Thursday 12 June 2014

ప్రాణం ఖరీదు


హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన విద్యార్ధుల మృతి చాలా దారుణమైనది. గత రెండు మూడ్రోజులుగా జాతీయ మీడియా కూడా ఈ ఘటనకి చాలా ప్రాధాన్యతనిచ్చి కవర్ చేస్తుంది. మా ఇంట్లో కూడా దీనిగూర్చే చర్చ. తూనీగల్లాంటి పిల్లలు! ఎంత ఆనందంగా, ఎంత సరదాగా వున్నారు! చదువుకునేప్పుడు స్నేహితుల్తో కలిసి ఫొటోలు తీసుకునే సరదా ఎంత మజాగా వుంటుందో నాకు తెలుసు. ఎందుకంటే - నేను కూడా ఇట్లాగే, ఇంతకన్నా ఎడ్వెంచరస్‌గా - చెట్లూ, పుట్టలూ ఎక్కి ఫొటోలు దిగినవాణ్ని కాబట్టి! అంచేత - చాలా దిగులుగా అనిపిస్తుంది.

సంతోషంగా వున్నప్పుడు ఆలోచనలు రేసుగుర్రంలా పరిగెడితే, దిగులుగా వున్నప్పుడవి దుక్కిటెద్దులా నిదానంగా సాగుతాయి. ఆ దిగుల్లోనే నన్ను నేనో ప్రశ్న వేసుకున్నాను. నన్నీ ఘటన ఎందుకింత తీవ్రంగా కలచివేసింది?

నాకు తోచిన కారణాలు కొన్ని రాస్తాను. ఒకప్పుడు స్నేహితుల్తో నేనూ ఇలాగే ఎంజాయ్ చేశాను, ఇప్పుడు ఆ విద్యార్ధులు నా పిల్లల వయసువాళ్ళు, ముఖ్యంగా వారు పట్టణప్రాంత ప్రజలు. ఎలా చూసుకున్నా - వారు నాకూ, నా కుటుంబానికి ప్రతిబింబం లాంటివారు. అందువల్ల - నేనా పిల్లలతో, వారి కుటుంబాలతో చాలా సులభంగా ఐడింటిఫై అయిపొయ్యాను. 

ఇప్పుడు నాకింకో ప్రశ్న. నేను అన్ని మరణాలకి ఇంతే బాధగా స్పందిస్తానా? దీనికి సమాధానం కోసం కొంత ఆలోచన చెయ్యాలి. మానవ సమాజం అనేక పొరలతో compartmentalize అయింది. కులం, మతం, ప్రాంతం, జెండర్, సామాజిక ఆర్ధిక స్థాయి.. ఇలా అనేకమైన పునాదుల ఆధారంగా. వీటిల్లో కొన్ని భౌతికమైనవి, మరికొన్ని మానసికమైనవి. అందువల్ల అందరూ అన్ని సమస్యలపై ఒకే రకంగా స్పందించటం జరక్కపోవచ్చు. 

ఈ దేశంలో అనేకమంది, అనేక కారణాల వల్ల మరణిస్తూ వుంటారు. వాటిల్లో కొన్ని మరణాలు సభ్యప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన మరణాలు. వీటిల్లో మన హైదరాబాద్ విద్యార్ధుల మరణం కూడా ఒకటి. అయితే మన దృష్టికి రాని, వచ్చినా పెద్దగా పట్టించుకొని మరణాలు ఇంకా చాలానే వున్నాయి. ఉదాహరణకి ఈ రోజుకీ అనేకమంది ఆదివాసీలు మలేరియా, టైఫాయిడ్ వంటి సాధారణ జబ్బులక్కూడా సరైన వైద్యసహాయం అందక చనిపోతున్నారు.

రైతుల ఆత్మహత్యలైతే.. లెక్కే లేదు. నాసిరకం విత్తనాలు, పురుగు మందుల్తో.. చివరికి గిట్టుబాటు ధర లేక.. చేసిన అప్పులు తీరే మార్గం లేక.. రైతులు చనిపోతూనే వుంటారు. పంటపొలాలకి పన్జెయ్యని మందులు ప్రాణం తీసుకోడానికి మాత్రం చక్కగా పన్జేస్తుంటాయి! ఇంకో గమ్మత్తేమంటే, రైతులపై ఆధారపడి వ్యాపారం చేసే వ్యాపారస్తులు మాత్రం కోట్లకి పడగలెత్తుతారు!

దేవుడు మన్నందర్నీ సమానంగానే పుట్టించాడు కదా? మనమందరం మన అమ్మ పాలు తాగే పెద్దవాళ్ళం అయ్యాం కదా? మనందర్లో ప్రవహించే రక్తం రంగు ఎరుపే కదా? మనందరికీ రక్తమాంసాలు, మలమూత్రాలు ఒకటే కదా? ఇట్లాటి ప్రశ్నలు సంధిస్తూ చేంతాడులా చాలా రాయొచ్చు గానీ.. ప్రస్తుతానికి ఈ లిస్టు ఆపేసి, ఇంకో లిస్టు రాస్తాను.

మనందరికీ తినే ఆహరం ఒకటి కాదు. ఒక పాపడికి 'బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ' అయితే, ఇంకో పాపడికి 'గంజి విత్ ఉల్లిపాయ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ'! ఒకడిది కేజీల చదువైతే, ఇంకోడిది కూలీ చదువు. ఈ లిస్టు కూడా చాలా పొడుగ్గా రాయొచ్చు కానీ.. ఇంతటితో ఆపేస్తాను. 

కుక్కల్లో బొచ్చుకుక్కలు, వీధి కుక్కలున్నట్లే.. మానవజన్మల్లో కూడా రకాలుంటాయి. అయితే కుక్కల్లో రూపం తేడా వుంటుంది.. మనుషుల్లో వుండదు, అంతే! ప్రస్తుతం మన ప్రభుత్వాల్ని బొచ్చుకుక్కలు పాలిస్తున్నాయి, వీధికుక్కలు పాలింప బడుతున్నయ్. ఐదేళ్ళకోసారి వచ్చే ఎలక్షన్ల ప్రహసనంలో వీధికుక్కలకి రాయితీలంటూ కొన్ని బిస్కట్లని లంచాలుగా పడేసి తమ అధికారాన్ని కాపాడుకుంటున్నాయి.  

అయితే - ఈ మరణాల్ని మనం ఆపలేమా? ఆపటం సంగతేమో గానీ, తగ్గించటం మాత్రం చెయ్యొచ్చు. కానీ - మన ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీల్ని నడిపిస్తుంది వ్యాపార మాఫియా. కాబట్టి ప్రభుత్వాల నుండి చిత్తశుద్ధి ఆశించడం అమాయకత్వమే అవుతుంది. విద్యార్ధుల మరణం అనే ఘోర దుర్ఘటన వెనుక హిమాచల్ ప్రదేశ్‌లోని ఇసుక మాఫియా, ప్రైవేటు విద్యుత్తు మాఫియాల హస్తం వుందంటున్నారు. ఇకముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అక్కడి పాలకులు నొక్కి వక్కాణిస్తున్నారు. నమ్మక చేసేదేమీ లేదు. 

సరే! ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకం కష్టనష్టాల్ని చిత్తశుద్ధిగా పట్టించుకుంటాయనుకునే అమాయకులకి ఈ దేశంలో కొరత లేదు కావున, ప్రస్తుతానికి నేను కూడా ఆ అమాయకుల సరసన చేరి ప్రభుత్వాల్ని వేడుకుంటున్నాను (ఇంతకుమించి చేసేదేమీ లేదు కాబట్టి).

అయ్యా! ప్రభుత్వాల పెద్దమనుషులూ! మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు - ఇకముందు ఇలా అర్ధంతరంగా, అసహాయంగా, సిల్లీగా, అకారణంగా, చెప్పుకోడానిక్కూడా సిగ్గుపడే విధంగా.. పైకి పోకుండా వుండేందుకు తగు చర్యలు తీసుకొమ్మని వినయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను. 

మీరు దయామయులు, కరుణా స్వరూపులు. ప్రజల్ని, ప్రజా ప్రయోజనాల్ని సలసల కాగే నూనెలో పకోడీల్లా వేయించుకు తింటుండే తమరు.. కొంచెం (మరీ ఎక్కువేం కాదులేండి) మీ ప్రయోజనాల్ని పక్కన పెట్టి మా గోడు కూడా పట్టించుకొమ్మని విన్నవించుకుంటున్నాను. తమరు తల్చుకుంటే ఇదేం పెద్ద ఇబ్బందైన పని కాదు. 

అదేమిటయ్యా? ఇంత ఛండాలంగా ప్రభుత్వాల్ని అడుక్కునేవాణ్ని నేనెక్కడా చూళ్ళేదు. నీ విన్నపం దేవుణ్ని ప్రార్ధించినట్లుంది!

అన్నా! ఇప్పటిదాకా దేవుణ్ని చూసినోడు లేడు. అయినా ఆ దేవుణ్ని ప్రార్ధిస్తూనే వుంటాం! ఎందుకు? 'దైవం' అనేది ఒక నమ్మకం. ఒకవేళ ఆ దేవుడే వుంటే.. మన ప్రార్ధనే ఆయన చెవుల పడితే.. మన కష్టాల గూర్చి ఆలోచిస్తాడనే ఆశ, నమ్మకం. ఇదీ అంతే!

(picture courtesy : Google)