Monday 24 December 2012

'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే!



ఇవ్వాళ ఆంధ్రజ్యోతిలో 'సోషలిజం తేవడం చాలా తేలికే!' అంటూ రంగనాయకమ్మ రాసిన వ్యాసం చదివాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాదాపుగా నా అభిప్రాయాలు కూడా రంగనాయకమ్మవే. నా ఆలోచనలు అప్పుడప్పుడు 'విరసం' ప్రముఖులకి చెబుతూనే ఉన్నాను.

ప్రస్తుతం తెలుగు బ్లాగుల్లో ఇటువంటి విషయాలు రాయాలంటే ధైర్యం కావాలి. 'విరసం', రంగనాయకమ్మ వంటి పదాలు వినడమే ఆలస్యం.. తిట్టడమే లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారు. వారితో తిట్టించుకునే ఓపిక లేకా..ఎందుకొచ్చిన గోలలే అనుకుంటూ.. ఇటువంటి అంశాలు బ్లాగులో రాయను. ఇవ్వాళెందుకో ధైర్యం వచ్చేసింది. కారణం తెలీదు.

తెలుగు సాహిత్యంలో ప్రముఖ సాహితీవేత్తల complete works ప్రచురించడం ఈ మధ్య ఊపందుకుంది. శ్రీపాద, మల్లాది, పాలగుమ్మి పద్మరాజు, గోపీచంద్, అడవి బాపిరాజు, బుచ్చిబాబు, మధురాంతకం రాజారాం మొదలైనవారి పూర్తి సాహిత్యం ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ పరిస్థితి కొన్నేళ్ళ క్రితం లేదు. కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వాన 'విశాలాంధ్ర' ప్రచురించిన కుటుంబరావు సాహిత్యం నాకెంతగానో ఉపయోగపడింది.

ఈ మధ్యన మనసు ఫౌండేషన్ వారు వరసగా ఇట్లాంటి సమగ్ర రచనల్ని ప్రచురిస్తున్నారు. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, బీనాదేవి, గురజాడ, పతంజలి.. ఈ లిస్టు పెరుగుతూనే ఉంది. వారు ఇదొక యజ్ఞంగా స్వీకరించారు. వారికి నా అభినందనలు.

ప్రతి సంస్థకి ఒక నిర్దేశిత లక్ష్యం ఉంటుంది. ఉండాలి కూడా. ఒక హిందూ ధార్మిక సంస్థ నాస్తికవాదుల రచనల్ని ప్రచురించరాదు. జనవిజ్ఞాన వేదిక చేతబడికి ప్రచారం కలిపించరాదు. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపుల్స్.

ఇప్పుడు 'విరసం' గూర్చి మాట్లాడుకుందాం. 'విరసం' అనగా విప్లవ రచయితల సంఘంకి కుదించిన పేరు. ఈ పేరులోనే సంస్థ లక్ష్యం మనకి తెలుస్తుంది. శ్రీశ్రీ పుట్టిన రోజున ఏర్పడ్డ విరసం చరిత్ర అందరికీ తెలిసిందే. 'అరుణతార' అనే మాసపత్రిక విరసం ప్రచురిస్తుంది. అరుణతార కవితలకి ప్రాముఖ్యతనిస్తూ.. సంస్థ లక్ష్యాలకి అనుగుణంగా నడుస్తుంది.

అయితే విరసం వ్యక్తులకి అనవసర ప్రాధాన్యం ఇస్తుందని నా భావన. అంచేతనే తమ సభ్యుల complete works కి ప్రాధాన్యతని ఇచ్చుకుంటుంది. ఇది శ్రీశ్రీతో మొదలయ్యింది. శ్రీశ్రీ సాహిత్య సంపుటాలని చలసాని ప్రసాద్ ఎడిట్ చేసిన తీరు అద్భుతం. నాకు తెలిసి తెలుగులో ఇంత గొప్పగా ఎడిట్ చేసిన సాహిత్యం లేదు. అయితే శ్రీశ్రీ సాహిత్యంలో సినిమా వ్యాసాలు 'విరసం'కి అనవసరం. (చలసానికి శ్రీశ్రీ, రావిశాస్త్రిల పట్ల గల వీరాభిమానం జగద్విదితం. అంచేత దీన్నొక aberration గా అనుకున్నాను.)

ఇప్పుడు కుటుంబరావు సమగ్ర సాహిత్యం వరుసగా వెలువడుతోంది. ఇది ఇరవై సంపుటాలు. తమ సభ్యుల్ని (వల్లమాలిన ప్రేమతో/ అభిమానంతో/ స్నేహంతో) ప్రమోట్ చేసుకోవడం విరసం ఎజెండాలో ఒకటిగా నాకనిపిస్తుంది. కుటుంబరావు తెలుగు సాహిత్యంలో 'మకుటం లేని మహారాజు' అన్నాడు శ్రీశ్రీ. పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

అయితే కుటుంబరావు తాత్విక వ్యాసాలు భీతి గొలుపుతాయి. కుటుంబరావు పేరా సైకాలజీకి తెలుగు ప్రజలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నమ్ముతున్నాను. ఈ వ్యాసాల్ని కూడా ప్రచురించడంలో విరసం తాత్వికత ఏమిటో ఎడిటర్లైన చలసాని ప్రసాద్, కృష్ణాబాయిలు చెప్పాలి. అలాగే కుటుంబరావు సినిమా వ్యాసాలు రెండు పెద్ద సంపుటాలుగా (14 & 15) వెలువరించారు. సినిమా వ్యాసాలకి, విరసానికి సంబంధం ఏమిటో?!

ఒక రచయిత తన అభిప్రాయాలు మార్చుకోవచ్చు (గుడిపాటి చలం). లేదా.. ఎన్నో విషయాల్లో డెమాక్రటిక్ గా ఉంటూ స్త్రీ పురుష సంబంధాల గూర్చి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చెయ్యవచ్చు (శ్రీశ్రీ 'అనంతం'). అది ఆ వ్యక్తి ఇష్టం. వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ శ్రీశ్రీ ఒక శతకం రాస్తే.. ఆ శతకం ఒక్కదాన్నే తితిదే (TTD) వారు ప్రచురిస్తారు. మనవాడేలే అంటూ మహాప్రస్థాన కవితల్ని కూడా ప్రచురించరు. ఎందుకంటే తితిదేకి ఒక స్పష్టమైన, నిర్దేశిత లక్ష్యం ఉంది. అది విశాలాంధ్ర పబ్లిషర్స్ కి కూడా ఉంది. దురదృష్టవశాత్తు విరసంకి లేదు.

విరసం తన సభ్యులైతే చాలు. వాళ్ళు రాసిన 'అన్ని రకాల' రచనల్ని సమగ్ర సంపుటాలుగా ప్రచురిస్తుంది. అదేమంటే.. ఒక రచయిత గూర్చి చదివే వాళ్లకి పూర్తి అవగాహన కావాలంటుంది. కుటుంబరావు గూర్చి పూరా అవగాహన కల్పించే గొప్ప కార్యక్రమం విరసానికి ఎందుకు? 'పూర్తిగా' తమవాడిగా చేసుకోవలసిన అవసరం ఏమిటి? ఆ పని చెయ్యడానికి మనసు ఫౌండేషన్, ఇంకా అనేక ట్రస్టులు ఉన్నాయిగా!

ఒక వ్యక్తి రాసిన అనేక వేల పేజీల్లో తమ సంస్థ లక్ష్యాలకి అనుగుణంగా ఉన్న సాహిత్యాన్ని మాత్రమే ప్రచురించుకోగల నిర్మొహమాటత, నిక్కచ్చితనం ఉండగలగడం ఆ రచయితల సంఘం ప్రాధమిక కర్తవ్యం. ఇక్కడ వ్యక్తిగత అభిమానాలకి తావుండరాదు. ఈ విషయాన్ని రంగనాయకమ్మ తన వ్యాసంలో చక్కగా వివరించారు. అందుకు రంగనాయకమ్మని అభినందిస్తున్నాను.

చూద్దాం.. చలసాని, కృష్ణాబాయి రంగనాయకమ్మకి ఎలా రియాక్ట్ అవుతారో!


(photos courtesy : Google)