Saturday, 21 June 2014

భాషా రుద్దుడు, గుద్దుడు


భాష యొక్క ప్రయోజనమేమి? భావప్రకటన. భావప్రకటన అనగానేమి? నావంటివాడికైతే 'సర్వర్ బాబూ! రెండిడ్లీ సాంబారు, సాంబారు వేడిగా వుండాలి సుమా'. కవులకైతే 'ఆహా! ఏమి ఈ లలనామణి హొయలొలుకు జఘన సౌందర్యము! ఈ నాట్యమయూరి పదఘట్టము బహుసుందరము, కడుసుకుమారము, అతిలాలిత్యము!'.

ఇలా మనకి మన భాషతోనే అన్నిపనులూ జరిగిపోతున్నప్పుడు, పరాయి భాష నేర్చుకొనుట ఎందుకు? సూటిగా చెప్పాలంటే - ఉపాధి అవకాశాల్ని మెరుగు పర్చుకునేందుకు మాత్రమే (ఒక భాష పట్ల ప్రేమతో నేర్చుకునేవాళ్ళు వేరే కేటగిరీ, ఇక్కడ చర్చ అది కాదు). అందుకే - తెల్లవాడి నౌకరీ కోసం ఇంగ్లీషు విద్య అవసరం అని అగ్నిహోత్రుడికి మన గిరీశం కూడా చెప్పాడు!

ఇప్పుడు కేంద్రం హిందీకి ప్రాముఖ్యతనివ్వాలంటుంది. హిందీ భాష అధికార భాషట! ఇంతకీ అధికార భాష అనగా యేమి? అధికారులు మాత్రమే మాట్లాడే భాషా? సర్లే! ఏదోటి, అధికార భాష కాబట్టి, ఆ భాషకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ప్రాముఖ్యత అంటే ఏమిటి? 'గుంటూరు రైల్వే స్టేషన్' అని తెలుగు, ఇంగ్లీషుతో పాటుగా హిందీలో కూడా వుండాలి. అలాగే - ఎల్లైసీ రశీదుల మీద, టెలిఫోన్ బిల్లుల మీద కూడా హిందీ ఉంటుంది. ఇక్కడిదాకా ఎవరికీ అభ్యంతరం వుండకపోవచ్చు (నాకు మాత్రం లేదు). ఇప్పటిదాకా జరుగుతుందీ ఇదే.

ప్రభుత్వం తన వెబ్ సైట్లలో ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా సమాచారం వుంచుతుంది. మంచిది. ఎంతైనా హిందీ 'అధికార భాష' కదా! తాజాగా సోషల్ సైట్లలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. ఇక్కడ మాత్రం నాకు పేచీ వుంది. సోషల్ సైట్లలో ఏ భాషకి ప్రాముఖ్యతనివ్వాలో చెప్పడం ప్రభుత్వాల పనికాదు.

ఇదే సూచన కాంగ్రెస్ పార్టీవాళ్ళు చేస్తే? భాష గూర్చి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ పట్టింపు లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ! పురాతనమైన పార్టీ! ప్రజాస్వామ్యం ఎక్కువగా వున్న పార్టీ! అందువల్ల - వాళ్లెప్పుడూ ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోలేదు. ఎందుకంటే - కాంగ్రెస్ వాళ్ళు 'స్కాము' వీరులే గానీ, బీజేపీ వాళ్ళలా 'సాంస్కృతిక' వీరులు కారు!

అసలు హిందీతో ఈ గొడవెందుకు వస్తుంది? కొన్ని రాష్ట్రాల్లో హిందీ మాతృభాష, కొన్ని రాష్ట్రాల్లో కాదు. హిందీ వాళ్ళు బాష పేరుతొ తమ మీద పెత్తనం చేస్తారేమోనని హిందీయేతరుల అనుమానం, భయం (నాకీ మాతృ, పితృభాషల్తో పేచీ వుంది. కానీ ఇంకెలా రాయాలో తెలీటల్లేదు). ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాల్లో హిందీ మాట్లాడే వారి ఆధిపత్యం ఎక్కువగా వుంటుంది (అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా). ఢిల్లీ చుట్టుపక్కల గల్లీ లీడరు కూడా జాతీయ స్థాయి నాయకుడే!

మనం తెలుగు భాష మాట్లాడతాం, ఎందుకంటే - మనింట్లో అదే భాష మాట్లాడతారు కాబట్టి. స్కూళ్ళల్లోఇంగ్లీషు భాషలో సబ్జక్టులు చదువుకుంటాం, ఎందుకంటే - మనకి ఆ భాష అన్నం పెడుతుంది కాబట్టి. ఇప్పుడు కాలేజీల్లో ఇంటర్ స్థాయిలో పిల్లలు సంస్కృతం పరీక్ష రాస్తున్నారు. ఎందుకంటే - తెలుగులో కన్నా సంస్కృతంలో మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి!

మరప్పుడు హిందీ భాష నేర్చుకోవటం ఎందుకు? నాకు తెలిసి హిందీ వచ్చుండటం వల్ల ఒక్కటే ప్రయోజనం, ఎప్పుడన్నా ఉత్తర భారత దేశానికి వెళ్తే ఆటోవాళ్ళు మనని మోసగించకుండా కాపాడుకోగలం! ఇంతకుమించి హిందీ వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. మరి హిందీ భాషని మన పిల్లలు నేర్చుకునేలా చేసేదెలా? సింపుల్ - అమెరికా, ఇంగ్లాండుల్లో కూడా హిందీని 'అధికార భాష'గా చేసినట్లైతే, మన పిల్లలు ఆటోమేటిగ్గా హిందీ మీడియంలోనే చదువుతారు.. ఇంకే మీడియంలోనూ చదవరు!

మన ప్రధాని హిందీలో మాట్లాడతారు. అది ఆయన ఇష్టం, ఆయనకి ఏ భాషలో సుఖంగా, సౌకర్యంగా వుంటే ఆ భాషలో మాట్లాడవచ్చు. రేపాయన గుజరాతీలోనే మాట్లాడతాను అన్నా కూడా నేను స్వాగతిస్తాను. అది ఆయన హక్కు. కానీ, సోషల్ సైట్లలో ఫలానా భాషకి ప్రాధాన్యం ఇమ్మని మాత్రం చెప్పరాదు. ఎందుకంటే - అది ఇతరుల హక్కు. ఎవరికి ఏ భాష ఇష్టమైతే ఆ భాషే వాడుకునే స్వేచ్చ కల్పించటం ప్రజాస్వామిక స్పూర్తి అని నమ్ముతున్నాను.

హిందీ జాతీయ భాష కాదు, అధికార భాష మాత్రమే! ఒకవేళ జాతీయ భాషైనా మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. జాతీయ పక్షి నెమలిని అడవుల్లో వేపుడు చేసుకుని విస్కీలో నంజుకుంటున్నారు. జాతీయ క్రీడైన హాకీలో - జట్టుకి ఎందరుంటారో కూడా చెప్పలేని దుస్థితి! కాబట్టి - మనకి భావనలో జాతీయత వుంది కానీ, చేతల్లో జాతీయత ఉన్నట్లుగా తోచదు.

హిందీ భాషలో మాధుర్యం వుంది, మంచి సాహిత్యం వుంది.. ఇత్యాది ఊకదంపుడు మాటలు నేను నమ్మను. ఏ భాషకి మాత్రం ఏం తక్కువ? అన్నిట్లో అన్నీ వున్నాయి. కన్నడం తక్కువా? బెంగాలీ తక్కువా? అన్నీ సమానమే. ఏ భాష సొగసు ఆ భాషదే!

పీవీనరసింహారావుకి చాలా భాషలొచ్చుట. ఆయన అన్ని భాషలు ఎందుకు నేర్చుకున్నాడో మనకి తెలీదు కానీ, ఆయనా భాషల్ని ఎంతో ఇష్టంగా నేర్చుకునుంటాడు. అలాగే ఎందఱో విద్యావంతులు బహుభాషా పండితులు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం - ఒక భాషని ఇష్టపూర్వకంగా నేర్చుకోటం వేరు, రుద్దించుకోటం వేరు అన్నది.

నా భయమల్లా - ఈ రుద్దుడు కొంతకాలానికి గుద్దుడు స్థాయికి వెళ్తుందేమోనని!

(picture courtesy : Google)