Tuesday, 14 August 2012

ఉసైన్ బోల్ట్! నువ్వు మాతో పరిగెత్తగలవా?


"రమణ మామ! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

టీవీలో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ చూస్తున్నాను.

"సుబ్బూ! భలే సమయానికొచ్చావు. బోల్ట్ ని చూడు, అదరగొట్టేస్తున్నాడు. హేట్సాఫ్ టు ఉసైన్ బోల్ట్ , ద గ్రేటెస్ట్ ఎథ్లెట్." అన్నాను ఉత్సాహంగా.

సుబ్బు మొహం చిట్లించాడు.

"బోడిగుండు బోల్టుగాడు ఆ గ్రౌండులో పరిగెత్తడం నాకేమంత గొప్పగా అనిపించట్లేదు." అన్నాడు సుబ్బు. 

నా ఉత్సాహం మీద నీళ్ళు కుమ్మరించినట్లయ్యింది.

"సుబ్బూ! నీకు బుర్ర సరీగ్గా పన్జేస్తున్నట్లులేదు, అతను గ్రౌండులో పరిగెత్తక ఇంకెక్కడ పరిగెత్తుతాడోయ్?" అన్నాను.

"జీవితంలో పరిగెత్తాలి, పరిగెత్తడంలో మనకిలా కొత్త రికార్డులు సృష్టించుకోవాలి." కవితాత్మకంగా అన్నాడు సుబ్బు. 

ఇంతలో కాఫీ వచ్చింది, సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మన పిల్లల జీవితాలు చూడు. వాళ్ళని పుట్టంగాన్లే కేజీల్లో పడేస్తారు. ఇంక చదువుల పరుగు, పరీక్షల పరుగు. కార్పొరేట్ స్కూళ్ళు, నిర్బంధ ర్యాంక్ సాధన పధకాలు. మెడిసిన్ సీటు, IIT సీటు అనే పతకాలు సాధించాలి.. ఆపకుండా పరిగెత్తుతూనే ఉండాలి."

"మంచిదే కదా! కాంపిటీటివ్ గా లేకుంటే మంచి భవిష్యత్తు ఎలా సాధ్యం?" అడిగాను. 

"మంచిదా! ఎవరికి మంచిది? ఎందుకు మంచిది? ఇక్కడ మంచిదో కాదో నిర్ణయించుకునే అవకాశం, సమయం ఎవ్వరికీ లేదు నాయనా! వేలం వెర్రిగా పరిగెత్తడమే అందరి పని." అన్నాడు సుబ్బు.

"ఇంతకీ నీ కంప్లైంట్ ఏంటి? చదవొద్దనా? మంచి భవిష్యత్తు సంపాదించొద్దనా?" చికాగ్గా అన్నాను.

"నాకే కంప్లైంట్  లేదు, జరుగుతున్నది చెబుతున్నానంతే. మనవాళ్ళు స్పీడుగా పరిగెత్తుకుంటూ 'మంచి' ఉద్యోగంలోకొచ్చి పడతారు. కానీ ఇక్కడ ఫినిష్ లైన్ ఉండదు. విజయవంతంగా పరిగెత్తినందుకు 'మంచి' పెళ్ళిసంబంధం అనే పతకం ఇవ్వబడుతుంది. సినిమాల్లో హీరోకి పెళ్ళవ్వంగాన్లే 'శుభం' కార్డు పడుతుంది, ఇక్కడా సౌలభ్యం లేదు. కాళ్ళు లాగేస్తున్నాయి, పరుగు స్పీడు తగ్గిద్దామనుకున్నా.. కొత్తభార్య అందుకు ఒప్పుకోదు. కొత్త లక్ష్యాలు నిర్దేశింపబడతాయి. పెద్దఇల్లు, పెద్దకారు, అనేక ఇన్వెస్టిమెంట్ ప్లాన్లు, ఖరీదైన వెకేషన్లు.. ఇవొక అంతులేని లక్ష్యాలు. ఇక్కడ ఫినిష్ లైన్ కి తావులేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రం గుండెలు పగిలేలా పరిగెత్తాల్సిందే." అన్నాడు సుబ్బు.

"అందుకేనా నువ్వు పెళ్ళి చేసుకోంది?" నవ్వుతూ అన్నాను.

సుబ్బు కూడా నవ్వాడు.

"అన్నీ అమర్చుకున్నాం, అమ్మయ్య! అంటూ కొద్దిసేపు ఆ పక్కన కూర్చుని అలుపు తీర్చుకుందామనుకునేలోపు, పిల్లలు పెద్దవాళ్ళవుతుంటారు. వారికి 'మంచి భవిష్యత్తు' కోసం.. గుర్రం మళ్ళీ పరుగో పరుగు. అంత పరిగెత్తుతూ కూడా అభద్రతా భావం, భయం, ఆందోళన. అంచేత - బిపి, షుగరు బోనస్. ఆ తరవాత రిటైర్మెంట్ ప్లాన్లంటూ మళ్ళీ కొత్త లక్ష్యాలు నిర్దేశింపబడతాయి. పడుతూ లేస్తూ కుంటి గుర్రంలా మళ్ళీ పరుగు షురూ." అంటూ ఖాళీకప్పు టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"సుఖమయ జీవనానికి ఇవన్నీ అవసరమోయీ! వీటిని నొప్పిగా భావించరాదు." అన్నాను.

"సుఖమయ జీవనమో, భారమయ జీవనమో.. అది చూసేవాడి దృష్టికోణం బట్టి ఉంటుంది మిత్రమా!" అంటూ టైమ్ చూసుకుంటూ లేచాడు సుబ్బు.

"సుబ్బూ! పొరబాటున కూడా సజావుగా మాట్లాడవు గదా! బట్టతలకి మోకాలికి ముడేస్తూ ఏదేదో వాగుతావు." అన్నాను.

సుబ్బు పెద్దగా నవ్వాడు. 

"నీకలాగే ఉంటుందిలే. నువ్వా బోల్టో, నట్టో.. వాణ్నే పొగుడుకో. నేకాదన్నానా? కాకపోతే - వాడు పరిగెత్తేది మాత్రం వంద మీటర్లు, పది సెకండ్లే! కానీ మనవాళ్ళు పరిగెత్తేది వందేళ్ళు. పరిగెత్తడానికి మనకి మంచి బూట్లుండవు, నున్నటి ట్రాకులుండవు, ఉత్సాహపరిచే ప్రేక్షకులుండరు, మైమరిపించే గర్ల్ ఫ్రెండులుండరు. నెత్తిన ట్రంకు పెట్టెలో బాధ్యతల బరువు, ఎగుడు దిగుడు రోడ్డు, గులకరాళ్ళు, దుర్భర వాతావరణం, ఎంత పరిగెత్తినా కనపడని ఫినిష్ లైన్. నా మటుకు నాకు ఆ బోల్టుగాడి కన్నా మనమే పరుగుల చాంపియన్లం అనిపిస్తుంది. పనుంది, వస్తా మరి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)