Friday 28 November 2014

అమాయకుల ఆందోళన


ఒకానొకప్పుడు - ఎక్కడైనా, ఎప్పుడైనా అంతిమంగా న్యాయమే జయిస్తుందని నమ్మేవాణ్ని. యిలా నమ్మడం నా అమాయకత్వం మాత్రమేనని కొన్నాళ్ళకి అర్ధం చేసుకున్నాను. అప్పుడు నేను - నా అమాయకత్వానికి నవ్వుకున్నాను.

ఈ తరహా అమాయకత్వం ఏ వొక్కడి సొత్తూ కాదనుకుంటాను. ఎందుకంటే - ఈ లోకంలో ఎప్పుడూ కావల్సినంతమంది అమాయకులు వుంటూనే వున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది. యిలా జాలి పడటం నాకేమీ సంతోషంగా లేదు.

ఒకప్పుడు అజ్ఞానంతో - 'మీ చర్మం రంగు తెల్లగా మార్చేస్తాం' అంటూ క్రీముల కంపెనీలు గుప్పించే ప్రకటనలు చూసి - 'చర్మం ఆరోగ్యంగా వుండాలి గానీ ఏ రంగులో వుంటేనేం?' అని విసుక్కునేవాణ్ని. నేనిప్పుడా ప్రకటనల్ని అర్ధం చేసుకున్నాను, సమర్ధిస్తున్నానుకూడా! అవును - మనం తెల్లగా వుండాలి! వుండి తీరాలి!

'హిందూ మతవాదులు గోవుల్ని చంపడం నిషేధించండి! అంటూ నినదిస్తారే గానీ, అదే జాతైన గేదెల్ని చంపొద్దని ఎందుకు అనరు?' ఇది కంచె ఐలయ్య ప్రశ్న. తెల్లగా వుండటమే గోవుల పవిత్రతకి కారణమా? అయ్యుండొచ్చు! 'ఎరుపంటే కొందరికి భయం భయం!' అన్నాడే కానీ - నలుపు తెలుపుల సంగతి చెప్పలేదు శ్రీశ్రీ.

కాబట్టి - మనిషైనా, జంతువైనా చర్మం నల్లగా వున్నట్లైతే - ప్రాణాలకి రక్షణ ఉండదని అర్ధమవుతుంది. మన పేదదేశాలవారికి అమెరికా ఒక సుందర స్వప్నం. కానీ ఆ అమెరికాలో నివసించే నల్లవారికి మాత్రం ఒక పీడకల. ఈ విషయం మాల్కం ఎక్స్, మార్టిన్ లూధర్ కింగ్ వంటి హక్కుల నాయకులు హత్య చేయబడ్డప్పుడే అర్ధమైంది.

కొన్నిరోజుల క్రితం అమెరికాలో ఓ 'నల్లతోలు' యువకుణ్ని కర్తవ్య నిర్వహణయే పరమావిధిగా భావించిన 'తెల్లతోలు' పోలీసు దొర అనుమానంగా, హడావుడిగా కాల్చి చంపేశాట్ట.

ఇదసలు వార్తేనా? కాదు కదా! మరీ ఆందోళనలేమిటి? ఎందుకంటే - మొదట్లో నే చెప్పినట్లు - ఈ ప్రపంచం అమాయకుల నిలయం. ఈ అమాయకులు అజ్ఞానంతో అరుస్తారు. అలా అరవగా అరవగా - కొంతకాలానికి వారే విజ్ఞానవంతులవుతారు.

ఒక మాజీ అమాయకుడిగా నొక్కి వక్కాణిస్తున్నాను - ఇవన్నీ మనం పట్టించుకుని సమయం వృధా చేసుకోరాదు. ఎంత అన్యాయం! అమెరికా ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎక్కడెక్కిడికో వెళ్ళి దుష్టుల్ని సంహరించి ప్రపంచశాంతిని కాపాడుతుంది కదా! అటువంటి ఒక గొప్పదేశానికి - తన పౌరుడ్ని (వాడు నల్లవాడో తెల్లవాడో మనకనవసరం) చంపుకునే అధికారం, హక్కు వుండకూడదా? వుండాలి! వుండితీరాల్సిందే!!