Thursday 15 March 2012

సచిన్ టెండూల్కర్.. సున్నాల సమస్య

"ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నాకు? రిచర్డ్ హాడ్లీకి ఇడ్లీ తినిపించాను, మెక్‌గ్రాత్‌ని మంచినీళ్ళు తాగించాను, షేన్ వార్న్‌కి వార్నీషు వేశాను, అక్రంని అప్పడంలా నమిలేశాను, ఉమర్ గుల్‌ని గుడ్డలా ఉతికేశాను (ప్రాస కోసం ప్రయాసల్ని పాఠకులు గుర్తించగలరు). కానీ.. కానీ.. ఈ వందోసెంచరీ ఎందుకు చెయ్యలేకపోతున్నాను? చెయ్యలేకపోతున్నాను? చెయ్యలేకపోతున్నాను?"

అదో ఐదు నక్షత్రాల హోటల్, అందులో ఓ విశాలమైన గది. గది మధ్యలో నిద్రపోతున్న గున్నేనుగులా డబుల్ కాట్, దానిపై మంచు కప్పేసినట్లు తెల్లని బెడ్ షీట్. ఓ పక్కగా అందమైన సోఫా. ఆ మూలగా ఒక టేకుబల్ల, దానిపై టేబుల్ లైట్.

ప్రస్తుతం ఆ గదిలో ఒక నడివయసు వ్యక్తి సోఫాలో జారగిలిపడి శూన్యంలోకి చూస్తున్నాడు. పరీక్షగా చూస్తే అతను తీవ్రఆలోచనల్లో మునిగున్నాడని అర్ధమౌతుంది. అతడి నామధేయం సచిన్ టెండూల్కర్, క్రికెట్ క్రీడాకారుడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులు, బ్యాంకులవారిగా కోట్లాది రూపాయిలు అతగాడి సొంతం.

విధి బలీయమైనది, క్రూరమైనది కూడా! క్రికెట్ బ్యాటుతో ప్రపంచాన్ని శాసించిన సచిన్బాబుకి ఈమధ్యన అనేక కష్టాలు మరియూ కడగండ్లు! అతనిప్పుడు అశోకవనంలో సీతలా (దుఃఖించడానికి ఆడామగా తేడాలుండవ్) శోకమూర్తియై, ఆలోచనా కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

'అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను గదా! సాయిబాబా బొమ్మ జేబులో పెట్టుకుంటున్నాను. బ్యాటు, హెల్మెట్లకి లార్డ్ బాలాజీ టెంపుల్లో స్పెషల్ పూజలు చేయిస్తున్నాను. కారు నంబర్ మార్చాను, ఇల్లు మారాను, ఈశాన్యం వైపు తిరిగి కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను. ఎర్రరంగు కలిసొస్తుందంటే ఎర్రరిబ్బను కట్ డ్రాయర్లో దోపుకుని బ్యాటింగు చేస్తున్నాను. కానీ.. కానీ.. ఎందుకిలా?" బాధగా నిట్టూర్చాడు, కంట్లో పల్చటి కన్నీటి పొర.

ఇంతలో కిర్రుమంటూ గది తలుపు తెరుచుకుంది (గది తలుపు ఎప్పుడూ కిర్రుమనే తెరుచుకుంటుంది, ఇంకోలా తెరుచుకోలేదు). ఒక నడివయసువాడు.. బట్టతల, పిల్లి గెడ్డంతో ఉన్నవాడు.. ఫుల్ సూట్, బ్లాక్ షూ  ధరించినవాడు.. లోపలకొచ్చి సచిన్‌కి ఎదురుగానున్న సోఫాలో కూర్చున్నాడు. అతని తల ఇత్తడి చెంబులా, కళ్ళు గోళీకాయల్లా ఉన్నాయి. శరీరం బక్కగా, సరివి కట్టెకి సూటూబూటూ తొడిగినట్లున్నాడు. అతగాడు ఆ డ్రస్సు ఠీవీ కోసం కన్నా, గాలొస్తే ఎగిరిపోకుండా రక్షించుకుందుకు వేసుకున్నాడనిపిస్తుంది.

"సచిన్! అయాం డాక్టర్ మరణం. నాపేరు విండానికి గమ్మత్తుగా వుంటుంది. మా తాత చనిపోయిన రోజే నేను పుట్టాన్ట. నాతండ్రి ప్రముఖ నాస్తికుడు. అంచేత నా తండ్రి తన తండ్రి మరణానికి గుర్తుగా నాపేరు 'మరణం'గా ఫిక్సయ్యాడు. నేను ఆంధ్రాలో ప్రముఖ సైకాలజిస్టుని. మీకు సాయం చేద్దామని వచ్చాను." అన్నాడు డాక్టర్ మరణం.

టెండూల్కర్‌కి విసుగ్గా ఉంది. కానీ కష్టాల్లో ఉన్నాడు, నమ్మకాల్ని తీవ్రంగా నమ్మినవాడు. అంచేత సహనం వహించి డాక్టర్ మరణం అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పాడు.

"చివరి ప్రశ్న. ఈమధ్య మీకు ఒకబంతి రెండుబంతులుగా కనిపిస్తుందా?" అడిగాడు డాక్టర్ మరణం.

సచిన్ ఒక్కక్షణం ఆలోచింఛి, అవునన్నట్లు తల ఊపాడు. విషయం అర్ధమయిందన్నట్లు తల పంకించాడు డాక్టర్ మరణం.

"సచిన్! మీ కేస్ చాలా సింపుల్. మీరు మీ వందో సెంచరీ గూర్చి ప్రీ ఆక్యుపై అయ్యున్నారు. పొద్దస్తమానం వంద సంఖ్య గూర్చే ఆలోచించడం మూలానా,  మీకు తెలీకుండానే ఆ వందలో ఉన్న రెండుసున్నాలు మీ మనసులో బలంగా నాటుకుపొయ్యాయి. అందుకే మీకు గ్రౌండులో కూడా రెండుసున్నాలు కనబడుతున్నయ్. గ్రౌండులో రెండుసున్నాలంటే రెండుబంతులు. కావున మీకు ఒకబంతే రెండుగా కనిపిస్తుంది. అంచేతనే మీరు ప్రతి అడ్డమైనవాడికి మీ వికెట్ సమర్పించుకుంటున్నారు."

సచిన్ ఆసక్తిగా అడిగాడు - "ఇప్పుడు నేనేం చెయ్యాలి?"

"వెరీ సింపుల్! మీ రెండుసున్నాల్ని ఒకసున్నాకి మారిస్తే సమస్య పరిష్కారం అయినట్లే. ఈక్షణం నుండి మీరు వంద గూర్చి ఆలోచించడం మానెయ్యండి. ఇప్పట్నించి మీ సంఖ్య పది. మీరు ఈ పది నంబర్ని జపిస్తూనే వుండండి. మనసులోంచి వంద చెరిగిపోయి పదిముద్ర పడాలి. అప్పుడు మీకిక బంతి ఒకటిగానే కనిపిస్తుంది. పదిలో ఉంది ఒక సున్నానే గదా!" అంటూ లేచాడు డాక్టర్ మరణం.

మరి - డాక్టర్ మరణం సలహా సచినుడికి పని చేస్తుందా? చూద్దాం!