Thursday, 17 November 2011

నేను మేధావినే.. నా?

టీవీలో ఏదో చర్చాకార్యక్రమం, తీవ్రమైన వాదన నడుస్తుంది. పాయింటు లేకుండా అరుచుకునే ప్రోగ్రాం చూసే ఓపిక లేదు నాకు. ఇవ్వాళ అనుకోకుండా కొద్దిసేపు ఒక చర్చ చూశాను. వారిలో ఒక వ్యక్తి నా దృష్టిని ఆకర్షించాడు. అతగాడు - కొద్దిగా పెరిగిన గడ్డం, ఇంకొద్దిగా నెరిసిన తల, భుజం మీద ఉన్నిశాలువా.. ఒక యాంగిల్లో అక్కినేని టైపు భగ్నప్రేమికుళ్ళా వున్నాడు. ఆయన ఆంధ్రా మేధావుల సంఘానికి అధ్యక్షుడట!

'మేధావుల సంఘం' - పేరెంత సెక్సీగా ఉంది! ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్న ఈరోజుల్లో మేధావిగా గుర్తింపు పొందటం చాలా కష్టం. దానికి ఎంతో మేధస్సూ, మరెంతో కృషి అవసరం. ఇవన్నీ లేకుండా కేవలం ఒక సంఘసభ్యుడిగా చేరి మేధావిగా మారిపోవటం ఎంత సులభం, ఎంత సుఖం! అర్జంటుగా నేనూ ఈ సంఘం సభ్యుడిగా చేర్తాను, మేధావిగా రెడీమేడ్ కీర్తి సంపాదిస్తాను.

డాక్టర్ల సంఘం, ఆటోడ్రైవర్ల సంఘం అంటూ వృత్తి సంఘాలున్నాయ్. ఆర్యవైశ్య సంఘం, కమ్మ సంఘం అంటూ కులసంఘాలున్నాయ్. ఈ సంఘాల్లో చేరాలంటే అర్హత గూర్చి పేచీ లేదు. అయితే మేధావుల సంఘం అనంగాన్లే ఇబ్బంది వస్తుంది. 'నువ్వు మేధావివి కాదు' అంటే ఎవరూరుకుంటారు?

సర్లే! ఏదోకటి. నేను మేధావినా కాదా అన్న మీమాంస నాకేలా? అదేదో సభ్యత్వం ఇచ్చేవాళ్ళు నిర్ణయించుకుంటారు. నా ఎమ్డీ సర్టిఫికేట్ కాపీ జేబులో కుక్కాను. నాకు బుర్ర తక్కువ అని డౌటొచ్చినప్పుడల్లా ఈ సర్టిఫికేట్ నన్ను కాపాడుతుంది (పేరు పక్కన ఎమ్డీ ఉన్నంత మాత్రాన బుర్ర ఎమ్టీ కాకూడదని లేదులేండి). ఎందుకైనా మంచిదని నా ఎంబీబియ్యెస్ సర్టిఫికేట్ కాపీ కూడా తీసుకున్నాను. సమాజంలో కొందరికి ఎమ్డీ కన్నా ఎంబీబియ్యెస్ ఎక్కువన్న అభిప్రాయం ఉంది. ఎంతైనా రెండక్షరాల కన్నా నాలుగక్షరాలు ఎక్కువ కదా!

తీరా బయల్దేరే ముందు డౌటొచ్చింది. ఆంధ్రా మేధావుల సంఘం వాళ్ళు 'మాక్కావాల్సింది నీ మేధావిత్వం, సర్టిఫికెట్లు కాదు.' - అంటే! మేధావిత్వానికి వాళ్ళదగ్గర వున్న కొలబద్ద యేంటి? జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారా? మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? తెలీదు. మెక్సికో రాజధాని చెప్పు? అస్సలు తెలీదు! పేపర్ లీకైతే బాగుణ్ణు. తలకి మిషన్లూ గట్రా తగిలించి మీటర్ రీడింగ్ తీస్తారా? వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, అవన్నీ నాకెందుకు? నేను మాత్రం ఇవ్వాళ ఖచ్చితంగా మేధావుల సంఘంలో చేరబోతున్నాను, దట్సాల్!

ఇంతలో మస్తిష్కంలో మెరుపు మెరిసింది (అంటే గొప్ప ఐడియా వచ్చిందని అర్ధం). మనగూర్చి మనం చెప్పుకునేకన్నా ఎదుటివారితో చెప్పిస్తేనే గదా వేల్యూ! పైగా ఇది నాకు చాలా సులువైన పని కూడా. నేను మేధావినని వెయ్యిమందితో చెప్పించగలను.

అప్పటికే లేటయ్యిందని హడావుడిగా ఆస్పత్రికి వెళ్తున్న నా భార్యని ఆపి అడిగాను - "ఈ లెటర్ తీసుకొచ్చినవాడు మేధావి అని ఒక సర్టిఫికేటివ్వు."

సందేహం లేదు, గవర్నమెంట్ డాక్టర్ కావున నా భార్య సర్టిఫికేట్ బ్రాండెడ్ సిమెంటంత స్ట్రాంగ్‌గా వుంటుంది. నా భార్య నాకేసి ఎగాదిగా చూసింది, ఒక్కక్షణం ఆలోచించింది - "సారీ! నేను దొంగ సర్టిఫికెట్లివ్వను." అంటూ వెళ్ళిపోయింది.

హతాశుడనయ్యాను. ఎంత అవమానం! కొంచెం కళ్ళు తిరిగినట్లనిపించింది. చరిత్రలో ఏ భర్తకీ భార్య చేతిలో ఇంత అవమానం జరక్కూడదు. ఈ అవమాన భారం భరింపలేను. 'ఎవరక్కడ? చితి పేర్పించండి'.

"సార్! స్విచ్చిలన్నీ మార్చేశాను. ఇంక మీకు ఇబ్బందుండదు."

నిదానంగా తల పైకెత్తి చూశాను. ఎదురుగా ఎలెక్ట్రీషియన్ నిలబడున్నాడు. మస్తిష్కంలో మళ్ళీ మెరుపు (మళ్ళీ ఇంకో గొప్ప ఐడియా)! సొంతభార్య సర్టిఫికేట్‌కి విలువేముంది? ఈ శ్రామికవర్గ ప్రతినిధితో సర్టిఫికేట్ తీసుకుంటే తిరుగేముంది?

"సర్లే! ఈ కాయితం మీద నేను తెలివైనవాణ్ణని రాసి సంతకం పెట్టు."

ఎలెక్ట్రీషియన్ సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు - "ఆ విషయం నాకు తెలుసు సార్!"

"అవును కదా! ఆ సంగతే రాసివ్వు." విసుగ్గా అన్నాను.

"నేను తెలివైనోణ్ణని నేనే రాసుకుంటే ఏం బాగుంటుంది సార్!" మళ్ళీ సిగ్గు, మెలికలు.

"నేనన్నది నీగూర్చి కాదు, నాగూర్చి! ఈ డాక్టర్ గొప్పమేధావి అని రాసి సంతకం పెట్టివ్వు."

సిగ్గు మాయమైంది - "అదేంటి సార్! అట్లెట్లా రాసిస్తా. నేను రాయలేను."

"అంటే నాకు నీఅంత తెలివి లేదంటావా?" కోపంగా అడిగాను.

"సార్! మీరు పెద్దవారు, ఏమనుకోకండి. మిమ్మల్ని రెండేళ్ళనించి చూస్తున్నాను. మీకు చోక్ అంటే తెలీదు, స్టార్టర్ అంటే అర్ధం కాదు. కనీసం యే స్విచ్చి దేనికో కూడా గుర్తుండదు." అంటూ జారుకున్నాడు.

ఆరి దుర్మార్గుడా! ఇన్నాళ్ళు నువ్వు నన్నో బుర్ర తక్కువ్వాడిగా అనుకుంటున్నావా! నాకు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తల దిమ్ముగా వుంది, నీరసంగా సోఫాలో కూలబడ్డాను.

"సార్! కాఫీ." అంటూ టీపాయ్ మీద కాఫీకప్పు పెట్టింది వంటమనిషి. అమ్మయ్య! నా బాధ వెళ్ళబోసుకొటానికో మనిషి దొరికింది. ఆ వంటావిడ నాకు నా పగిలిన గుండె అతికించుకునేందుకు దొరికిన ఫెవికాల్ గమ్ములా కనబడింది.

"చూడమ్మా! నేను మేధావినేనా? కాదా?"

ఆవిడ ఇబ్బందిగా మొహం పెట్టింది - "మేధావి అంటే ఏంటో నాకు తెలీదు."

ఈ వంటమనిషి నాపై గల అపార గౌరవంతో మాట్లాడ్డానికి మొహమాట పడుతున్నట్లుంది. అవును మరి! ఆమె భర్తకి వైద్యం చేసి తాగుడు మాన్పించాను, మొన్నామధ్యనే జీతం పెంచాను.

అంచేత కృతజ్ఞతా భారంతో ఒంగిపోతూ - 'మీరు దేవుళ్ళాంటోరు సార్! ఈ ప్రపంచంలో మీకన్నా గొప్ప మేధావి ఎవ్వరూ లేరు.' అని పొగడొచ్చు. కానీ నాకు పొగడ్తలు గిట్టవు. అందుకే -

"చూడమ్మా! నన్ను పొగడకు. నీ మనసులో మాట ఉన్నదున్నట్లు నిర్మొహమాటంగా చెప్పెయ్!" అన్నాను.

వంటావిడ బెరుకుగా - "తప్పుగా మాట్లాడితే మన్నించండి! ఎన్నోఏళ్ళుగా మీ ఇంట్లో పన్జేస్తున్నాను. మీరు చాలా మంచివారు, అమాయకులు. కానీ మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలీదు. పూరీ కూరకీ, చపాతి కుర్మాకీ తేడా తెలీదు. పొద్దస్తమానం యేదో ఆలోచిస్తూ పరధ్యానంగా వుంటారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మేడంగారు లేకపోతే మీకు చాలా కష్టం సార్!" అని అంటుండగా -

నాకు స్పృహ త... ప్పిం.... ది.

ఉపసంహారం :

గౌరవనీయులైన పాఠకులకి నమస్కారం!

ఈ రాతలు రాస్తున్నవాడికి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. వున్నట్లుండి 'నేను మేధావిని, నేను మేధావిని.' అంటూ ఎగిరెగిరి పడుతున్నాడు. వైద్యశాస్త్రంలో ఇదో అరుదైన కేసుగా డాక్టర్లు భావిస్తున్నారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జంటూ అయితే మళ్ళీ తన రాతలతో మిమ్మల్ని హింసిస్తాడని హామీ ఇస్తున్నాం, సెలవు.