Wednesday 1 August 2012

నాదీ ఒక పేరేనా?! హ్మ్.. !

ఇవ్వాళ సోమవారం. ఆస్పత్రి పేషంట్లతో హడావుడిగా వుంది. ఆవిడకి సుమారు ముప్పయ్యేళ్ళుండొచ్చు. నల్లగా వుంది, పొట్టిగా వుంది, గుండ్రంగా ఉంది. విష్ చేస్తూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. ఔట్ పేషంట్ స్లిప్ మీద ఆవిడ పేరు చూశాను. 

'వెంకట రమణ'

అబ్బా! మానుతున్న గాయంలో నిమ్మరసం పిండినంత బాధ. ఈ గాయం ఈ జన్మకి మానదేమో - నాదీ ఒక పేరేనా?! హ్మ్ .. !

'నేములో నేమున్నది?' అంటారు. కానీ - నేములోనే చాలా వుంది, ఇంకా మాట్లాడితే - చచ్చేంత ఉంది. నా పేరు చూడండి - 'వెంకట రమణ'. ఈ పేరు నాకస్సలు నచ్చదు. ఇది ఉభయలింగ నామం. అర్ధం కాలేదా? తెలుగులో చెబుతాను - ఈపేరుకి లింగం లేదు! అనగా ఆడా, మగలిద్దరికీ ఈపేరు ఉంటుంది!

నాపేరు నాన్న పూర్వీకులది. ఆయన నానమ్మ పేరు రమణమ్మ. ఇంకానయం! ఆపేరు ఏ పిచ్చమ్మో అవలేదు. అప్పుడు నేను పిచ్చయ్య నయిపోయేవాణ్ణి. నాన్నకి దేవుడు లేడు కానీ తన వంశం గొప్పదని నమ్మకం. అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. ఈ విధంగా - అన్ని విషయాల్లో కీచులాడుకునే అమ్మానాన్న, నాపేరు విషయంలో మాత్రం వొక అంగీకారానికొచ్చి - 'వెంకట రమణ' అని పెట్టేశారు.

నన్ను చిన్నప్పుడు 'రమణి!' అంటూ ముద్దుగా పిలిచేవారు. స్కూల్  ఫైనల్ చదువుతుండగా - ఒకరోజు 'రమణి' అనబడు శృంగార కథల పుస్తకం (వెచ్చటి ఊపిరి, వేడినిట్టూర్పులతో) చదవడం తటస్థించినది. ఆ మేగజైన్ నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. కథలయితే బాగున్నాయిగానీ, అర్జంటుగా నన్ను 'రమణి' అని ఎవరూ పిలవకుండా కట్టడి చేసేశాను!

నాకు హైస్కూల్లో స్థాయిలో కూడా 'ణ' రాయడం సరీగ్గా వచ్చేది కాదు. తెలుగు లిపిలో అనేక మెలికలతో కూడిన 'ణ' అక్షరం అత్యంత కష్టమైనదని నా నిశ్చితాభిప్రాయం. మా తెలుగు మేస్టరు 'నీ పేరు నువ్వే తప్పు రాసుకుంటే ఎలా?' అంటూ విసుక్కునేవారు. మహానుభావుడు! ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు - మూడేళ్ళపాటు సవర్ణదీర్ఘ సంధి మాకు నేర్పడానికి విఫలయత్నం చేశారు. నాకు మాత్రం గుణసంధి కూడా కొద్దిగా వచ్చు, మాక్లాసులో నేను బ్రిలియంటుని లేండి!

ఎనాటమి పరీక్ష మార్కుల లిస్టు నోటీస్ బోర్డులో పెట్టారు. నాపేరు పక్కన (F) అని ఉంది! హడావుడిగా ఎనాటమి ట్యూటర్ని కలిశాను. ఆయనకి నా జెండర్ ఘోష అర్ధం కాలేదు. అందుకే కూల్ గా 'నీ నంబరు, మార్కులూ సరీగ్గానే ఉన్నాయిగా? ఈసారికి ఎడ్జస్టయిపో!' అన్నాడు. నాకు మండింది. నేను ఆడవాడిగా ఎలా ఎడ్జస్టయ్యేది! 

గట్టిగా అడగాలంటే భయం, మొహమాటం. నాపేరు పక్కన ఈ మాయదారి (F) వల్ల అమ్మాయిలు నన్నుచూసి 'రవణమ్మ' అంటూ కిసుక్కుమనుకోవడం గుర్తుంది. నేనంటే పడని ఒకళ్ళిద్దరు కసిగా 'ఒరే! వంకర్రవణా!' అని పిలవడం కూడా గుర్తుంది.

ఇడ్లీసాంబార్ తిందామని హోటలుకి వెళ్తాను. అక్కడ టేబుళ్ళు తుడిచే చింపిరిజుట్టువాడు రమణ! 'అరేయ్ రవణగా! ఈ టేబులు మీద ఈగలేందిరా? సరీగ్గా తుడవరా దున్నపోతు!' కత్తితో పొడిచినట్లుండేది. నేను వర్గ ధృక్పదంతో రాయట్లేదు, నామ ధృక్పదంతో రాస్తున్నాను.

నా డొక్కుస్కూటర్ పంక్చర్. నెట్టుకుంటూ, రొప్పుకుంటూ.. పంక్చర్ షాపుకెళ్ళాను. అక్కడా నాఖర్మ కాలింది. అక్కడి బక్కచిక్కిన అసిస్టెంటు రమణ! 'క్యాబే సాలా! చక్రం హిప్పటం హెంతసేపురా సువ్వర్ కా బచ్చా!' 

నా పేరుని హత్య చెయ్యడంలో తెలుగు సినిమావాళ్ళు కూడా తమదైన పాత్ర పోషించారు. చాలా సినిమాల్లో హీరోయిన్ తమ్ముడి పేరు రమణ! ఆ వెధవ ఏ తిక్కలోడో, తింగరోడో అయ్యుంటాడు. వాణ్ణి పోషించటానికి హీరోయిన్ నానా కష్టాలు పడుతుంది. సినిమాలో ఆ దరిద్రుడి పాత్ర ప్రయోజనం హీరోయిన్ కష్టాలు పెంచడం తప్ప మరేదీ కాదు. 

నాకు అర్ధం కానిది.. పొరబాటున కూడా ఏ ఉత్తముడికో, ఏ డాక్టరుకో (ఒక మనిషి ఉత్తముడో, డాక్టరో.. ఏదో ఒకటే అయ్యుంటాడని.. డాక్టర్లల్లో ఉత్తములుండరని మా సుబ్బు అంటుంటాడు.) -  'వెంకట రమణ' అన్న పేరు ఎందుకుండదు అనేది. 

తెలుగేతరులకి నాపేరు 'రమన' అవుతుంది! వారి 'న'ని.. 'ణ'గా మారుద్దామని తీవ్రప్రయత్నాలు చేశాను. ఆ ప్రాసెస్ లో నాపేరు 'రామన్న', 'రావణ్ణ' అంటూ మరింత ఖూనీకి గురయ్యేది. ఆవిధంగా నేను MD చేస్తున్న రోజుల్లో పంజాబీలు, బెంగాలీయులు నాపేరుని సామూహికంగా పిసికి పరోటాలు వేసేవాళ్ళు.

నాకెందుకో ఈ 'రమణ' అన్నపేరు బోడిగా, తోకతెగిన బల్లిలా ఉంటుంది. అందుకే కామోలు - నా పేషంట్లు నన్ను రమణయ్యగారు, రమణారావుగారు, రమణమూర్తిగారు అంటూ తోకలు తగిలిస్తారు. అప్పుడు నేను దిగులు చెందుతాను. 

నాపేరు ఏ నరసింహారావో, రంగారావో అయితే ఎంత బాగుండేది! ఈపేర్లలో ఎంత గొప్ప మెసేజుంది! ఈ నామధేయుడు మగవాడు, తెలుగువాడు, గంభీరమైనవాడు.. ఇంకా చాలా 'వాడు'. నాకా లక్జరీ లేదు. నన్ను చూస్తేకానీ నేనెవరో తెలీదు. 

కాలం గడుస్తున్న కొద్దీ నాకు నాపేరుపై గల 'పేరు న్యూనతాభావం' పోయింది. ఇప్పుడు పెద్దమనిషినయినాను. పరిణితి చెందాను (ఇదిమాత్రం డౌటే). అంచేత నాపేరు గూర్చి వర్రీ అవడం మానేశాను. అయితే - కొందరు పేషంట్లు అప్పుడప్పుడు ఇట్లా గుండెల్లో కత్తులు, కొడవళ్ళు గుచ్చుతుంటారు.

ఇవ్విధముగా బ్రతుకుబండిని గవాస్కరుని బ్యాటింగు వలె స్తబ్దుగా లాగుచుండగా, ఒక దుర్దినాన నా కజిన్ ప్రసాదుగాడు తగలడ్డాడు. నా చిన్నాన్న కొడుకైన ప్రసాదు చిన్నాచితక వ్యాపారాలు చేసి, అన్నిట్లో నష్టపోయి (వాడు నష్టపోతాడన్న సంగతి వాడికితప్ప అందరికీ ముందే తెలుసు) ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజంటుగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు (ఇళ్ళస్థలాల బ్రోకర్లని స్టైలుగా రియల్ ఎస్టేట్ ఏజంటందురు).

వీడుచేసే ఎస్టేట్ ఎంత రియలోగానీ, ప్రిస్టేజి మాత్రం ఫాల్సే! ప్రసాదుకి నిమిషానికో ఫోన్ వస్తుంది. వంద ఎకరాలంటాడు, సింగిల్ సిట్టింగంటాడు, డెవలప్మెంటంటాడు, పది కోట్లకి తగ్గేది లేదంటాడు.  

ప్రసాదుగాడి ఫోనుకి క్షణం తీరికుండదు, నోటికి తాళం ఉండదు. అనేక ప్రముఖుల పేర్లు ఫోను సంభాషణల్లో విరివిగా దొర్లుతుంటాయి. వీడి భార్య మాత్రం ఇల్లు గడవడం కష్టంగా ఉందని వాపోతుంటుంది!     

ఓ రోజున - మా ప్రసాదుగాడితో పాటు ఒక శాల్తీ రంగప్రవేశం. నల్లటి శరీరం, తెల్లటి బట్టలు, మెళ్ళో పులిగోరు చైను, సెంటుకంపు! పులిగోరు సెంటుగాళ్ళు సంఘవిద్రోహశక్తులని నా నమ్మకం.  

చికాకుని అణుచుకుంటూ 'ఏంటి సంగతి?' అన్నట్లు ప్రసాదుని చూశాను. 

ప్రసాదు మాట్లాడలేదు, బదులుగా సెంటుకంపు పులిగోరు మాట్లాడింది.

"సార్! మీపేరు చాలా బాగుంటుంది."

ఊహించని స్టేట్ మెంట్! ఆ శాల్తీని ఆశ్చర్యంగా చూశాను.

"నాకు వెంకటరమణ అన్న పేరు చాలా ఇష్టమండి. ఈపేరు విన్నప్పుడల్లా నాకు ముళ్ళపూడి వెంకటరమణ గుర్తొస్తాడు!"

అవునుకదా! ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన బుడుగు, రెండుజళ్ళ సీత , సీగానపెసూనాంబ.. అందరూ కళ్ళముందు కదిలారు. నిజమే! ఇన్నాళ్ళూ నాకీ చిన్న సంగతి తోచలేదేమి! పోన్లే - ఇంతకాలం హోటల్ క్లీనర్లకి మాత్రమే పరిమితమైన నాపేరు మీద ఒక ప్రముఖుడు ఉన్నాడు. సంతోషం. సెంటుకంపు కొడితే కొట్టాడు గానీ చాలా మంచివాళ్ళా ఉన్నాడే!

"ఎవరైనా తమ పిల్లలకి వెంకటేశ్వరస్వామి పేరు పెడదామనుకుంటే వెంకట్రమణే బెస్ట్ నేమండి!"

అవునా! నాచెవుల్లో 'ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గొవిందా.. గొవిందా!' అంటూ గోవిందనామ స్మరణం వినిపించసాగింది! తిరువణ్ణామలై రమణ మహర్షి కనబడసాగాడు. 

ఛ.. ఛ.. నేనెంత అజ్ఞానిని! ఇంతటి పవిత్రమైన పేరుని ఇన్నాళ్ళూ ఎంతలా అవమానించితిని. ఎంతలా కించపరిచితిని. అయ్యా! సెంటుకంపు పులిగోరు బాబూ! నాకళ్ళు తెరిపించావ్. నీకు థాంక్సురా అబ్బీ!

"అసలు 'ణ' అక్షరం స్వచ్చమైన తెలుగు నుడికారానికి ప్రతీక! ఈ అక్షరమే లేకపోతే తెలుగుభాష పేదరికంలో మగ్గిపొయ్యేది!"

అవును సుమీ! ఇదీ కరెక్టే! ఈ 'ణ' ఎంత గొప్పక్షరం! ఉన్నట్టుండి తెలుగు లిపి రక్షకుడిగా ఫీలవడం మొదలెట్టాను. తరచి చూడగా.. నాపేరు తెలుగుభాషకే మకుటాయమానంగా తోస్తుంది. సడన్ గా నాకు నేను చిన్నయ సూరిలా, గిడుగు రామ్మూర్తిలా ఫీలవడం మొదలెట్టాను!

ఈయనెవరో దైవదూత వలె నున్నాడు, నా అజ్ఞానాంధకారమును ఎవెరెడీ టార్చ్ లైటు వెలుగుతో పారద్రోలినాడు. సందేహము వలదు. ఇతగాడు మహాజ్ఞాని, మహామేధావి, మహానుభావుడు. అయ్యా! మీకు శిరసు వంచి నమస్కృతులు తెలుపుచున్నాను, నమోన్నమః.

గర్వంతో, స్వాతిశయంతో గుండెలుప్పొంగగా.. నాపేరు గొప్పదనాన్ని విడమర్చిన ఆ మహానుభావుని పట్ల కృతజ్ఞతతో తడిసిపోతూ ఒకక్షణం అతన్నే చూస్తుండిపోయాను. ఎంతయినా, గొప్పవారికే గొప్పపేర్ల గూర్చి అవగాహన ఉంటుంది. వారే సరైన అంచనా వెయ్యగలరు. వారు కారణజన్ములు. 

ఒరే ఫాల్స్ ప్రిస్టేజి రియల్ ప్రసాదుగా! ఒక గొప్పవ్యక్తిని పరిచయం చేశావ్! నీ ఋణం తీర్చుకోలేనిది.

అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! నేనెంత మర్యాద తక్కువ మనిషిని! నాపేరుని ఇంతలా అభిమానిస్తున్న ఈయన నామధేయము తెలుసుకొనవలెనన్న కనీస మర్యాదని మరచితిని.

"అయ్యా! తమరు.. " అంటూ అగాను.

"నా పేరు చినపుల్లయ్య సార్! మీ తమ్ముడు ప్రసాదు క్లాస్మేట్నండి. చిట్స్ బిజినెస్ చేస్తాను."

ఒహో అలాగా! చిట్స్ వ్యాపారం చేస్తూకూడా నాపేరు మీద ఎంత రీసెర్చ్ చేశాడు! జీతే రహో బేటా! ఒకవేళ దేవుడనేవాడే ఉంటేగింటే నీ చిట్టీల వ్యాపారం బాగా సాగాలని ఆయన్ని కోరుకుంటున్నాను. లేదులేదు, ప్రార్ధిస్తున్నాను.

చినపుల్లయ్య గొంతు సవరించుకున్నాడు.

"సార్! రేపట్నించి కొత్తచీటీ మొదలెడుతున్నాను. మీరుకూడా ఒక చీటీ వెయ్యాల్సార్! అంతా మీ డాక్టర్లే సార్! మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్! చినపుల్లయ్య ఎట్లాంటివాడని ఎవర్నైనా అడగండి సార్! చీటీ పాడిన రోజే ఎమౌంట్ పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తా సార్! నాకు మార్కెట్లో ఉన్న గుడ్‌విల్ అట్లాంటిది.. " చినపుల్లయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. 

'టప్'మని బెలూన్ పగిలిన శబ్దం! ఉప్పొంగిన నాగుండె ఫ్లాట్ అయిపోయింది!

నాదీ ఒక పేరేనా?! హ్మ్.. !

(నిట్టూర్చుచూ, వగచుచూ, వాపోవుచూ, చింతించుచూ, ఖేదించుచూ, దుఃఖించుచూ, శోకించుచూ.. ఇంకా చాలా 'చూ'లతో.. )

చివరి తోక -


'వెంకట రమణ' నామధేయులకి క్షమాపణలు.