Wednesday, 26 March 2014

రచయిత


"నమస్కారం రచయిత గారు! ఈమధ్య మీర్రాసిన కథ చదివాను, చాలా బాగుందండి." వినయంగా అన్నాడు అప్పారావు.

రచయితకి మూడాఫ్ అయిపొయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఉప్మాపెసరట్టులో చచ్చిన ఈగ కనిపించినట్లు వికారంగా ఫీలయ్యాడు. వంద గజ్జికుక్కల ఆకలి చూపుల మధ్య పెళ్లిభోజనం చేస్తున్నంత రోతగా అనిపించింది. జబ్బుతో తీసుకుంటున్న పేదవాడు మొహంమీద దగ్గినంత ఇబ్బందిగా అనిపించింది. కొత్తగా కొన్న పెద్దకారుకి చిన్నగీత పడితే కారు ఓనరయ్యకి కలిగే ఆందోళన లాంటిది కూడా కలిగింది. స్కాచ్ మాత్రమే తాగేవాడికి లోకల్ బ్రాండ్ ఆఫర్ చేస్తే వచ్చే చికాకులాంటి భావన కూడా కలిగింది.

ఇన్నిరకాల భావనలతో, దేశంలో ఉన్న సమస్త దరిద్రాన్నీ మూటకట్టి నెత్తిన పెట్టుకుని మోస్తున్నవాళ్ళా భారంగా నడుస్తూ ఇంటికి బయల్దేరాడు. మనసు మనసులో లేదు, ఆలోచనలు మునిసిపాలిటీవాడు దోమలమందు చల్లినా చావని దోమల గుంపుల్లా కమ్ముకుంటున్నయ్.

'నా కథ ఈ అప్పారావుకి ఎలా అర్ధమైంది? నా రచనలు కాఫ్కా కన్నా పైస్థాయిలో ఉంటాయి కదా! నా ఆలోచనలు మేధావులకే అంతుబట్టవు. నా కథల్లోని అర్ధాన్ని వెతకడానికి ప్రపంచవ్యాప్తంగా నా అభిమాన గణం నిరంతరంగా ప్రయత్నిస్తుంటుంది. నా రచనల్లోని అర్ధాలు, గూఢార్ధాల, నిగూఢార్ధాల గూర్చి వ్యాఖ్యానాలే అనేక పుస్తకాలుగా వచ్చాయి. నేను కథకులకి మాత్రమే కథకుణ్ణి కదా! మరి ఈ ఆఫ్టరాల్ అప్పారావుకి నా కథ ఎలా అర్ధమైంది? నా కథల స్థాయి ఇంతగా దిగజారిందా?" ఆలోచనలతో రచయిత బుర్ర అట్టు పెనంలా వేడెక్కింది.

వేడెక్కిన బుర్రని అంతకన్నా వేడిగానున్న ఫిల్టర్ కాఫీతో చల్లబరచ ప్రయత్నించాడు. ధర్మాసుపత్రిలో అధర్మ డాక్టరిచ్చిన మాత్రలేసుకుంటే ఉన్న రోగం పోకపోగా, కొత్తరోగం మొదలైనట్లు.. ఆలోచనలు మరింతగా పెరిగిపోయ్యాయి.

ఇంతలో ఎక్కణ్ణుంచో ఒక శిష్యపరమాణువు నుండి ఫోన్.

"రచయిత గారు! ఫలానా కథలో సముద్రం ఎర్రబారిందనీ, అలలు ఘనీభవించాయనీ రాశారు. అలా ఎందుకు రాశారో చెప్తారా?"

మనం అప్పు పెట్టిన వడ్డీవ్యాపారస్తుడు వోల్వో బస్సు ప్రమాదంలో ఛస్తే వచ్చేంతటి బ్రహ్మానందం.. రచయితకి కలిగింది.

"ఆ కథలో సముద్రం అంటే సముద్రం అని కాదు, 'మనసు' అని అర్ధం." గర్వంగా అన్నాడు రచయిత.

"అలాగా! అయితే అప్పుడు అలలు అంటే అలలు కాదనుకుంటా." అన్నాడు శిష్యపరమాణువు.

"అక్కడ అలలు అంటే అర్ధం రెండురకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పోస్ట్ మోడర్నిస్ట్ అర్ధం, రెండు మేజిక్ రియలిజం అర్ధం. అయినా ఆ కథని విశ్లేసిస్తూ ఓ రెండు వేల పేజీల పుస్తకాన్ని నా అభిమానులు ప్రచురిస్తున్నారు." అన్నాడు రచయిత.

"రచయిత గారూ! నే చచ్చేలోపు మీలాగా ఒక్కవాక్యం రాసినా చాలండీ, నా జన్మ ధన్యమౌతుంది, మీరు నిజంగా కారణజన్ములు." తన్మయత్వంగా అన్నాడు శిష్యపరమాణువు.

ఆ మాటల్తో, తన కటౌట్ కి పాలాభిషేకం చేస్తున్న వెర్రి అభిమానుల్ని చూసినప్పుడు తెలుగు సినిమా హీరోకి కలిగేంత ఉత్సాహం వచ్చింది రచయితకి. ఫుల్లుగా మేకప్పేసుకుని పార్టీకి ఎటెండైన ఆంటీని 'మీరే కాలేజ్ స్టూడెంట్?' అనడిగితే వచ్చే గర్వానందము లాంటిది కలిగింది.

'అవును! తెలుగునాట 'మో' కవితల్ని అర్ధం చేసుకున్నవాడు ఉండొచ్చు, 'త్రిపుర' కథల్ని పరిచయం చేసేవాడూ ఉండొచ్చు, కానీ - నా రచనల్ని అర్ధం చేసుకున్నవాడు ఇప్పటిదాకా పుట్టలేదు (పుట్టకూడదని కూడా నా కోరిక)!' అని నర్తనశాలలో ఎస్వీరంగారావులా అనుకున్నాడు రచయిత.

కానీ - అంతలోనే అప్పారావు జ్ఞాపకం వచ్చాడు, నిస్సత్తువ ఆవహించింది. తన కథని బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టినంత బాధ కలిగింది. తన బార్లో రోజూ బిల్లు కట్టకుండా మందు తాగే పన్నుల అధికార్ని చూసి బారు ఓనరు లోలోపల నిశ్సబ్దంగా కుళ్ళుకుంటూ ఏడ్చినట్లు, రచయిత కూడా మనసులోనే రోదించసాగాడు.

'నా కథ అప్పారావుకి ఎలా అర్ధమైంది? ఇదెవరికైనా తెలిస్తే నాకెంత పరువు తక్కువ!' అనుకుంటూ అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన సూపర్ డైరక్టర్లా అవమాన భారంతో దీర్ఘాలోచనలో మునిగిపోయ్యాడు రచయిత.

రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు రచయిత. ఎంత ఆలోచించినా.. అవి చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలా సాగుతూ, అక్కడక్కడే తిరుగుతున్నాయి గానీ, ఓ కొలిక్కి రావట్లేదు. అందువల్ల - మండే వేసవి ఎండలకి కరిగే గుంటూరు తారు రోడ్డు వలే.. రచయిత బుర్ర మరీ హీటెక్కిపోయింది.

'లాభం లేదు, ఒక కథ రాయడానిక్కూడా ఎప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. ఈ విషయం తేల్చాల్సిందే.' అనుకుంటూ అప్పారావుకి ఫోన్ చేశాడు.

"రచయిత గారు నమస్తే!" అప్పారావు లైన్లోకొచ్చాడు.

"నువ్వు నాకో విషయం చెప్పాలయ్యా అప్పారావు. నా కథలో నీకేం నచ్చింది?" సూటిగా సుత్తి లేకుండా అడిగేశాడు రచయిత.

అప్పారావు వైపునుండి కొద్దిసేపు నిశ్శబ్దం.

"హ్మ్.. మీ కథ బాగుందండి." మొహమాటంగా అన్నాడు అప్పారావు.

"నేనడిగేదీ అదే, నీకాకథ ఎందుకు నచ్చింది?" రెట్టించాడు రచయిత.

అటువైపు నుండి మళ్ళీ నిశ్శబ్దం.

"అప్పారావు! అడిగేది నిన్నే! లైన్లోనే ఉన్నావా?" అసహనంగా అడిగాడు రచయిత.

"రచయిత గారు! క్షమించండి. వాస్తవానికి మీ కథ ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు." ఇబ్బందిగా అన్నాడు అప్పారావు.

"మరి బాగుందని ఎందుకు చెప్పావ్?" ఆశ్చర్యంగా అడిగాడు రచయిత.

"మీరు నన్ను మన్నించాలి. మిమ్మల్ని ప్లీజ్ చెయ్యాలని ఒక చిన్న అబద్దం ఆడాను, అంతే!" తప్పు చేసినవాడిలా అన్నాడు అప్పారావు.

"థాంక్స్ అప్పారావ్."

లైన్ కట్ చేశాడు రచయిత. ఈ థాంక్స్ దేనికో అప్పారావుకి అర్ధమయ్యే అవకాశం లేదు.

మర్డర్ మిస్టరీని చేధించినప్పుడు షెర్లాక్ హోమ్స్, డిటెక్టివ్ యుగంధర్, పెర్రీ మేసన్ లకి కలిగే ఆనందం, తృప్తి లాంటివి.. రచయితక్కూడా కలిగాయి.

'అనవసరంగా పొద్దున్నుండి ఎంతలా ఆవేదన చెందాను!' సారా పేకెట్లు పంచకుండానే ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యేలా సంతోషంతో పొంగిపోయ్యాడు రచయిత.

'అప్పారావుకి కథ నిజంగా అర్ధమైనట్లైతే అసలు రచన చెయ్యడమే మానేద్దును. ఇప్పుడా ప్రమాదం తప్పిపోయింది. ఇది తెలుగు జాతి అదృష్టం, తెలుగు సాహిత్యం చేసుకున్న పుణ్యం.'

రచయితకి ఒక్కసారిగా తన శిష్యకోటి, అవార్డులు, రివార్డులు, సన్మాన శాలువాలు గుర్తొచ్చాయి. గర్వాతిశయములతో గుండెల్నిండా గాలి పీల్చుకుని.. ఒక కొత్త రచనకి శ్రీకారం చుట్టాడు.

అంకితం :

పాఠకులకి అర్ధం కాకుండా రాస్తూ లబ్దప్రతిష్టులైపోయిన తెలుగు రచయితలందరికీ అభినందనలతో..

(picture courtesy : Google)