషి. బక్కగా, నల్లగా, మాసిన గుడ్డల్తో, గెడ్డంతో.. చెత్తకుండీ, మురిక్కాలవకి మ్యాచింగ్ బోర్డర్లా ఉన్నాడు.

అతగాడు అరగంట క్రితం ప్రభుత్వంవారి చౌక మద్యం సేవించాడు. ఆ మద్యం కల్తీలేని స్వచ్చమైనదైయ్యుంటుంది, అందుకే నిఖార్సైన కిక్కుతో మత్తుగా జోగుతున్నాడు. ప్రశాంతంగా బీడీని కాల్చుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుచున్నాడు.

ఇంతలో అటువైపుగా వచ్చాడు ఓ పచ్చచొక్కా పెద్దమనిషి. పచ్చచొక్కాకి మురికి మనిషిని చూస్తుంటే నలిగిపోయిన ఓటులాగా కనిపించాడు.. ఎలక్షన్ల సీజను మరి!

"చూడు నాయనా! రేపు ఎలక్షన్లలో నీ ఓటు మా బాబు పార్టీకే వెయ్యాలి. అర్ధమైందా?" అంటూ పార్టీ ప్రచారం మొదలెట్టాడు.

మురికి మనిషి ఆనందానికి బ్రేకు పడింది. హఠాత్తుగా స్వర్గం అంచు నుండి జారిపడినట్లైంది. అంచేత చిరాగ్గా చూశాడు.

"ఏంది ఏసేది? ఎందుకెయ్యాల?" పెళుసుగా అన్నాడు మురికి మనిషి.

"ఎందుకా? అబివృద్ధి కోసం. రేపు కొత్త రాష్టం బాగుపడాలంటే మనమందరం బాబుకే ఓటెయ్యాలి. అసలు బాబు ఎంత గొప్పనాయకుడు? అబివృద్ధికి చొక్కా తొడిగి, గెడ్డం పెంచితే.. అది అచ్చు బాబు లాగే ఉంటుది." ఉపన్యాస ధోరణిలో అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"ఏంది ఉండేది? అందుకేగా అబిరుద్ది, అబిరుద్ది అంటూ సోమ్ములన్నీ ఐదరాబాదులో కుప్పగా పోసాడు?" కాలిపోయిన బీడిని విసిరేస్తూ చికాగ్గా అన్నాడు మురికి మనిషి.

"ఈసారట్లా చెయ్యళ్ళే. అన్ని ఊళ్లు సమానంగా అభివృద్ధి చేస్తాడు. నాదీ హామీ." అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"అంటే ఈసారి అబిరుద్ది చిన్నచిన్న కుప్పలుగా సేస్తాడన్నమాట." ముద్దగా అన్నాడు మురికి మనిషి.

"అవును, అవునవును. నేచేప్పేదదే." సంతోషంగా అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"అట్టాగా! అయితే ఇసయం ఆలోచిస్తాలే." అంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నాడు మురికి మనిషి.

'అమ్మయ్యా! ఈమాత్రం హామీ చాలు.' అనుకుంటూ అక్కణ్నుండి కదిలింది పచ్చచొక్కా.


రోడ్డు మలుపులో ఓ బడ్డీకొట్టు. కొట్లో ఓ పాతికేళ్ళ కుర్రాడు. గోళీ సోడా కొట్టించుకున్నాడు పచ్చచొక్కా పెద్దమనిషి. సోడా తాగుతూ కొట్లో కుర్రాణ్ణి అడిగాడు.

"తమ్ముడూ! ఇక్కడంతా శుభ్రంగా ఉందిగా. అతనెవరో ఇక్కడ కాకుండా ఆ చెత్తకుండీ దగ్గర ఉన్నాడెందుకు?"

"ఆడా? ఆడిది మునిసిపాలిటీలో చెత్త ఎత్తే ఉద్యోగం సార్. రోజూ పొద్దున్నే మునిసిపాలిటీ ఆడోళ్ళు చీపుళ్ళతో రోడ్డు మీద చెత్తని చిన్నచిన్న కుప్పలుగా చిమ్ముతారు. ఈడు ఎనకమాలగా ఆ చిన్న కుప్పల్ని తోపుడు బండిలోకి ఎత్తుతాడు." అన్నాడు బడ్డీకొట్టు కుర్రాడు.

"అట్లాగా!"

"ఆడికి సొంతిల్లుందండి. కానీ ఆ చెత్త కంపు అలవాటైపోయిందనుకుంటా. అందుకే డ్యూటీ అయ్యాక్కూడా ఆడే కూర్చుంటాడు." అన్నాడు ఆ బడ్డీకొట్టు కుర్రాడు.

"బాగా తాగి ఉన్నట్టున్నాడు." పచ్చచొక్కా అబ్జర్వేషన్.

"ఆడు టొంటీఫోర్ అవర్సు ఫుల్లు ఆన్ లోనే ఉంటాడండి బాబు." నవ్వాడు బడ్డీకొట్టు కుర్రాడు.

"రాజకీయం బాగానే చెబుతున్నాడు." అన్నది పచ్చచొక్కా.

"ఆడి పేరు కుప్పుసామి. చేసేది చెత్త కుప్పల పని. అందుకే ఆడేది చెప్పినా చెత్త కుప్ప భాషలోనే చెబుతాడు, ఏ విషయాన్నైనా ఆ భాషలోనే అర్ధం చేసుకుంటాడు. అందుకే ఆణ్ణందరూ 'కుప్పల చెత్తసామి' అంటారు." నవ్వుతూ అన్నాడు బడ్డీకొట్టు కుర్రాడు.

పచ్చచొక్కాకి ఇప్పుడు తత్వం బోధపడింది. నిట్టూరుస్తూ చిన్నగా ముందుకు కదిలాడు.

(photo courtesy : Google)