Monday 16 June 2014

రావిశాస్త్రీ! థాంక్యూ వెరీ మచ్


సమయం రాత్రి పన్నెండు గంటలు, నిద్ర రావట్లేదు. పక్కన పడుకునున్న నా భార్య ఏదో మెడికల్ జర్నల్ చదువుకుంటుంది. రోజూ ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపై ఏదోటి తీక్షణంగా చదువుతూ, తీవ్రంగా ఆలోచిస్తూ, అంతకన్నా తీవ్రంగా నిట్టూరుస్తూ వుంటాను. తరవాతేం చేస్తావు? అబ్బే! పెద్దగా ఏమీ చెయ్యను, అలసిపొయ్యి నిద్ర పోతాను, అంతే! రోజుట్లా వార్తలు చదివి నిట్టూర్చడానికి ఇవ్వాళ మూడ్ బాలేదు.

పక్కనున్న టీపాయ్ మీద 'రావిశాస్త్రి రచనాసాగరం' వుంది. పుస్తకం అట్టమీదనున్న రావిశాస్త్రి రంగుల బొమ్మ నవ్వుతూ నన్ను పలకరిస్తున్నట్లనిపించింది. రావిశాస్త్రికి రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టుకుని (నాకు దేవుడి మీద నమ్మకం లేదు గానీ రావిశాస్త్రి మీద నమ్మకముంది), ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను. చేతికొచ్చిన ఒక పేజీ ఓపెన్ చేశాను.

వావ్! నా ఫేవరెట్ 'రాజు - మహిషి' వచ్చింది. గేదెల రాజమ్మ, బావ గంగరాజుతో కలిసి బంగారి కిళ్ళీకొట్టు ముందు.. కర్రిముండని (అమ్మలు), కమ్మలింటి రాజుని (భవానీ శంకర ప్రసాద్) రొట్లప్పిగాడి సాక్షిగా తన్నిన ఘట్టం. ఈ చాప్టర్ మొత్తం ఒకేఒక్క పేరాగ్రాఫ్‌లో పీనుగ్గుమాస్తాతో ఉపన్యాస ధోరణిలో చెప్పిస్తాడు రావిశాస్త్రి. ఇదో ఎపిక్ పేరాగ్రాఫ్. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంటుంది. కావున - చదవసాగాను.

"పొద్దస్తమానం ఆ రావిశాస్త్రినే చదువుతారు! బోర్ కొట్టదా?" నా భార్య ప్రశ్న విని తల పక్కకి తిప్పాను.

"ఏమో మరి! అస్సలు బోర్ కొట్టట్లేదు, పైగా రోజురోజుకీ ఇష్టం పెరిగిపోతుంది కూడానూ." నవ్వుతూ అన్నాను.

నేను అనేక సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో కొత్తగా ఏదీ చదవలేదు. ఎందుకు? 'సమయం లేదు' అంటూ అబద్దాలు రాసుకోడానికి ఇదేమీ నా ఆత్మకథ కాదు కదా? కావున నిజాయితీగానే ఈ ప్రశ్నకి సమాధానం రాయడానికి ప్రయత్నిస్తాను.

జీవిక కోసం తప్పించి, ఏ మనిషీ కూడా తనకి నచ్చని పని చెయ్యడాని నా నమ్మకం. నాకు రావిశాస్త్రి రచనలు ఇష్టం. కావున అవే చదువుతుంటాను. రావిశాస్త్రి అన్నేసి కథలు, అన్నేసి పేజీలు  రాశాడు కదా? ఎందుకు? తనెందుకు రచనలు చేస్తున్నానో రావిశాస్త్రి చాలా స్పష్టంగానే చెప్పాడు. ఆయన ఎందుకోసం రాశాడో ఆ ప్రయోజనం నెరవేరిందా? ఆయన ఎవరి కోసం రాశాడో - వాళ్ళు ఆయన సాహిత్యం చదువుతున్నారా? చదివినట్లైతే వారిపై ఆయన ప్రభావం ఎంత? ఇత్యాది విషయాలు ఆలోచించి బుర్ర పాడు చేసుకోను.

మొన్నెక్కడో చదివాను 'రావిశాస్త్రి భవిష్యత్తరాలు కూడా స్మరించుకునే గొప్ప రచయిత.' అని. నాకు నవ్వొచ్చింది. రావిశాస్త్రిని ఎవరు, ఎందుకు, ఎప్పటిదాకా చదువుతారో మనమెలా చెప్పగలం? ఏ రచనైనా మారుతున్న సమాజానికి రిలెవెంట్ గా వుంటే నిలబడుతుంది, లేకపోతే లేదు. ఈ ముక్క రావిశాస్త్రే చెప్పాడు. నేను మాత్రం గత కొన్నేళ్ళుగా రావిశాస్త్రి రచనల్ని పూరీ పిండిలాగా పిసికేస్తున్నాను!

ఒకసారి నా మిత్రుడు అన్నాడు. 'ఒక సినిమా గానీ, రచన గానీ ఒకసారి ఎంజాయ్ చేస్తే రెండోసారి చెయ్యలేం.' అతని అభిప్రాయం కరెక్టు కావచ్చు. కానీ - అన్నిసార్లు కాదు. షెర్లాక్ హోమ్స్ నవల, హిచ్‌కాక్ సినిమా రెండోసారి ఎంజాయ్ చెయ్యలేకపోవచ్చు. కానీ - సోమర్సెట్ మామ్ ని ఎన్నిసార్లైనా చదవొచ్చు, 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్' ని ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఇంకా చాలా పన్లు చాలాసార్లు చేసినా బాగానే ఎంజాయ్ చెయ్యొచ్చు.

చిన్నప్పుడు అమ్మ వంట చేస్తుంటే పక్కన కూర్చుని గమనిస్తుండేవాణ్ని. కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక పదార్ధం తినడానికి పనికొచ్చే విధంగా తయారైపోవడం అనే అద్భుతాన్ని ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూస్తుండి పొయ్యేవాణ్ని. ముఖ్యంగా - అమ్మ చక్రాలు చేసేప్పుడు చూస్తూ కూర్చోటం నాకెంతో ఇష్టం. చక్రాల గిద్దల్ని నొక్కుతుంటే కింద గిద్ద రంధ్రాల్లోంచి సన్నగా, మెత్తగా, ధారగా, దారంలా వచ్చే శెనగ పిండి - మరుగుతున్న నూనెని తాకంగాన్లే 'సుర్రు'మని శబ్దం చేస్తూ, హడావుడిగా నూనెలో అటూఇటూ పరిగెట్టడం చూస్తే గమ్మత్తుగా వుండేది. నేను కూడా చక్రాల గిద్దల్ని ఒత్తుదామని ప్రయత్నించేవాణ్ని గానీ, నా బలం సరిపొయ్యేది కాదు. నాకు చక్రాల రుచి కన్నా, అవి వండిన విధానం ఎంతగానో ఇష్టం.

అలాగే - చిన్నప్పుడు తిరుపతి చాలాసార్లు వెళ్లాను. రెండు మూడు కుటుంబాల వాళ్ళం కలిసి వెళ్ళేవాళ్ళం కాబట్టి మా పటాలం పెద్దది. ముసలీ ముతకా, కొందరు సుకుమారులు కొండపైకి కార్లల్లో వెళ్లిపొయ్యేవాళ్ళు. నేను మాత్రం నడక బ్యాచ్‌లోనే వుండేవాణ్ని. ఆ అడవి, కొండలు, గుట్టలు, లోయలు, రాళ్ళూరప్పలు, కోతుల గుంపులు, కాళ్ళ నొప్పులు.. నాకు చాలా ఇష్టం. నా మటుకు నాకు తిరుపతి ట్రిప్ అంటే ఇంతే! దేవుడి దర్శనం చప్పగా (ఒక్కోసారి విసుగ్గా) అనిపించేది.

అమ్మ చేసిన వంట రుచి నాకు ముఖ్యం కాదు. తిరుపతి దేవుడి దర్శనం నాకు ప్రధానం కాదు. అలాగే - రావిశాస్త్రి రచనల్లో 'కథ' నాకు అనవసరం. నేను దాన్నెప్పుడూ పట్టించుకోలేదు, ఇకముందు పట్టించుకోను కూడా. నాకు రావిశాస్త్రి వాక్యం ఇష్టం, అక్షరం ఇష్టం, ఆయన రాసే స్టైల్ ఇష్టం. ఒకవేళ - రావిశాస్త్రి తను షేవింగ్ చేసుకునే విధానం గూర్చి రాసినా చదవడానికి నాకు ఆసక్తిగానే వుంటుంది. కొందరు కథావస్తువు, శిల్పం అంటూ ఏవో చెబుతారు గానీ.. నాకవేవీ అర్ధం కావు, అనవసరం కూడా. అయినా - అందరికీ అన్నీ నచ్చాలని రూలేమీ లేదు కదా?

ఈమధ్య ఒకళ్ళిద్దరు నన్ను విసుక్కున్నారు, ఆ ఒకళ్లిద్దరూ నా శ్రేయోభిలాషులే!

'నీ గూర్చి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా? నీదంతా గుడ్డెద్దు వ్యవహారం. ఏదో ఒకదాన్ని ఇష్టపడతావ్. ఇంక అందులోనే కూరుకుపోతావ్. పైగా అదే స్వర్గం అనుకుని మురిసిపోతుంటావ్! నీ రావిశాస్త్రి అభిమానం వ్యసన స్థితికి చేరుకుంది, అందులోంచి అర్జంటుగా బయటకి రా! ఈ ప్రపంచం చాలా పెద్దది, కళ్ళుండి చూడాలే గానీ చాలా సుందరంగా వుంటుంది.'

నాకు మొండి కత్తితో గుండెల్లో పొడిచినట్లు అనిపించింది. తెలుగు సినిమా హీరో అభిమానుల సరసన నించున్నంత అవమానంగా కూడా అనిపించింది. అవున్నిజమే! నేనెప్పుడూ ఈ కోణంలో ఆలోచించలేదే! నేనేమన్నా రావిశాస్త్రికి బానిసనా? ఆయనకేమన్నా అప్పున్నానా? అక్కటా! ఏల నేనిన్నాళ్ళూ బావిలో కప్పలా, బురదలో పందిలా, సందులో కుక్కలా జీవించితిని? నా హృదయం తడిసిన సిమెంటు బస్తాలా బరువుగా అయిపొయింది.

ధృతరాష్ట్రుడికంటే కళ్ళు కనిపించవు, ఆయనకి వేరే చాయిస్ లేదు. మరి ఆ పక్కన గాంధారి కళ్ళకి గుడ్డెందుకు కట్టుకుంది? గాంధారి భర్త కోసం కళ్ళగ్గుడ్డ కట్టుకుని (పాతివ్రత్యాన్ని పాటించి) ఎంతోకొంత పుణ్యం సంపాదించి వుండే వుంటుంది.. రావిశాస్త్రి వల్ల నాకాపాటి పుణ్యం కూడా లభించదు కదా! కావున - ఇకముందు నేనిలా వుంటానికి వీల్లేదు. వీరేశలింగం వితంతువుల్ని సంస్కరించినట్లు, నన్ను నేను సంస్కరించుకోవలసినదే!

అసలు తెలుగు సాహిత్యమన్న ఒక పవిత్ర జీవనది వంటింది. దాన్ని మనసారా చదివి ఆనందం పొందవలె! సీతాకోక చిలక అనేక పుష్పములపై వ్రాలి మకరందము గ్రోలుట నీవు కాంచలేదా? ఏం - ఆ కీటకం ఒక పువ్వు మీదే వాలి కడుపు నింపుకోవచ్చు కదా? కానీ - ఆ సీతాకోక చిలక అన్నిరకాల పూలపై వ్రాలుతూ  మకరందం కుంచెం కుంచెం రుచి చూస్తూంటుంది. దీన్నే సమన్యాయం అంటారు! అర్ధమైందా?

అయ్యో! ఒక అర్భక సీతాకోక చిలక్కి వున్నంత పాటి బుర్ర నాకు లేకపోయేనే! తప్పదు.. తక్షణమే తెలుగులో రాస్తున్న యితర రచయితల సాహిత్య పరిమళాన్ని అఘ్రూణించెద, తేనే వలే స్వీకరించెద, చింతలూరివారి మాదీఫల రసాయనము వలె నాకి వేసెద, నూజివీడు రసం వలె జుర్రు కొనెద, అమూల్ ఐస్‌క్రీం వలె చప్పరించెద.

నా స్నేహితుల సలహా మేరకు, పుస్తకాల షాపు కెళ్ళి, ఈ మధ్య కాలంలో తీవ్రమైన పేరు ప్రఖ్యాతులు పొందిన మాంచి జమాజ్జెట్టీల్లాంటి రచయితల పుస్తకాలు కొన్నాను. ఉత్తమ పాఠకుని లక్షణమేమి? పుస్తకం 'కొని' చదవటం. పుస్తకం కాజేసో, అరువు తెచ్చుకునో చదివినవాడు పాఠకుడో, పాతకుడో అగును కానీ.. ఉత్తముడు మాత్రం కాజాలడు.

ఒక చల్లని రాత్రి (వాస్తవానికి అది చల్లని రాత్రి కాదు, ఎండాకాలపు వెచ్చని రాత్రి, ఏసీ వల్ల గది లోపల మాత్రమే చల్లగా వుంది, కానీ - అనాదిగా తెలుగు కవులు వెచ్చని రాత్రిని శృంగార విషయాలకి మాత్రమే రిజర్వ్ చేసి ఉంచారు) పుస్తకం తెరిచి చదవడం మొదలెట్టాను.

ఒక పేజీ ఏదో చదివాను. రెండో పేజీ కష్టపడి చదివాను. మూడో పేజి చదువుతుంటే ఎంతకీ కదలట్లేదు! ఔరా! ఏమి ఈ మాయ! రాత్రికి రాత్రులు దిండ్ల కన్నా మందమైన, బండరాయి కన్నా బరువైన పుస్తకాల్ని 'ఉఫ్'మని ఊది పారేసిన నాకు పేజి కదులుట భారమగుటయా! ఏమి ఈ కాలమహిమ! కష్టపడి మూడో పేజి కూడా చదివాను. నాలుగో పేజి మొదట్లోనే ఇంజన్ మొరాయించింది.

ఎన్నో యేళ్ళుగా ఎంతోమందికి కౌన్సిలింగ్ చేశాను. పీనుగల్లాంటి వాళ్ళు ఏనుగుల్లాగా ఫీలయ్యేట్లు చేశాను. కర్కోటకుల్ని కరుణామయులుగా మార్చేశాను. తొమ్మిది మార్కుల వాళ్ళని తొంభై తొమ్మిది మార్కుల వాళ్ళగా తీర్చిదిద్దాను. ఆశ్లీలుల్ని సచ్ఛీలులుగా మార్చి సమాజానికి సేవ (డబ్బు తీసుకునే అనుకోండి) చేశాను. అట్టి నాకు, ఒక తెలుగు రచన ముందుకు కదలకపోవుటయా! ఇది కలయా? నిజమా? భ్రాంతియా?

ఎవరక్కడ? దుశ్శాసనా! ఈ అవమానం నేను భరింపలేకున్నాను. చితి పేర్పించు, వెంటనే ప్రాయోపవేశం చేస్తాను. 'రారాజా! ఆగుము. నీవే యిటుల ఆలోచించినచో మేమైపోవాలి? నీ తమ్ములం నూర్గురం వున్నాం, ఆజ్ఞాపించు. తక్షణం చతురంగ బలాలతో వెళ్లి ఆ దరిద్రపుగొట్టు తెలుగు సాహిత్యాన్ని భస్మీపటలం చేసేస్తాం.' అని ఎవరూ ఎంతకీ అనరేమి? ఒరేయ్! ఎవడోకడు వచ్చి నా ప్రాణాల్ని కాపాడండ్రా! ఆలీసం అయితే అన్యాయంగా చచ్చూరుకుంటాను. ఇంతలో మెలుకువొచ్చింది. ఔరా! ఇదంతా కలన్న మాట! పుస్తకం మహిమ! కొన్ని పుస్తకాలు నిద్ర మాత్రల్లా పంజేస్తాయి. వెంటనే పుస్తకం టపుక్కున మూసేసి పడుకున్నాను.

మర్నాడు ఇంకో రచయిత పుస్తకం, ఈసారి రెండో పేజి దాటలేకపోయ్యాను. అవమాన భారంతో, శోకంతో కృద్దుడనై మళ్ళీ మాగన్ను నిద్రలోకి జారుకుంటిని. మళ్ళీ దుర్యోధనుడు ప్రత్యక్షం! 'ఇక నీకు మరణమే శరణ్యం.' అంటూ ఎస్వీరంగారావులా వికటాట్టహాసం చేయుచుండగా మెలకువొచ్చింది.

ఇంక నాకు పట్టుదలొచ్చేసింది. 'ఇవ్వాళ - నేనో తెలుగు సాహిత్యమో తేలిపోవాలి' అని పట్టుదలగా ఇంకో రచయిత పుస్తకం తెరిచాను. ఈ పుస్తకం మొదటి పేజి దాటట్లేదు. హృదయం బరువెక్కింది, గుండె నీరయ్యింది, మనసు తల్లడిల్లింది. కంట్లో నీటిపొర! ఏమి నా దౌర్భాగ్యము? నా అఖండ పఠనాశక్తి ఏమయ్యింది? ఏమయ్యింది? ఎక్కడకి పోయింది? కహా గయా? అని మనసు ఘూర్ఘించింది.. దీనంగా, దిక్కు తోచక, బిత్తర చూపులు చూసింది.

ఫ్రిజ్ తెరిచి ఐస్ వాటర్ గటగటా తాగాను. కడుపు చల్లబడింది, తెలుగు సినిమాకి 'శుభం' కార్డు పడినప్పుడు కలిగే ప్రశాంతత వంటిది లభించింది. ఇప్పుడు బుర్ర ఆలోచించడం మొదలెట్టింది.

'నేనవర్ని? సగటు తెలుగు పాఠకుణ్ని. నేనెవర్ని? ప్రభుత్వ గ్రంధాలయంలో దుమ్ము కొట్టుకుపోయిన పాత పుస్తకం లాంటి వాడిని. నేనెవర్ని? పెద్దబాలశిక్షకీ, ఉరిశిక్షకీ తేడా తెలియని అజ్ఞానిని. నేనెవర్ని?  'ది హిందూ'ని హిందువులు మాత్రమే చదువుతారనుకున్న అమాయకుణ్ని. నేనెవర్ని? జీవన పరమార్ధాన్ని కాఫీ హోటళ్ళల్లో, సినిమా హాళ్ళల్లో వెతుక్కున్న వ్యర్ధజీవిని. నేనెవర్ని? నేనెవర్నీ కాను, నేను నేనే!'

నువ్వో జ్ఞానివా? కాదు. నువ్వో సాహిత్య పాఠకుడివా? కానేకాదు. నేను చందమామ, విజయచిత్ర మాత్రమే చదువుకున్న అపాఠకుణ్ని. నువ్వో సాహిత్య విమర్శకుడవా? కాదు బాబూ కాదు, అసలు నాకా మాటకి అర్ధమే తెలీదు. మరి నీకెందుకీ ఆపసోపాలు? నీకు నచ్చింది తిను, నచ్చింది చూడు, నచ్చింది చదువుకో! ఈ భువనము నందు నీవొక నీటి బిందువువి, ఇసుక రేణువువి, అరిగిపోయిన కారు టైరువి, కాల్చి పడేసిన సిగరెట్టు పీకవి! కావున - ఆయాసపడుతూ అర్ధం కాని విషయాల జోలికి వెళ్ళడం మాని.. నీకు ఆనందం కలిగే పన్లు మాత్రమే చెయ్యి! దేశాన్ని ఉద్ధరించే ప్రయత్నం మానుకో!

అమ్మయ్య! మనసు ప్రశాంతంగా అయిపొయింది. నేనిప్పుడేం చెయ్యాలి? కొద్దిసేపు ఆలోచించిన మీదట, రావిశాస్త్రి 'బాకీ కథలు' తీసుకున్నాను. పక్కింటి అబ్బాయి, వెన్నెల, పాతదే కథ.. వరసగా కథలు చదువుతూనే వున్నాను. నిద్రా గిద్రా ఎగిరిపోయింది. మా చాత్రిబాబు మాటల మాయలో పడిపోయ్యాను, రచనా ప్రవాహ వేగానికి కొట్టుకు పోసాగాను. 'అబ్బా! తల దిమ్ముగా ఉందేంటి?' అనుకుంటూ టైమ్ చూశాను. తెల్లావారుఝాము నాలుగయ్యింది. అయినా ఏం పర్లేదు, నాకిప్పుడు తెలుగు కథలు చదవగలననే కాన్ఫిడెన్స్ వచ్చేసింది.

ఆ రోజున నేనో జీవిత సత్యం తెలుసుకున్నాను. పక్షులు మాత్రమే ఎగురుతాయి, పులి మాత్రమే వేటాడుతుంది, పోలీసులు మాత్రమే ఎన్‌కౌంటర్లు చేస్తారు, ప్రకృతి వైపరిత్యాల్లో పేదవాడు మాత్రమే చస్తాడు, కాఫీ మాత్రమే కమ్మగా వుంటుంది, విస్కీ మాత్రమే వెచ్చగా వుంటుంది, రావిశాస్త్రి మాత్రమే నాకు నచ్చిన కథ రాయగలడు.

తాజ్‌మహల్ అందముగా యుండును, సావిత్రి నటన అద్భుతముగా యుండును, కొత్తావకాయ ఘాటుగా యుండును, మండువేసవిలో తొలకరి జల్లు ఆహ్లాదముగా యుండును, కృష్ణమ్మ ప్రవాహము వేగముగా యుండును? ఈ 'యుండును'లకి ఇంకో వంద 'యుండును'లు కలిపి.. అవన్నీ ఎందులో యుండును? రావిశాస్త్రి రచనల్లో యుండును!

రావిశాస్త్రీ! థాంక్యూ వెరీ మచ్! యువార్ ద బెస్ట్! ఐ బో మై హెడ్ టు ఎ ట్రూలీ గ్రేట్ రైటర్.

(picture courtesy : Google)