Tuesday, 13 March 2012

తెలుగు సినిమాల్లో రేపుల కామెడీ

Disclaimer -

Rape is a heinous crime. I CONDEMN the ghastly crime in no uncertain terms. This write-up is strictly limited to Telugu movie scenes which depicted rape. I found those scenes and actors rather funny and sharing my thoughts with you.   

పుస్తకం చదివేవాళ్ళని పాఠకులు అంటారు, తెలుగులో అక్షరాస్యులు తక్కువ.. కాబట్టి పాఠకుల్ది మైనారిటీ. సినిమా చూసేవాళ్ళని ప్రేక్షకులు అంటారు, తెలుగులో నిరక్షరాస్యులు యెక్కువ.. కాబట్టి ప్రేక్షకుల్ది మైనారిటీ. సినిమా వ్యాపారం కాబట్టి, మెజారిటీ (ప్రేక్షకులు)ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు. వీళ్ళకి నచ్చితేనే సినిమా అనే వ్యాపారంలో లాభాలొస్తయ్.

సినిమా వ్యాపారంలో చాలా దారుణమైన నేరాలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వినోదభరితంగా మారిపోతుంటయ్. ఉదాహరణకి రేప్ (రేప్‌ని 'అత్యాచారం' అనాలని ఒక వాదన వున్నా ప్రస్తుతానికి రేప్ అనే రాస్తాను) అన్న టాపిక్ తీసుకుందాం. నిజజీవితంలో రేప్ అన్నది అత్యంత క్రూరమైన, దుర్మార్గమైన నేరం. అయితే తెలుగు సినిమాలకి సంబంధించి రేప్ నేరం కాదు, ఒక వినోద సాధనం. ఈ నేరాన్ని ఒక ఫైటింగు సీన్లా, ఒక ఐటం సాంగులా - రేప్‌ని బాక్సాఫీస్ ఫార్ములాగా వాడుకుంటారు.

రేప్ సినిమాల్లో హీరోకి వికలాంగురాలైన ఓ చెల్లెలు. మంచి పెర్సనాలిటీ వున్న ఆ అమ్మాయికి హీరో గోరుముద్దలు తినిపిస్తూ 'ఓ చెల్లి! నా చిట్టి తల్లి' అంటూ ఘంటసాల గొంతు అరువు తెచ్చుకుని పాటలు పాడుతుంటాడు. ఆ అమ్మాయికి సినిమాలో ఒక రేప్ సీన్ రెడీగా వుందనీ, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటుందనీ హీరోకి తప్ప థియేటర్లో అందరికీ తెలుసు. రేప్ సీన్ మొదలవగానే హాల్లో ఈలలూ, చప్పట్లూ! 

రేప్ సీన్ల వీక్షక స్పెషలిస్ట్ అయిన నా మిత్రుడొకడు ఓసారి తన రేప్ సీన్ల కోరికలు వెలిబుచ్చాడు. ముందే ఓ గంటపాటు కొన'సాగే' రేప్ సీన్ చుట్టేసి, ఆ సీన్‌ని సెన్సారోళ్ళు ఒప్పుకుంటే - ఆ తర్వాత ముందువెనుకలు ఏదోక కధని అతికించే సౌలభ్యం వుండాలి! హాలు బయట 'హౌస్ ఫుల్' బోర్డులాగా, హాల్లో ఫలానా టైముకి రేప్ సీనుంటుంది అనే బోర్డు పెట్టాలి - అప్పుడు హీరోగారు ఆయన చెల్లెలిగారి మమతలూ, అనురాగాలూ తాలూకా సీన్లు చూసే శిక్ష తప్పుతుంది!

మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనే ఒక దుర్మార్గమైన నేరం సినిమాల్లో బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపొయ్యింది. ఇప్పుడు నేరాసేదంతా సినిమా రేపులగూర్చి మాత్రమే. అంచేత చదువరులు దీన్నొక సరదా రాతగా మాత్రమే భావించ మనవి.

సినిమావాళ్ళకి ఒక నటి శరీరాన్ని ఎక్స్పోజ్ చెయ్యడానికి రేపుని మించిన అవకాశం లేదు, అందుకే వాళ్ళు రేప్ సీన్లని విపులంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తారు. మన తెలుగు సినిమాకి జాతీయ అవార్డులు రావట్లేదని ఏడ్చేకన్నా, ఉత్తమ రేప్ సీన్ కేటగిరీ ఒకటి క్రియేట్ చేయించినట్లయితే ఖచ్చితంగా చాలా అవార్డులు వచ్చేవని నా నమ్మకం.

ఎంతైనా ఆ రోజులే వేరు. రేపుల్లో ఎంత క్రియేటివిటీ! మన ఆనందం కోసం కొండల్లో, గుట్టల్లో.. ఎండనకా వాననక సత్యన్నారాయణ, ప్రభాకరరెడ్డి, రాజనాలలు ఎంత కష్టపడి రేపులు చేశారు! పాపం! పోలీస్ ఉద్యోగం సెలక్షన్ల కోసం పరిగెత్తినట్లు మైళ్ళకొద్దీ పరిగెత్తేవాళ్ళు. సత్యన్నారాయణ ఫేమస్ రేపిస్ట్. ఎందుకనో మొదట్నించి రాజనాల మొహంలో రేప్ ఫీలింగ్స్ పలకవు, కత్తియుద్ధం చేస్తున్నట్లు మొహం క్రూరంగా పెడతాడు.

రేప్ సీన్లో నటించడం అంత వీజీ కాదు. దట్టమైన మేకప్ పూసుకుని, ఆర్క్ లైట్ల వేడిని తట్టుకుంటూ.. అంతమంది మధ్యన కళ్ళల్లో కామం చూపించడం ఎంత కష్టం! నామాట నమ్మరా? యేదీ, మహానటుడు చిత్తూరు నాగయ్యని ఒక రేప్ సీన్లో నటించమనండి చూద్దాం! ఆయనకి తన లిమిటేషన్స్ తెలుసు గనకనే కష్టమైన రేపుల జోలికి పోకుండా, సులభమైన భక్తిపాత్రలు వేసుకున్నాడు!

ఇప్పుడు సినిమా రేపుల గూర్చి కొన్ని నా రీసెర్చ్ ఫైండింగ్స్. అసలు తెలుగు సినిమాల్లో రేపులు ఎందుకు ఎలా మొదలయ్యాయి? అందుక్కారణం పాత సినిమా హీరోయిన్లేనని నా అభిప్రాయం! సినిమా తొలినాళ్ళలో విలన్లు హీరోయిన్లని ఘాటుగా ప్రేమించారు, వారి ప్రేమని పొందడానికి తహతహలాడారు. పాపం వాళ్ళసలు రేపుల జోలికే పోలేదు. ఇందుకు ఉదాహరణలు చాలానే వున్నాయి.

కేవీరెడ్డి దర్శకత్వం వహించిన 'జగదేకవీరుని కథ'లో రాజనాల రాజు. బి.సరోజాదేవిని చూసి మనసు పడ్డాడు. కొత్తమంత్రి సియస్సార్‌తో కలిసి ఎన్నో ప్లాన్లేశాడు! ఎన్నో తిప్పలు పడ్డాడు! 'ప్రెగ్గడ! హే పాదరాయ ప్రెగ్గడా' అంటూ మంత్రి సాయంతో సరోజాదేవి దృష్టిలో పడ్డానికి రాజనాల చెయ్యని ప్రయత్నం లేదు. చివరాకరికి ఆడవేషం వేశాడు, తన్నులు తిన్నాడు. బి.సరోజాదేవి మాత్రం తన చిలక పలుకులతో రామారావునే ప్రేమించింది కాని రాజనాలని కన్నెత్తి చూళ్ళేదు, ఇది చాలా అన్యాయం!

మళ్ళీ కేవీరెడ్డి సినిమానే ఉదాహరణ. ఆర్.నాగేశ్వరరావు దొంగే కావచ్చు, తాగుబోతే కావచ్చు. కానీ - 'దొంగరాముడు'లో సావిత్రిని ఘోరంగా ప్రేమించాడు. దుర్మార్గుడే కానీ సావిత్రితో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ ఆ మహాతల్లి ఏంచేసింది? 'రావోయి మాఇంటికి' అంటూ పాట పాడి నమ్మకద్రోహం చేసింది. ఆరడుగుల ఆర్.నాగేశ్వరరావు ప్రేమకి వెన్నుపోటు పొడిచింది, చివరికి జైల్లో వేయించింది. ఇది మిక్కిలి గర్హనీయము.

కేవీరెడ్డి మహాదర్శకుడు, ఆయన సినిమాల్లోనే ఎంతో అన్యాయానికి గురయ్యారు మన విలన్లు. ఇంక బుద్ధున్న యే విలనైనా హీరోయిన్లనీ, హీరో చెల్లెళ్ళనీ యెలా నమ్ముతాడు? అంచేత కాన్ఫిడెన్సు కోల్పోయి, ప్రేమ విషయాల్లో హీరోల్తో పోటీపడి నెగ్గుకు రాలేమని విలన్లందరూ మూకుమ్మడిగా డిసైడైపొయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో రేపుల వైపు మళ్ళారు (దుఖంతో గొంతు పూడుకుపోతుంది, ఒక్కక్షణం విరామం).

ఇప్పుడు ద బెస్ట్ అండ్ ద వరస్ట్ రేప్ సీన్స్! బెస్ట్ రేప్ - 'డబ్బుకు లోకం దాసోహం'లో సత్యన్నారాయణ రేప్. డిస్కవరీ చానెల్లో లేడి వెంట చిరుత పరిగెత్తినట్లు వై.విజయ వెనక గంటసేపు పరిగెత్తుతాడు. ఆవిడ శారీని లాగేస్తాడు, తరవాత ఆవిడ మళ్ళీ ఫుల్ శారీతో పరిగెడుతుంటుంది! మళ్ళీ లాగేస్తాడు, మళ్ళీ ఫుల్ శారీ! ఈవిధంగా సత్యన్నారాయణ ఇరవైసార్లు చీర లాగేస్తాడు. ఇంకో పదిసార్లు జాకెట్ చించేస్తాడు! ఎడిటింగ్ లోపం ఆ సినిమాని గుర్తుండిపోయ్యేలా చేసింది. 

వరస్ట్ రేప్ సీన్ - 'బంగారు సంకెళ్ళు'లో గుమ్మడి రేప్. గుమ్మడి ఇబ్బందిగా, దిగులుగా జమున చెయ్యి పట్టుకుంటాడు. జమున ఏదో అంటుంది. తరవాత గుమ్మడి క్లోజ్అప్. అది ఏడుపో, నవ్వో అర్ధం కాని ఒక విచిత్ర ఎక్స్‌ప్రెషన్. అప్పడిగేవాడు కూడా మొహం అంత దీనంగా పెట్టలేడు.

ఇంకో వరస్ట్ రేప్ - 'అంతా మన మంచికే'లో చూడొచ్చు. ఒక రౌడీగాడు బయ్యంబయ్యంగా భానుమతి చేతిని సెకనులో పదోవంతుసేపు పట్టుకుంటాడు. భానుమతి వాణ్ని ఈడ్చి ఒక్క తన్ను తంతుంది, అంతే! వాడింక లేవడు! అంత పిరికి సన్నాసికి రేపెందుకో మనకి తెలీదు.

ఆరోగ్యంగా వున్న స్త్రీని ఒక్కడే మగాడు రేప్ చెయ్యడం అసాధ్యం అని ఫోరెన్సిక్ మెడిసిన్లో చదివి బిత్తరపోయ్యాను. అంటే ఇన్నాళ్ళూ తెలుగు సినిమావాళ్ళు నన్ను మోసం చేశారా!? లేక తెలుగు హీరొయిన్లు తమని రక్షించుకునే ప్రయత్నం చెయ్యకుండా, హీరోని ఎలివేట్ చెయ్యడానికి 'కెవ్వుకెవ్వు' మన్నారా? ఏమిటో అంతా గజిబిజి, గందరగోళం.

కాలంతో పాటు క్రమేణా రేపులు అంతరించిపోయాయి. రేపు చుట్టూతా తిరిగే కధలు చూడ్డం అలవాటు పడ్డ నాలాంటి ప్రేక్షకులూ అంతరించిపోయారు (అంటే చచ్చారని కాదు, సినిమాలు చూడ్డం మానేశారని అర్ధం). ఇవ్వాళ జనాలకి సినిమా రేపంటే యేంటో తెలీకుండాపోయింది (ఇప్పుడు చిత్తూరు నాగయ్యలా దీర్ఘ నిట్టూర్పు)!

ముగింపు -

ఇందాక చెప్పిన విషయాన్నే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనేది ఒక దారుణమైన నేరం. ఈ నేరం లోతుపాతులు ఫోరెన్సిక్ సైకియాట్రీ చదువుకున్న నాకు బాగా తెలుసు. ఈ రాత ఉద్దేశం - కేవలం మన సినిమా రేపుల గూర్చి సరదాగా రాయడం మాత్రమే, నథింగ్ మోర్. థాంక్స్ ఫర్ రీడింగ్!  

(updated & posted in fb on 4/2/2018)