Monday 24 March 2014

పవన్ కళ్యాణ్ - ఎం.జె.అక్బర్


ఈమధ్య పవన్ కళ్యాణ్ అనే తెలుగు సినిమా నటుడికి నరేంద్ర మోడీలో చెగువేరా కనిపించాట్ట, రేపు ఈయనకి చంద్రబాబు నాయుళ్లో భగత్ సింగ్ కనిపించొచ్చు. ఎవర్లో ఎవరు కనిపించినా, అది ఆ సినిమా నటుడి ఇష్టం. ఎందుకంటే ఒక నటుడికి రాజకీయాలు తెలియాల్సిన అవసరం లేదు, నటించడం తెలుసుంటే చాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే నటుడి సమస్యని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఎం.జె.అక్బర్ అనే ఒక ఘనత వహించిన ఆంగ్ల కాలమిస్టు ఈమధ్య బీజేపిలో చేరాడు. ఇదేమంత విశేషం కాదు. కొందరు జర్నలిస్టులు ఎలక్షన్ల సమయంలో చాన్స్ (టిక్కెట్టు) దొరికితే రాజకీయపార్టీల్లో చేరిపోతుంటారు. ఈయన గతంలో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీతో సహా ఏవో పదవులు వెలగబెట్టాడు. అటుతరవాత ఈయనకే మొహం మొత్తిందో, కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టిందో తెలీదు గానీ.. బుద్ధిగా పత్రికలకి వ్యాసాలు రాసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. 

ఎం.జె.అక్బర్ గుజరాత్ అల్లర్లకి మోడీని బాధ్యుణ్ణి చేస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, మోడీని హిట్లర్ తో పోలుస్తూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు. మంచిది, జర్నలిస్టుగా ఆయన నమ్మిన అభిప్రాయాలు నిష్కర్షగా రాసుకున్నాడు, అది ఆయన ఇష్టం. 

ఇప్పుడు బీజేపిలో చేరుతూ (నరేంద్ర మోడీ పంచన చేరుతున్న అన్ని వలస పక్షుల్లాగే) నరేంద్ర మోడీలో ఈ దేశాన్ని భీభత్సంగా అభివృద్ధి చెయ్యబోతున్న భావిప్రధాని కనిపిస్తున్నాడని వాకృచ్చాడు. సిట్, సుప్రీం కోర్టులు నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చాయి కావున నరేంద్ర మోడీ అమాయకుడని కూడా సెలవిచ్చాడు! 

అలాగా? మరి ఈయనగారు దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు తమ పని పూర్తి కానిచ్చేవరకూ ఆగకుండా, ఈలోపుగానే అదేపనిగా నరేంద్ర మోడీని ఎందుకు తిట్టిపోసినట్లో! డబ్బు కోసమా? కీర్తి కోసమా?

పవన్ కళ్యాణ్ కి చెగువేరా, భగత్ సింగ్, గద్దర్, నరేంద్ర మోడీ.. వీళ్ళెవరూ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయన ఒక సినిమా నటుడు కాబట్టి. అయితే - చాలామంది (తమకి తెలీకపోయినా) కొందరు ప్రముఖుల పేర్లు అలవోకగా ప్రస్తావిస్తుంటారు.. తమక్కూడా ఒక 'మేధావి' అనే గుర్తింపు వస్తుందని. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ అర్ధమయ్యాడు. 

ఎం.జె.అక్బర్ మాత్రం పవన్ కళ్యాణ్ వంటి అమాయకుడు కాదు. ఆయన తెలివైనవాడు, మేధావి. అన్ని విషయాలు బాగా అధ్యయనం చేసిన ప్రముఖ పత్రికా సంపాదకుడు, కాలమిస్టు, రచయిత. ఆయనకి మోడీ నిన్నటిదాకా దెయ్యంలాగానూ, ఇవ్వాళ్టినుండి దేవుళ్ళాగానూ కనపడ్డంలో మాత్రం పూర్తిగా స్వార్ధప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా పచ్చి అవకాశవాదం, పాత్రికేయ దిగజారుడుతనం.


(photos courtesy : Google)