Thursday 22 December 2011

మెగాస్టార్ భిక్షాపాత్ర


అమ్మయ్య! ఎట్లాగయితేనేం - సెక్యూరిటీ కన్నుగప్పి, ఆ స్టార్ హోటల్లోకి దూరాను. చల్లగా ఏసీ, మెత్తగా తివాచీలు, నున్నగా తెల్లటి గోడలు.. స్వర్గంలా వుంది. లాబీలో వెళ్తున్నవాళ్ళు నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిల్లిలా ఓ గదిలోకి జారుకున్నాను. ఇంతలో ఎవరో గదిలోకి వస్తున్న అలికిడి. ఒక్క గెంతున కర్టన్ల చాటుకి దాక్కున్నాను.

గదిలోకి వచ్చిన వ్యక్తిని చూసి నమ్మలేకపొయ్యాను. ఆయన మామూలు మనిషి కాదు - సినిమా యాక్టర్ చిరంజీవి! నాదెంత అదృష్టం! లక్షలమంది 'అన్నయ్యా' అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ దేవుళ్ళా ఆరాధించే వ్యక్తి బస చేసిన గదిలోకి దూరగలిగాను. రూమ్ బాయ్ కాఫీ తెచ్చాడు. చిరంజీవి కాఫీ సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అవును మరి! తెలుగు ప్రజల ఉన్నతికై అనుక్షణం పరితపించే వ్యక్తి అలాగే ఆలోచిస్తాడు. 

కర్టన్ చాటునుండి బయటకొచ్చి చిరంజీవి ఎదురుగా నిలబడ్డాను. నన్ను చూడంగాన్లే ఆశ్చర్యపోయాడు చిరంజీవి. ఆశ్చర్యపోడా మరి! మాసిన తల, పెరిగిన గడ్డం, ముడతలు పడ్డ నల్లటి చర్మం, ఎండిన డొక్కలు, తొర్రిపళ్ళు, రంగు వెలిసిన మొలత్రాడు, మురికిపట్టిన చిల్లుల గోచీ, కుంటి నడక, కుడిచేతిలో సొట్టలు పడ్డ సత్తు బొచ్చె, బొచ్చెలో రెండు రూపాయి బిళ్ళలు. ఇదీ నా అవతారం. కుక్కల్లో గజ్జికుక్కలు హీనమైనవి. మనుషుల్లో అడుక్కునేవారు హీనులు. అట్టి హీనులు నక్షత్ర్రాల హోటలు రూములోకి ఎలా రాగలరు?   
                           
భిక్షాటన నాకు ఎన్నో యేళ్ళుగా అలవాటైన వృత్తి, నిద్రలో లేపినా అడుక్కోగలను. గొంతు సరిచేసుకుని, సత్తుబొచ్చె పైకీకిందకీ ఆడిస్తూ, రూపాయి బిళ్ళల్ని శబ్ధం వచ్చేలా ఎగరేస్తూ "ఆకలేస్తంది దొరా! అన్నం తిని నాల్రోజులయ్యింది బాబయ్యా! దరమం సెయ్యి దొరా!" అంటూ రాగయుక్తంగా ఓండ్ర పెట్టాను. 

చిరంజీవి ఒక్కక్షణం నాకేసి చూశాడు. పక్కనే నిలబెట్టి ఉన్న పెద్ద సూట్‌కేసుని గది మధ్యకి లాగాడు. నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. 'అమ్మయ్య! నా దరిద్రం వదిలిపోయింది. ఈ దరమ ప్రభువు ఇచ్చే సొమ్ముతో నా దశ తిరిగిపోద్ది.' అనుకుంటూ వుండగా -
                                            
చిరంజీవి సూట్‌కేసు తెరిచాడు, అందులో ఒక బొచ్చె - అచ్చు నా సత్తు బొచ్చెలాంటిదే వుంది. ఆ బొచ్చెని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. "అమ్మా పదవి, అయ్యా పదవి! కేంద్రమంత్రయినా, రాష్ట్రమంత్రయినా ఏదయినా పర్లేదు. పదవి లేక చచ్చిపొయేట్లున్నాను. అమ్మా, అయ్యా.. " అంటూ భోరున విలపించసాగాడు.

బిత్తరపొయ్యాను. కొద్దిసేపటికి యేం జరుగుతుందో అర్ధమైంది. వార్నీ! ఈ చిరంజీవి కూడా నాలాగానే అడుక్కునేవాడా!? నాది వొట్టి దరిద్రం అయితే, ఈయన దరిద్రానికే దరిద్రంలాగా వున్నాడు. ఇంకా అక్కడే వుంటే నా చిల్లుల గోచీగుడ్డ లాక్కుంటాడేమోననే భయంతో, ప్రాణాలు (గోచీగుడ్డ) అరచేతిలో పెట్టుకుని (పట్టుకుని) ఒక్క ఉదుటున బయటికి ఉరికా!