Thursday, 19 June 2014

ఆదివాసీలూ మనవాళ్ళే
మనిషి చదవగలడు, జంతువులు చదవలేవు. కావున జంతువులకి లేని ఎడ్వాంటెజ్ మనిషికి వుంది. మనిషికి చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, అర్ధం చేసుకునే శక్తినిస్తుంది. అట్టి జ్ఞానంతో మనిషి నిరంతరం తన కోసం, తన సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడు, పాటుపడతాడు. సమాజంలో తమ వాణి వినిపించలేని బలహీనుల్ని దయతో, ప్రేమతో అర్ధం చేసుకుంటాడు. వారి హక్కుల కోసం తపన పడతాడు, పోరాడతాడు. 

అట్టి బలహీనుల్లో ఆదివాసీలు ముందువరసలో వుంటారని నా నమ్మకం. ఎందుకంటే - వాళ్ళ హక్కుల గూర్చి వాళ్ళు సరీగ్గా మాట్లాడలేరు, ఒకవేళ మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. కారణం - వారికి సరైన చదువు వుండదు, మేధావుల్లా భాషా పటిమ వుండదు, సరైన భావప్రకటన వుండదు. అందువల్ల మనం వాళ్లకి అర్ధం కాము, వాళ్ళు మనకి అర్ధం కారు.

అనాదిగా అడవుల్లో జీవనం చేస్తున్న ఆదివాసీల మనుగడ ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం అడవుల్లో లభించే ఖరీదైన ఖనిజ సంపద. ఈ ఖనిజ సంపదే వారి మనుగడకి మృత్యుఘంటికలు మోగిస్తుంది. మైదానప్రాంత ప్రజల నాగరికతకి విద్యుత్తు చాలా అవసరం. కావున అణు విద్యుత్తు కేంద్రాలు నిర్మించాలి. అందుకు మారుమూల అడవులు కావాలి, ఎందుకంటే - ప్రమాదం జరిగినా నాగరికులు రేడియేషన్ బారి పడకుండా safe zone లో వుండాలి కదా! మైదాన ప్రాంత రైతుల వ్యవసాయం కోసం నీళ్ళు కావాలి, పట్టణ ప్రజల అవసరాలక్కూడా నీళ్ళు కావాలి. అందుకు అడవుల్ని ముంచేసే డ్యాముల్ని నిర్మించాలి. ఈ విధంగా అన్ని 'అభివృద్ధి' నమూనాలు ఆదివాసీలకి ఒక శాపంగా పరిణమించాయి.

ఏసీలలో 'split model' వుంటుంది. పెద్దగా శబ్దం చేసే కంప్రెసర్, వేడి గాలిని చిమ్మే ఫ్యాన్ కలిపి ఒక యూనిట్. ఇది దూరంగా బయటవైపు వుంటుంది. రూములోకి నిశ్సబ్దంగా చల్లని గాలిని పంపే యూనిట్ ఇంకోటి వుంటుంది. ఇవ్వాళ మన అభివృద్ధి మోడళ్లన్నీ ఈ split ఏసీలాగా ఉంటున్నాయి. వేడిగాలి, బొయ్యిన శబ్దం ఆదివాసీలకి.. చల్లగాలి మైదాన ప్రాంత ప్రజలకి. మన చల్లదనానికి వాళ్ళు వేడిని భరించాలి!

రాజ్ కపూర్ 'సంగం' తీశాడు. ఆ సినిమా చివర్లో రాజ్ కపూర్, రాజేంద్ర కుమార్లు తాము ప్రేమించిన వైజయంతిమాల ఎవరికి చెందాలనే విషయంపై చాలాసేపు వాదించుకుంటారు.. నాకైతే విసుగ్గా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో నించున్న వైజయంతిమాల కూడా 'ఇంతకీ నేనెవర్తో వుండాలి?' అన్నట్లు టెన్షన్తో వాళ్ళ చర్చని ఫాలో అవుతుంటుంది! అయితే - ఎంతసేపూ హీరోలిద్దరే మాట్లాడుకుంటారు గానీ, వైజయంతిమాలని 'మాలో ఎవరితో జీవించడం నీకిష్టమో చెప్పు' అని మాత్రం ఒక్కమాట కూడా అడగరు!

ప్రస్తుతం మన పోలవరం నిర్వాసితుల దీనావస్థ వైజయంతిమాలని జ్ఞప్తికి తెస్తుంది. తాము ఉండాలా, ఊడాలా అన్నది ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల వివాదంగా మారింది. ఇప్పుడు వాళ్ళు నిస్సహాయంగా (కొంత ఆసక్తిగా) వీళ్ళిద్దర్నీ గమనిస్తున్నారు (అతకుమించి చేసేదేమీ లేక).

మన మధ్యతరగతి మేధావులు డ్యాములు, గనులు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందని అంటారు. అందుకోసం - 'అడవులు ఖాళీ చెయ్యాల్సిందే, ఆదివాసీలు త్యాగం చెయ్యాలి.' అంటారు. సరే! ఒప్పుకుందాం. మరప్పుడు ఆదివాసీల పునరావాసం నిజాయితీగా, బాధ్యతగా జరగాలి కదా? గత అనుభవాలు అలా జరగట్లేదనే చెబుతున్నాయి.

ఆదివాసీలకి ప్రత్యామ్నాయంగా భూమినివ్వాలనీ, వాళ్ళకి ఆ ప్రాజెక్టులోనే ఉద్యోగం కల్పించాలనీ.. ఇత్యాది జాతీయ, అంతార్జాతీయ సూత్రాలు కాగితాల మీద మాత్రం ఎంతో ఘనంగా రాసుకున్నారు. కానీ - ఎక్కడ పాటించారు? ఎక్కువలో ఎక్కువ.. కొన్నిచోట్ల భూమినిచ్చారు గానీ, వాళ్ళకి ఆదాయ వనరు మాత్రం చూపించలేకపొయ్యారు.

కొందరు బుద్ధిజీవులు (అమాయకంగా) 'డబ్బిస్తే సరిపోతుంది కదా?' అని వాదిస్తారు. ఆదివాసీల జీవనం వేరుగా వుంటుంది, వారిలో కొందరు సంచార జీవులు కూడా. వాళ్ళకి డబ్బివ్వడమంటే చిన్నపిల్లాడి చేతికి డబ్బివ్వడంతో సమానం. చదువు లేకపోవడం, అమాయకత్వం వల్ల వారి భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన సొమ్ము దుర్వినియోగం అయిపోతుంది. అందువల్ల - ఆదివాసీల పునరావాసం విషయంలో ప్రభుత్వాలు నిర్వాసిత చట్టాల్ని తుచ తప్పకుండా అమలు చెయ్యాలని మనలాంటివారు డిమాండ్ చెయ్యాలి. 

ఎన్నో విషయాల్లో ఎంతో నిక్కచ్చిగా వుందే ప్రభుత్వాలు ఆదివాసీల పునరావాసం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తాయి? ఎందుకంటే - ఈ దేశంలో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల పేర్లు మారతాయే గానీ.. ప్రభుత్వాల స్వరూపాల్లో మౌలికమైన తేడా వుండదు. ఏ ప్రభుత్వాన్నైనా ఆడించే శక్తులు వేరే వుంటాయి. ఈ శక్తులకి దేశప్రయోజనాల కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యం. అందువల్ల - ప్రభుత్వాలు ఆదివాసీలకి పునరావాసం కోసం కంటితుడుపుగా కొంతచేసి.. చెయ్యాల్సింది చాలా వదిలేస్తాయి.

కార్పొరేట్ మీడియా తెలివిగా తమ ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని మళ్ళించి - రాజకీయ నాయకుల్ని సినీ హీరోల స్థాయిలో హైప్ సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయి. తమ ప్రయోజనాల్ని ఎవరు పరిరక్షించగలరో వారినే హీరోలుగా మీడియా ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ కార్పోరేట్ శక్తులే ఒకప్పుడు కాంగ్రెస్ ని ప్రమోట్ చేశాయి, ఇప్పుడు బీజేపీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. వ్యాపారస్తుడైన సినిమా హాలువాడు.. సినిమా కలెక్షన్లు పడిపోతే, ఇంకో హీరో సినిమా వేసుకుంటాడు. ఇదీ అంతే!

ఒకప్పుడు బాలగోపాల్ ఆదివాసీలని కలుసుకుని వారి సమస్యల్ని వివరంగా తెలుసుకుని, వారి తరఫున రిపోర్టులు, వ్యాసాలు రాసేవాడు. అవసరం అనుకున్నప్పుడు కోర్టుల్లో కేసులు వేసేవాడు, వాళ్ళ తరఫున వాదించేవాడు. ఈ రంగంలో జయధీర్ తిరుమలరావు చేసిన, చేస్తున్న కృషి అభినందనీయం. క్రమంగా నిబద్దత కలిగిన వ్యక్తులు తగ్గిపోతున్నారు (ground zero వ్యక్తుల్ని కలవకుండా - టీవీ స్టూడియోల్లో చర్చల్లో పాల్గొనేవారు ఈమధ్య ఎక్కువైపొయ్యారు).

సమాజం అనేక వర్గాలుగా విడిపోయింది. ఈ వర్గాలు తమ వర్గంవారి ప్రయోజనాలు తప్ప ఇంకే విషయాన్ని సమస్యగా చూట్టం మానేశాయి. పైగా - తమకోసం పక్కవర్గంవాడు మాత్రమే త్యాగం చెయ్యాలనే స్వార్ధపూరిత వాదనల్ని తలకెత్తుకుంటున్నాయి. ప్రజల్లోని అనేక వర్గాలు తమ సొంత ప్రయోజనాల గూర్చే తప్ప, ఇంకే ఇతర సెక్షన్ గూర్చి పట్టించుకోరనే స్పష్టతకి ప్రభుత్వాలొచ్చేశాయి. ఇందువల్ల ప్రభుత్వాలక్కూడా హాయిగా వుంది.  ప్రజల్లో లేని సున్నితత్వాన్ని ప్రభుత్వాల్లో ఆశించడం దురాశే అవుతుంది.

ముగింపు :

ఎప్పుడూ త్యాగం చెయ్యాల్సింది ఆదివాసీలేనా?

For a change - ఈసారి మనమే త్యాగం చేద్దాం. ఆ అవకాశం ఇప్పుడు మనకి వచ్చింది కూడా!

గుంటూరు, విజయవాడ ప్రాంతం రాజధానికి అనుకూలం అంటున్నారు కదా? మన తెలుగుజాతి భావి ప్రయోజనాల కోసం, ఈ రెండు నగరాల్లోని ప్రజలం - మన ఇళ్ళూ, భూముల్ని స్వచ్చందంగా ఖాళీ చేసి ప్రభుత్వపరం చేసేద్దాం. ఆవిధంగా - ఒక అద్భుత నగర (సింగపూర్ని తలదన్నే) నిర్మాణానికి మన వంతు చేయందిద్దాం. ఒక జాతి విశాల ప్రయోజనాల కోసం ఎవరోకరు నష్టపోక తప్పదు కదా! అంచేత - ఆ నష్టమేదో మనమే భరిద్దాం. ఈ విధంగా చేసి - తమ నివాసాలపై మక్కువ చూపిస్తున్న ఆదివాసీలకి బుద్ధొచ్చేలా చేద్దాం. ఏమంటారు? 

(fb post on 23/8/2017)