Saturday, 12 November 2011

అమ్మ.. నేను.. కొన్ని పెళ్ళికబుర్లు


అమ్మయ్య! చిరంజీవి కొడుక్కి పెళ్ళి కుదిరిందిట, ఆనందమానందమాయే! ఇంక నాక్కొన్నాళ్ళు రిలీఫ్! థాంక్స్ టు తెలుగు టీవీ చానెల్స్.

ఏవిఁటీ అర్ధంపర్ధం లేని రాతలు? సినిమావాళ్ళ పెళ్ళైతే నీకెందుకానందం?!

అమ్మ అన్నయ్య దగ్గర ఉంటుంది. షుగరు, బిపి, మోకాళ్ళ నొప్పుల వగైరా జబ్బులు అమ్మతో వుంటాయి. అమ్మని పలకరించాలంటే మా చుట్టాల్లో చాలామందికి భయం. ఎవరైనా దొరికితే చాలు - అమ్మ తన జబ్బులు, బాధలు, మందులు.. చెప్పుకుంటూనే పోతుంది. అదో ఎల్పీ రికార్డ్! ఘంటసాల పాడిన భగవద్గీత వంటి ఆ రికార్దుని నేను రోజూ వింటూనే వుంటాను. ఎవరైనా సరే! తన వేసే రికార్డు మొత్తం చచ్చినట్లు వినాల్సిందే. ఓపిగ్గా విన్నవాడు ఉత్తముడు, వినలేనివాడు అధముడు. 

అది పెద్ద హాలు, మధ్యన పెద్ద సోఫా. ఆ సోఫాలో పెదరాయుడు స్టైల్లో అమ్మ, ఎదురుగా టీవీ, చేతిలో మంత్రదండంలా రిమోట్! ఈ పెదరాయుడికి అనుచరగణం ఇద్దరు. సోఫా పక్కనే గచ్చుమీద కూర్చునే వెంకటమ్మ - ఇంటిపని చేస్తుంది. వంటగది గుమ్మానికి జారగిలిపడే చిట్టెమ్మ - వంటపని చేస్తుంది. వీళ్ళు టీవీ సీరియళ్ళని సీరియస్‌గా చూస్తూంటారు. వీళ్ళకితోడుగా ఆమధ్యదాకా 'సన్నీ' అనబడు ఒక శునకుడు కూడా వుండేవాడు, వాడు వృద్ధాప్య కారణంగా కొంతకాలం క్రితం కాలం చేశాడు! టీవీ సీరియళ్లు రాని (లేని) సమయంలో అమ్మకి నొప్పులు, నీరసం, గుండెదడ!

అవి అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటున్న రోజులు.

నా రోజువారీ డ్యూటీలో భాగంగా డ్యూటిఫుల్‌గా అమ్మని అడిగాను. "అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?"

అమ్మ నన్ను పట్టించుకోలేదు. 

"చిట్టెమ్మా! తొందరగా రా! పెళ్ళికి పవన్ కళ్యాణ్ వచ్చాడు చూడు! పక్కన భార్య లేకుండా ఒక్కడే చేతులూపుకుంటూ వచ్చాడేంటి?"

"అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?" మళ్ళీ అడిగాను.

"వెంకటమ్మా! చిరంజీవి రెండో కూతుర్ని పిలవలేదనుకుంటా. పాపం! ఆ అమ్మాయి కూడా వస్తే బాగుండేది."

"అమ్మా! నొప్పులు.. " అసహనంగా నేను. 

"పెళ్ళికూతురు మెరిసిపోతుంది కదూ. అబ్బో! అబ్బో! ఏం నగలు! ఏం అలంకారాలు!"

ముగ్గురూ నోరు తెరుచుకుని చూస్తున్నారు. మొదట్లో నాకు చిరాకేసినా, ఆ తరవాత నేనూ వాళ్ళతో కలిసిపొయ్యాను!

"చిరంజీవి రెండో కూతురు మొగుణ్ణి పవన్ కళ్యాణ్ కాల్చేస్తానని సవాల్జేసిండంట! పాపం రావాలంటే ఆళ్ళకి బయ్యం గదా!" వెంకటమ్మ సమాచారం.

"లేదు వెంకటమ్మా! కాలుస్తాడనే తుపాకీని పోలీసోళ్ళు తీసేసుకున్నారు." చిట్టెమ్మ అదనపు సమాచారం.

ఈ విషయాల్లో వీళ్ళు నాకన్నా జ్ఞానవంతులనే సంగతి అర్ధమయ్యింది. మా ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లే ఎన్నెన్నో విశేషాలు ముచ్చటించుకున్నారు.

చీరలు, నగలు ఎక్కడ కొన్నారు? రేటెంత? పెళ్లి జరుగుతున్న స్టేజ్ వెడల్పెంత? పొడుగెంత? వంట ఎంతమందికి? ఎన్నిరకాల స్వీట్లు? యేయే ఊళ్ళనించి తెచ్చారు? వంటల్లో వాడిన నూనేంటి? తాలింపు గింజలెన్ని? ఎవరెవర్ని పిలిచారు? వాళ్ళ డ్రస్సులేంటి?

అమ్మ తన నొప్పి, నీరసం, గుండెదడ మర్చిపోయింది. అసలు నన్నే మర్చిపోయింది! హమ్మయ్య!

అల్లు అర్జున్ పెళ్ళైపోయింది. అమ్మకి నొప్పులు, నీరసం మొదలయ్యాయి. తన పాత ఎల్పీ రికార్డుని దుమ్ము దులిపి ప్లే చెయ్యటం మొదలెట్టింది.

కొన్నాళ్ళకి నా అదృష్టం బాగుండి జూ.ఎన్టీఆర్ పెళ్లి కుదిరింది. కొన్నాళ్ళ పాటు ఆ పెళ్ళీకబుర్లు. ఆరోజు జూ.ఎన్టీఆర్ పెళ్లి జరుగుతుంది.

యధావిధిగా డ్యూటిఫుల్‌గా అడిగాను - "అమ్మా! షుగర్ మాత్రలు వేసుకుంటున్నావా?"

"చిట్టెమ్మా! అర్జంటుగా రా! ఎన్టీఆర్ తల్లిని చూడు."

వంట మధ్యలో వదిలేసి పరుగున వచ్చింది చిట్టెమ్మ. "మనిషి బాగుంది మామ్మగారు! హరికృష్ణని ఎందుకు చేసుకుందో?"

"చాలా మంచమ్మాయిలా ఉంది. కాబోయే కోడలంటే ఎంత ప్రేమ! లక్షలు పెట్టి చీరలు కొంటుంది!" అమ్మ కళ్ళల్లో మెరుపు.

"అమ్మా! షుగర్ మాత్రలు.. " అడిగాను. 

"వెంకటమ్మా! పెళ్ళికూతురు ఎంత ముద్దోస్తుందో! అల్లు అర్జున్ భార్యకన్నా హైటా?" అమ్మ సందేహం. 

"లేదమ్మగారు! ఎన్టీఆర్ పొట్టి, అందుకనీ అమ్మాయి ఎత్తుగా అవిపిస్తుంది." వెంకటమ్మ అబ్జర్వేషన్.

అల్లు అర్జున్ పెళ్ళికీ, ఎన్టీఆర్ పెళ్ళికీ కల పోలికల గూర్చి కొంతసేపు మేధోమధనం కొనసాగింది.

"అమ్మా! షుగర్.. " గొణిగాను. 

"చిట్టెమ్మా! పెళ్లికి బాలకృష్ణ రాడన్నావ్? వచ్చాడు చూడు." అమ్మ అరిచింది.

"బాబాయ్ వస్తేగానీ తాళి కట్టనన్నాట్ట పెళ్లికొడుకు. అందుకే వచ్చినట్లున్నాడు." చిట్టెమ్మ సంజాయిషీ.

నేను మాట్లాడ్డం ఆపేసాను, అమ్మ పెళ్లి విషయాలు ఫాలో అవుతూ అలా టీవీ చూడ్డం నాకు ముచ్చటేసింది.

ఈవిధంగా జూ.ఎన్టీఆర్ కొన్నాళ్ళపాటు అమ్మకి నొప్పులు, నీరసం పోగొట్టాడు. థాంక్యూ జూ.ఎన్టీఆర్!

ఆ తరవాత కొంతకాలం నన్ను సత్యసాయిబాబా కాపాడాడు. బాబా చనిపోయాడా? లేదా? ఆస్తి ఎవరికి వెళ్తుంది? ముగ్గురూ తీవ్రమైన చర్హలు సాగించారు. అయితే సాయిబాబా విషయం తొందరగానే తేల్చేశారు. బాబాని డా.సఫాయ సాయంతో రత్నాకర్ చంపేశాడు! ఆ తరవాత డబ్బుల పంపకంలో ఇద్దరికీ తేడా వచ్చింది. ఇట్లా అనేక మలుపులతో ఒక క్రైమ్ స్టోరీ చెప్పారు! ఈవిధంగా మీడియాక్కూడా తెలీని అద్భుత రహస్యాలు బయటపడ్డాయి!

నేను తెలివిగా అమ్మని తెలంగాణా ముగ్గులోకి లాగుదామని ప్రయత్నించాను. కానీ నా కుట్ర ఫలించలేదు. అమ్మకి తెలంగాణా మీద ఆసక్తి లేదు, సోనియాగాంధీ అంటే మాత్రం చాలా ఇష్టం. ఆ ఇష్టానిక్కారణం.. సోనియాగాంధీ తెల్లగా వుంటుంది, చీరలు బాగుంటాయి, నడక హుందాగా ఉంటుంది! భర్త చనిపోయినా అత్తగారి కొంపలోనే వుంటుంది. అంచేత - సోనియాగాంధీ తెలంగాణా ఇస్తేనే మనం తీసుకోవాలి, లేకపొతే లేదు. అంతే!

నాకు అమ్మ జబ్బుల ఎల్పీ రికార్డ్ తప్పట్లేదు, టీవీలవాళ్ళు మాత్రం ఏంచేస్తారు? పొద్దస్తమానం అందరికీ మళ్ళీమళ్ళీ పెళ్లి చెయ్యలేరుగా! పోన్లేండి! ఇప్పుడు చిరంజీవి కొడుక్కి పెళ్ళవుతుంది. కొన్నిరోజులు ఆవిడ కాళ్ళనొప్పులకి సెలవు! 

ఈ హీరోల పెళ్ళిళ్ళు కవర్ చేసినందువల్ల చానెళ్ళవాళ్ళకి వొచ్చే లాభం నాకు తెలీదు గానీ.. నాకు మాత్రం హాయిగా, ప్రశాంతంగా వుంటుంది - అదీ సంగతి!

(కొన్నాళ్ళకి ఆదివారం 'ఆంధ్రజ్యోతి' లో పబ్లిష్ అయ్యింది, డేట్ గుర్తు లేదు)