Monday, 12 December 2011

'శంకరాభరణం' పై బాలగోపాల్


"మీరు తెలుగులో రాస్తున్న వ్యాసాలు కష్టంగా ఉంటున్నాయి. భాషని సింప్లిఫై చెయ్యొచ్చుగా." ఒక సందర్భంలో నేను బాలగోపాల్‌ని అడిగాను.

"నేను చెప్పదలుచుకున్న విషయం రాసేస్తాను. అది అందరికీ అర్ధం అయ్యేట్లుగా రాయలని అనుకోను." బాలగోపాల్ సమాధానం.

నేను ఆయన్ని వదలదల్చుకోలేదు. 

"మరి నా సంగతేంటి? నేనేం చెయ్యాలి?" బాలగోపాల్‌కి ఒక గొప్పప్రశ్న సంధించినందుకు మనసులో భలే ఆనందపడ్డాను. 

'బాలగోపాల్ అభిమానులారా! బీ రెడీ! నేటినుండి బాలగోపాల్ కలం నుండి కుటుంబరావు శైలిలో వ్యాసాలు రాబోతున్నాయి. ఈ క్రెడిట్టంతా నాదే!' 

"తెలుగు నేర్చుకోండి, లేదా నా వ్యాసాలు చదవటం మానేయండి." అన్నాడు బాలగోపాల్. 

నెత్తిమీద నీళ్ళు కుమ్మరించినట్లైంది. ఈ బాలగోపాల్ ఎంత నిర్దయుడు!

ఓ నెలరోజుల క్రితం విశాలాంధ్ర వారి ఎగ్జిబిషన్లో బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంకలనం 'రూపం సారం' కొన్నాను. కె.శ్రీనివాస్ ముందుమాటతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. పాతికేళ్ళ క్రితం చేరా, కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూదనరావులు రాసిన ముందుమాటల్ని వెనక్కి పంపారు! కారణం తెలీదు.

'రూపం సారం'లో బాలగోపాల్ రాసిన శంకరాభరణం, మాభూమి సినిమా రివ్యూలు చదివాను. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో చదువుకోడానికి హాయిగా వున్నాయి. అంటే - నేనీ వ్యాసాలు చదవకుండా బాలగోపాల్‌కో గొప్పసలహా ఇచ్చానన్నమాట, అదీ సంగతి!

పుస్తకంలో 'సామాజిక వ్యాఖ్యాత కొడవటిగంటి కుటుంబరావు' అనే చాప్టర్లో కుటుంబరావులాగా క్లిష్టమైన అంశాలు సరళంగా రాయటం ఎంత కష్టమో వివరంగా రాశాడు. కొకు రచనల్ని చాలా సాధికారంగా విశ్లేషించాడు బాలగోపాల్. మాటల్లోలాగే రాతల్లో కూడా - క్లుప్తత, సూటిదనం బాలగోపాల్ సొంతం.  

'రూపం సారం'లో శంకరాభరణం చిత్ర సమీక్ష చదువుతుంటే భలే నవ్వొచ్చింది. బాలగోపాల్ ఇంత సరదాగా కూడా రాయగలడని అప్పటిదాకా నాకు తెలీదు.

---------------------------------------------

శంకరాభరణం - సినిమా సమీక్ష :

ఈ సినిమా బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల కొరకు తీయబడిన సినిమా. నేను యిక్కడ 'బ్రాహ్మణుల'ని అంటున్నది కులం చేత బ్రాహ్మణులయిన వాళ్ళను మాత్రమే కాదు. 'భారతీయ సంస్కృతి' గా పిలవబడుతున్న దానికి వారసులుగా తమను తాము భావించుకుంటున్న వారందర్నీ. అంటే భారతీయ విద్యాభవన్ తరహా ఆలోచనా విధానం కలిగిన వారందర్నీ.

కథ క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంగీతం పిచ్చి ఉన్న ఒక బ్రాహ్మణుడి కథ. శంకరాభరణం రాగం పాడడంలో అతను సుప్రసిద్ధుడు. ఈ బ్రాహ్మణుడు సంగీతం కోసం ఏమైనా చేస్తాడు. సంగీతాన్ని ప్రేమించే ఒక వేశ్య కూతురి పక్షం వహించి ఆమె కోసం సంఘబహిష్కరణకి కూడా సిద్ధపడతాడు. వాళ్ళు నిజంగానే వెలివేస్తే ఆ కోపాన్నంతా తన ఇష్టదైవం మీద చూపించి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాడు. అపస్వరం పాడిందని తన కుమార్తె పెళ్ళిని దాదాపు చెడగొట్టినంత పని చేస్తాడు. ఆమెకు సాయం చేయబోయినందుకు పెళ్ళికొడుకును కూడా బిక్కచచ్చిపోయేలా చేస్తాడు.

మొత్తం సినిమాలో ఒక సందేశం మన చెవులను పోటెత్తిస్తుంది. సంగీతం, కళలు ఉన్నది కామోద్రేకాల్ని రెచ్చగొట్టటానికి కాదు. లేబర్ క్లాస్ (ఆంధ్రులకి ఇష్టమైన మాటలో చెప్పాలంటే) అశ్లీల అభిరుచులను సంతృప్తి పరచడానికి కాదు. అవి ఉన్నది 'అద్వైత సిద్ధి'కి, 'అమరత్వ లబ్ధి'కి. ఈ సినిమా కొందరి కోసమే అన్నభావం కలిగించే ప్రయత్నం మొదటి నుంచి చివరిదాకా కనిపిస్తుంది. ఎవరో కామెంట్ చేసినట్లు ఇది 'వాళ్ళకు' (అలగా జనానికి) అర్ధమయ్యే సినిమా కాదు.

--------------------------------

శంకరాభరణం సినిమాని రాజకీయ కోణంతో విమర్శించాడు బాలగోపాల్. రంగనాయకమ్మ, రావిశాస్త్రి కూడా అలాగే సమీక్షించారు. సినిమా విమర్శకులకీ రచయితలకీ వున్నా తేడా మనం గుర్తుంచుకోవాలి. 

శంకరాభరణం గూర్చి బాలగోపాల్ వివరంగా రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు balagopal.org లో ఇంగ్లీషులో కూడా చదువుకోవచ్చు.