Wednesday 5 December 2012

'రాగమయి రావే.. ' ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!

సమయం రాత్రి పన్నెండు గంటలు. సాహిత్యంపై బాలగోపాల్ రాసిన వ్యాసాల సంకలనం 'రూపం-సారం' చదువుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువసార్లు చదివిన పుస్తకం ఇదే. ఇంతలో అసరా (USA) నుండి ఒక మిత్రోత్తముని ఫోన్. చాలాసేపు చిన్ననాటి కబుర్లు, కాకరకాయలు. పిచ్చాపాటీ.

"ఈ టీవీలో 'పాడుతా తీయగా' ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తున్నాను. ప్రోగ్రాం నాకు బాగా నచ్చింది. నువ్వుకూడా చూడు." అన్నాడు. మావాడు సంగీత ప్రియుడు, ఓ సన్నకారు పాటగాడు.

"తెలుగు టీవీ చూడకపోవడం నా ఆరోగ్య రహస్యం. కావున తియ్యగా పాడినా, చేదుగా పాడినా నాకు తెలిసే అవకాశం లేదు. నువ్వు చూడమంటున్నావు కాబట్టి తప్పకుండా చూస్తాను." అని మాటిచ్చాను. 

నాది మాటమీద నిలబడే వంశం కాదు. అంచేత సహజంగానే అటు తరవాత ఆ టీవీ గోల మర్చిపోయ్యాను. అనగనగా ఓ పనిలేనిరోజు నా స్నేహితుడు, అతగాడికి చేసిన బాస గుర్తొచ్చి ఆ ప్రోగ్రాం టైమింగ్స్ వాకబు చేసి టీవీ ఆన్ చేయించాను.

టీవీ స్క్రీన్ పై ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిండుగా కనిపిస్తున్నాడు. ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఈ రియాలిటీ షోలు - గిరాకీ తగ్గిన పనిలేని నటులకి, గాయకులకి చక్కటి ఆశ్రయం కల్పిస్తున్నాయి. మంచిది. ఇట్లాంటి కార్యక్రమాలు వృద్ధ కళాకారులకి రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్ వలే కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి, వెరీ గుడ్.

ఇంతలో బక్కపలచటి కుర్రాడొకడు సెట్ మధ్యలో కొచ్చి ఆవేశంగా ఏదో సినిమా పాట ఎత్తుకున్నాడు. కళ్లు మూసుకుని గొంతెత్తి పాడటం మొదలెట్టాడు. నాకు చిరాకేసింది.

'వార్నీ! 'పాడుతా తీయగా' అంటే సినిమా పాటల పోటీ ప్రోగ్రామా!' ఆశ్చర్యపోయాను.

'మరి మన అసరోత్తముడు బాగుందన్నాడేమి! నా మీద వాడికి పాత కక్షలేమీ లేవు గదా!' ఆలోచిస్తూ మళ్లీ టీవీ చూశాను.

ఇప్పుడు కడుపులో వికారం మొదలైంది, వెంటనే టీవీ కట్టేసాను.

ఈ వికారం నాకు కొత్త కాదు. దీనికి నలభయ్యేళ్ళ చరిత్ర ఉంది. సైకియాట్రీలో PTSD అని ఓ కండిషన్ ఉంది. ఒక భయంకర అనుభవం మనసులో ముద్రించుకుపోయి.. ఆ అనుభవం తాలూకా భయాలు వెంటాడుచుండగా.. ఆ అనుభవం కనీస స్థితిలోనయినా మళ్ళీ ఎదురైతే తట్టుకోలేరు. అసలా ఊహకే విచలితులవుతారు. నా జీవితంలో ఈ సినిమా పాటల పోటీ ఒక బీభత్స PTSD.

ఇప్పుడు కొంచెంసేపు ఫ్లాష్ బ్యాక్. నా చిన్నప్పుడు వీధివీధినా వెలిసే  శ్రీరామనవమి పందిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలకి కేరాఫ్ ఎడ్రెసులు. ప్రతేడాది ఈ పందిళ్లల్లో సినిమా పాటలు పోటీ కూడా ఒక ముఖ్యాంశంగా వుండేది.

అలనాటి ఆ పాటల పోటీలు నా జీవితంలో చెరగని ముద్ర వేస్తాయని అప్పుడు నాకు తెలీదు. అరిగిపోయిన భాషతో మర్యాద కోసం 'ముద్ర' అంటున్నానే గానీ.. నిజానికవి ముద్రలు కావు.. కత్తి పోట్లు, గొడ్డలి నరుకుళ్లు!

ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట - 'రాగమయి రావే! అనురాగమయి రావే!'. ఒకళ్ళ తరవాత మరొకళ్లు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది. ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి.. దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది!


ప్రతి గాయక రాక్షకుడు మైకు ముందుకు రావడం.. గొంతు సరి చేసుకుని.. 'ఇప్పుడు ఘంటసాల మాస్టారు పాడిన ఫలానా పాట.' అని ఎనౌన్స్ చేసి మరీ హింసించేవాళ్ళు. మరీ ఒక్కోడు పాడుతుంటే పిశాచాల ప్రార్ధనలా, సూడి పంది ప్రసవ వేదనలా ఉండేది. జీవితం మీద విరక్తి పుట్టేది.


చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే! కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్లు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు.

శ్రోతల ఏడుపు మొహాలు ఎవాయిడ్ చెయ్యడానికి వారు అలా కళ్ళు మూసుకొంటారని సుబ్బు అంటాడు. కొంతమంది మెలికలు తిరుగుతూ పాడేవారు. 'గొంతు ఎలాగు మెలికలు తిరగదు, కనీసం శరీరంలోనయినా చూపించనీ!' అంటాడు సుబ్బు.

మొత్తానికి ఆ యేడాది శ్రీరామనవమి పాటల పోటీ - గాడిదలు, కుక్కలు, పిల్లులు, గబ్బిళాలు వంటి నానాజాతుల వికృత గాన సౌందర్య విలాసములకి పుట్టినిల్లుగా భాసిల్లింది. కళ్లు మూసుకున్నట్లు చెవులు మూత పడకపోవడం మానవశరీర నిర్మాణ లోపమని ఆనాడే నాకు అర్ధమయ్యింది. అందుకే నాకు 'రాగమయి రావే' పాటంటేనే కసి, కోపం, చిరాకు, రోత!

ఒకానొక రోజు నవ్వారు మంచంపై కాళ్ళు పైకెత్తుకుని చందమామలోని ధూమకేతు, శిఖిముఖిల సీరియల్ ఉత్కంఠపూరితంగా పఠించు సమయమున.. నా ఒక్కగానొక్క అన్నయ్య ప్రేమగా అడిగాడు.

"జయభేరి సినిమాకి వెళ్తున్నా, వస్తావా?"

"ఛీ.. ఛీ.. ఆ సినిమా పొరబాటున కూడా చూడను." ఈసడించుకున్నా.

అన్నయ్యకి అర్ధం కాలేదు. ఆ సినిమాపై నాకున్న కోపానికి కారణం తెలుసుకుని పెద్దగా నవ్వాడు.

"పోనీ ఒక పని చెయ్యి! ఆ పాట  వచ్చినప్పుడు కళ్లు మూసుకుని, చెవుల్లో వేళ్లు పెట్టుకో!" అన్నాడు.

'ఇదేదో బానే ఉంది.' అనుకుంటూ అన్నయ్యతో 'జయభేరి'కి బయల్దేరాను.

'జయభేరి' ఒక అద్భుత దృశ్యకావ్యం. ఆసాంతం సుమధుర సంగీతమయం. నేను అసహ్యించుకున్న 'రాగమయి రావే' పాట సమయంలో కళ్లు మూసుకోవడం కాదు.. కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయ్యి చూశాను. ఇన్నాళ్లూ మా బ్రాడీపేట ఔత్సాహిక గాయక రాక్షసులు ఘంటసాల పాటని సామూహికంగా హత్య కావించారని అవగతమైంది.

(ఏమిరా దుష్ట దుర్మార్గ వెర్రి వైద్యాధమా! నీ రాతలతో మన బ్రాడీపేటీయుల పరువు తీయుచుంటివి? మనవాళ్ళు తమ గార్ధభ గానంతో ఘంటసాల పాటని కంకరరాళ్ళతో కలిపి కరకరలాడించారు. అంతమాత్రానికే ఇంతలా విమర్శించాలా?) 

అవును గదా! 'రాగమయి రావే!.. ' గీత హనన నేరం మా బ్రాడీపేట గాత్రకారులది కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు బాధ్యత వహించవలసిన వారు ఘంటసాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, పెండ్యాల, పి.పుల్లయ్యలు మాత్రమే! ఒక పాటని మరీ అంత గొప్పగా రూపొందించడమే వారు చేసిన నేరం! దొంగలు బంగారాన్ని మాత్రమే కాజేస్తారు.

తరవాత జయభేరి సినిమా చాలాసార్లు చూశాను. ఎప్పుడు చూసినా 'రాగమయి రావే!' ఇష్టంగానే చూస్తున్నాను. కావున.. నా 'రాగమయి' పాట తాలూకా వికారం తగ్గిపోయినట్లే. ఘంటసాల అద్భుత గానం మూలానా కొందరి నీచగాన దోషం నశించినట్లుంది. పోన్లే, మంచిదే కదా!

చిత్రంగా ఇప్పుడు 'పాడుతా తీయగా' కార్యక్రమం చూస్తుంటే అప్పటి వికారం బయటేసింది. అనగా.. నేనకున్నట్లు నా చిన్ననాటి క్షుద్ర గాయకుల పట్ల నా ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదన్నమాట. ఆలోచించగా ఇదంతయూ Pavlov classical conditioning వలే యున్నది. నా పసిహృదయం మరీ అంతలా గాయపడి తల్లడిల్లిందా!

దూరంగా పాట వినిపిస్తుంది. 'తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా.. మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనయినా.. '

(posted in fb on 15 / 1 /2018)