Sunday 20 November 2011

కొడవటిగంటి కుటుంబరావు 'ఐశ్వర్యం'


"మనమంతా సంకేతాలని పట్టుకుని బతుకుతాం. భగవంతునిపై భారం వేసి వాళ్లకి ఒక గుడో, అందులోఉండే విగ్రహమో, ఒక పటమో సంకేతం. మనిషి యొక్క కొనుగోలుశక్తికి సంకేతం డబ్బు. సంకేతాల వెనక ఉండే వాస్తవ విషయాన్ని అర్ధం చేసుకున్నవాణ్ని సాధారణంగా లోకం అర్ధం చేసుకోదు." 

కొడవటిగంటి కుటుంబరావు 'ఐశ్వర్యం' నవలలో డాక్టర్ కనక సుందరం ద్వారా ఈ మాటలు చెప్పిస్తాడు. 

మానవసంబంధాల్లో డబ్బుపాత్ర చాలా ముఖ్యమైనది. డబ్బు మూలంగా కొన్ని సంబంధాలు బలపడవచ్చు. కొన్ని తెగిపోవచ్చు. ఈ డబ్బు (ఐశ్వర్యం)ని మూలఅంశంగా తీసుకుని మానవసంబంధాలని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన ఐశ్వర్యం తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైనది.

ఈ నవలలో ప్రధాన పాత్రలు నాలుగు.

1.నరసింహం : లాయరు. బెజవాడలో ప్రాక్టీస్ చేస్తూ బాగా డబ్బు గడించాడు. డబ్బే ఒక మనిషి విలువని నిర్ణయిస్తుందని నమ్మిన వాడు.

2.డాక్టర్ కనక సుందరం : లాయర్ నరసింహం కొడుకు. ప్రజలకి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో డాక్టర్ అయిన ఆదర్శవాది. ఈపాత్ర రచయిత వాయిస్ కూడా.

3.కనక సుందరం కూతురు నర్సు (నరసమ్మ) : తండ్రి ఆదర్శభావాలనీ, నిరాడంబర జీవితాన్నీ మౌనంగా అనుసరిస్తుంటుంది. కానీ కూతురుకి తన జీవనవిధానం పట్ల ద్వేషం ఉందన్న విషయం డాక్టర్ కనకం తెలుసుకోలేకపోతాడు.

4.సూర్యం : డాక్టర్ దగ్గరకి పేషంటుగా వెళ్లి.. ఆయన ప్రభావానికి లోనై.. స్నేహితుడుగా ఉంటూ.. మధ్యలో మిస్టర్ నర్సుగా  (నర్సు భర్తగా) మారిపోతాడు. ఈ నవలలో 'నేను' అంటూ సూర్యం వైపు నుండి కధనాన్ని నడిపిస్తాడు కుటుంబరావు.

ఈ నాలుగు ప్రధానపాత్రల ద్వారా కుటుంబరావు తను చెప్పదలచుకున్న విషయాన్ని తనదైన సింపుల్ స్టైల్లో చెప్పేస్తాడు. డబ్బే ప్రధానంగా భావిస్తూ లక్షలు గడించిన తండ్రంటే కొడుక్కి ఎలర్జీ. డబ్బు సంపాదించటం చేతకాక.. తన ఐశ్వర్యాన్ని అసహ్యించుకుంటున్నాడని కొడుకంటే తండ్రికి ద్వేషం. ఈ ప్రపంచంలో డబ్బు విలువని గుర్తించని వాడెవడూ మనిషి కాదని నరసింహం నమ్మకం. కొడుకు విలువలని ఈసడించుకుంటాడు. ఈయన బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీని ఇష్టపడతాడని సూర్యం పాత్ర ద్వారా వెక్కిరిస్తాడు కుటుంబరావు (ఇది నాకు భలే నచ్చింది). 

వృద్ధాప్యంలో, ఒంటరితనంతో తన మనమరాలైన నర్సుని చేరదీస్తాడు. నర్సులో తాత గుణమే ఉంది. తండ్రి నిరాడంబర ప్రపంచంలోంచి ఐశ్వర్యంలోకి వచ్చి పడటంతో మనకి అసలు నర్సు కనపడుతుంది. ఏ డబ్బయితే తండ్రీ కొడుకుల్ని వేరుచేస్తుందో.. అదేడబ్బు తాతామనమరాళ్ళని కలుపుతుంది. డబ్బుకున్న శక్తీ, మానవసంబంధాలపై దాని ప్రభావం ఆద్యంతమూ చర్చించిన నవల 'ఐశ్వర్యం'.

కుటుంబరావు శైలి గూర్చి వందలమంది వేలసార్లు రాశారు. ఆయన శైలి ఒక జర్నలిస్టిక్ స్టైల్లో ఉంటుంది. స్వచ్చమైన బిస్లరీ వాటర్ తాగుతున్న భావన కలుగుతుంది. సంభాషణలు బాగా తక్కువ. ఒక క్లిష్టమైన సబ్జక్ట్ ఎంచుకుని చందమామ కథలా సింపుల్ గా రాసి పడేయటం అబ్బురపరుస్తుంది. కుటుంబరావు రచనల్లో సమాజంపై డబ్బు ప్రభావం చాలాసార్లు చర్చించబడింది. కానీ.. డబ్బునే ప్రధాన అంశంగా తీసుకుని రాయటం వల్ల 'ఐశ్వర్యం' విశిష్టమైనది.

కుటుంబరావు ఒక మంచికథని రాసేద్దామనే ఉద్దేశ్యంతో రాసిన రచయిత కాదు. తన రాజకీయ ఫిలాసఫీని చెప్పటానికి కల్పనా సాహిత్య (ఫిక్షన్) ప్రక్రియని ఎన్నుకోన్నాడు. విషయాన్ని బొమ్మల భారతంలా, చందమామ కథలా సరళీకరణ చేస్తూ సగటు తెలుగు పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించినవాడు. నాకు కుటుంబరావు సాహిత్యం చదువుతుంటే చిన్నప్పటి లెక్కల మాస్టర్లు గుర్తొస్తారు. ఫైవ్ పండిట్స్ గైడ్లూ గుర్తుకొస్తాయి. మనని ఆలోచింపచెయ్యటమే ఆయన రచనల ఉద్దేశ్యం. ఆపనిలో విజయవంతమయ్యాడు కాబట్టే ఈనాటికీ ఆయన రచనలు సుప్రసిద్ధం.

రావిశాస్త్రి దగ్గర గుంపులుగా కనబడే సిమిలీలు కుటుంబరావు దగ్గర వెతికినా కనబడవు.. తను చెప్పదలచుకున్న విషయం తప్ప. నాలాంటివాడిని దృష్టి లో ఉంచుకుని కొన్ని సిమిలీలు (వల్లంపాటి వెంకటసుబ్బయ్య రావిశాస్త్రి శిల్పచాతుర్యాన్ని ఒక బలహీనతగా విమర్శించినా.. నామిని రావిశాస్త్రిని నిందించినా నేను పట్టించుకోను) రాస్తే బాగుండుననిపిస్తుంది. కానీ కుటుంబరావు ఒక లెక్కల మాస్టారు, పొదుపరి. స్టెప్పులు లెక్కేసుకుని, ఆన్సర్ తెప్పించేసి విషయాన్ని ముగించేస్తాడు. అందుకే ఆయన కుటుంబరావయ్యాడు!

డాక్టర్ కనక సుందరం తండ్రి గూర్చి చెబుతూ "మానాన్న రకంవాళ్ళు నాకు బాగా తెలుసు. వాళ్ళు తము నమ్మే ప్రతిదీ ఉద్యమం అనుకుంటారు. తమతో ఏకీభవించనివారితో కత్తి కడతారు. మానాన్నను మెప్పించటానికో, ఆయన డబ్బు కోసమో నేను కూడా ఇర్రేషనల్ గా ఉండనా? ఒకడి పెళ్ళాన్ని చాటుగా ప్రేమించటం సాధ్యమైనప్పుడు, ఒక వితంతువును బహిరంగంగా ప్రేమించటం ఎందుకు అసాధ్యం కావాలి?" అంటాడు. 

డాక్టర్ కనకం తన నిరాడంబర జీవితం గూర్చి మాట్లాడుతూ భాసుడి చారుదత్తం నాటకాన్ని ఉదహరిస్తాడు. సాహిత్యం గూర్చి ఖచ్చితమైన అభిప్రాయాలు చెబుతాడు. "మన సమాజంలో కిందతరగతులవాళ్ళు పుస్తకాలు చదవరు. వాళ్ళ వాస్తవజీవితానికి అనుగుణమైనదేదీ సాధారణంగా పుస్తకాలలో వుండదు."

ఈ నవల మొదటిసారి చదివినప్పుడు (తెలుగు వారపత్రికల్లో ప్రచురితమయ్యే కథల flat characters కి అలవాటు పడినందువల్ల) నాకు నర్సు ప్రవర్తన అర్ధం కాలేదు. నా ఆత్మయ మిత్రుడు డా.శరత్, నేనూ కలిసి తెల్లవార్లూ కాఫీలు, సిగరెట్లతో ఆలోచిస్తేగానీ విషయం బోధపళ్ళేదు. 

శరత్ కి సూర్యం ('నేను' క్యారెక్టర్) అంటే ఇష్టం. శుభ్రంగా కనకం సాహిత్యాభిమానాన్నీ, నరసింహం ఐశ్వర్యాన్నీ ఎంజాయ్  చేశాడని! శరత్ సరదాగా అనేవాడు కుటుంబరావు చాలా డేంజరస్. ప్రశాంతంగా కనబడే కోనేరు లాంటివాడు. కాని తాడిచెట్టంత లోతయినవాడని. అప్పుడు వెంటనే నేను 'రావిశాస్త్రి అలలతో అల్లకల్లోలంగా ఉండే మహాసముద్రం' అనేవాణ్ణి.

కేతు విశ్వనాథ రెడ్డి (అద్భుత) సంపాదకత్వాన విశాలాంధ్రా వాళ్ళు ప్రచురించిన తరవాత (దాదాపు) ముప్పైయ్యేళ్ళకి 'విరసం'వారు కృష్ణాబాయి, చలసాని ప్రసాద్ సంపాదకత్వంలో కుటుంబరావు సాహిత్యాన్ని ఇప్పుడు (ఇంతకుముందే ఎందుకు చేయలేదబ్బా!) వెలువరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎనిమిది సంపుటాలు వెలువడ్డాయి. 'ఐశ్వర్యం' తొమ్మిదో సంపుటం లో ఉండొచ్చు (విరసంవాళ్ళు రచనాకాలాన్ని ఆధారం చేసుకుని సంపుటాలు పబ్లిష్ చేస్తున్నారు).

(photo courtesy : Google)

No comments:

Post a Comment