Saturday 4 August 2012

మా సుబ్బు ఒలింపిక్ స్పూర్తి!




"రమణ మామ! కాఫీ!" అంటూ  వచ్చాడు  సుబ్బు.



"కూర్చో  సుబ్బూ! ఒలింపిక్స్ లో  మన  పరిస్తితి  పెద్దగా  బాలేదు." దిగులుగా  అన్నాను.



"ఆ  పోనిద్దూ! ఈ  వార్త  చిన్నప్పట్నించి  నాలుగేళ్ల కోసారి  వినేదేగా! ఆ  ఒలింపిక్స్ లో  చాలా  ఆటలు  నాకు  అర్ధం కావు! అర్ధం  కాని  ఆటల్లో  మెడల్స్  గూర్చి  చింతన  ఏల?" అన్నాడు  సుబ్బు.



"సుబ్బూ! ఒలింపిక్స్ లో  కొన్ని  ఈవెంట్స్  నాకూ  అర్ధం  కావనుకో. అంత మాత్రానికే  మెడల్స్  పట్టించుకోకపొతే  ఎలా?" అన్నాను.



సుబ్బు  చిన్నగా  నవ్వి  అన్నాడు.



"మన దేశానికి  ఒలింపిక్స్  ఆటల  గోల  అంత  అవసరం  లేదేమో! అవన్నీ  యూరోపియన్ల  ఆటలు. వాళ్ళకి  జనాలు  తక్కువ. డబ్బులెక్కువ. ఆరడుగులుంటారు. బాగా  తింటారు. స్టామినా  ఎక్కువ. మనకి  తిండే  సమస్య. మనవాళ్ళు  మాత్రం  వారి  ఆటల్ని.. బోల్డంత  డబ్బు  పోసి  దిగుమతి  చేసుకున్న  వారి  పరికరాల్తోనే  నేర్చుకుంటూ.. వారితో  పోటీ  పడుతూ.. పతకాలు  రాలేదని  జనాలతో  నాలుగేళ్ళకోసారి  తిట్లు  తింటూ  ఉంటారు."



"దీన్నే 'అందని  ద్రాక్ష  పుల్లన' అంటారు  నాయనా! ఒలింపిక్స్  కేవలం  ఆటలు  కాదు. ఒక  గొప్ప  స్పూర్తి."



"ఒప్పుకుంటున్నాను. కాకపోతే  అది  అమెరికా, యూరప్  ఖండాల  స్పూర్తి  మాత్రమే  అంటాను. ఈ  ఆటలు  పుట్టింది  గ్రీస్  దేశంలో. ఆ  కాలంలో  ఉన్న  యూరోపియన్  ఆటల్ని  క్రీడాంశాలుగా  చేశారు. ప్రపంచంలో  తర్వాత్తర్వాత  చాలా  మార్పులు  చోటు  చేసుకున్నాయి. ఈ  మార్పుల్ని  గమనిస్తూ.. అన్ని  ఖండాల్లో, అన్ని  దేశాల  ప్రజల  ఆసక్తులని  పరిగణనలోకి  తీసుకుంటూ  ఎప్పటికప్పుడు  మార్పులు  చెయ్యవలసి ఉంది."



ఇంతలో  కాఫీ  వచ్చింది. సిప్  చేస్తూ  చెప్పసాగాడు  సుబ్బు.



"కానీ  అలా  మార్పుచేర్పులు  చెయ్యడం  జరుగుతుందా? లేదనుకుంటున్నాను. లేకపోతే  మన  దేశీయ ఆటలు  ఈ  ఒలింపిక్ స్పూర్తిలో  ఎందుకు  చోటు  చేసుకోవు? ఏం?  ఇన్ని  మెడల్సే  ఉండాలని  మెడల్స్  నెత్తిన  ఏవన్నా  మేకు  దించారా? మన  కేరళ  పడవలు, కబాడీ, ఖోఖోలు  ఒలంపిక్స్ లో  ఎందుకు  కనబడవు?"



"ఆ  విషయాల్ని  చూడాల్సింది  మన  క్రీడా సంఘాలు." అన్నాను.



"సురేష్ కల్మాడీ లాంటివాళ్ళు  మన దేశానికి  ప్రాతినిధ్యం  వహిస్తున్నారంటేనే  అర్ధమౌతుంది.. అక్కడుండే  మిగతావాళ్ళు  ఎంత  దరిద్రులో! ఒక్కో  దేశానికి  ఒక్కో  బలం, బలహీనతా  ఉంటాయి. అవి  పరిగణనలోకి  తీసుకుంటూ  ఆటల్లో  మార్పుచేర్పులు  జరుగుతుండాలి. నా  వాదనకి  ఋజువు  లాంగ్ డిస్టెన్స్  రన్ లో  కెన్యా  విజయం. ఈ  క్రీడాంశం  ఎప్పట్నించో  ఉన్నా.. మెడల్  కోసం  పేద దేశాలు  కూడా  పోటీ  పడగల  అవకాశం  ఉంది. పరిగెత్తే  క్రీడాంశాల్లో  గొప్ప  ఇన్ఫ్రా  స్ట్రక్చర్  అవసరం లేదు. పరిగెత్తడం  ఆఫ్రికన్లకి  అలవాటే. అందుకనే  కెన్యన్లు  పతకాలు  కొట్టేస్తున్నారు."



"ఇంతకీ  నువ్వు  చెప్పేదేంటి  సుబ్బూ?" విసుగ్గా  అన్నాను.



"రమణ మామా! నే  చెప్పేది  శ్రద్దగా  విను. కొద్దిసేపు  ఒలింపిక్స్  ఆటల  పోటీల్ని  పక్కన బెట్టు. ఇప్పుడు  ఒలింపిక్స్  వంటల  పోటీల్ని   ఊహించుకో. ఈ  వంటల  పోటీలకి  పోటీ అంశాలని  ఎలా  నిర్ణయిస్తాం? అన్ని  దేశాలకి  రిప్రజంటేషన్  వహిస్తూ  కొన్ని  వంటకాలని  సెలక్ట్  చేసుకోవాలి. అమెరికా వాడి  పిజాతో  పాటు  మన  గుంటూరువాడి  గోంగూర  పచ్చడి  తయారీ  కూడా  పోటీలో  అంశంగా  ఉండాలి. అంటే.. అన్ని  వంటలకి   సమాన అవకాశాలు  ఇవ్వబడాలి. అప్పుడే  ఈ  ఈవెంట్  అంతర్జాతీయ  వంటలకి  స్పూర్తిగా  నిలబడుతుంది."



ఇంతలో  ఇంటర్ కమ్  మోగింది. ఒక  పేషంట్  గూర్చి  నర్స్  అడిగిన  సమాచారం  చెప్పాను.



సుబ్బు  చెప్పసాగాడు.



"అంతర్జాతీయ వంటల  స్పూర్తి  ప్రకారం  అమెరికావాడు  మనతో  మన  గోంగూర పచ్చడి  చెయ్యడానికి  పోటీ  చెయ్యాలి. వాడు  అలా  చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే  వాడి  దృష్టిలో  గోంగూర  పచ్చడి  అసలు  తినే  పదార్ధమే  కాదు! కానీ  మనం  మాత్రం  వాడి  పిజాలు, బర్గర్లని.. వాడి  కత్తులు, వాడి  ఓవెన్లూ  వాడుతూ.. వాడితోనే  పోటీ  పడాలి. అప్పుడు వాడు  మనల్ని  అలవోకగా  ఓడించి  మెడల్స్  కొట్టేస్తాడు. ఈ  రకమైన  అసమాన  పోటీ విధానాన్ని  ఏ విధంగా  అంతర్జాతీయ  వంటలు  అనరో.. ఒలింపిక్స్  కూడా  అంతే."



"అంతేనంటావా?" సాలోచనగా  అన్నాను.



"అంతే! ఒలింపిక్  ఆటల  పోటీలకి  ప్రిపేర్  అవడం  చాలా  ఖర్చుతో  కూడుకున్న  విషయం. అందుకు  వాడే  క్రీడాపరికరాలు  చాలా  ఖరీదైనవి. కనీస  శిక్షణక్కూడా  లక్షల్లో  ఖర్చవుతుంది. అందుకే  మన  జనాభాలో  కనీసం ఒక  శాతం  కూడా  ఒలింపిక్స్  క్రీడాంశాల్లో  శిక్షణ  తీసుకోలేరు. జనాభా  ఎక్కువ  ఉండి, వనరులు  తక్కువున్న  మన  పేద దేశాలకి  ఏ  మాత్రం  అనుకూలం  కానివి  ఈ  ఒలింపిక్స్." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.



జేబులోంచి  క్రేన్ వక్క పొడి  ఐదు రూపాయల  పేకెట్  తీసి  ఒక  పలుకు  నోట్లో  వేసుకుని  చప్పరిస్తూ  చెప్పసాగాడు  సుబ్బు.



"ఉదాహరణకి  ఈత పోటీలు. ఇందులో  డజన్ల  కొద్దీ  పతకాలున్నాయి. వాళ్ళ  దేశాల్లో  స్కూళ్ళల్లో  ఈత కొలనులు  ఉంటాయి. మనకి  రాష్ట్ర  స్తాయిలో  కూడా  ఆ  సౌకర్యాలు  ఉండవు. ఈ  ఒలింపిక్స్  పేద దేశాల  ముందు  ధనిక  దేశాలు  ఆడే  ఒక  అహంకార క్రీడ. ఇంతకు ముందు  ఆధిపత్యం  కోసం  అమెరికా, రష్యాలు  పోటీ  పడేవి. ఇప్పుడు   చైనా, అమెరికాలు  పోటీ  పడుతున్నయ్. అందుకోసం  చైనాలో  పిల్లల్ని  చపాతి పిండిలా  పిసికేస్తున్నారు. అన్ని విషయాల్లో  అమెరికాతో  పోటీ  పడాలనే  చైనా  ఆబ్సెషన్  ఒక  రోగ స్థాయికి  చేరుకుంది. ఒక రకంగా  మనమే  చాలా  నయం. జెండా  ఊపేసి, క్రీడా స్పూర్తిని  ప్రదర్శించేసి  వచ్చేస్తాం. అంతకన్నా  చేయగలిగేది  ఏంలేదు గనక!" అన్నాడు సుబ్బు.



"నిజమేనుకో! కానీ  ఇంతమంది  జనాభాకి  ఒక్క  మెడల్  కూడా  రాకపోడం  అవమానం  కదూ!" అన్నాను.



"కానే కాదు. జనాభా  లెక్కే  ప్రాతిపదికైతే  మన  గుంటూరు  జనాభా  యూరపులో  కొన్ని  దేశాల కన్నా  ఎక్కువ. ఎంతమంది  జనం  ఉన్నారన్నది  ప్రాతిపదిక  కాదు. ఎన్ని  ఈత కొలనులు, ఆటస్థలాలు  ఉన్నాయన్నది  మాత్రమే   ప్రధానం. ఇక్కడ  మనకి  ఆట స్థలాలు, మైదానాలు  సంగతి  దేవుడెరుగు.. కనీసం  నడవడానికి  కూడా  జాగా  లేదు. చీమల పుట్టల్లా  ఒకటే  జనం. కరెంటు  కటకట. తాగడానికి  నీరు, పీల్చడానికి  గాలి  లేకుండా  ఇబ్బందులు  పడుతుంటే  నీకు  మెడల్స్  కావాలా  మిత్రమా?"



"మరి  మన  దేశానికి  మెడల్స్  వచ్చే  అవకాశమే  లేదా?" నీరసంగా  అన్నాను.



"లేకేం! మనకి  మెడల్స్  రావాలంటే  ఒలింపిక్స్  ఈవెంట్స్  మార్చాలి. అమెరికా, యూరపుల  పిల్లలకి  మన  పిల్లలతో  చదువుల  పోటీ  పెట్టాలి. మన  పిల్లల్ని  పొద్దున్నే  దొంగల బండిలా  స్కూల్ బస్  వచ్చి  ఎత్తుకుపోతుంది. పొద్దున్నుంచి  రాత్రి  దాకా  చదువు  రోట్లో  పడేసి.. పరీక్షల  రోకటితో  దంచుతారు. ఇలా  పిల్లల్ని  నలిపేసే కార్యక్రమానికి  కొన్ని  మెడల్స్  పెడదాం. అప్పుడవన్నీ  మనకే. కాకపోతే  చైనావాడి  గూర్చి  జాగ్రత్తగా  ఉండాలి. పిల్లల  హక్కుల్ని  అణిచేసే  విషయంలో  వాడు  మనకన్నా  నీచుడు!" అంటూ  నవ్వాడు  సుబ్బు.



"సుబ్బు! చదువుల  పోటీ  ఆటల పోటీ  ఎలా అవుతుందోయ్?" అన్నాను.



"అవును గదా! సరే!  సైక్లింగ్  పోటీలో  మనదే  మెడల్. ఐతే  పోటీ  స్టేడియంలో  కాదు. మన  రోడ్ల  మీద.. మన  సైకిల్ తో.. మన  ట్రాఫిక్ లో  తొక్కాలి. ఈ  గతుకుల  రోడ్ల  మీద.. ఈ  బస్సులు, ఆటోల  మధ్య.. మన వాళ్ళు  తప్ప  అన్ని  దేశాల  సైకిల్  వీరులు  సిటీ బస్సుల  క్రింద పడి  చచ్చూరుకుంటారు. అంచేత  ఈ  కేటగిరీలో  భవిష్యత్తులో  మనతో  ఏ  దేశం వాడు  పోటీక్కూడా  రాడు." అన్నాడు  సుబ్బు.



"ఏం  సుబ్బూ! నీకు  మన దేశం మరీ  లోకువైనట్లుందే." చికాగ్గా  అన్నాను.



"కూల్  మామా  కూల్! మెడల్స్  కావాలంటావ్! ఎగతాళి  చేస్తున్నానంటావ్! త్వరలోనే  మనం  కూడా  సూపర్ పవర్  కాబోతున్నమని  లోకం  కోడై  కూస్తుంది. భవిష్యత్తులో  అంతర్జాతీయ  ఒలింపిక్  సంఘం  మన  లగడపాటి  రాజగోపాల్  వంటి  యంగ్  డైనమిక్  లీడర్ల  పాలనలోకి  వస్తుంది. అప్పుడీ  ఈవెంట్లని  పెట్టించడం  పెద్ద  కష్టం  కాదు. అంతగా  అయితే  మన  తరఫున  లాబీయింగ్ కి  మాంటెక్ సింగ్  ఆహ్లూవాలియా  ఉన్నాడుగా. ఒలింపిక్  ఈవెంట్లకీ, ఒక  MNC  రిటైల్  మార్కెట్  పర్మిషన్ కి  కనెక్షన్  పెట్టేస్తాడు. అప్పుడు  ఇంచక్కా  మన  గోళీలు, బొంగరాలాటల్ని  కూడా  క్రీడాంశాలుగా  చొప్పించేద్దాం." అంటూ  లేచాడు  సుబ్బు.



"అప్పటిదాకా?"



"ఈ  ఒలంపిక్స్ ని  ఒక  రియాలిటీ  షోగా  చూడు. రియాలిటీ  షోల్లో  రియాలిటీ  ఉంటుందా? అయినా  చూడట్లేదూ! ఒక  పూరీ జగన్నాథ్  తెలుగు సినిమాగా  చూడు. పూరి  సినిమాల్లో  పాత్రలు  తెలుగు భాషని  మాట్లాతాయే గానీ.. అవి  తెలుగు సినిమాలు  కాదుగా. అయినా   టైమ్ పాస్  కోసం  చూడట్లేదూ! ప్రస్తుతానికి  మనకి  ఒలంపిక్స్  కూడా  అంతే!" అంటూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుబ్బు.