Wednesday, 21 December 2011

సప్తపది


'నెమలికి నేర్పిన నడక ఇదీ' అంటూ టీవీలో సప్తపది సినిమా పాటొస్తుంది. పాతరోజులూ, అప్పటి స్నేహితులూ గుర్తొచ్చి నవ్వుకున్నాను. నాకు పాతసినిమాలు గొప్ప నోస్టాల్జియా.

ఇప్పుడంటే టీవీలు, కంప్యూటర్లు వచ్చేశాయిగానీ, చిన్నప్పుడు మాకు సినిమాలే వినోదం. సినిమా చూడ్డం అనేది ఓ గ్రూప్ ఏక్టివిటీ. పరీక్షలప్పుడు చదువుకోవడం, పరీక్షలు లేనప్పుడు సినిమాలు, షికార్లు, కబుర్లు. ఇదే మా జీవితం.

స్నేహితుల గ్రూపుల్లో నోరున్నోడిదే రాజ్యంగా వుంటుంది. ఈ నోరున్నుడే ఫలానా సినిమాకి వెళ్లాలని నిర్ణయించేస్తాడు. అంచేత కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా చచ్చినట్లు యేదో సినిమాకి వెళ్లాల్సివచ్చేది. కానీ వీళ్ళ ఉక్రోశం, ఆగ్రహానికి సినిమా బలయ్యేది.  

అలా బలైన సినిమాల్లో 'సప్తపది' కూడా ఒకటి. 

ఆ రోజు కొంతమంది అప్పటికే రెండుసార్లు చూసేసిన శ్రీదేవి సినిమా మళ్ళీ చూడాలని ప్లాన్ వేశారు. కానీ నోరున్న నాయకుడొకడు సప్తపది చూడాల్సిందేనన్నాడు. తీవ్ర వాదప్రతివాదాల తరవాత - 'సప్తపది'కే వెళ్ళాం.

శ్రీదేవి సినిమా బ్యాచ్ వాళ్ళు సప్తపది సినిమా చూస్తున్నంతసేపూ కుళ్ళుకు చచ్చారు. తమ చెత్త కామెంట్లతో సినిమాని చీల్చి చండాడ్డం ప్రారంభించారు.

"శంకరాభరణం సింగిల్ పిలకతో సూపర్ హిట్టైంది. ఇది మూడుపిలకల సినిమా, ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో!"

"వీడెవడ్రా నాయనా! వీడికి భార్యలో దేవత కనిపిస్తుంది! రేపు మన పనీ ఇంతేనా!?" ఒకడి ధర్మసందేహం.

"ఇంతోటి సినిమాకి అమరావతి గుడెందుకు? మనూళ్ళో శివాలయం సరిపొయ్యేది."

"పాటలు బాగున్నాయి, హరికథా కాలక్షేపంలాగా!"

"పొద్దస్తమానం ఎలకపిల్ల హీరోయిన్తో గుడి చుట్టూతా కూచిపూడి నాట్యం వేయిస్తున్నారు. శ్రీదేవి డాన్స్ ఒక్కటుంటే ఎంత బాగుండేది!" ఒక శ్రీదేవి డై హార్డ్ ఫ్యాన్ ఆవేదన!

"ష్.. మాట్లాడొద్దు, సినిమా అర్ధం కావట్లేదు." ఆ సినిమాకి కారకుడైన నాయకుడు విసుక్కున్నాడు.

"అర్ధం కావట్లేదా! ఇది ఖచ్చితంగా అవార్డు సినిమానే." కసిగా సమాధానం.

సినిమా చివరికొచ్చింది. 

"ఈ సినిమా బ్రామ్మల సినిమా. ఒక పెళ్ళయిన బ్రామ్మలమ్మాయిని లేవదీసుకుపోవటానికి దళితుడు రెడీ అయ్యాడు. పూజారిగారు దొడ్డమనసుతో పంపించారు. ఇదేకథని రివర్స్ చేసి దళితవాడలో ఒక బ్రామ్మల కుర్రాడు దళిత యువతిని లేవదీసుకుపోయేట్లుగా.. అందుకు దళితులందరూ దొడ్డమనసుతో ఒప్పుకుంటున్నట్లుగా తీయొచ్చు. కానీ దర్శకుడు పొరబాటున కూడా అలా తీయడు. ఆయన ఎజండా వేరు." ఒక కంచె ఐలయ్య అబ్జర్వేషన్!

సినిమా అయిపోయింది. అందరం బయటకొచ్చాం. ఆ సినిమా చూద్దామని ఉబలాటపడ్డ నాయకుడి మొహం మాడిపోయుంది! 

నాకెప్పుడూ సినిమా కంటెంట్ ముఖ్యం కాదు, సినిమానెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. చాలాసార్లు సినిమా పేరు తెలీకుండా సినిమా చూశాను! సినిమా అనేది స్నేహితులతో కలిసి జస్ట్ టైమ్ పాస్, ఫన్ - అంతే!