Sunday, 4 December 2011

అమృత మూర్తులు

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు సుబ్బు. తాపీగా టేబుల్ మీదున్న న్యూస్ పేపర్ని తిరగెయ్యసాగాడు.

"అమృతమూర్తికి అశ్రునివాళి. హి.. హి.. హీ! వెరీ గుడ్!" అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు. 

"సుబ్బు! అందులో నవ్వడానికేముంది?" అడిగాను.

"ఇంగ్లీషులో సింపుల్‌గా 'హోమేజ్' అనేసి ఊరుకుంటారు. కానీ తెలుగులో అక్షరాలు ఎక్కువ, భావాలూ ఎక్కువే. అమృతమూర్తిట, అశ్రునివాళిట! ఏదో నాటకంలో పద్యంలా లేదూ?"

ఇంతలో వేడికాఫీ పొగలుగక్కుతూ వచ్చింది.

"సుబ్బు! ఆయనెవరో పొయ్యాడు. పోయినాయన కోసం డబ్బుపోసి కుటుంబ సభ్యులు పత్రికల్లో ప్రకటన ఇచ్చుకున్నారు. వాళ్ళేం రాసుకుంటే మనకెందుకు?" అన్నాను. 

"నిజమే, మనకెందుకు? కావాలంటే కారణజన్ముడు, పురుషోత్తముడు, లోకోద్ధారకుడు అని ఇంకో నాలుగు తోకలు తగిలించుకోమందాం. సర్లే గానీ, అశ్రునివాళి దాకా ఓకే. కానీ 'అమృతమూర్తి' పదం రిలెటివ్ కదా!" అన్నాడు సుబ్బు. 

"ఎలా?" అడిగాను. 

"అమృతం అనగా తీయగా నుండునది, మేలు చేయునది. ఎవరికి తియ్యగా ఉంటుంది? ఎవరికి మేలు చేస్తుంది? అది తాగేవాడిబట్టి వుంటుంది. రాజకీయ నాయకుడో, డాక్టరో, ఉన్నతాధికారో.. నిజాయితీగా, సమాజహితంగా జీవిస్తే వాళ్ళు సమాజానికి అమృతమూర్తులు. కానీ అతని నిజాయితీ మూలంగా ఇంట్లోవాళ్ళు కొన్నిసుఖాలు కోల్పోతారు, కాబట్టి అతగాడు ఇంట్లోవాళ్లకి అమృతమూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్లకి అతనో గరళమూర్తి కూడా అవ్వొచ్చు." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"మా పక్కింటి వడ్డీల వెంకటయ్య సంగతేమయ్యింది? వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేసేవాడు. గడ్డితిని ఆస్తులు పోగేసాడు. చివర్రోజుల్లో ఎంత తీసుకున్నాడు! ఆయన ఆస్తి కోసం కొడుకులు తన్నుకు చచ్చారు, అంతా కలిసి తండ్రికి తిండి పెట్టకుండా చంపేశారు. చావంగాన్లే వెంకటయ్య కొడుకులకి అమృతమూర్తయిపోయాడు. అందుకే రోజుల తరబడి పేపర్లల్లో ప్రకటనల ద్వారా కొడుకులు తమతండ్రి అమృతమూర్తని ఘోషించారు!" అన్నాడు సుబ్బు. 

ఖాళీ కప్పుని టేబుల్ మీద పెట్టాడు.

"గాలి జనార్ధనరెడ్డి ఆయన కుటుంబానికి అమృతమూర్తి, సమాజానికి కాదు. గాంధీ రిజిడ్ ఫిలాసఫీ వల్ల ఆయన కుటుంబం ఇబ్బంది పడింది. వారి దృష్టిలో గాంధీ అమృతమూర్తి కాకపోవచ్చు." అన్నాడు సుబ్బు.

"ఓ పన్జేద్దాం. మనం చచ్చేముందు మన ఫోటోల కింద ఈ అమృతమూర్తిని తగిలించొద్దని మనవాళ్లకి చెప్పి చద్దాం. సరేనా?" నవ్వుతూ అన్నాను.

"మనకాభయం లేదు. నువ్వూ నేనూ చస్తే మనకి పేపర్ ప్రకటన కూడానా! మనకంత స్థాయి లేదు. అందుకు మనం భారీగా నాలుగు తరాలకి సరిపడా సంపాదించాలి. అది మనవల్ల కాదు కాబట్టి మనం చచ్చాక అమృతమూర్తులం అయ్యే ప్రమాదం లేదు!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నీకు బొత్తిగా పని లేకుండా పోతుంది. ఆయనెవరో పోయ్యాడని వాళ్ళవాళ్ళు ఏదో రాసుకుంటే దానికింత విశ్లేషణ అవసరమా?"

"అస్సలు అవసరం లేదు. కానీ కబుర్లు చెప్పకుండా కాఫీ తాగితే తాగినట్లుండదు నాకు. ఇదో రోగమేమో. సర్లే! సాయంకాలం క్లబ్బులో పార్టీ వుంది, వస్తున్నావుగా?""

"మర్చిపొయ్యాను. మన మూర్తి వచ్చాడు కదూ!"

"వార్నీ దుంపదెగ, మూర్తిగాడి పార్టీ మర్చిపోయ్యావా!? మూర్తి ఫ్రమ్ అమెరికా విత్ గ్లెన్ ఫిడిచ్. అమెరికా నుండి అమృతం తెచ్చిన మన మూర్తే అసలైన అమృతమూర్తి!" అంటూ పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.