Friday 16 June 2017

సిన్మా లాజిక్

'సిన్మా ఎంజాయ్ చెయ్యాలంటే ప్రేక్షకుడు లాజిక్ అప్లై చెయ్యకూడదు' - వొప్పుకుంటున్నాను. కానీ లాజిక్‌ని అప్లై చెయ్యడం, చెయ్యకపోవడం ప్రేక్షకుడి చేతిలో వుండదని నా అభిప్రాయం. ఇక్కడ ప్రేక్షకుడు అంటే నేనే కనుక, నా సంగతే రాస్తాను.

నా లాజిక్ కండిషన్డ్‌గా, బయాస్డ్‌గా, సెలక్టివ్‌గా వుంటుంది. 

చార్లీ చాప్లిన్, రాజ్ కపూర్ సినిమాల్లో లాజిక్ నాతోపాటుగా (with rapt attention) సిన్మా చూస్తుంది. ఎన్టీఆర్, ఏయన్నార్ సిన్మాలకి నిద్రపోతుంది.  కె.రాఘవేంద్రరావు BA సినిమాలకి లాజిక్ హాల్లోక్కూడా రాదు, బయట క్యాంటీన్ దగ్గర తచ్చాడుతుంటుంది.

అందువల్ల నా లాజిక్ కొన్ని సిన్మాల్లో డాక్టర్ పేషంట్ పల్స్ చూసి 'కంగ్రాచ్యులేషన్స్! మీరు తల్లి కాబోతున్నారు' అంటే నవ్వేసుకుంటుంది, ఇంకొన్ని సినిమాల్లో అదే సీన్ వుంటే వొప్పుకోదు - కోపం తెచ్చుకుంటుంది.  

'అమర్ అక్బర్ ఆంథోని'లో ఒకేసారి ముగ్గురు హీరోలు తల్లికి రక్తదానం చేస్తారు. మన్మోహన్ దేశాయ్ సిన్మా కాబట్టి లాజిక్‌గాడు పట్టించుకోలేదు. ఇదే సీన్ యే శ్యామ్ బెనెగల్ సిన్మాలోనో వుంటే లాజిక్‌గాడు చిందులేసేవాడు. 

అలాగే -

అందరూ సిన్మాల్ని ఒకేరకంగా చూడరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దృష్టికోణం వుంటుంది. 'ఆకుచాటు పిందె తడిసె' పాటలో తడిసిన శ్రీదేవి కోసం ఆరుసార్లు సినిమా చూశా (భరించా)! నా క్లాసమ్మాయిలు 'అసలు 'వేటగాడు' ఆరుసార్లు చూసే సినిమానేనా?' అంటూ నన్ను విసుక్కున్నారు, వాళ్ళకెలా చెప్పేది? 

నాకు నచ్చిన ప్రేక్షకుడు -

నా చిన్ననాటి స్నేహితుడు మాతోపాటు అన్ని సినిమాలకీ వచ్చేవాడు, సిన్మా మొదలవ్వంగాన్లే నిద్రపొయ్యేవాడు. 'శుభం' కార్డు పడ్డాక లేపుకొచ్చేవాళ్ళం. శంకరాభరణం సిన్మాక్కూడా నిద్రపోయిన ఘనత నా స్నేహితుడిది. మరప్పుడు సిన్మాకెందుకు రావడం? 'స్నేహధర్మం' అని సమాధానం చెప్పేవాడు!  

(fb post)