Monday, 26 March 2012

కళాపోషణ

ఆయనో ప్రముఖ కాంట్రాక్టర్, కాంగ్రెస్ నాయకుడు, నిష్టాగరిష్టుడు. తన పుట్టిన్రోజు కళారంగానికి సుదినం అని ఆయన అభిప్రాయం. ఆయనకా ఆభిప్రాయం వుండటంలో ఆశ్చర్యం లేదు! కానీ ఆయనగారి ఆతిధ్యం పొంది ఆయన్ని కీర్తించడానికి అనేక ప్రముఖులు క్యూ కట్టడం మాత్రం ఆశ్చర్యకరమే! 

కళలు నానావిధములు. ప్రజలకి పనికొచ్చే కళలు, ప్రజలకి పనికిరాని కళలు. ఈ కళాకారుల్లో కొందరికి ఆర్ధికంగా దుస్థితి అయితే మరికొందరిది గుర్తింపు కోసం వెంపర్లాడే దుస్థితి. వీళ్ళంతా యేదోరకంగా డబ్బు సంపాదించినవారి పంచన చేరి, వారిని మెప్పించి తమక్కావలసిందాన్ని సంపాదించుకుంటారు.      
               
పూర్వం రాజులు తమ యుద్ధవ్యాపకాలు, ప్రజల నడ్డివిరిచే పన్నుల వసూళ్ళూ వంటి పనుల్లో బిజీగా వుండేవాళ్ళు. ఈ పన్లయ్యాక సేద తీరడానికి వారికి వినోదం అవసరమయ్యేది. అందుకోసం రాజులకి సంగీతం, నృత్యం, కవిత్వం తెలిసిన కళాకారుల్తో పని పడేది. రాజులు వారి దగ్గర్నుండి కొద్దిగా వినోదం పొంది, ఇంకొద్దిగా కీర్తింపచేసుకుని ఖరీదైన బహుమానాల్ని దానంగా ఇచ్చేవారు. 

ఈ కళాకారులు రాజుల చల్లని నీడలో సుఖంగా సేద తీరుతూ ప్రబందాలు, కవితల్నీ రాసేవాళ్ళు. వీళ్ళు బ్రతక నేర్చిన కళాకారులు, అందుకే పొరబాటున కూడా ప్రజల పక్షాన మాట్లాడరు. 'ఓ రాజా! పొరుగు రాజ్యాల మీదకి అనవసరంగా యుద్ధానికి పోనేల? ఈ సంవత్సరం కరువొచ్చిందికదా! పన్నులో ఓ దమ్మిడీ తగ్గించరాదా?' అని సలహాలిస్తే రాజుపక్కనుండే సేనాపతి తక్షణం తమకి శిరచ్చేదన కావిస్తాడని వీరికి తెలుసు.

గుప్తుడి స్పాన్సర్డ్ కవులు గుప్తుల కాలం స్వర్ణయుగమనీ, కృష్ణదేవరాయలు స్పాన్సర్డ్ కవులు రాయలవారి పాలనలో రత్నాలు రాసులు పోసుకుని అమ్మేవారని రాసుకుంటూ (యే ఎండకా గొడుగు పడుతూ) స్వామికార్యము, స్వకార్యము చక్కపెట్టుకున్నారు. ఇప్పటి ప్రభుత్వాలు తమ విధేయులకి పద్మ అవార్డులు ఇచ్చినట్లే.. ఆరోజుల్లో రాజులు కవులకి, కళాకారులకి కాళ్ళూ చేతులకి కంకణాలు, కడియాలు తొడిగేవాళ్ళు.     
                 
కాలక్రమేణా రాజులు అంతరించిపొయ్యారు. వారి స్థానంలో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు వచ్చి చేరారు. ఆనాటి రాజులకి మల్లె ఇప్పటి డబ్బున్నమారాజుల్లో కొందరికి 'కలాపోసన' అనే దురదుంది. సహారా బాబు ప్రపంచ సెలెబ్రెటీలకి తన లోయనగరంలో 'సపరివార ఆతిథ్యం' ఇస్తాడు. విజయ మల్లయ్య కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం కోట్లు గుమ్మరిస్తాడు, ముద్దుగుమ్మల్తో జల్సా చేస్తాడు. కాంగ్రెస్ కాంట్రాక్టర్ తన పుట్టిన్రోజున నచ్చినవారికి అవార్డులు (?) ఇస్తాడు.

మా సుబ్బు ఇట్లాంటి విషయాల్ని తేలిగ్గా తీసుకొమ్మమంటాడు.

"నువ్వు వ్యక్తులకి వుండని, వుండాల్సిన అవసరం లేని గొప్పగుణాల్ని ఆపాదిస్తున్నావ్. అక్కడ ఇచ్చేవాళ్ళకీ, పుచ్చుకునేవాళ్ళకీ, పొగిడే ప్రముఖులకీ.. ఎవరి లెక్కలు వారికున్నయ్. లెక్కల్లేనిదల్లా వాళ్ళని సీరియస్‌గా తీసుకునే నీకే! లైట్ తీస్కో బ్రదర్!" 

ఎస్, సుబ్బూ ఈజ్ రైట్!