Saturday, 8 December 2012

'పెళ్లిచేసిచూడు'.. చూసేశా!


గత మూడ్రోజులుగా విజయా వారి 'పెళ్లి చేసిచూడు' సినిమా చూశాను. కుదురుగా కూర్చుని సినిమా చూసే ఓపిక ఎప్పుడో నశించింది. ట్రెడ్మిల్‌పై నడుస్తూ సినిమాల్ని ముక్కలుగా చూట్టం నాకు అలవాటు. ముక్కలుగా చూసిన 'పెళ్లి చేసిచూడు' సినిమా గూర్చి కొన్నిముక్కలు.
నచ్చిన అంశాలు :-
1.ఎన్టీరామారావు పాత్ర పేరు వెంకటరమణ (తెలుగులో ఇంతకన్నా గొప్ప పేరు లేదని నా ధృఢవిశ్వాసం). అత్యున్నతమైన ఈ పేరుని హీరోకి ఇవ్వడం చక్రపాణి, ఎల్వీప్రసాదుల అత్యుత్తమ అభిరుచికి తార్కాణం! ఎస్వీరంగారావు, డా.శివరామ కృష్ణయ్య రామారావుని 'రమణా!' అంటూ పిలిచినప్పుడల్లా చెవుల్లో ఫిల్టర్ కాఫీ పోసినంత మధురంగా వినిపించింది.
2.ఎస్వీరంగారావు పోషించిన వియ్యన్న పాత్ర చాలా విలక్షణంగా ఉంది. సినిమాకి ఈ పాత్ర ఒక ఎస్సెట్. మహంకాళి వెంకయ్య సీన్లు కొన్ని తగ్గించి ఎస్వీరంగారావు పాత్ర నిడివి పెంచినట్లయితే బాగుండేది.
3.ఘంటసాల సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. పాటలు సూపర్బ్. విజువల్స్, నేపధ్య సంగీతం పాలూ నీళ్ళలా కలిసిపొయ్యాయి. కొన్ని దృశ్యాలు ఘంటసాల వల్లే ఎలివేట్ అయ్యాయి.
4.సిసింద్రీగా నటించిన బాలనటుడు మాస్టర్ కుందు ప్రతిభ. చక్కటి ఈజ్‌తో సరదాగా నటించేశాడు. కొన్ని సన్నివేశాల్లో జోగారావుని డామినేట్ చేసేశాడు.
5.ఎన్టీరామారావు రూపం. నాకు యాభైలలోని రామారావు రూపం చాలా ఇష్టం, చాలా బాగుంటాడు. ఈ సినిమాలో మరీమరీ బాగున్నాడు.
హాశ్చర్యపరిచిన అంశం :-
'మిస్సమ్మ' లో మేరీ తండ్రిగా ఓ ముసలాయన గడ్డం, టోపీతో కనబడతాడు. ఆయన్ని ఆ పాత్ర కోసం ఏదో చర్చి ప్రేయర్లోంచి పట్టుకోచ్చారనుకున్నా. ఆయనే ఈ 'పెళ్లి చేసిచూడు'లో విలన్! పేరు దొరైస్వామి. నక్కజిత్తులవాడిగా చక్కగా నటించాడు.
నచ్చని అంశాలు :-
1.సినిమా మొదలైన చాలాసేపటి దాకా ఎన్టీరామారావు (రమణ) కనిపించడు. ఈ సినిమాకి హీరో జోగారావేనేమో అన్న సందేహం కలుగుతుంది.
2.ఎన్టీఆర్ (రమణ) కనిపించిన మొదటి సీన్ పెళ్లిపీటలపై. కట్నం దగ్గర పేచీ వస్తుంది. తండ్రి ఆజ్ఞపై మూడు ముళ్ళు వేసి కూడా.. పీటల మీదనుండి లేచి వెళ్ళిపోతాడు. రమణని కట్నకానుకలకు వ్యతిరేకిగా ఎస్టాబ్లిష్ చేస్తూ పెళ్ళికి ముందు ఒక సీన్ ఉన్నట్లయితే బాగుండేది (నేచూసిన డివిడిలో అటువంటి సీన్లు ఎగిరిపోయ్యాయేమో తెలీదు).
3.రమణ తండ్రిగా డా.శివరామ కృష్ణయ్య చక్కగా నటించాడు. మంచివాడు, కానీ కోపిష్టి. కథంతా ఈ పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. దొరైస్వామి చెప్పినవన్నీ అమాయకంగా నమ్మేస్తాడు. ఈయన్ని కొడుకు, కోడలు మరీ వెర్రివాడిని చేస్తారు. 'పాపం! ఈ అమాయకుడి కోసం ఇన్ని వేషాలు అవసరమా?' అనిపిస్తుంది. ఈ పాత్రని కొంత తెలివిగా చూపిస్తే కథ ఇంకా కన్విన్సింగ్‌గా ఉండేదేమో.
ధర్మసందేహం :-
సూర్యాకాంతం సన్నగా, చిన్నదిగా ఉంది. అందంగా కూడా ఉంది. దొరైస్వామికి భార్యగా వేసింది. ఇంత చిన్న వయసులో తల్లిపాత్ర ఎందుకు వేసిందబ్బా?! 'బావ' అన్నప్పుడల్లా కూతుర్ని పుర్ర చేత్తో 'ఫెడీ' మనిపిస్తుంటుంది. ఆ తరవాత కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకి సూర్యకాంతం తన చేతి చురుకు రుచి చూపించింది!
చివరితోక :-
సినిమా పొడుగ్గా వుంది, నిదానంగా నడిచింది. ఈతరం ప్రేక్షకులకి నచ్చదని నా అనుమానం.
(fb post on 19 / 1 / 2018)