Sunday 18 March 2012

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?" (ఒక నడక మిషన్ కథ)


"ఇంకా ఎంత దూరం ఉంది నాయనా?"

'దేవదాసు' క్లైమాక్స్ గుర్తుంది కదూ! దుర్గాపురం చేరేదాకా బతుకుతానో లేదో అనే దేవదాసు ఆర్తి, ఆతృత.. పారుని చూడకుండానే చనిపోతానేమోననే ఆవేదన.. గుండెని కరిగించి కన్నీటిని వరదలా ప్రవహింపచేసే ఉద్వేగపూరిత ఘట్టం. సీతారాం (బండి నడిపిన వ్యక్తి) నటన అపూర్వం. తెలుగుసినిమా చరిత్రలో నన్ను ఇంతకన్నా ఏడిపించిన సన్నివేశం మరోటి లేదు.
               
ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే - ప్రతిరోజూ ఉదయం నేను కూడా దేవదాసులా ఫీలవుతుంటాను. దేవదాసుకి పార్వతి బాధ, నాకు ట్రెడ్‌మిల్ బాధ! ఈ డాక్టర్లు రాక్షసులకి తక్కువ, పిశాచాలకి ఎక్కువ. ఎక్సర్సైజ్ చెయ్యకపొతే చస్తావని బెదిరిస్తుంటారు. ఆ డాక్టరే భార్య రూపేణా ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఎడారిలో ఎండమావి వంటిదని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.

కృష్ణకుమారి అక్కయ్యా! భార్యలకి భర్తల ఆరోగ్యం పట్ల తీవ్రమైన శ్రద్ధ ఎందుకు? మన పవిత్ర భారతదేశంలో భార్యలకి భర్తల పట్ల గల ఘోరప్రేమే కారణమని నేనూ, 'నీ బొంద! అది ప్రేమా కాదు, దోమా కాదు. మొగుడు చస్తే బాధ్యతలు నెత్తిమీద పడతయ్యనే బయ్యం! ప్రతిరోజూ నోరు  నొప్పెట్టేలా తిట్టుకోడానికి కొత్తమనిషి దొరకడనే అభద్రతా భావం!' అని నా స్నేహితుడూ వాదించుకుంటున్నాం. ఎవరు కరక్టో చెప్పండి. మీరు చెప్పేదాకా మేం వాదించుకుంటూనే వుంటాం! చెప్పకపొతే కొట్టుకుని చచ్చిపోతాం!!

'ట్రెడ్‌మిల్ ఎందుకయ్యా? హాయిగా పొద్దున్నే గ్రౌండ్ లో వాకింగ్ చెయ్యొచ్చుగా?' అని మీకు అనుమానం రావొచ్చు. 'పొద్దున్నే నిద్రలేచి రోడ్డున పడకురోయ్! నిన్ను ఏ పేపరోడో, పాలపేకెట్లోడో అనుకుంటారు.' అని మా సుబ్బు భయపెడ్తాడు. కుక్కలు కరుస్తయ్యని కూడా బెదరగొడతాడు. 

అసలు విషయం - నేనెక్కడ వాకింగ్ చేసి ఆరోగ్యం మూట గట్టుకుంటామేమోనని సుబ్బు భయం! కానీ - నేను స్నేహితుల మాటకి విలువిచ్చే మనిషిని! అందుకే - ఉదయాన్నే లేవకుండా బారెడు పొద్దెక్కేదాకా నిద్రోవడం, పొరబాటున లేచినా వాకింగుకి దూరంగా ఉండడం చేస్తున్నాను. తప్పదు, స్నేహధర్మం!

అయితే అన్నిరోజులూ ఒకలా ఉండవు. నేను వాకింగ్ చెయ్యక తప్పని పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నిరోజులు ఇంటికి దగ్గరగా వున్న గ్రౌండ్‌కి వెళ్లాను. అక్కడ నడిచేవాళ్ళని చూసి ఆశ్చర్యమేసింది. వాకింగ్ ట్రాక్ మీద క్రమబద్దంగా, హడావుడిగా నడుస్తున్న వారంతా బుద్ధిమాన్ గొర్రెల్లా కనిపించారు.

నడకలో కూడా ఒక్కోడిది ఒక్కో స్టైల్. ఒకడిది అడుగులో అడుగేస్తూ పెళ్లినడకయితే, ఇంకొకడిది 'పదండి ముందుకు పదండి తోసుకు' అన్నట్లు పరుగులాంటి నడక. అక్కడ చాలామంది వాకర్లు కాదు, టాకర్లు మాత్రమే! కొందరైతే మొక్కుబడిగా నాలుగు రౌండ్లు నడిచి పక్కనే ఉన్న హోటల్లో అరడజను నేతిడ్లీలు ఆరగించి వెళ్తున్నారు! ఆరోగ్యంగా జీవించడానికి యిన్నికష్టాలు పడాలా? వామ్మో! నా వల్లకాదు.

కానీ 'నడక' లేని జీవితం గాలిలో దీపం వంటిదని డాక్టర్లు ఘోషిస్తున్నారు, భయపెడ్తున్నారు, అసలు వాళ్ళుపెట్టే ఈ భయంతో చచ్చేట్లున్నాం. అందువల్ల 'ట్రెడ్‌మిల్' అని ఆంగ్లంలో పిలవబడుతున్న ఒక నడక మిషన్ని కొన్నాను.

ట్రెడ్‌మిల్ - బుజ్జిముండ! చూడ్డానికి అందంగా, గంభీరంగా వుంటుంది. కానీ ఈ మిషన్ మీద నడవడం మాత్రం దుర్భరం. కింద పట్టా వెనక్కి కదిలి పోతుంటుంది. మనని వెనక్కి లాక్కెళ్ళి పోదామని, పడేద్దామని ఆ పట్టా తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. కింద పడితే మూతి పళ్ళు రాల్తాయి కావున, పడకుండా మనకి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విధంగా కదిలే ఒక పట్టాతో మనం చేసే నిరంతర పోరాటన్నే 'ట్రెడ్‌మిల్ వాకింగ్' అంటారు!

మిషన్ ముందు ఒక బల్ల. దానిమీద ఎంత దూరం? ఎంత సమయం? ఎన్ని కేలరీలు? - ఇట్లా ఏవేవో లెక్కలు. 'జాగ్రత్త, ఇరువైపులా ఉన్న కడ్డీలని జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజుల్లో కరెంట్ యే క్షణాన్నైనా పోవచ్చును. మీ భద్రతకి మా బాధ్యత లేదు!' ఇలా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నడుస్తూ, అప్పుడప్పుడు పరిగెడుతూ- క్షణక్షణం ఆశగా ఎదురుగానున్న మీటర్లపై కాలము, దూరము అంకెలు చూసుకుంటూ - 'విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం.' అని పాడుకుంటూ -

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?"

నా ఏడుపు వాకింగ్ మా 'గుండెలు తీసిన బంటు' గోఖలేకి తెలిసింది. 'అలా ఏడుస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యకు, ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి.' అన్నాడు. ఈ గోఖలేకి వొక్కటే పని - గుండె ఆపరేషన్లు చెయ్యడం. నేను మాత్రం చాలా బిజీ! అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సమస్యలోంచి ఎలా బయటపడుతుంది? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చైనా ఇండియాకి సహకరిస్తుందా? లేదా? ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గూర్చి ఆలోచించాల్సిన గురుతర బాధ్యతలు నామీదున్నాయి.

అయినా ఎంజాయ్ చేస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యడమేమిటి! ఎంజాయ్ చెయ్యడానికి ఇదేమన్నా జ్యోతిలక్ష్మి డాన్సా? లేక సింగిల్ మాల్ట్ విస్కీయా? ఒరే మందుల కంపెనీ బాబులూ! జలుబుకీ, గజ్జికీ కూడా వందల కొద్దీ మందుల్ని మార్కెట్ చేస్తారు. పొద్దున్నే ఈ వాకింగులు, పీకింగులు లేకండా ఏదన్నా మందులు కనిపెట్టి చావండ్రా! నడవలేక ఇక్కడ కువసాలు కదిలిపోతున్నాయ్! 

(posted in fb on 28 Dec 2017)