Wednesday, 28 December 2011

ఇచ్చట అభివృద్ధి చేయబడును

"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"యేమి నాయనా! ఇప్పుడే వస్తున్నానని అరగంట లేటుగా వచ్చావ్?" నవ్వుతూ అడిగాను.

"హోల్డాన్! నేరం నాదికాదు, ట్రాఫిక్‌ది. మెయిన్ రోడ్డు వెడల్పు చేస్తున్నార్ట, మొత్తం తవ్విపడేశారు, ట్రాఫిక్ జామ్. అభివృద్ధి పేరిట విధ్వంసం చేసెయ్యడం మనవాళ్ళ స్పెషాలిటీ." వ్యంగ్యంగా అన్నాడు సుబ్బు.

"రోడ్డు వెడల్పు చేస్తుంటే మంచిదేగా? విధ్వంసం అంటావేంటి!" ఆశ్చర్యంగా అడిగాను.

ఇంతలో వేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మనతోపాటే ఉండేది మన దేహం. వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు తెల్లబడుతుంది, చర్మం ముడతలు పడుతుంది, నరాలు గిడసబారతాయి. మన ఊరు కూడా మనదేహం వంటిదే. శరీరానికి వయసొచ్చినట్లే ఊరిక్కూడా వయసొస్తుంది. మనం పిల్లల్ని కని సంతతిని పెంచుకున్నట్లే ఊరు కూడా జనాభాని పెంచుకుంటుంది. మన పెద్దల్ని గౌరవించినట్లే ఊరినీ గౌరవించాలి. ఇంట్లో మనుషులు ఎక్కువైపొయ్యారని వృద్ధులని బయటకి తరిమేస్తామా? నా దృష్టిలో రోడ్లు వెడల్పు చెయ్యడం వృద్ధుల్ని బయటకి గెంటటంతో సమానం."

"సుబ్బు! నాగరికత పెరుగుతుంది, మనిషి అవసరాలు మారుతున్నయ్. అందుకు తగ్గట్టుగా ఊరు కూడా మారాలి గదా!" అన్నాను.

"మిత్రమా! ఏది నాగరికత? ఇరుకు రోడ్లల్లో కార్లని నడపటం నాగరికతా! కార్లు, మోటార్ సైకిళ్ళ పరిశ్రమలకి రాయితీలిస్తారు. వందరూపాయిల డౌన్ పేమెంట్‌తో మోటర్ సైకిళ్ళూ, కార్లు అంటగడుతున్నారు. ప్రభుత్వాలకి పరిశ్రమలు ముఖ్యం, పన్ను వసూళ్ళు ముఖ్యం. అంతేకానీ ట్రాఫిక్‌ని తట్టుకోలేక 'కుయ్యో! మొర్రో!' మంటూ చేసే ఊరు ఆర్తనాదాలు ఎవరికీ పట్టదు. మనిషి కన్నా ఊరు ఎందులో తక్కువ? ఒకప్పుడు సైకిళ్ళు, రిక్షాల బరువుని అవలీలగా, హాయిగా మోసిన ఊరి నెత్తిన మోయరాని భారాన్ని మోపుతున్నారు. ఈ అనవసరపు బరువు మొయ్యలేక ఊరు ఒంగిపోతే ఆ బరువు తగ్గించే మార్గం వదిలేసి.. ఆ బరువు మోసేందుకు టానిక్కులిస్తున్నారు." ఆలోచిస్తూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! సమాజం స్థిరంగా ఉండదు, మార్పు దాని సహజగుణం." అన్నాను.

"నిజమే, వొప్పుకుంటున్నాను. కానీ ఆ మార్పు అడ్డదిడ్డంగా వుండకూడదు. పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా చేసే మార్పులు, చేర్పులకి ఒక శాస్త్రీయవిధానం వుండాలి. ఊరి విశిష్టతని కాపాడాలి, మానవీయకోణంలో ఆలోచించాలి. ముందుగా కారు వెనక సీట్లో బద్దకంగా, ఒరిగిపోతూ కూర్చునేవాళ్ళ కోణం నుండి ఆలోచించడం మానెయ్యాలి. వాహనాలతో రోడ్లని ఓవర్‌లోడ్ చేసి రోడ్లు వెడల్పు చేస్తాననటం తలక్రిందుల వ్యవహారం."

"మన నాయకులు రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేసేస్తామంటున్నారు!" అన్నాను.

"అసలు ఒక పట్టణంలా ఇంకో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాననటమే హాస్యాస్పదం. ప్రపంచంలో ప్రతి పట్టణానికీ ఒక చరిత్ర వుంటుంది. ఆయా పట్టణాలు ఆయా ప్రజల అవసరాల మేరకు రూపాంతరం చెందాయి. ఎవరి అవసరాలు, ఇష్టాలు వారివి. అభివృద్ధి అంటే వృద్ధురాలు చీరకి బదులు మిడ్డీ వెయ్యటం కాదు, ఆమె ఆరోగ్యంగా వుండేట్టు చూడటమే అభివృద్ధి." అంటూ కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"మొత్తానికి ఈ రోడ్ల వెడల్పు నిన్ను బాగానే బాధ పెడుతుందే!" నవ్వుతూ అన్నాను.

"వెడల్పాటి రోడ్లమీద స్పీడ్ బైకులతో చక్కర్లు కొట్టటం థ్రిల్ నివ్వవచ్చు. రోడ్డుపక్కన నిలబడి బజ్జీలు తింటూ, ఆ ఘాటుకి కన్నీరు కారుస్తూ, గోళీసోడా తాగడం ఇంకా గొప్ప థ్రిల్. ఈ రోడ్డు వెడల్పు మన బజ్జీల సంస్కృతిని కూడా ధ్వంసం చేసేస్తుంది." అంటూ టైం చూసుకున్నాడు సుబ్బు.

"ఇది పిజ్జాలు బర్గర్ల కాలం సుబ్బూ! కొన్నాళ్ళకి బజ్జీలు, గోళీసోడాలు అంతరించిపోతాయ్." అన్నాను.

"అవును, కార్ల కోసం ఊరు మాయం. పిజ్జాల కోసం బజ్జీలు, గోళీసోడాలు మాయం. పాలకులు దీన్నే ముద్దుగా అభివృద్ధి అంటారు, మనం విధ్వంసం అంటాం. వస్తాను." అంటూ పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.