Tuesday 1 November 2011

అయ్యా! పిల్లలు గలోణ్ణి


అది దర్శకేంద్రుడు తీస్తున్న లేటెస్టు సినిమా షూటింగు. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి లారీలు. లారీల్నిండా యాపిల్సూ, ద్రాక్షాలు, బంతిపూలు! ఒక లారీలోంచి ప్రొడ్యూసర్ కనకారావు బామ్మర్ది అడావుడిగా "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

దర్శకేంద్రులవారు గడ్డం నిమురుకుంటూ తీస్తున్న వర్షం పాట గూర్చి ఆలోచిస్తున్నారు. ప్రొడ్యూసర్ కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకేంద్రుడు మళ్ళీ గడ్డం నిమురుకుంటూ "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు ఈరోయిన్ బొడ్డుమీద ద్రాక్షాకాయ గుత్తులు, పొట్టమీద యాప్లీసు కాయలు, చెస్ట్ మీద బంతిపూల సీన్లు తియ్యాలకదండీ. మీరు రోడ్డుమీద దొర్లించటానికి మూడులోడ్లు బత్తాకాయలు ఎనకమాల వత్తన్నాయండి." అన్నాడు కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.


అది దర్శకరత్న తీస్తున్న లేటెస్టు సినిమా షూటింగ్. ఓ పక్కగా కూర్చుని రీముల కొద్దీ డైలాగులు రాస్తున్నాడు దర్శకుడు. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి లారీలు. లారీల్లో పాడె, కుండ, బొగ్గులు, తెల్లగుడ్డ! ఒక లారీలోంచి ప్రొడ్యూసర్ కనకారావు బామ్మర్ది అడావుడిగా "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

దర్శకరత్న హెవీగా ఆలోచిస్తూ హెవీ సీన్నొకదాన్ని రాస్తూనే వున్నాడు. ప్రొడ్యూసర్ కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకుడు తల పైకెత్తి - "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు శవాన్ని మోసే సీను తీస్తారుగా! ఇంతకీ శవాన్ని కూర్చోపెట్టి స్నానం చేయిస్తారా? పడుకోబెట్టా? శోకాలు పెట్టటానికి వందమంది సరిపోతారా? శవాన్ని దహనం చేసే సీనుకి ఒకలారీ కట్టెలు చాలా?" అనడిగాడు కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.


అది కళాతపస్వి తీస్తున్న లేటెస్టు సినిమా షూటింగ్. తియ్యాల్సిన సీన్ గూర్చి కెమెరామెన్ తో చర్చిస్తున్నాడు తపస్వి. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి లారీలు. లారీల్లో పట్టుచీరలు, పట్టుపంచలు, పసుపు కుంకుమలు, వీణ, ఫ్లూటు, గజ్జెలు! ఒక లారీలోంచి ప్రొడ్యూసర్ కనకారావు బామ్మర్ది అడావుడిగా "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

ప్రొడ్యూసర్ కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకుడు ఆశ్చర్యంగా - "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు వీణ పాట, గజ్జెల డ్యాన్సింగులు తీస్తారుగా! ఇంతకీ హీరో గుడ్దోడా? హీరోయిను గుడ్డిదా? ఎవరైతే నాకెందుకులేండి! పూజార్లు ఎనకాల లారీలో వస్తన్నార్లెండి. ఆళ్ళు సరిపోకపోతే మా బామ్మర్దిని మళ్ళీ పంపాల." అన్నాడు కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.


కనకారావు ఆవిధంగా పెద్దదర్శకులతో హిట్లూ మరియూ ఫట్లూ తీసి, వార్ధక్య కారణమున విశ్రాంతి తీసుకొనసాగెను. ఇప్పుడు కనకారావు కొడుకు జూ.కనకారావు సినిమాలు తీస్తున్నాడు. మరిప్పుడు అతగాడేం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు?

అది తెలుగు సినిమాల ఫ్యాక్షనిస్టు దర్శకుడి లేటెస్టు సినిమా షూటింగ్. ప్రోడ్యూసర్ మన జూ.కనకారావు. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి రెండొందల సుమోలు. ఒక సుమోలోంచి జూ.కనకారావు బామ్మర్ది "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

ప్రొడ్యూసర్ జూ.కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకుడు మొహమాటంగా - "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు సుమోలు గాల్లోకి లేపుతారుగా! ఇవి చాలకపోతే ఇంకా తెప్పిస్తా, బడ్జెట్ గూర్చి ఆలోచించమాకండి." అన్నాడు జూ.కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు జూ.కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.

(picture courtesy : Google)