Wednesday, 7 December 2011

స్వర్గంలో భానుమతి, సావిత్రి.. నేను కూడా!అదొక విశాలమైన హాలు. పొడవాటి రంగురంగుల కర్టెన్లు. జమీందార్ల కొంపల్లో మాత్రమే కనిపించే సింహాసనం సోఫాలు, సోఫాలాంటి కుర్చీలు. అందమైన చీరల్లో మరింత అందమైన ఆడవాళ్ళు, తెల్లటి వస్త్రాల్లో మగవాళ్ళు. ఆ వాతావరణం సందడి సందడిగా, హడావుడి హడావుడిగా ఉంది.

హాలు మధ్యన పెద్ద పట్టుతివాచీ. దానిపై మందపాటి ముఖమల్ పరుపు. ఆ పరుపుపై కూర్చున్న ఒక స్త్రీ అచ్చు భానుమతి గొంతుతో గీతం ఆలపిస్తుంది. ఆమె చుట్టూతా కూర్చున్నవారు శ్రద్ధగా ఆమె గానాన్ని వింటూ తల పంకిస్తున్నారు.

'సావిరహే తవదీన.. '

ఏవిటిదంతా? నేనిక్కడికెలా వచ్చాను? అటుగా వెళ్తున్న ఒక తెల్లబట్టల పెద్దమనిషిని వాకబు చేశాను. ఆయన సమాధానం విని హతాశుడనయ్యాను. 

ఇది భూలోకం కాదు - స్వర్గంట! ఐదునిమిషాల క్రితమే నేను బాల్చీ తన్నేశాన్ట! యేమిటీ దారుణం? ఇది కల కాదు గదా? అసలేమైంది చెప్మా? కళ్ళు మూసుకుని ఓ క్షణం ఆలోచించాను.

ఆ! గుర్తొచ్చింది. ఇవ్వాళ అరికాలు దురద పెడుతుంటే ఓ కార్పోరేట్ ఆస్పత్రి డాక్టరు దగ్గరకెళ్ళాను. ఆ డాక్టరు నా అరికాలుని ఆరు నిమిషాలు పరీక్షించి, ఆరువేల రూపాయల టెస్టులు చేసి, ఆరువందల రూపాయల ఇంజెక్షను పొడిచాడు. ఆ ఇంజెక్షను వికటించిందా? వికటించే వుంటుంది, లేకపోతే ఇక్కడికెలా వొచ్చి పడతాను? అయ్యో! అంటే.. అంటే.. ఇప్పుడు నేను చచ్చిపోయానా!

బాధతో గుండె బరువెక్కింది. దుఃఖంతో కొంచెంసేపు విలపించాను. అయ్యో! చావడంలో కూడా నాదెంత దరిద్రపుగొట్టు చావు! ఏదో గుండెజబ్బులాంటి రోగంతో చస్తే గౌరవం గానీ, మరీ చీప్‌గా అరికాలు దురదకి చావటం ఎంత సిగ్గుచేటు! నా శవాన్ని చూడ్డనికొచ్చిన వారి ముందు నా పరువు పోయుంటుంది. సర్లే! ఎట్లాగూ చచ్చానుగా, ఇంక పరువుతో పనేముంది!

'కానీ - పుట్టి బుద్ధెరిగి ఎప్పుడూ పాపాలే చేశాను గానీ, పుణ్యం ఎప్పుడూ చెయ్యలేదే! యమభటులేమైనా పొరబాటున స్వర్గంలో పడేశారా?' అనే సందేహం కలిగింది. కొంతసేపటికి దుఃఖం తగ్గి, మనసు తేలికయ్యింది. ఇక్కడేదో బాగానే ఉన్నట్లుంది. పరిసరాలు పరికించి చూశాను. అక్కడి వాతావరణానికి నిదానంగా అలవాటు పడసాగాను. 

ఇంతకీ అంత మధురంగా పాడే ఆ గాయని ఎవరబ్బా!

'దగ్గరకెళ్ళి చూస్తే తెలుస్తుందిగా' అనుకుంటూ అలా వెళ్ళాను. ఆవిడ నిజంగానే భానుమతి! మహారాణిలా ఠీవీగా, విలాసంగా, హుందాగా.. మంద్రస్థాయిలో పాడుతుంది. అక్కడివారు ఆ పాటకి ఆనంద పరవశులవుతున్నారు. భానుమతి ఒక పాట తరవాత మరో పాట పాడుతూనే ఉంది.

'ఒహొహొ! పావురమా'

'పిలచిన బిగువటరా'

'ఎందుకే నీకింత తొందర'

'మనసున మల్లెల మాలలూగెనే'

'ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన'

'ఓ బాటసారి"

'నేనే రాధనోయి'

అహాహా! ఏమి ఈ గాత్రమాధుర్యము! జన్మ ధన్యమైంది! పోన్లే - చస్తే చచ్చాగానీ, గారెల బుట్టలో పడ్డా! అన్నట్లు ఈ స్వర్గంలో గారెలు దొరుకుతాయా? అసలిక్కడ వంటిల్లు అంటూ వుందా? ఆకలేస్తే ఉగ్గిన్నెతో అమృతం తాగిస్తారా!

ఇంతలో ఒక బూరె బుగ్గల చిన్నది - అక్కడున్న ఆడవాళ్ళని పేరుపేరునా పలకరిస్తూ, కాఫీ, టీ ఏర్పాట్లు పర్వవేక్షిస్తుంది. అబ్బా! ఎవరీ అందాలరాశి? ఎంత సుందరముగా యున్నది! కొంచెం దగ్గరగా వెళ్లి చూద్దాం. ఆఁ.. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయి.. ఆవిడ.. సా.. వి.. త్రి!

ఆనందంతో ఒళ్ళు పులకరించింది. నా శశిరేఖ, మేరా పార్వతి, మై మిస్సమ్మ.. వావ్! చచ్చిపోతే సావిత్రి కనిపిస్తుందంటే ఎప్పుడే చచ్చేవాణ్ణిగా! బొద్దుగా, ముద్దుగా, అమాయకంగా ఎంత బాగుంది! ఒరే అరికాలు డాక్టరు! థాంక్స్ రా బాబు థాంక్స్!

ఇంతలో పిడుగు పడ్డట్లు ఒక పెద్ద అరుపు.

"వొసే సావిత్రీ! నా కాఫీలో చక్కెర ఎక్కువెయ్యమని చెప్పానా లేదా? ఈ కాఫీ నీ మొహంలేగే వుంది, ఏడుపుగొట్టు మొహమా! తెలివితక్కువ దద్దమ్మ!"

పుఱ్ఱచేత్తో విసెనకర్రతో టపాటపా విసురుకుంటూ రుసరుసలాడింది సూర్యకాంతం. సావిత్రి భయంతో వణికిపోయింది.

"ఆ కాఫీ మీక్కాదు, అది కన్నాంబగారి కాఫీ." అంటూ కళ్ళనీళ్ళెట్టుకుంది.

నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఇంత కోపం నాకు భూలోకంలో కూడా ఎప్పుడూ రాలేదు. స్వర్గంలో మర్దర్ కేసుకి శిక్షలున్నాయా? ఈ సూర్యకాంతాన్ని మర్దర్ చెయ్యటానికి - ఏ రాజనాలకో, ఆర్.నాగేశ్వర్రావుకో సుపారీ ఇవ్వాలి. ఏరీ వాళ్ళు?

చప్పట్లతో హాలంతా మారుమోగింది. భానుమతి కచేరీ పూర్తయింది. శ్రోతలు భానుమతిని మెచ్చుకుని, నమస్కరిస్తూ ఒక్కొక్కళ్ళే హాలు బయటకెళ్ళారు. ఇప్పుడు హాల్లో కొద్దిమందిమి మాత్రమే మిగిలాం.

"నమస్కారం భానుమతమ్మగారు! నేను మీ అభిమాన రేణువుని. 'మల్లీశ్వరి'ని లెక్కలేనన్నిసార్లు చూశాను. ఆ సినిమాలో మీరు హీరో, మీ పక్కన ఎన్టీరామారావు హీరోయినని మా స్నేహితులు అంటారు." వినయంగా అన్నాను.

భానుమతి నన్ను ఆపాదమస్తకం పరికించింది. ఆనక గంభీరంగా తల పంకించింది. ఆవిడకి నేను తన అభిమానిగా పరిచయం చేసుకోటం చాలా సంతోషాన్నిచ్చినట్లుంది. మనసులోని ఆనందాన్ని బయటకి కనబడనీయకుండా గుంభనంగా నవ్వుకుంది.

"మల్లీశ్వరి సినిమాకి హీరోని, హీరోయిన్ని కూడా నేనే! ఆ రామారావు కేవలం సహాయనటుడు." గర్వంగా తలెగరేస్తూ అన్నది భానుమతి.

అవునన్నట్లు తలూపుతూ అర్జంటుగా వొప్పేసుకున్నాను.

"అమ్మా! మీ అత్తగారి కథలు లేకపోతే చక్రపాణి, కుటుంబరావులు దీపావళి యువ సంచికలు అమ్ముకునేవాళ్ళా? మీ కథలు పంచదార గుళికలు." మరింత ఒంగిపోతూ అన్నాను. 

భానుమతి బహుత్ ఖుష్ హువా! ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ -

"ఒరే బడుద్దాయ్! మాటలు బాగానే నేర్చావు. నాకు పొగడ్తలంటే నచ్చవు. కానీ నువ్వన్నీ నిజాలే చెబుతున్నావనుకో!" అన్నది భానుమతి.

ఇంతలో సావిత్రి భానుమతికి తళతళలాడుతున్న గాజు గ్లాసులో బత్తాయి రసం ఇచ్చింది. నేను గుడ్లప్పగించి సావిత్రికేసి చూస్తుండిపోయాను. భానుమతి ఒక క్షణం నన్ను గమనించింది.

"సావిత్రీ! రా చెల్లీ! ఇలా నాకు దగ్గరగా వొచ్చి కూర్చో. వీడు ఇప్పటిదాకా నన్ను పొగిడాడు. నువ్వు రాంగాన్లే నిన్ను చూస్తూ నీలుక్కుపొయ్యాడు. మళ్ళీ చచ్చాడేమో వెధవ! వీడికి నువ్వంటే చచ్చేంత ఇష్టంట, నీగూర్చి చాలా రాస్తుంటాడు."

"నిజమా! నాకు తెలీదక్కా!" ఆశ్చర్యంగా అంది సావిత్రి.

"ఓసి మొద్దుమొహమా! నీకు ఏం తెలిసి చచ్చింది గనక! ఆ దేవుడు నీకు గొప్ప నటనా ప్రతిభనిచ్చాడు గానీ, మట్టిబుఱ్ఱనిచ్చాడే బంగారం." అంటూ ముద్దుముద్దుగా సావిత్రిని విసుక్కుంది భానుమతి.

చటుక్కున తల ఎత్తి, నావైపు సూటిగా చూస్తూ "ఏమిరా! నా గూర్చి ఎప్పుడు రాస్తున్నావ్?" అంటూ హూంకరించింది భానుమతి.

"చి.. చి.. చిత్తం. త్వరలోనే.. తప్పకుండా.. ర.. రాస్తాను." వణికిపొయ్యాను.

భానుమతి కిలకిల నవ్వింది.

"నీ మొహం, నువ్వు రాయలేవులే. మీ మగాళ్లు నా నటనని అభిమానిస్తారు, నా పాట కోసం చెవి కోసుకుంటారు, నా రచననల్ని ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ములేని దద్దమ్మలు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్‌గా ఉండే వెర్రిమొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే వల్నరబిలిటీని ఇష్టపడతారు. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే బుర్ర చితక్కొట్టేస్తాను, గుడ్లు పీకేస్తాను, పీక పిసికేస్తాను. అందుకే నీకు నాగూర్చి రాయాలంటే వెన్నులో వణుకు."

భానుమతి చెబుతుంటే సావిత్రి కుందనపు బొమ్మలా, చెక్కిలిపై అరచెయ్యి ఆనించి, శ్రద్ధగా వింటూ తన చక్రాల్లాంటి కళ్ళతో 'నిజమా!' అన్నట్లు సంభ్రమంగా చూస్తూంది.

ఇంతలో మళ్ళీ ఇంకో పెద్ద పిడుగు!

"వొసే సావిత్రీ! కాఫీ నా మొహాన పడేసి ఏమిటే నీ మంతనాలు? పెత్తనాలు పక్కన పెట్టి నాకు నిద్రొచ్చే దాకా కాళ్ళొత్తు, నిద్రమొహం దానా! చూశావా ఛాయాదేవొదినా! నన్ను ఇక్కడ కూడా చెడ్డదాన్ని చెయ్యాలని కాకపోతే ఒక్కపనీ సరీగ్గా చేసేడవదు." పక్కనున్న చాయాదేవితో నిష్టూరంగా అంది సూర్యకాంతం. చాయదేవి మూతి వంకర్లు తిప్పుతూ ఆ పక్కకి వెళ్ళిపోయింది.

సూర్యకాంతం గావుకేకలతో స్వర్గం దద్దరిల్లింది. సావిత్రి ఉలికిపాటుతో ఎగిరిపడి సూర్యకాంతం దగ్గర పరిగెత్తుకెళ్ళింది.

భానుమతి నవ్వుతూ అంది. "ఇక్కడికి రాకముందు నాకూ అర్ధమయ్యేది కాదు - ఎందుకీ మగవాళ్ళు సావిత్రంటే పడి చస్తారు? నన్ను చూసి భయంతో వణికిపోతారు? మొన్నామధ్య ఒక గడ్డపాయన.. అదేనోయ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త.. దీంట్లోని మతలబు విడమర్చి చెప్పాడు."

"ఫ్రాయిడ్ మీతో మాట్లాడాడా!" ఆశ్చర్యపొయ్యాను.

"ఏంటోయ్ వెర్రి పీనుగా! అంత ఎక్స్‌ప్రెషనిచ్చావ్! నా పాటలు వినటానికి ఫ్రాయిడేం ఖర్మ! ఎరిక్ ఎరిక్సన్, ఎడ్లెర్, ఎరిక్ ఫ్రామ్, సార్త్ర్ కూడా ఎగబడతారు. ఫ్రాయిడుకి నా 'దులపర బుల్లోడా' పాట ఎంత ఇష్టమో తెలుసా? నిన్న సూర్యకాంతం పెట్టిన దొసావకాయ తిని, ఆవఘాటుకి ఉక్కిరిబిక్కిరై చచ్చాడు." అంటూ పెద్దగా నవ్వింది.

ఇంతలో హడావుడిగా లూజు చొక్కా ఇన్ షర్ట్ చేసుకుని కుర్రాళ్ళా కనిపిస్తున్న పెద్దాయన లోపలకొచ్చాడు. అతను.. ఆయన దేవానంద్! తల పైకికిందకీ ఊపుతూ, పల్చటి పెదాల్లోంచి నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతూ అడిగాడు.

"నమస్కార్ భానుమతి బెహన్! ఆప్ జర మేరా సురయా కా ఎడ్రెస్ బతాయియే!"

భానుమతి దేవానంద్‌తో హిందీలో ఏదో మాట్లాడుతుంది. భానుమతి నుండి పారిపోడానికి ఇదే సరైన సమయం. చడీచప్పుడు చెయ్యకుండా చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాను. 

updated 4/3/18