Wednesday, 2 November 2011

డా.రావ్ కష్టాలు


ముప్పైయ్యేళ్ళ క్రితం గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీయస్ పట్టా పుచ్చుకున్నాడు డాక్టర్ రావ్.పి.పచ్చిపులుసు. పట్టాపై అతని పూర్తిపేరు పచ్చిపులుసు పిచ్చేశ్వరరావు అని ఉంటుంది. పిచ్చేశ్వర్రావు అత్యంత ప్రతిభాసంపన్నుడు, సునిశిత మేధోశాలి.

మన మాయదారి దేశం ఇంతటి ప్రతిభావంతుల్ని గుర్తించదు. కావున - మేధావులందర్లాగే మన పిచ్చేశ్వర్రావూ అమెరికా సంయుక్త రాష్ట్రాల వారి పంచన చేరాడు. అమెరికావాళ్ళు మనపేర్లని నిలువుగా చీల్చి, జరాసంధుని శరీరభాగముల్లాగా మళ్ళీ కలుపుతారు, అది వాళ్ళ ఆచారం. అంచేత మన పిచ్చేశ్వర్రావులో 'పిచ్చేశ్వర' మాయమైపోయింది. ఇప్పుడు పిచ్చేశ్వర్రావు, సారీ! రావ్.పి.పచ్చిపులుసు - మానసికరోగ వైద్యంలో నిపుణుడు.

మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించటం చేత అతనికి డబ్బంటే మొహం మొత్తింది. అతగాడు మానసిక రోగాల గూర్చి అనేక పరిశోధనలు చేసాడు, రాశాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సుల్లో, యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. అనేక ఎవార్డులు, రివార్డులు సాధించాడు. ఈవిధంగా డా.రావ్ ప్రశాంతంగా, ఆనందంగా జీవనం కొనసాగిస్తూ హాయిగా వున్నాడు. 

*                         *                                *                          *

ఇదంతా యెందుకు రాస్తున్నట్లు? విసుగ్గా వుంది.

లేదు లేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒకరోజు డా.రావ్ ఓ సభకి వెళ్ళాడు. అది ఒక అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు మహాసభ. అక్కడందరూ పట్టు పంచెలు, పట్టు చీరల్తో హడావుడి హడావుడిగా వున్నారు. ఆ వాతావరణం రావుని పరవశింపజేసింది. వారి ముద్దుముద్దు తెలుగు మాటలకి ఉత్తేజితుడైనాడు డా.రావ్.

డిప్పగుల కసిభూషణశర్మ కూనిరాగాల అవధానాన్ని అసాంతమూ ఆస్వాదించాడు, అవధులు దాటిన ఆనందంతో ఆనంద భాష్పాలు కార్చాడు. 

'నీ దేశం, నీ ఊరు, నీ తల్లి, నీ భాష పిలుస్తుంది.. రా! రా!' అంటూ ఒకే వాక్యాన్ని ఖండఖండాలుగా నరికుతూ, డప్పు కొడుతూ పూనకం వచ్చినవాళ్ళా ఫడేల్ ఫణీంద్ర అరిచాడు.. సారీ! పాడాడు. అతని కేకల్ని 'గజల్' అని అంటార్ట! ఆ అరుపుల్ని విని డా.రావ్ ఆవేశభరితుడైనాడు. తట్టుకోక మిసెస్ రెడ్డిని వాటేసుకుని బావురుమన్నాడు, పొరబాటు గ్రహించి లెంపలేసుకుని 'సారీ' చెప్పాడు.

ఆ సమావేశంతో డా.రావులో నూతనోత్తేజం ఉరకలెత్తింది.

"తెలుగుజాతి మనది, నిండుగా వెలుగుజాతి మనది." అంటూ ఆవేశంగా పాడుకున్నాడు.

"పుణ్యభూమి నా దేశం నమో: నమా!" అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

"మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. " అంటూ ఆనందపరవశుడయ్యాడు

*                          *                                  *                           *

ఇంటికేళ్ళంగాన్లే హడావుడిగా తన మదీయ మిత్రుడు, గుంటూరు మెడికల్ కాలేజ్ క్లాస్మేటూ అయిన వెంకట్రావుకి ఫోన్ చేసాడు.

"గుంటూరులో నేనో సైకియాట్రీ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను, ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి."

వెంకట్రావు ఎంబీబీఎస్‌తో చదువాపేశాడు. సొంతవూరైన గుంటూర్లోనే జనరల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

స్నేహితుని ప్రపోజల్‌కి ఆశ్చర్యపోయి - "తొందరపడకు... " అంటూ ఏదో చెప్పబోయ్యాడు.

"తొందరా! నథింగ్ డూయింగ్, ఇప్పటికే ఆలస్యమైంది. నా తెలుగుజాతి.. తెలుగుభాష.. తెలుగు గాలి.. తెలుగు నేల.. " అంటూ రోప్పసాగాడు డా.రావు.

వెంకట్రావుకి విషయం అర్ధమైంది. "అలాగే! సాధ్యమైనంత త్వరలో అన్ని ఏర్పాట్లు చేస్తాను, నువ్వు మాత్రం రోప్పకు." అన్నాడు.

*                              *                                 *                             *

చెప్పిన విధంగానే తక్కువ సమయంలోనే డా.రావ్ ఆస్పత్రి ఏర్పాట్లు పూర్తి చేశాడు వెంకట్రావు.

"ఎన్నాళ్ళో వేచిన ఈ ఉదయం" అని పాడుకుంటూ తట్టాబుట్టా సర్దుకుని గుంటూరు వచ్చేసాడు డా.రావ్.

భార్యాపిల్లలు 'ముందు నువ్వు తొందరగా వెళ్ళు, వెనక మేం నిదానంగా వస్తాం.' అని అక్కడే ఉండిపోయారు. మనసులో మాత్రం  'డటీ ఇండియా, డటీ పీపుల్.' అనుకున్నారు.

గుంటూర్లో ఆస్పత్రి ఓపెనింగ్ అట్టహాసంగా అద్దిరిపోయింది. సన్నాయి వాయిద్యం, వేదపండితులు, వేదమంత్రాలు.. చాలా హడావుడిగా జరిగింది. ఆనందాన్ని తట్టుకోలేక వెంకట్రావుని పట్టుకుని భోరున ఏడ్చేశాడు డా.రావ్, స్నేహితుణ్ని జాలిగా చూస్తూ ఓదార్చాడు వెంకట్రావు.

(డా.రావ్ పరిచయం పూర్తయింది. ఇక నుండి ప్రాక్టీస్ కబుర్లు)

(picture courtesy : Google)