Saturday 26 November 2011

శ్రీరామరాజ్యం


"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు. 



టీవీలో బాపు 'శ్రీరామరాజ్యం' కమర్షియల్ నడుస్తుంది. 

టీవీ వైపు చూస్తూ "ఈ బాపుకి ఎంత ఓపిక! అరిగిపోయిన రికార్డులా రామాయణాన్ని తీస్తూనే ఉన్నాడు గదా!" అన్నాడు సుబ్బు.

"ఓపికుంది, తీస్తున్నాడు. మనకెందుకు చెప్పు!" నవ్వుతూ అన్నాను.

"నాకు తెలుగు సినిమా దర్శకుల్ని చూస్తుంటే హోటల్లో అట్టుమాస్టర్లు గుర్తొస్తారు. మన ఆనందభవన్లో అట్టు మాస్టర్ ముత్తు గుర్తున్నాడా? నలభయ్యేళ్ళుగా అట్లు పోస్తున్నాడు. మనిషి కాలిన పెనంలా, ఎండిపోయిన చుట్టలా వుంటాడు. దించిన తల ఎత్తకుండా దీక్షగా బుల్లిగిన్నెలో పిండి తీసుకుని పల్చగా, గుండ్రంగా అట్లు పోస్తూనే ఉంటాడు." అన్నాడు సుబ్బు.

"అవును, అయితే?" 

"ముత్తు అట్లకాడతో స్టీలు మగ్గులోంచి నూనె అట్టుమీదకి జల్లటం ఎంతో కళాత్మకంగా వుంటుంది! పిండిచెయ్యిని నీళ్ళబొచ్చెలో ముంచి - కొన్నిట్లో బంగాళదుంప మసాలా, కొన్నిట్లో ఉల్లిపాయలు గుప్పిటతో ఎంతో పొందికగా పెడతాడు. మళ్ళీ నూనెని అట్లకాడతో ఇంకోరౌండ్ జల్లి, అట్టుని లాఘవంగా చుట్టి పక్కనున్న పెద్ద సత్తుప్లేట్ మీద పెట్టి, అట్లకాడతో టకటకమంటూ శబ్దం చేస్తాడు. ఆ టకటక - 'ఆర్డర్ రెడీ!' అని సర్వర్‌కి తెలియజేసే కోడ్." అన్నాడు సుబ్బు.

"విషయానికి రా." విసుక్కున్నాను.

"వస్తున్నా! వస్తున్నా! అట్లు పోయ్యటంలో గొప్ప ప్రతిభాశీలి అయిన ముత్తుకి ఇడ్లీలు వెయ్యడం రాదు! పొద్దస్తమానం అట్లుపోస్తూ, పక్కనే ఉండే ఇడ్లీమాస్టర్‌తో కబుర్లాడుతుంటాడు, కానీ ముత్తుకి ఇడ్లీ గూర్చి తెలీదు!" అన్నాడు సుబ్బు. 

"అవునా?!" ఆశ్చర్యపొయ్యాను. 

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు - "తెలుగు సినిమారంగం 'ముత్తు'ల మయం!"

"యెలా?" ఆసక్తిగా అడిగాను.  

"విఠలాచార్య ఒకేరకమైన సినిమాలు పుంజీలకొద్దీ తీశాడు. అన్నిసినిమాల్లో అవే గుర్రాలు, అవే కత్తులు! హీరో యెవరైనా - పులులు, పిల్లులు, కప్పలు మాత్రం రెగ్యులర్ ఆర్టిస్టులు. ఆయన జానపద సినిమాలు అనే 'అట్లు' పోసీపోసీ కీర్తిశేషుడయ్యాడు." అన్నాడు సుబ్బు.

"అవును, ఆయన్ని 'జానపద బ్రహ్మ' అంటారు." అన్నాను.

"కె.ఎస్.ఆర్.దాస్ లెక్కలేనన్ని 'డిష్షుం డిష్షుం' సినిమాలు తీశాడు. ఆయన దగ్గర ఇంకా పిండి మిగిలే ఉంది. కానీ - ఆయన అట్లు తినడానికి ప్రేక్షకులు అనే కస్టమర్లు మాయమయ్యారు, అంచేత నేచురల్‌గానే నిర్మాత అనే పెనం దొరకలేదు."

"అవును, ఆయన సినిమాల్ని ఫైటింగుల్తో చుట్టేశాడు!" అన్నాను.

"ఇంక రాంగోపాల్ వర్మ! గాడ్‌ఫాదర్ సినిమాని తిరగేసి తీశాడు, బోర్లించి తీశాడు, మడతపెట్టి  తీశాడు, చితక్కొట్టి తీశాడు, పిసికి పిసికి తీసాడు, ఉతికి ఉతికి తీశాడు! ఒకే పిండి, ఒకే అట్టు. రకరకాలుగా పేర్లు మార్చి కస్టమర్లని మోసం చేస్తుంటాడు."

"ఒప్పుకుంటున్నాను." నవ్వుతూ అన్నాను.

"బాపు రమణల స్పెషాలిటీ 'రామాయణం' అనే దోసెలు. రమణ మెత్తగా పిండిరుబ్బి బాపుచేతికి అందిస్తే, బాపు గుండ్రంగా అట్టు పోసేస్తాడు. ఒకసారి ముత్తుని - అట్టు కొంచెం పెద్దదిగా, స్పెషల్‌గా వెయ్యమని అడిగాను. మొహం చిట్లిస్తూ 'నా వల్లకాదు! చెయ్యి వణుకుద్ది, వాటం కుదరదు.' అని విసుక్కున్నాడు ముత్తు."

"నిజమా!" ఆశ్చర్యపోయాను.

"అవును. మలయాళ దర్శకుడు అరవిందన్ ఆంధ్రా అడవుల్లో చెంచుదొరల్తో 'కాంచనసీత' అనే సినిమా కొత్తదనంతో వెరైటీగా తీశాడు. కొత్తరకంగా ఆలోచించాడని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. కానీ - బాపురమణలు ముత్తుకి సోదరులు, కొత్తఐడియాలు వచ్చే అవకాశం లేదు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో, కానీ - బాపు రమణలు ప్రతిభావంతులు." అన్నాను.

"కాదని నేనన్లేదే! కానీ నువ్వో విషయం గ్రహించాలి. దోసెలన్నీ ఒకటే. అట్లే వృత్తులన్నీ ఒక్కటే. నీ వైద్యవృత్తి క్షురకవృత్తి కన్నా గొప్పదేమీకాదు. కానీ మనం కొన్ని ప్రొఫెషన్లకి లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. అలాగే విఠలాచార్య, కె.ఎస్.ఆర్.దాస్, వర్మ, బాపురమణలు ఒకేగొడుగు క్రిందకొస్తారు. కానీ మనం దేవుడి సినిమాలు తీసేవాళ్ళనే గొప్పవారంటాం. ఇక్కడ మతవిశ్వాసాలు కూడా ప్లే చేస్తాయి." అన్నాడు సుబ్బు.

"నీ ఎనాలిసిస్ బాగానే ఉంది. మరి 'శ్రీరామరాజ్యం' చూడవా?" అడిగాను.

"ఆ సినిమా తీసింది కుర్రాళ్ళ కోసం. మన్లాంటి ముసలాళ్ళ కోసం ఎన్టీరామారావు 'లవకుశ' ఉందిగా!" అన్నాడు సుబ్బు.

"బాపురమణలు తెలుగువాళ్లవడం మన అదృష్టం." నేనివ్వాళ సుబ్బుని ఒప్పుకోదల్చుకోలేదు.

"నేను మాత్రం కాదన్నానా? బాపురమణలకి రామాయణమే జీవనాధారం. అదే కథని నలభయ్యేళ్ళుగా నమ్ముకున్నారు. రామాయణాన్ని తీసేవాడు దొరక్కపొతే ఆ కథకే ప్యాంటూ, చొక్కా తొడిగి సోషల్ పిక్చర్లు చుట్టేశారు.. రామకోటి రాసినట్లు!"

"ఈ విషయం ఇంకెక్కడా అనకు, వాళ్ళ భక్తులు తంతారు." నవ్వుతూ అన్నాను.

సుబ్బు కాఫీ తాగటం పూర్తిచేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు.

"వాళ్ళకి ఫైనాన్స్ చేసేవాడు దొరికాడు, నటించేవాడూ దొరికాడు. అట్టు పోసేశారు. ఇష్టమైనవాడు చూస్తాడు, లేపోతే లేదు. ఎవడి గోల వాడిది. ఉప్మాపెసరట్టు అందరికీ నచ్చాలని లేదుకదా." అన్నాడు సుబ్బు.

"మొత్తానికి నీ అట్టు థియరీ బాగానే వుంది." నవ్వుతూ అన్నాను.

"థాంక్యూ! ముత్తు అట్లు పోస్తూనే ఉన్నాడు, బాపురమణలు రామాయణం తీస్తూనే వున్నారు!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు. 

(updated & posted in fb on 1/2/2018)