Wednesday, 25 June 2014

శ్రీదేవి బుక్‌స్టాల్


పుస్తకాలు అనేక రకాలు. వీటిని ప్రధానంగా రెండురకాలుగా వర్గీకరించవచ్చు. పరీక్షల చదువుకు సంబంధించిన పుస్తకాలు (వీటినే టెక్స్ట్ బుక్స్ అంటారు) ఒకరకం. ఉన్నతమైన జీవనం కోసం విద్యార్ధులు ఈ పుస్తకాల్ని కష్టపడి చదువుతారు, ఇంక దేనికీ చదవరు. మానసికోల్లాసానికి చదివే పుస్తకాలు రెండోరకం. ఈ రకం పుస్తకాలు చదివితే జ్ఞానం రావొచ్చునేమో గానీ, పరీక్షల్లో మార్కులు మాత్రం రావు. ఒక్కోసారి మానసికోల్లాసం కోసం చదివిన పుస్తకమే మానసిక క్షోభ కూడా పెట్టొచ్చు (అది మన అదృష్టం మీద ఆధారపడి వుంటుంది).

ఈ ప్రపంచంలో అసలేం చదువుకోనివారే ధన్యులని నా అభిప్రాయం, ఎందుకంటే - వాళ్ళసలే పుస్తకాలు చదవరు కనుక! ఇప్పుడొక కష్టమైన ప్రశ్న. పుస్తక పఠనం వల్ల కలుగు ప్రయోజనమేమి? విజ్ఞానవికాసములు దండిగా కలుగునని కొందరూ.. గాడిద గుడ్డేం కాదు? అదో వ్యసనం. పుస్తకాలు చదవడం వల్ల కళ్ళు మంటలు, తలనొప్పి తప్పించి మరే ప్రయోజనమూ లేదని మరికొందరూ వాదిస్తుంటారు. ఎవరు కరెక్టో చెప్పడం చాలా కష్టం! ఇదిప్పుడిప్పుడే తేలే వ్యవహారం కాదు కనుక, అసలు విషయంలోకి వచ్చేస్తాను.

ఇప్పుడంటే టీవీలు, కంప్యూటర్లు, స్మార్టు ఫోన్లు వచ్చేశాయి కాబట్టి కావలసింత కాలక్షేపం. నా చిన్నప్పుడు ఇవేవీ లేవు. కాలక్షేపం కోసం పుస్తకాలు, సినిమా వినా వేరే మార్గం వుండేది కాదు. కావున చాలామందికి చందమామ, బాలమిత్రలతో మొదలయ్యే 'చదివే అలవాటు' ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల మీదుగా నవలల వైపు సాగిపొయ్యేది.

పెళ్లి కెదిగిన ఆడపిల్లలు (వీళ్ళనే 'గుండెల మీద కుంపట్లు' అని కూడా అంటారు) యద్దనపూడి సులోచనారాణి, కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి నవలలు.. పెళ్లి కెదగని కుర్రాళ్ళు కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావుల డిటెక్టివ్ నవలలు.. మేధావులం అనుకునేవాళ్ళు ప్రేమ్‌చంద్, శరత్ బాబుల నవలలు.. ఆంగ్లభాషా కోవిదులు ఇంగ్లీషు నవలలు.. ఇలా అనేక వర్గాలవారు రకరకాల పుస్తకాలు చదువుతుండేవాళ్ళు.

ఆ రోజుల్లో సమాజంలో డబ్బు తక్కువ. పుస్తకం కొని చదివేంత ఆర్ధికస్థితి కొద్దిమందికే వుండేది. ఉన్నా - పెద్దబాలశిక్ష, రామాయణ భారతాలు తప్పించి ఇంకే పుస్తకాలు కొనేవాళ్ళు కాదు. 'ఒక్కసారి చదివి అవతల పారేసేందుకు' ఒక పుస్తకం కొనడం దండగనే అభిప్రాయం చాలామందిలో వుండేది. అందువల్ల - రోజువారీగా నవలల్ని, పత్రికల్ని అద్దెకిచ్చే వ్యాపారం బాగానే సాగేది.

బ్రాడీపేట బ్రిడ్జి డౌన్లో అంబికా షో రూం పక్కన ఒక చిన్న సందుంది. ఆ సందులో 'శ్రీదేవి బుక్‌స్టాల్' అనే పేరుతొ ఒక అద్దె పుస్తకాల షాపు వుండేది. అదో చిన్నగది, మధ్యలో కరెంటు వైరుకి వేళ్లాడుతూ ఒక ఎలెక్ట్రిక్ బల్బు. ఆ గుడ్డి వెలుగులో, ఆ గదో మాంత్రికుని రహస్య స్థావరంలా వుండేది. గదినిండా నాసిరకం చెక్కతో చేసిన ర్యాకులు, వాటినిండా నిలువుగా కుక్కిన పాత పుస్తకాలు. ఓ పక్కగా తాడుతో కట్టలు కట్టిన పుస్తకాలు. ఇంకో పక్కగా కుప్పగా పోసిన పాడైపోయిన పుస్తకాలు.

ఆ పుస్తకాల మధ్యలో ఒక మనిషి నిలబడ్డానికి మాత్రమే చోటుండేది. కాబట్టి - దీపం స్తంభంలా ఎల్లప్పుడూ ఒక మనిషే నిలబడి వుండేవాడు. అతనే - 'శ్రీదేవి  బుక్‌స్టాల్ నాగేశ్వరరావు'గా అందరికీ సుపరిచితమైన బిజినేపల్లి నాగేశ్వరరావు.

'చూడు నాగేశ్వరరావు! యద్దనపూడి సెక్రెటరీ ఇవ్వు.'

'నాగేస్సర్రావ్! ఇంజన్ హీటెక్కించే వెచ్చని పుస్తకం ఒకటివ్వవోయి.'

'నాగేశ్రావ్! ఒక్క పుస్తకం కోసం నాల్రోజుల్నించి తిప్పుతున్నావ్! నాలుక్కాపీలు ఎక్కువ తెప్పించకపోయ్యావా?'

'నాగేశ్వరరావుగారు! మీదగ్గర ఆర్దర్ హైలీ పుస్తకాలు దొరుకుతాయాండీ?'

ఏ పుస్తకం అడిగినా ఆ పుస్తకాల గుట్టలు, రాసుల్లోంచి ఒక్కక్షణంలో పుస్తకం తీసివ్వడం నాగేశ్వరరావు స్పెషాలిటీ. విచిత్రమేమంటే నాగేశ్వరరావుకి ఇంగ్లీషు తెలీదు. కానీ - మనం అడిగితే పుస్తకాలు గుర్తు పట్టేవాడు. సిడ్నీ షెల్డన్ అనంగాన్లే ఒక బండిల్ మనముందు వుంచేవాడు. హెరాల్డ్ రాబిన్స్ ఎక్కడ? అంటే ఇంకో కట్ట మన ముందుంచేవాడు. డి.ఎచ్.లారెన్స్ కావాలంటే బాగా పాడైపోయిన పుస్తకాలు చూపించి అందులో వెతుక్కోమనేవాడు.

నాగేశ్వరరావు ప్రవర్తన ఎంత కస్టమర్ ఫ్రెండ్లీగా వున్నా, అద్దె వసూల్లో మాత్రం నిక్కచ్చిగా వుండేది. ఇవ్వాల్టి పుస్తకం రేపు ఉదయం పది గంటల కల్లా ఇచ్చెయ్యాలి. ఒక్క నిమిషం దాటినా, ఇంకో రోజు అద్దె ఆటోమేటిగ్గా పడిపోతుంది. మనం ఎన్ని కారణాలు చెప్పినా అద్దె విషయంలో మాత్రం నాగేశ్వరరావు రాతిగుండె కరిగేది కాదు! అందువల్ల పబ్లిక్ ఎక్జామ్స్ రాసేవాళ్ళలా మేం తొమ్మిదింటికే పరుగులు పెట్టేవాళ్ళం.

పెద్దపెద్ద మేధావులు పెద్దపెద్ద లైబ్రరీల్లో కూచుని పెద్దవాళ్ళయ్యార్ట! నేనెప్పుడూ ఏ లైబ్రరీకి పోయిందీ లేదు, చదివిందీ లేదు. కావున - నేను మేధావిననే కన్ఫ్యూజన్ నాలో ఏనాడూ లేదు. కానీ - చాలా విషయాల పట్ల నాకో అవగాహన కలిగించటంలో శ్రీదేవి బుక్‌స్టాల్ నాకు బాగా వుపయోయపడిందనేది నా నమ్మకం.

శ్రీదేవి బుక్‌స్టాల్ లేకపోయినట్లైతే - నాకేమయ్యేది?

తెలుగు డిటెక్టివ్‌లైన యుగంధర్, పరుశురామ్, వాలి, నర్సన్‌లు పరిచయం అయ్యేవాళ్ళుకాదు.

జేమ్స్ హేడ్లీ చేజ్‌తో ఇంగ్లీషు నవలల అరంగేట్రం జరిగేది కాదు.

షెర్లాక్ హోమ్స్, పెర్రీ మేసన్‌లు తెలిసేవాళ్ళు కాదు.

పిజి.వోడ్‌హౌజ్, అగాథా క్రిస్టీల్ని పట్టించుకునేవాణ్నికాదు.

'రమణి' కథల్ని భారంగా, బరువుగా, వేడి నిట్టూర్పులతో చదివగలిగేవాణ్నికాదు.

స్టార్‌డస్టుల్లో, డెబొనైర్లల్లో సెంటర్ స్ప్రెడ్‌లో బట్టల్లేని అందమైన అమ్మాయిల్ని - నోరు తెరుచుకుని అలా చూస్తుండిపొయ్యేవాణ్నికాదు.

ఇన్ని 'కాదు'లు వున్నాయి కాబట్టే శ్రీదేవి బుక్‌స్టాల్ నాకిష్టం!

అటుతరవాత ఒక్కొక్కళ్ళుగా స్నేహితులు దూరమయ్యారు. నాకు పుస్తకాలు కొని చదవడం అలవాటయ్యింది. ఇలా - అనేక కారణాల వల్ల, క్రమేపి శ్రీదేవి బుక్‌స్టాల్‌కి వెళ్ళడం తగ్గించేశాను.. ఆపై పూర్తిగా మానేశాను. కొన్నాళ్ళకి  ఆ బుక్‌స్టాల్ కూడా మూతబడింది. చాలా విషయాల్లాగే, శ్రీదేవి బుక్‌స్టాల్ కూడా నా జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళిపోయింది.

కొన్నేళ్ళక్రితం శ్రీదేవి బుక్‌స్టాల్ నాగేశ్వరరావు తన భార్యా కూతురితో నా హాస్పిటల్‌కి వచ్చాడు. లోపలకి రాంగాన్లే గుర్తు పట్టాను, ఆప్యాయంగా పలకరించాను. నాగేశ్వరరావు చాలా సంతోషించాడు. అతనికి కస్టమర్ల మొహాలు తెలుసు గానీ, పేర్లు తెలీదు. అంచేత - కన్సల్టేషన్ రూమ్ లోపలకొచ్చేదాకా బయట బోర్డు మీద వున్న పేరు నాదని అతనికి తెలీదు!

అటుతరవాత అతను తరచుగా నా హాస్పిటల్‌కి వస్తూనే వున్నాడు. నాగేశ్వరరావుకి నేను చెయ్యగలిగిందంతా చేస్తూనే వున్నాను. అతను నాదగ్గరకి ఎందుకొస్తున్నాడో ఇక్కడ రాయడం అనవసరం, రాయాలనుకున్నా professional ethics అందుకు ఒప్పుకోవు.

దాదాపు ముప్పైయ్యైదేళ్ళ వయసున్న శ్రీదేవి బుక్‌స్టాల్  జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది. నేను గుంటూరులోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చావబోతున్నాను కూడా. నాకిక్కడ ప్రతిదీ అందంగానే కనబడుతుంది.

మొన్న ఆస్పత్రిలో నాగేశ్వరరావుని ఫోటో తీశాను. తనగూర్చి రాయడానికి, తన ఫోటోగ్రాఫ్ పబ్లిష్ చేసుకోడానికి అనుమతి నిచ్చిన 'శ్రీదేవి బుక్‌స్టాల్ నాగేశ్వరరావు'కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్యూ నాగేశ్వర్రావ్!