Wednesday 19 March 2014

డాక్టర్ కె.పి.మిశ్రా


ఇవ్వాళ హిందూలో డాక్టర్ కె.పి.మిశ్రా చనిపోయారన్న వార్త చదివాను. ఆయన గూర్చి ఎన్నో జ్ఞాపకాలు. అవి మీతో పంచుకోవాలని ఈ పోస్టు రాస్తున్నాను.  

డాక్టర్ కె.పి.మిశ్రా హార్ట్ స్పెషలిస్ట్. ఎక్కువకాలం చెన్నైలో పనిచేశారు. ఆయన ECG పాఠాలు నేను విన్నాను. ఆయనో గొప్ప టీచరని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. ఆయన టీచింగ్ స్కిల్స్ అద్భుతం.  

టీచర్లలో రకరకాలైన వాళ్ళుంటారు. కొందరు సరళమైన విషయాల్ని క్లిష్టంగా బోధిస్తారు, వీరిని చెడ్డ టీచర్లు అంటారు. ఇంకొందరు క్లిష్టమైన విషయాల్ని క్లిష్టంగానే బోధిస్తారు, వీరిని ఒకమాదిరి టీచర్లు అంటారు. మరికొందరు క్లిష్టమైన విషయాల్ని సరళ తరం చేసి బోధిస్తారు, వీరిని గొప్ప టీచర్లు అంటారు. 

డాక్టర్ కె.పి.మిశ్రా గొప్ప టీచర్ల కేటగిరీలోకి వస్తారు. 1980 లలో (గుండెకి సంబంధించిన గీతలైన) ECG (ఎలెక్ట్రోకార్డియోగ్రామ్) ని జెనరల్ మెడిసిన్ పీజీలకి, జెనరల్ ప్రాక్టీస్ డాక్టర్లకి, మాబోటి హౌజ్ సర్జన్లకి చక్కగా విడమరిచి చెప్పిన మహానుభావుడు. 

సాధారణంగా వైద్యవిద్యా బోధన మొనాటనస్ గా, డల్ గా ఉంటుంది. అందుకు పూర్తి విరుద్ధంగా డాక్టర్ కె.పి. మిశ్రా పాఠం సాగేది. ఆయన వాక్ప్రవాహం చాలా ఒరవడిగా ఉంటుంది. ఆ భాషా పటిమ, మాట విరుపు, నాటకీయత, బాడీ లాంగ్వేజ్.. ఎంతో విలక్షణం. 

మరీ ముఖ్యంగా, పాఠంలో అక్కడక్కడా సమయస్పూర్తితో ఆయన చొప్పించే జోక్స్ చాలా సరదాగా, ఆహ్లాదకరంగా ఉండేవి. ఆయన క్లాస్ వింటుంటే 'విషయం ఇంతేనా? ఇది చాల సింపుల్' అని అనిపించేది. క్లాస్ అప్పుడే అయిపోయిందా? అని కూడా అనిపించేది. ఇవన్నీ గొప్ప లెక్చర్ లక్షణాలు. 

గుంటూరు మెడికల్ కాలేజిలో కూడా గొప్ప మెడిసిన్ ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు (వారిలో డాక్టర్ సి.యం.రావు గారు ప్రముఖులు). వాళ్ళు కూడా చక్కగా చెప్పేవారు. కానీ డాక్టర్ కె.పి. మిశ్రాది మాత్రం స్టన్నింగ్ పెర్ఫామెన్స్. నేను ఆయన ECG క్లాసులు వినటం వలన మాత్రమే, ఈ రోజుకీ ECG బేసిక్స్ గుర్తున్నయ్యని నా నమ్మకం. 

నాలాంటి అజ్ఞానులెందరికో గుండెకి సంబంధిన 'గీత' గుట్టు రట్టు చేస్తూ, 'గీత'లోని మర్మాన్ని సరళంగా, సరదాగా మాకు బోధించిన మహోపాధ్యాయుల వారైన డాక్టర్ కె.పి.మిశ్రా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  

డాక్టర్ సాబ్! మీరెప్పుడూ మీ విద్యార్ధుల మదిలో చిరంజీవిగానే ఉంటారు. మీకు నా నివాళులు.  

(photo courtesy : Google)