Tuesday 20 March 2012

డిజా వు


"ప్రధానమంత్రిజీ! ప్రధానమంత్రిజీ! రక్షించండి." నిండుసభలోకి సావిత్రి స్టైల్లో ఏడ్చుకుంటూ పరుగున వచ్చాడు దినేష్ త్రివేది.

సభికులు (పార్లమెంట్ సభ్యులు) బిత్తరపొయ్యారు. జరుగుతున్న (లోక్) సభ ఒక ముఖ్యమైన (బజెట్) సమావేశం. త్రివేదిని కీచకుడిలా తరుముకుంటూ వచ్చిన మమతా బెనర్జీ ఒక్కక్షణం ఆగి సభని పరికించింది. సింహాసనం మీదనున్న మన్మోహన్ సింగ్‌ని చూసి నిర్లక్ష్యంగా నవ్వింది. మన్మోహన్ ముక్కామల స్టైల్లో ఇబ్బందిగా కదిలాడు.

"హు.. ఇదొక సభ! వీళ్ళందరూ సభ్యులు! ఈ ప్రధానమంత్రి నేను కూర్చండబెట్టిన మట్టిబొమ్మ. ఎవరు?.. ఎవరు నన్నెదిరించువారు?" అంటూ ఎస్వీరంగారావులా గర్జించింది మమత.

"అయ్యో! మమతా దీదీ! నీ పరాక్రమం నాకు తెలియనిదా! కానీ నిండుసభ కొలువై ఉండగా నీవిటుల త్రివేది వెంటపడుట.. " నీళ్ళు నమిలాడు విరాట మహారాజు.. సారీ, మన్మోహనుడు.

"నీవా నాకు సభామర్యాదలు నేర్పునది! మన్మోహనా! నువ్వేం చేస్తావో నాకనవసరం. తెల్లవారేసరికి ఈ త్రివేది రాజీనామా నా మందిరానికి చేరాలి. లేదా నీ యూపియే 2 ని సర్వనాశనం చేస్తాను. నీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటావో నీట ముంచుకుంటావో ఇహ నీ ఇష్టం." అంటూ విసవిసా సభ నుండి నిష్క్రమించింది మమతా బెనర్జీ!

(పొద్దున న్యూస్‌పేపర్ చదువుతుంటే - ఢిల్లీలో జరుగుతున్న రాజకీయం ఇంతకుముందెక్కడో చూసినట్లు అనిపించింది. కొద్దిసేపు ఆలోచించాక 'నర్తనశాల' గుర్తొచ్చింది.)