Sunday 4 June 2017

మీడియా దొంగాట

యుద్ధం పాశవికమైనది, మానవాళికి నష్టదాయకమైనది. అనాదిగా ఈ ప్రపంచం యుద్ధాలకి పరిహారాన్ని చెల్లించుకుంటూనే వుంది. చిన్నపాటి పొలంగట్టు తగాదాలే వైరిపక్షాలకి కోలుకోలేని దెబ్బ తీసేస్తాయి. రెండుదేశాల మధ్య తగాదాలు ఆ రెండుదేశాల అభివృద్ధిని అడ్డుకుంటాయి, తీవ్రసంక్షోభంలోకి నెట్టేస్తాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని యెన్నుకుంటారు. ప్రభుత్వం ప్రజల తరఫున, ప్రజల కొరకు పనిచెయ్యాలి. ప్రభుత్వం పనిచెయ్యడంలో తేడాలు రాకుండా ప్రజల పక్షాన నిలబడ ప్రశ్నించాల్సిన బాధ్యతాయుతమైన పాత్ర మీడియాది. 

ఇవ్వాళ దేశప్రజలకి చాలా ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలేదు, యెందుకు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, యెందుకు? విద్యారంగంలో లోపాలు సవరించుకోలేకపోతున్నాం, యెందుకు? నిరుద్యోగాన్ని తగ్గించలేకపోతున్నాం, యెందుకు? వినిమయ వస్తువుల ధరలు తగ్గట్లేదు, యెందుకు? ఈ 'యెందుకు?'కి సమాధానం దిశగా మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి. మీడియా తన బాధ్యతని యెందుకు విస్మరిస్తుంది? 

టీవీ చర్చలు - ఒకప్పుడు రాత్రిళ్ళు మాత్రమే జరిగేవి, ఇప్పుడు డైలీ సీరియల్స్‌లాగా రోజంతా కొనసాగుతున్నయ్! యెక్కువ శాతం యెడతెగని ఊకదంపుడు కాశ్మీర్ చర్చలే! పోనీ చర్చల్లో 'కాశ్మీర్ సమస్యని పరిష్కరించేందుకు కేంద్ర హోమ్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది? కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలేంటి?' అంటూ చర్చించరు. యెంతసేపటికీ - 'దేశద్రోహ హురియత్', 'రాళ్లు విసుర్తున్న ముష్కర మూకలు' వంటి చౌకబారు టాగ్ లైన్లతో రెచ్చగొట్టే కేకలే!

'పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి, యుద్ధం చెయ్యాలి, అవసరమైతే అణుబాంబు పేల్చాలి!' ఇట్లాటి భీభత్సమైన ఆలోచనల్తో మిలిటరీ నిపుణుల సలహాలు! 'యుద్ధం వద్దు' అంటే - ఆర్మీ నైపుణ్యాన్ని కించపరుస్తున్నావంటూ హేళన! ప్రస్తుతం మన టీవీ చానెళ్ల పరిస్థితి ఇదీ!

ప్రజల రోజువారీ సమస్యలకి వందోవంతు ప్రాధాన్యతనిస్తూ, సరిహద్దు సమస్యని వందరెట్లు పెద్దదిగా చూపిస్తున్న మీడియా విశ్వాసనీయత ఏంటి? ప్రభుత్వం 'అసలు' సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొన్ని నకిలీ సమస్యల్ని సృష్టిస్తుంది. మీడియా ఈ అప్రధాన నకిలీ వార్తలకి వత్తాసు పలకడంలో బయటకి కనపడని కోణం ఇంకేదైనా వుందా? అసలు ఇండియా కాశ్మీర్‌లో అంతర్భాగమా? కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమా? 

ఆదివారం పదినిమిషాలు టీవీ చూస్తేనే ఇన్నేసి ప్రశ్నలొస్తున్నయ్! ఈ ప్రశ్నలకే కాదు, యే ప్రశ్నలకీ సమాధానం చెప్పాల్సినవాళ్ళు చెప్పరు. మనం మాత్రం రోజువారీ మీడియా తమాషాని గుడ్లప్పగించుకుని చూస్తూనే ఉంటాం, ఇంతకన్నా దురదృష్టమేముంది!

(fb post 4/6/2017)

No comments:

Post a Comment