Monday, 17 December 2012

యబిచారం.. తప్పు కాదు! మంచిది కూడా!!

"ఇదిగో సారూ! యబిచారం సేసేటప్పుడు ఒళ్ళంతా యమ యేడి. ఒకటే సెగలు పొగలు. సేసిం తరవాత కళ్ళమ్మట, సెవుల్లో యేడి పొల్లుకొస్తంది. కాళ్ళూ, సేతులూ ఒకటే పీక్కపోతన్నాయి. ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా బాడీలో ఓవర్ వీట్ తగ్గటల్లా. ఆ యేడంతా పోవాలా. బాబ్బాబు! మంచి మందులు రాయండే! సచ్చి నీ కడుపున పుడతా." అన్నాడు పుల్లయ్య.

పుల్లయ్య ఒక సన్నకారు రైతు. కష్టజీవి. అతనిది ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రాంతం. ఎత్తుగా, బలంగా ఉంటాడు. తెల్ల చొక్కా. రంగు లుంగీ. భుజంపై తుండుగుడ్డ. నున్నగా గీయించిన గెడ్డం. సన్నటి మీసం. తలకి పాగా.

ఓరి వీడి దుంప దెగ! హాయిగా వ్యభిచారం చేసుకుంటాడా! దానికి నేను మందులివ్వాలా! హథవిధి! సమాజంలో డాక్టర్ల పరిస్థితి ఎంతలా దిగజారిపోయింది! అసలు నన్నిట్లా అడగడానికి ఈ పుల్లయ్యకెంత ధైర్యం! నాకు ఒళ్ళు మండిపోయింది.

"ఏం పుల్లయ్యా! బ్రతకాలని లేదా? ఈ రోజుల్లో వ్యభిచారం ఆత్మహత్యతో సమానం. ఎయిడ్స్ రోగం వస్తుంది. హెపటైటిస్ వ్యాధి వస్తుంది. పిల్లలు గల వాడివి. వ్యభిచారం, గిభిచారం అంటూ వెధవ్వేషాలెయ్యకు. ఆ పాడు అలవాటు అర్జంటుగా బంద్ చేసెయ్యి. అర్ధమైందా?" గద్దించాను.

పుల్లయ్య ఆశ్చర్యపొయ్యాడు. ఏదో ఆలోచించాడు. సందేహంగా, బెరుగ్గా అడిగాడు. "అప్పుడప్పుడయినా.. "

"నీకసలు బుద్ధుందా? ఆప్పుడు లేదు ఇప్పుడు లేదు. నువ్వు చేసేది చాలా ప్రమాదకరమైన పని. అన్యాయంగా చచ్చిపోతావ్. గెట్ లాస్ట్!" కోపంగా అరిచాను.

పుల్లయ్య భయపడి పోయాడు.

"అట్లాగా! నాకు తెలవదు సార్! తప్పయిపోయిందయ్యా. ఇంకెప్పుడూ ఆ పాడు పని సెయ్యను. చదువు సంధ్య లేని మోటోణ్ణి సార్. తెలిసీ తెలీక ఏదో వాగాను. కోపం చేసుకోమాక సార్. ఉంటా దొరా!" అంటూ ఒంగి ఒంగి దణ్ణాలు పెడుతూ నిష్క్రమించాడు పుల్లయ్య.

నాకు మూడాఫ్ అయిపొయింది. గవర్నమెంట్ ఎయిడ్స్ ప్రాజెక్టులంటూ కోట్లు ఖర్చు పెడుతుంది. అయినా ఏం లాభం? ఈ పుల్లయ్య వంటి అజ్ఞానులున్నంత కాలం ఈ దేశం బాగుపడదు.

నెల రోజుల తరవాత..

ఆ రోజు హాస్పిటల్లో సోమవారం హడావుడి. మధ్యాహ్నం రెండింటి సమయంలో ఒక పొడుగాటి వ్యక్తి నీరసంగా నా కన్సల్టేషన్ చాంబర్లోకి అడుగెట్టాడు. ఎక్కడో చూసినట్లుందే! అరె! పుల్లయ్య! అతని ఆకారం చూసి ఆశ్చర్యపోయ్యాను. గుర్తు పట్టలేనంతగా చిక్కిపోయున్నాడు. పెరిగిన గడ్డం. రేగిన జుట్టు. నలిగిన చొక్కా. మాసిపోయిన లుంగీ. గాజు కళ్ళు. నడిచి వచ్చిన శవంలా ఉన్నాడు.

పక్కనే ఒక ఆడమనిషి. భార్య అనుకుంటాను. బక్కగా ఎండిన కట్టెలా ఉంది. కర్రకి చీర కట్టినట్లు, దుఖానికి దుస్తులు తొడిగినట్లుంది. పెద్దాస్పత్రిలో పెద్ద జబ్బుతో పది రోజులు వైద్యం చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయినట్లుంది. నన్ను బెరుకుగా చూస్తూ నమస్కరించింది.

"ఈ మడిసి నా ఇంటాయనండి. మీ కాడ్నించి వచ్చినంక బాగా తేడా పడిపోయిండు సార్. పొద్దుగూకులు ఏందో ఆలోచిస్తా ఉంటాడు. ఉన్నట్టుండి పిల్లలు జాగరత్తంటూ ఏడస్తన్నాడు. నలుగురు మడుసుల కట్టం చేసేటోడు. మూడు పూటలా మడంతలు తినోటోడు. ఆ ఇజాన మంచాన పడ్డాడు. సూళ్ళేకపోతన్నా. ఆ మడిసికేవన్నా అయితే పిల్లలు, నేను ఏవయిపోవాలా. మాకు సావు తప్ప యేరే దారి లేదు దొరా!" అంటూ కన్నీరు పెట్టుకుంది.

'అవును తల్లీ అవును.. ఏ దేశ మేగినా ఏమున్నది గర్వ కారణం? స్త్రీ జాతి సమస్తము పురుష పీడన పరాయణం. ఏ మొగుడి చరిత్ర చూసినా అంతా విశృంఖల కేళీ విలాసము. భార్యల బ్రతుకు ఖేద భరిత విలాపములే. నీ వ్యధాభరిత దుఃఖ గాధ గాంచి సానుభూతి వినా నేనేమివ్వగలను తల్లీ?' ఆలోచిస్తూ ఆవిడ చెప్పిందంతా విన్నాను.

తరవాత మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆమెని బయటకి పంపాను. రూంలో పుల్లయ్య, నేను. కొద్దిసేపు నిశ్శబ్దం.

"ఏంటి పుల్లయ్యా! ఏమయ్యింది?" అడిగాను.

అప్పటిదాకా కనీసం నోరు విప్పని పుల్లయ్య ఒక్కసారిగా పెద్దగా చిన్నపిల్లాళ్ళా ఏడవడం మొదలెట్టాడు. కొద్దిసేపు అలాగే ఏడవనిచ్చాను.

"ఆ రోజు మీరు యబిచారం సేస్తే సస్తానని సెప్పారు. యెల్లిన నాలుగు రోజులకే తప్పు సేసాను దొరా. పిల్లలు సిన్నోళ్ళు. నా పెళ్ళాం ఎర్రి బాగుల్ది. నన్ను బతికించు దొరా!" ఏడుస్తూనే చెప్పాడు.

"చిలక్కి చెప్పినట్లు చెప్పాను. బుద్ధుండాలి. ఇప్పుడేడ్చి ఏం లాభం? అనుభవించు." విసుక్కున్నాను.

"మీరు కరస్టుగానే సెప్పార్సార్. కానీ మా ఆడది ఊరుకోటల్లేదు. రెచ్చగొడతాంది. తప్పని సెప్పినా ఇనుకోటల్లేదు. దానికి బుద్ది సెప్పండి. గడ్డి పెట్టండి. అందుకే యెంటబెట్టుకోచ్చా." కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు పుల్లయ్య.

"ఆ దరిద్రపు అలవాటుతో నీ భార్యకి సంబంధమేంటి పుల్లయ్యా?" చిరాగ్గా అన్నాను.

"మరెవరితో సంబందం? నే యబిచారం చేసేది మా ఆడోళ్ళతోనే గదా!" ఆశ్చర్యపోతూ అన్నాడు పుల్లయ్య.

గతుక్కుమన్నాను. అర్ధం కాలేదు. ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది. కుడికన్ను అదరసాగింది. మనసు కీడు శంకించ సాగింది.

"పుల్లయ్యా! నీ దృష్టిలో 'యబిచారం' అంటే ఏమిటి?" సూటిగా చూస్తూ నిదానంగా అడిగాను.

"నువ్వు మరీ సార్! ఎంత సదువు లేకపోయినా ఆ మాత్రం తెలీదా యేంది? యబిచారం అంటే ఆడామగా సంబందమేగా?" సిగ్గుపడ్డాడు పుల్లయ్య.

చచ్చితిని. ఘోరం జరిగిపోయింది. మహాపాపం చేశాను. పుల్లయ్య భాష అర్ధం చేసుకోలేక అతనికి తీవ్రమైన అన్యాయం చేశాను. పుల్లయ్య భాషలో 'యబిచారం' అంటే భార్యతో సెక్సువల్ ఇంటర్ కోర్స్! గ్రామీణ వాతావరణం, భాష పట్ల నాకు అవగాహన లేకపోవడం పుల్లయ్య పట్ల శాపంగా పరిణమించింది. ఒక్కసారిగా నీరసం ఆవహించింది.

ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు నా కర్తవ్యమేమి? పుల్లయ్యకి సారీ చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. జరిగిన పొరబాటు వివరించినా పుల్లయ్య నమ్మకపోవచ్చు. అసలిక్కడ సమస్య జరిగినదానికి సారీలు చెప్పుకోవడం కాదు. జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలనేదే. క్షణకాలం బుర్రకి సాన బెట్టాను. మెరుపు మెరిసింది.

"చూడు పుల్లయ్యా! నువ్వు చాలా అదృష్టవంతుడువి. పదిరోజుల క్రితమే అమెరికావాడు వ్యభిచారానికి మందు కనిపెట్టాడు. నీక్కొన్ని గొట్టాలు రాసిస్తా. ఓ నెల్రోజులు వాడు. ఆ గొట్టాలు నీ ఒంట్లో వేడి లాగేస్తాయి. హాయిగా ఉంటావు." అన్నాను.

నీరసంగా, దుఃఖంగా ఉన్న పుల్లయ్య మొహం ఒక్కసారిగా కళకళలాడసాగింది. ఒంగిపోయి, ఒరిగిపోయి కూర్చున్నవాడు నిటారుగా అయిపోయాడు.

"నిజంగానా సారూ? మరి వెయిడ్స్ రోగం.. "

"ఇంకే రోగం నీ దగ్గరికి రాదు. నీకు హామీ ఇస్తున్నాను. నీ ఇష్టమొచ్చినన్ని సార్లు వ్యభిచారం చేసుకో. నీకేమవ్వదు. నాదీ పూచి. అయితే ఈ గొట్టాలు నీ భార్యతో వ్యభిచారం చెయ్యడానికే పని చేస్తాయి. బయటవాళ్ళతో వ్యభిచారం చేస్తే రియాక్షన్ ఇస్తాయి. చాలా ప్రమాదం." పుల్లయ్య చేతిని నా చేతిలోకి తీసుకుని అనునయిస్తూ, ధైర్యం చెప్పాను.

"నాకట్టాంటి పాడలవాట్లు లెవ్వు సారు. దేవుళ్ళాంటోరు. మీ కాడ అబద్దం సెపుతానా!" అన్నాడు పుల్లయ్య.

పుల్లయ్య భార్యని లోపలకి పిలిపించి ఆమెకి కూడా ధైర్యం చెప్పాను. పుల్లయ్యకి కొద్దిపాటి నరాల బలహీనత ఉందని, మందులు వాడితే గ్యారంటీగా తగ్గిపోతుందని ఘాట్టిగా నొక్కి వక్కాణించాను. ఖరీదైన 'బి కాంప్లెక్స్' గొట్టాలు రాసిచ్చాను. ఆ గొట్టాలు అన్నం తిన్న పది నిమిషాల్లోనే మింగాలనీ.. రోజూ పాలు, గుడ్లు తీసుకుంటే ఇంకా బాగా పని చేస్తాయని పలు జాగ్రత్తలు చెప్పాను.

ఇంకో నెల రోజులు తరవాత..

పుల్లయ్య మళ్ళీ వచ్చాడు. చలాకీగా, హుషారుగా ఉన్నాడు. ఒళ్ళు చేశాడు. దాదాపు మొదట్లో నేచూసినప్పటిలానే ఉన్నాడు. నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం లభించింది. నావల్ల ఒక అమాయకుడు ఎంత బాధ ననుభవించాడు! మొత్తానికి కథ సుఖాంతమైంది. థాంక్ గాడ్!

"మీరిచ్చిన గొట్టాలు బాగా పని చేశాయి సార్! ఇప్పుడు యబిచారం చేసినాంక యేడి పారాడటల్లేదు. మందులు ఇంకో నెల వాడితే ఇబ్బంది లేదుగా?" అన్నాడు.

"అస్సలు ఇబ్బంది లేదు పుల్లయ్యా! నీ ఇష్టం." రిలాక్స్డ్ గా అన్నాను.

సందేహిస్తూ నెమ్మదిగా అడిగాడు పుల్లయ్య.

"అయితే యబిచారం సేస్తే తప్పు లేదుగా సారూ?"

"అదంతా పాతమాట పుల్లయ్యా! ఇప్పుడు నువ్వు వాడింది ఆషామాషీ మందులు కాదు. అమెరికా వాడి మందులు. వాటికి తిరుగు లేదు. ఇంక నీ ఇష్టం. అసలిప్పుడు వ్యభిచారం ఎంత చేస్తే అంత మంచిది. బాగా చాకిరీ చేస్తావు కదా! ఆ వేడిని వ్యభిచారం ఎప్పటికప్పుడు బయటకి పంపించేస్తుంది." స్థిరంగా అన్నాను.

పుల్లయ్య ఆనందంగా ఇంకోసారి నమస్కరించి నిష్క్రమించాడు.

చివరి తోక..

ఇది కథ కాదు. నా అనుభవం. పేషంట్ పేరు, ప్రాంతం మార్చాను.

(picture courtesy : Google)