Saturday 11 August 2012

చైనా ఆటలు - ఇండియా చదువులు




మొన్న  నేరాసిన  "నీచనికృష్ట చైనా! దీన్ని మెడబట్టి గెంటండి!" టపాపై  చర్చ  జరిగింది. ఆ  టపాలోని  కొన్ని వ్యాఖ్యలకి  సమాధానం  రాసే  కార్యక్రమం  మొదలెట్టగా  నిడివి  ఎక్కువైపోయింది. మన  కార్పొరేట్  విద్య  చర్చకి  వచ్చింది. అంచేత  ఆ  ఆలోచనల్ని  ఇప్పుడు  ఒక post గా publish చేస్తున్నాను. కావున  ఈ post  చైనా పిల్లల  గూర్చి  చర్చ  కొనసాగింపుగా  అనుకోవచ్చు.



విద్యార్ధులు - ప్రతిభ :



'merit'. నిజంగా  ఈ  పదం  చాలా  గౌరవప్రదమైనది. అయితే.. ప్రస్తుతం  మనం  ఏదైతే merit అనుకుంటున్నామో  అది  నిజమైన  మెరిటేనా? అసలు  ప్రతిభ  అంటే  ఏమిటి? ఉదాహరణకి  ఒక వందమంది  విద్యార్ధులు  రోజుకి  ఆరు గంటలు  క్లాసుల్లో  పాఠాలు  నేర్చుకుని, రెండు గంటలు  ఆటలాడుకుని, ఇంకో గంట  టీవీ  చూసి  నిద్ర  పోతారు. అప్పుడే  వారు  మానసికంగా, శారీరకంగా  ఆరోగ్యవంతులై  ఉంటారు. అందుకే  ఎటువంటి  పరిస్థితుల్లో  ఒక  నిర్ణీత  సమయాన్ని  మించి  వారిపై  పాఠాల  ఒత్తిడి  పెంచరాదనే  నియమం  ఉండాలి. కఠిన  చట్టం  ఉండాలి.



ఇలా  అందరికీ  ఒకే  రకమైన  curriculum  ఉన్నప్పుడు  మాత్రమే  వారి  ప్రతిభని  కొలవాలి. ఈ  కొలమానం  కూడా  చాలా ఖచ్చితత్వంతో  ఉండాలి. ఎవరెవరికి  ఏ  వృత్తి  పట్ల ఆసక్తి ఉందో.. వారు  ఆ  కోర్సుల్ని  అభ్యసించే  అవకాశం  ఉండాలి. అప్పుడే  మనకి  ఆటల్లో  కూడా  ప్రవేశం  ఉన్న  సైంటిస్ట్  తయారవుతాడు. సమాజం  పట్ల  అవగాహన  ఉన్న  వైద్యుడు  దొరుకుతాడు. లైబ్రరీల్లో, పుస్తకాల  మధ్యన  మాత్రమే  తయారయ్యే  నిపుణుడు  చిన్న వయసులోనే  రోగిష్టివాడైపోతాడు. దేశానికి  నష్టం.



కార్పొరేట్  విద్యా సంస్థల  పుట్టుక :



'పరీక్షల్లో  మార్కులే  కొలమానం  అయినప్పుడు  ఆటలకి, పాటలకి  సమయం  కేటాయించడం  దండగ! హాయిగా  ఆ  సమయాన్ని  కూడా  చదివించడానికి  ఉపయోగిస్తే  మరిన్ని  మార్కులు  సాధించొచ్చు!' అన్న  ఆలోచనతో  పుట్టిందే  కార్పొరేట్  విద్య. ఇది  కస్టమర్ల  అవసరాలు  తీర్చే  దుకాణదారుల  తరహా  ఆలోచన.



అయితే.. ఈ  అలోచన  అశాస్త్రీయమైనది. ఒక  విద్యార్ధి  శారీరకంగా, మానసికంగా  ఆరోగ్యంగా  ఉండాలి. చిన్నపిల్లలు  కూడా  ఈ  దేశ పౌరులే. రోజూ  కొంతసమయం  ఆడుకోవడం  వారి  హక్కు. వారికి  రాజ్యాంగమే  ఈ  హక్కుని  కల్పించింది. జైళ్ళల్లో  ఖైదీలకి  కూడా  ఆటలాడుకునే  సౌకర్యం  ఉంది. అయితే.. ఖైదీలక్కూడా  ఉన్న  హక్కు  బాలలకి  ఎందుకు లేదు?!



విద్యార్ధులు - తలిదండ్రులు :



తమ  పిల్లలు  బాగా  చదివి  మంచి  ఉద్యోగంలో  స్థిరపడాలని  తలిదండ్రులు  అనుకోవడం  సహజం. అయితే.. నా  కొడుకు  కావున  రోజంతా  చదివిస్తాననే  హక్కు  చట్టరీత్యా  నేరంగా  పరిగణింపబడాలి. అందుకే.. 'మీ  పిల్లాడు  ఆటలాడి  చెడిపోతాడు. మేం  దాన్ని  కట్టడి  చేసి.. ఆ  సమయాన్ని  కూడా  చదువుకే  కేటాయింపజేస్తాం.' అంటూ  ఎవడన్నా  చదువుల  దుకాణం  తెరిస్తే.. వాణ్ణి  తక్షణం  జైల్లో  పెట్టాలి.



కొడుకు  పెద్దయ్యాక  పోలీసాఫీసర్  కావలనుకునే  తలిదండ్రులు.. వాడికి  ఐదేళ్ళకే  పిస్టల్  షూటింగ్ లో  ట్రైనింగ్  ఇప్పించలేరు గదా! పిల్లల్ని  చదువుల  పేరుతో  ఒత్తిడి పెడితే.. వాళ్ళు మంచి  మార్కులు  సాధించవచ్చును గానీ.. భవిష్యత్తులో  మానసిక సమస్యల  పాలవుతారు. 'ఏం  పర్లేదు. రిస్క్  బేర్  చేసేది  మేమే గదా!' అన్న  వాదనకి  తావు  లేదు. అప్పుడు  తిండి  లేక  పిల్లల్ని  అమ్ముకునే  తల్లుల్ని  కూడా  మనం  సపోర్ట్  చెయ్యవలసి ఉంటుంది.



ప్రభుత్వ పాత్ర :



'ఇవ్వాళ  వందరూపాయలు  డిపాజిట్  చెయ్యండి. ఎల్లుండికల్లా  వెయ్యి రూపాయిలు  ఇస్తాం.' లాంటి  మోసపూరిత  ప్రకటనల  ప్రచారం  చేసుకోడానికి  ప్రభుత్వాలు  అనుమతినివ్వవు. ఒకవేళ  ప్రభుత్వం  ఉదాసీనంగా  ఉందనుకుందాం. ఆశ పడి  కొందరు  మోసపోతారు. వందకి  వెయ్యి  సంపాదించాలనే  దురాశపరులుగా  ఆ  మోసపోయినవారిని  మనం  చూడొచ్చు. కానీ.. అందర్నీ  రక్షించవలసిన  బాధ్యత  ప్రభుత్వాలదే. మనకి  రక్షణ  కల్పించడానికే  కదా ఈ  ప్రభుత్వాలుంది. అందుకే  ప్రభుత్వాలు  డిపాజిట్ deposit సేకరణ  విషయంలో అనేక  నిబంధనలని  పెట్టాయి.



డబ్బు  విషయంలోనే  ఇన్ని rules ఉన్నప్పుడు.. పిల్లల  విషయంలో  ఇంకెన్ని  కఠిన నిబంధనలుండాలి? కానీ.. అసలు  రూల్సంటూ  మనకున్నాయా? 'పిల్లల  విషయంలో  ఎందుకంత  కఠిన నిబంధనలు  ఉండాలి?' ఎందుకంటే  సమాజంలో  బలహీనులు  రక్షించబడాలి. అందుకే  వీరిని  రక్షించే  చట్టాలు  మరింత  పకడ్బందీగా, ఖచ్చితత్వంతో  ఉండాలి.



పిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం  కలవారు.. వీరంతా  ఒక special category. వీరిని  ఇబ్బంది  పెట్టే వారిని  నాగరిక  సమాజాలు  క్షమించరాదు. వీరిని  ఇబ్బంది  పెట్టే  సమాజం  రాతియుగానికి  చెందిందిగా  భావించాలి. వీరిని  కాపాడవలసింది  మనం  ఓట్లేసే  ప్రభుత్వాలు. కానీ  మన  ప్రభుత్వాలకి  ఈ spirit ఉందా?


ప్రభుత్వం + కార్పొరేట్  విద్యా సంస్థల  కుట్ర :


కానీ  మన  ప్రభుత్వాలు  చదువుల  దుకాణదారుల lobbying కి  లొంగిపోయాయి. ఉదాసీనంగా  ఉండటం  మూలానా.. ఈ  దుకాణ దారులు  ఒకరిని  మించి  ఒకరు  పిల్లల  హక్కుల్ని  హరించడంలో  పోటీ  పడుతున్నారు. ఒక  మాఫియాగా  రూపాంతరం  చెందారు. ఇది  మన  జాతికే  నష్టం. కొందరంటారు.. 'ఆ  పిల్లలు  విజయం  సాధిస్తున్నారుగా!' అని. నిజమే! వాళ్ళకి  మంచి  జీతం  వచ్చే  ఉద్యోగ  భవిష్యత్తు  ఉంటుంది. కానీ.. at what cost?




పిల్లల  భవిష్యత్తు  బాగుంటుందని  తలిదండ్రుల్ని  నమ్మించి.. పసి పిల్లల్ని  హింసించే  చదువుల  కార్ఖానాలే  ఈ  కార్పొరేట్  విద్యాసంస్థలు. ఇవి  పూర్తిగా  చట్టవ్యతిరేకం. ఈ  కార్ఖానాలే  లేకుండా  చెయ్యాల్సిన  బాధ్యత, అధికారం  ప్రభుత్వానికే  కదా  ఉంట! మన  ఊళ్ళో  కనీసం  లెబోరేటరీ  ఫెసిలిటీ laboratory facility కూడా  లేకుండా..shopping malls పైనా, ఎపార్ట్ మెంటుల్లో  నడుపుతున్న  కార్పొరేట్  కాలేజిలు.. కూతవేటు  దూరంలో  ఉన్నా  ఉన్నత  విద్యశాఖాధికారులకి  తెలీదు! వందలమంది  విద్యార్ధుల్ని  కుక్కే ఒక  పెద్ద physical structure అధికారులకి  కళ్ళకి  కనబడదు!!



EAMCET ప్రహసనం :



ఇప్పుడు  ఇంకో  పాయింట్. కొందరు  వాదించవచ్చు. 'quality డాక్టర్, ఇంజనీర్  అవ్వాలంటే  కష్టపడకపోతే  ఎలా?' అని. ఇక్కడ  మనం  ఆ  రకంగా  కూడా fail అవుతున్నాం. ఉదాహరణగా  మన  EAMCET  నే  తీసుకుందాం. ఒక  విద్యార్ధి doctor course లో  చేరాలంటే intermediate board పరీక్ష  పాసయితే  చాలు. కానీ  మనకి  అభ్యర్ధులు  ఎక్కువమంది  ఉండటం  చేత  మళ్ళీ  ఇంకో  రకం వడపోత (objective type) పరీక్ష  పెడుతున్నాం. పోనీ  ఇందులో  ఏమన్నా creativity చూపిస్తున్నామా? అంటే  అదీ  లేదు. అరిగిపోయిన  ప్రశ్నల్నే  మళ్ళీ మళ్ళీ  అడుగుతూ  కేవలం  ఒక  విద్యార్ధి  జ్ఞాపక శక్తిని  మాత్రమే  పరీక్షిస్తున్నాం. (జ్ఞాపక శక్తి  తెలివితేటల్లో  ఒక  భాగం  మాత్రమే.)



ఎప్పుడైతే  కేవలం  జ్ఞాపక శక్తిని  మాత్రమే  పరీక్షిస్తామో.. అప్పుడు  బండగా  చదువే  వారికి advantage ఉంటుంది. ఉదాహరణకి  వానపాము  గూర్చి  ఐదు సార్లు  చదివిన వాడి  కన్నా  ఇరవై సార్లు  చదివినవాడికి  ఎక్కువ  మార్కులు  వచ్చే  అవకాశం  ఉంది. అంటే.. అతను  రాష్ట్ర స్థాయిలో  ప్రధమ స్థానాన్ని  సంపాదించినా.. "తెలివైన"వాడన్న భరోసా  లేదు. మంచి  "చదువరి" మాత్రమే  అయ్యుండొచ్చు.



అయితే.. ఈ  మాత్రం  మన  ప్రభుత్వాలకి  తెలీదా? తెలుసు. కానీ.. ఈ  రకమైన  బట్టీయం  వేసే  విధానం  కార్పొరేట్  కాలేజిలకి  అనుకూలం. అక్కడ repeated గా  చదివిస్తారు. పరీక్షలు  పెడుతుంటారు. కాబట్టే  ఒక  పాఠాన్ని  ఎక్కువసార్లు  చదివించి, అరగదీసే  కార్పొరేట్  కాలేజిల  హవా  నడుస్తుంది. ప్రభుత్వం  మాత్రం  నిద్ర  పోతుంటుంది!



వైద్య విద్య - లోపభూయిష్టం :



ఇక  మన  వైద్య విద్యా విధానం. ఒక medical college నుండి  ఒక యేడాది వందమంది  డాక్టర్లు  బయటకొచ్చారనుకుందాం. వారందరూ  ఏవరేజ్  స్టూడెంట్లే. కానీ  సాధారణ  వ్యాధుల  పట్ల  అవగాహన ఉంది. పేషంట్లు  చెప్పేది  ఓపిగ్గా  విని  వైద్యం  చేసేంత నాలెడ్జ్ ఉంది. కామన్  సెన్సూ  ఉందివారిలో  ఏ ఒక్కరూ  గొప్ప cardialogist కాదు. గొప్ప  నెఫ్రాలజిస్టూ  కాదు. కానీ.. పేషంట్  పట్ల గౌరవంగా, నిజాయితీగా  వ్యవహరించే  విషయంలో  మంచి training పొందినవారు. పేషంట్ల  పట్ల  నిజాయితీ  అనేది  ఒక  డాక్టర్ యొక్క  ప్రాధమిక  గుణం  అయ్యుండాలి. మిగిలినవన్నీ secondary. శంకర్ దాదా MBBS  సినిమా  చూశారుగా.



ఇప్పుడు  ఇంకో  మెడికల్  కాలేజి. ఇక్కడ  నుండి  కూడా  ఇంకో  వందమంది  డాక్టర్లు  బయటకొచ్చారు. వాళ్ళు  అసాధారణ  మేధావులు. అద్భుతమైన  నాలెడ్జ్  ఉంది. అందరూ  అనేక  స్పెషాలిటీల్లో  నిష్టాతులు. ఈ  కాలేజి product ని  అన్ని కార్పొరేట్  ఆస్పత్రులు  ఎర్ర తివాచీ  పరిచి  మరీ  చేర్చుకుంటారు. మన  దేశానికి  ఆధునిక  వైద్యంలో  వీరే  దిక్సూచిలు. కానీ.. వారికి  పేషంట్ల  ఆర్ధిక స్థితిగతుల  పట్ల  తేలిక  భావం  ఉండొచ్చు. 'డబ్బుల్లేకపోతే  ధర్మాసుపత్రికి  పోవచ్చు కదా! మా  టైం  చెడగొట్టటం  దేనికంటూ'  చిరాకు  పడే  మనస్తత్వం  కలిగినవారై ఉండొచ్చు.



నా  దృష్టిలో  ఈ  మేధావుల  కాలేజి  కన్నా.. ఇందాక  సాధారణ  నాలెడ్జ్  కలిగిన  డాక్టర్లని produce చేసిన  కాలేజియే  గొప్పది. దేశానికి ఉపయోగపడేది. ఎందుకో  తెలీదు.. వైద్యవిద్యలో  పేషంట్లతో  ఎలా  మసులుకోవాలో  తెలిపే  సబ్జక్ట్  లేదు. ఇందువల్ల  చాలా  సమస్యలు  వస్తున్నాయి. ఈ  కాలేజిల  ఉదాహరణ  నే చెప్పే  విషయానికి  సపోర్ట్  కోసం  తెచ్చానే  తప్ప  స్పెషలిస్ట్  డాక్టర్ల  పట్ల  నాకేవిధమైన  వ్యతిరేకత  లేదని  మనవి  చేసుకుంటున్నాను.



అందరికీ అనారోగ్యం - కొందరికే వైద్యం :



దగ్గు, జ్వరం, విరేచనాలు.. ఇవి  సాధారణ  సమస్యలు. షుగరు, బిపి  సాధారణ  దీర్ఘకాలిక  రోగాలు. ఈ  రోగాలకి reasonable treatment జరుగుతుందంటే  ఆ ఊరు  వైద్యపరంగా  బానే  ఉందని  అర్ధం. వారికి speciality సేవలు  కూడా  ఉంటే  మంచిదే. కానీ  అవి  సెకండరీ.



ఈ  పాయింటునే  తిరగేద్దాం. ఇంకో  ఊళ్ళో open heart surgery లు  అద్భుతంగా  జరుగుతాయి. కానీ  జ్వరాలు, దగ్గులకి  వైద్యం  దొరకదు. ఒక  పక్క  మలేరియాతో  మనుషుల  చస్తున్న  ఊళ్ళో  గుండె  ఆపరేషన్లు  అద్భుతంగా  జరుగుతున్నాయంటే.. పరిస్థితి  బాలేదని  అర్ధం. ఒక  వ్యక్తి  గుండెజబ్బుతో  చావడం  గౌరవప్రదం. మలేరియాతో  చచ్చిపోవడం  దేశానికి  సిగ్గుచేటు. 'ఆరోగ్యశ్రీ' లో  జరుగుతుందిదే!



సమాజం - ఆటల స్పూర్తి - Olympic medals :



ఇప్పుడు  ఈ  పాయింటునే  ఆటలకీ  అన్వయించుకోవచ్చు. ఆటలనేవి  మనిషికి  తిండి, గాలి, నీరంత  ముఖ్యం. ఒక ఊళ్ళో  బోల్డన్ని  స్కూళ్ళు, ఆ  స్కూళ్ళకి  ఆట స్థలాలు  ఉన్నాయనుకుందాం. పిల్లలు  రోజూ  సాయంకాలం  హాయిగా  ఆడుకుంటారు. ఆ  ఊళ్ళో  పెద్దా చిన్నా  తమదైన  రీతిలో  ఏదోక  క్రీడ (చాలా  సాధారణ స్థాయిలో)  ఆడతారనుకుందాం. ఎవరూ  కూడా  చెప్పుకోతగ్గ  ఆటగాళ్ళు  ఉండరు. కానీ.. ఊరంతా  కనీసం  ఒక గంట పాటు  ఆటలాడతారు. మంచి fitness తో  ఉంటారు.



ఆ  ఊరికి  పక్క  ఊళ్ళో  ఆట మైదానాలు  లేవు. ఊళ్ళో  జనాలకి  క్రీడలు  అంటే  ఏంటో  తెలీదు. అందరికీ  షగరు, బిపి  రోగాలు. కానీ.. ఆ  ఊళ్ళో  ఒక  అభినవ్ బింద్రా  ఉన్నాడు. అతను  పొద్దున్నుండి  సాయంకాలం  దాకా  నాలుగ్గోడల  మధ్య  గంటల కొద్దీ  షూటింగ్  ప్రాక్టీస్  చేస్తూనే  ఉన్నాడు. అతను  అరుదుగా  బయటకొస్తాడు. ఒలింపిక్స్ లో gold medal సాధించాడు. ఆ  ఊరికి  గొప్ప  పేరు  సంపాదించాడు. కానీ  నా  దృష్టిలో  ఘనత  వహించిన  ఈ  రెండో  ఊరి  కన్నా  మొదటి ఊరే  ఉత్తమమైనది.



పిల్లలపై ఒత్తిడి :



పాసవడం  వేరు, select కాబడటం  వేరు. రెంటికీ  చాలా  దూరం  ఉంది. ఆటలు, చదువు.. ఎప్పుడయితే  మొదటి స్థానంలో  ఉండాలనుకుంటూ  శిక్షణ  పొందుతుంటారో  వారి  మానసిక క్షోభ  వర్ణనాతీతం. ఒక్కోసారి  ధైర్యం, మరెన్నోసార్లు  దైన్యం! పోటీలో  ఎక్కడుంటామో  తెలీక  సతమతమైపోతుంటారు.



నేను  వృత్తి రీత్యా  అనేకమంది long term coaching students చూస్తుంటాను. వారికి  అనేక రకాల నొప్పులు, నీరసం, నిరాశ, నిర్లిప్తత, ఆత్మహత్య ఆలోచనలు.. చాలా  జాలేస్తుంటుంది. వారితో  మీరు  మాట్లాడినట్లయితే  నేను  రాసేది  చాలా  తక్కువని  అర్ధమవుతుంది.



మన పిల్లల్ని రక్షించుకుందాం :



ఒక  దేశ పరిస్థితుల్ని  అంచనా  వెయ్యలంటే  మొత్తం  సమాజాన్ని  ఒక unit గా  తీసుకోవాలి. కేవలం  ఒక  వ్యక్తి  యొక్క  "గొప్ప" వ్యక్తిగత ప్రతిభ  అనేది  దేనికీ  సూచిక  కాదు. talent hunt పేరుతో  చైనావాడు  పిల్లల్ని  హింసిస్తూ  భవిష్యత్  బంగారు పతాక  గ్రహీతల్ని  తయారు  చెయ్యబోవడం.. ఇండియాలో  కార్పొరేట్  విద్య వాడు  పిల్లల్ని  కాల్చుకు  తింటూ  భవిష్యత్  IIT వాడిగా  తయారు  చెయ్యబూనడం.. చట్టరీత్యా  "ఘోరమైన"  నేరంగా  ప్రకటింపబడాలి. ఈ  చట్టాల్ని  అమలు  చెయ్యని  అధికారుల్ని  కఠినంగా  శిక్షేంచేందుకు  కూడా  "పకడ్బందీ"గా  చట్టాలుండాలి.




(photos courtesy : Google)