Tuesday, 21 August 2012

రావిశాస్త్రి 'పక్కింటి అబ్బాయి'


నిరంజనరావుకి తండ్రి లేడు. భూమ్మీద పడగానే అతనికి అమ్మా, ఆకలి తప్ప మరేం దక్కలేదు. అందుకే పరిస్థితుల్ని జయించి పైస్థాయికి వెళ్ళాలనే కసి కూడా అప్పుడే కలిగింది. 

అతని మాటలు వేసవికాలంలో మల్లెపువ్వుల్లా మధురంగా ఉండవు. చలికాలంలో వానచినుకుల్లా చురుక్కుమంటాయి... నిశ్చలంగా ఉన్నప్పటికీ అతను ధ్యానంలో ఉన్న యోగిలా నిర్మలంగా కనిపించడు. సత్రంలో బైరాగిలా చవగ్గా కూడా కనిపించడు. పుట్టలో పాములా భయంకరంగా కనిపిస్తాడు.

నిరంజనరావుకి తనచుట్టూ ఉండే దారిద్ర్యపు వాతావరణం అన్నా, తనచుట్టూ ఉండే తనలాంటివారన్నా తెగ ద్వేషం ప్రబలింది... అంతా ఒకే జెయిల్లో ఉన్నప్పటికీ అమెరికాలో తెల్లఖైదీలు నల్లఖైదీలని చూసినట్లు సాటివారిని చూసి అసహ్యించుకోనారంభించాడు... జీవితంలో అమరసౌఖ్యాలున్నాయనీ, వాటిని "చదువు" ద్వారా సంపాదించుకోవచ్చని అతను గ్రహించాడు.

పోటీ పరీక్షకి ప్రిపేర్ అవ్వటం కోసం చేస్తున్న చిన్నఉద్యోగాన్ని వదులుకొని.. పట్నంలో ఒక గది అద్దెకి తీసుకుంటాడు. ఇంటి ఓనర్ పక్కగదిని దగ్గర్లోనే ఉన్న ధర్మాసుపత్రి వైద్యనిమిత్తం వచ్చేవారికి రోజువారి అద్దె పద్ధతిన ఇస్తుంటాడు. పరీక్షల కోసం నిరంజనుడు భీకరంగా చదువుతుండగా పక్కగదిలోకి ఒక పేదకుటుంబం అద్దెకొస్తుంది.

ఆ కుటుంబంలోని భర్తకి చర్మం, దంతం, ఎమిక, దగ్గు తప్ప అతన్లో ఇంకేమి ఉన్నట్లులేవు... ఆ ఆడమనిషి పుల్లలా ఉంది. ఆమె గుండెలు అర్చుకుపోయాయి. ఆమె ముఖం పీక్కుపోయింది. ఆమె కళ్ళు పిల్లిని చూసిన ఎలక కళ్ళల్లా లేవు! పులిని చూసిన లేడి కళ్ళల్లా వున్నాయి. ఆ లేడైనా అర్నెల్లనించీ ఏఆకూ, అలమూ దొరక్క ఉప్పునీళ్ళు తాగి బతుకుతున్న లేడన్నమాట... ఆవిడ పెద్దడాక్టర్ల ముందు నగ్నంగా నిల్చున్న జబ్బుమనిషిలా చాలా దీనంగా కనిపిస్తుంది. ఆ పిల్లవాడి ఏడుపు చాలా ఘోరంగానూ, భయంకరంగానూ ఉంది.

ఆ పిల్లవాడి ఏడుపు తన చదువుకి తీవ్రఆటంకంగా పరిణమిస్తుంది. భర్త ధర్మాసుపత్రిలో చేరతాడు. ఓ అర్ధరాత్రి ఆ పిల్లవాడికి ప్రాణం మీదకొస్తుంది. ఆ ఆడమనిషి నిరంజనరావుని ఆస్పత్రి దాకా తోడు రమ్మని దీనంగా అర్ధిస్తుంది. అప్పటికే చిర్రెత్తిపోయున్న నిరంజనం గావుకేకలు వేస్తాడు.

"పిలవను. రిక్షా పిలవను! రాను. ఆస్పత్రికి రాను. చెయ్యను. సహాయం చెయ్యను. మీకోసం నేను పూచికపుల్ల మొయ్యను. నా చూపుడువేలు చూపిస్తే చాలు మీరంతా బాధల బురదల్లోంచి బైటపడి బంగారులోకాల్లో విహరిస్తానంటే నేను చూపుడువేలు చూపించను! ఎందుకు చూపించాలి?" అంటూ తలుపులు ఫెడిల్మంటూ మూసేసుకున్నాడు.

తెల్లారి చూస్తే ఆ ఆడమనిషి గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కధని రావిశాస్త్రి తనకి అలవాటైన ధోరణిలో ఈ విధంగా ముగిస్తాడు.

"ఇదంతా జరిగి ఎన్నాళ్ళయిందండీ?"

"పదిహేనేళ్ళయింది సార్!"

"మరైతే - రంజనుడో నిరంజనుడో - అతనేం చేస్తున్నాడండీ ఇప్పుడు?"

"వాడిప్పుడు ప్రజలపై పన్నులు విధించే ప్రభుత్వ ప్రత్యేకశాఖలో ప్రధానోద్యోగిగా ఉంటున్నాడు సార్!"

తొలి ప్రచురణ - ఆంధ్రజ్యోతి వారపత్రిక (14 - 07 - 1967)

పుస్తక రూపం - బాకీ కధలు

జీవితంలో అమరసౌఖ్యాలని సంపాదించుకోవటానికి "చదువు" మార్గన్నెంచుకున్న నిరంజనరావుని.. చదువులు, పోటీపరీక్షలు ద్వారా ఉద్యోగాలు సంపాదించుకుని.. సమాజం పట్ల పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉండే ప్రభుత్వోద్యోగులకి ప్రతీకగా తీసుకున్నాడు.

నిరంజనమంటే మనకి అసహ్యం కలిగేట్లు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా.. అనుమానం వచ్చిందేమో!.. వెంకట్రావనే చిన్ననాటి స్నేహితుడిని నిరంజనుడు ఎలా చంపేశాడో చెప్పి.. మనకి నిరంజనుడి పట్ల రోత కలిగేట్లు రాశాడు. బహుశా.. మంచికి చెడు చెయ్యరాదు. చెడుకు మంచి చెయ్యరాదనే తన రచనా పాలసీననుసరించి.. ఈ (అతి) జాగ్రత్త తీసుకునుంటాడు. 

చదువు లేనివాడు చదువుకున్నవాడిని ఎందుకు గౌరవిస్తాడు? చదువు జ్ణానాన్నిస్తుందని. సమసమాజ కాంక్షని పెంచుతుందని. కానీ.. కేవలం ఉన్నత స్థానాల కోసం, ఉద్యోగాల కోసం, డబ్బు సంపాదించుకునేందుకు 'చదువు' ఒక మార్గంగా ఎంచుకునేవారు సమాజానికి కీడే చేస్తారని ఈ కధలో రావిశాస్త్త్రి చెబుతాడు.

నేనీ కథని ఇరవైసార్లు చదివుంటాను. తన పాయింట్ ని కథారూపంలో మలచడానికి రావిశాస్త్రి  ఎంచుకున్న శైలి అనితర సాధ్యం. అందుకే ఎన్నిసార్లు చదివినా.. 'ఇంత గొప్పగా ఎలా రాశాడబ్బా!' అని ఆశ్చర్యపోతూ చదువుతుంటాను.

రావిశాస్త్రి ఈ కధ రాసి 45 సంవత్సరాలు నిండాయి. ఇప్పుడు నిరంజనుడి వారసులు ఉద్యోగాలేం ఖర్మ! అన్ని రంగాల్లో చెలరేగిపోతున్నారు. రోజురోజుకీ వీరి సంఖ్య పెరిగి పోతుందేమోనన్న భయాందోళనలు చెందవలసిన పరిస్థితులు ప్రస్తుతం మనకున్నాయి. 

(italics రావిశాస్త్రివి)