Wednesday 14 March 2012

రాహులుని రోదన

అది టెన్ జన్‌పథ్. విశాలమైన ఇల్లు, పొడవాటి వరండా. చిన్నబాబు రాహుల్ గాంధి సీరియస్‌గా వున్నాడు. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయ్. వరండాలో రాజ్యసభ సభ్యత్వం అడుక్కోడానికి వచ్చిన లీడర్లు గొడవారా వేసున్న చెక్కబల్లల మీద కునికిపాట్లు పడుతున్నారు. రాహుల్ బాబుని చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడి, తొట్రుపడుతూ గబుక్కున నించొని, వొంగొంగి నమస్కారాలు చేశారు. రాహులుడు వారిని కన్నెత్తి కూడా చూళ్ళేదు.

గదులన్నీ దాటుకుంటూ సరాసరి తల్లి బెడ్రూంలోకి వెళ్ళాడు. సోనియా గాంధి మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది. కొడుకు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచింది.

"రా నాన్నా రా! ఇలావచ్చి నాపక్కన కూర్చో!" అంటూ ఆప్యాయంగా పిలిచింది.

రాహులుడు తల్లి పక్కన కూర్చున్నాడు. దిగులుగా ఉన్న కొడుకుని చూసి కంగారుపడింది సోనియా.

"ఎలక్షన్లలో ఓడిపోవడం బాధగానే ఉంటుంది కన్నా! గడ్డం చేయించుకొమ్మంటినే. అసలే ఎండాకాలం, దురద పెడుతుంది నాయనా." నీరసంగా అంది సోనియా.

రాహుల్ ఒక్కసారిగా చిన్నపిల్లాళ్ళా భోరున యేడవడం మొదలెట్టాడు! 

సోనియా భయపడిపోయింది. కొంపదీసి రాహుల్ని గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసిందా ఏమిటి! 

కొద్దిసేపటికి తేరుకున్నాడు రాహుల్, కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకున్నాడు.

"అమ్మా! మనం మన ఇటలీ వెళ్లిపోదాం, ఈ దేశంలో ఉండొద్దు." ఏడుపు గొంతుతో అన్నాడు.

"ఏమైంది నాన్నా!" కన్నతల్లి తల్లడిల్లిపోయింది.

రాహుల్ గాంధి జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు.

"పొద్దున్నించి వొకటే మెసేజిలు, చూళ్ళేక చస్తున్నా!" అంటూ ఫోన్లో మెసెజిలు తల్లికి చూపించాడు.

"విషయం ఏంటి బంగారం!" అయోమయంగా అడిగింది సోనియమ్మ.

"కంగ్రాట్స్ రాహుల్. ఎ కరెక్ట్ డెసిషన్ ఎట్ కరెక్ట్ టైం. వి ఆర్ ఎరేంజింగ్ ఎ ఫేర్ వెల్ పార్టీ టు యు." అన్న మెసేజ్‌ని తల్లికి చూపించాడు రాహుల్.

"ఎవరికో పంపాల్సిన మెసేజ్ పొరబాటున నీకు పంపారు కన్నా! డోంట్ వర్రీ." ధైర్యం చెప్పింది సోనియా.

"నా ఏడుపూ అదేనమ్మా! రిటైర్ అయ్యింది క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. జనాలేమో నేను రిటైరయ్యాననుకుని పండగ చేసుకుంటున్నారు! నా రిటైర్మెంటుని స్వాగతిస్తూ వేలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయమ్మా. మొదట్లో నేనూ పొరబాటున పంపుతున్నారనుకున్నాను, కానీ కాదు. రాహుల్ అంటే నేనేననుకుని ప్రజలు నా రిటైర్మెంటునే స్వాగతిస్తూ పండగ చేసుకుంటున్నారు!" మళ్ళీ బావురుమన్నాడు రాహుల్ గాంధి.

సోనియాకి రాహుల్ని ఎలా ఓదార్చాలో తెలీక అయోమయంగా చూస్తుండిపోయింది!