Friday, 30 June 2017

గోరక్షక దాడులు ఆగేనా?


రాజ్యంగం ప్రకారం భారద్దేశం సెక్యులర్ దేశం. అనగా రాజ్యానికి అన్ని మతాలూ సమానమని అర్ధం. ఈ దేశంలో అనేక మతాలున్నయ్. ఒక్కో మతానికి ఒక్కో జంతువు పవిత్రం లేదా అపవిత్రం. ఇవన్నీ ఆయా మతాల్ని తుచ తప్పకుండా అనుసరించేవారి సమస్య. సామాన్య ప్రజలకి విద్య, వైద్యం, ఉద్యోగం మొదలైనవి సమస్య (ఇవి ఒకదానికి ఇంకోటి interchangeable కాదు). 

మొన్న సార్వత్రిక యెన్నికల్లో సంఘపరివార్ శక్తులు అధికారంలోకి వచ్చాయి (ఇందుగ్గానూ వారు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పాలనకి కృతజ్ఞులై వుండాలి). సంఘపరివార్‌కి ఈ దేశ ముస్లిములు శత్రువులు. ముస్లిముల్ని అణచడానికి వారికి దొరికిన చక్కని ఆయుధం 'గోరక్షణ'. ఇప్పుడు వారు చేస్తుంది - ఆవుగూర్చి విపరీతమైన హైప్ క్రియేట్ చెయ్యడం, గోరక్షక దళాల ద్వారా ముస్లిముల జీవించే హక్కు కాలరాయడం. ఈ వ్యవహారాలన్నీ పకడ్బందీ వ్యూహంతో నిరాటంకంగా అమలవుతున్న కుట్రపూరిత హత్యలు.

మన్ది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ప్రజలచే యెన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసమే పన్జెయ్యాలి, ప్రజలకి జవాబుదారీతనం వహిస్తూ పాలన సాగించాలి. మహమ్మద్ అఖ్లాక్ హత్య దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. కొన్ని నెలల నిశ్శబ్దం తరవాత గోరక్షకులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని తీవ్రంగా హెచ్చరించారు. గోరక్షకులు నేరస్తులనీ, వారి గూర్చి రాష్ట్రాల నుండి నివేదిక తెప్పిస్తామని సెలవిచ్చారు. ఆనాడు ప్రధానమంత్రి కఠినంగా మాట్లాడ్డంతో నేను చాలా సంతోషించాను. ప్రధాని స్థాయి వ్యక్తి తల్చుకుంటే ఈ గోరక్షక హత్యలు చిటికెలో ఆగిపోతాయని ఆశించాను.

యే దేశంలోనైనా, దేశాధినేత స్థాయి వ్యక్తి హామీ ఇచ్చాక, ఆ దిశగా కొన్ని చర్యలు మొదలవుతాయి. అందువల్ల ప్రధాని ప్రసంగం తరవాత కేంద్రం రంగంలోకి దిగాలి. శాంతిభద్రతలు రాష్ట్రాల సబ్జక్ట్ అయినప్పటికీ కేంద్ర హోమ్ శాఖ రాష్ట్రాలకి సూచన జారీ చేసే అధికారం వుంటుంది. గోరక్షకుల కదలిక పట్ల నిఘా, ప్రజాసంఘాల యేర్పాటు తదితర చర్యలతో కూడిన పలు సూచనల్ని కేంద్రం యివ్వొచ్చు. కానీ కేంద్ర హోమ్ శాఖ ఆ దిశగా యెటువంటి చర్యలూ తీసుకోలేదు, సహజంగానే రాష్ట్రప్రభుత్వాలూ పట్టించుకోలేదు. ఆ విధంగా ప్రధాని దేశప్రజలకి ఇచ్చిన హామీకి విలువ లేకుండా పోయింది.

ఇప్పుడు సబర్మతి ఆశ్రమంలో గోరక్షక ముఠాల హత్యల్ని ప్రధాని (మళ్లీ) తీవ్రంగా ఖండించారు. అందుగ్గానూ వారికి (మళ్లీ) ధన్యవాదాలు. అయ్యా! ఈ సారైనా మీ ఆగ్రహం నరహంతక గోరక్షక ముఠాల నిర్మూలనకి దారి తియ్యాలనీ, తద్వారా ఈ దేశంలో మరే యితర మూక దాడుల హత్యలు జరక్కుండా ఆగిపోవాలని కోరుకుంటున్నాను.

(fb post)